పార్వతి తిరువోలు ప్రధాన పాత్రలో నటించిన ప్రథమ దృష్ట్యా కుట్టక్కర (Pradhama Drishtiya Kuttakkar Movie) మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 9, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ప్రస్తుతానికి ఒరిజినల్ మలయాళం వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 11 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని చక్కటి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు ఓటిటీలో కూడా IMDB 7.8 రేటింగ్ తో దూసుకుపోతుంది.
ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే?
పోలీస్ ఇన్స్పెక్టర్ అబ్రహం విధి నిర్వహణలో మరణించడంతో కారుణ్య నియామకాల కింద ఆయన భార్య అలీనాకి ( పార్వతి తిరువోలు) పోలీస్ డిపార్ట్మెంట్లో క్లరికల్ పోస్ట్ ఇస్తామని ఎస్పీ చెప్పడంతో సినిమా మొదలౌతుంది.
కానీ అలీనా మాత్రం మాములు క్లరికల్ ఉద్యోగం కాకుండా తనకు కూడా తన భర్తలానే ఖాకీ యూనిఫామ్ వేసుకునే అవకాశం ఇమ్మని ఎస్పీని కోరడంతో ఆయన ఒప్పుకుని అలీనాని పోలీస్ ట్రైనింగ్ అకాడమీకి పంపిస్తాడు. అక్కడ శిక్షణ పొందిన అలీనా తర్వాత కేరళలోని పోలీస్ స్టేషన్లో జాయిన్ అవుతుంది. అదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దివ్య..ఏఎస్సై సయాద్.. డ్రైవర్ శ్రీనాథ్ లు అలీనాకి క్లోజ్ అవుతారు.
అయితే ఓ రాత్రి వేళ వీరు వీధుల్లో పెట్రోలింగ్ చేస్తుండగా జయప్రకాష్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా అనుమానం వచ్చి ఆపి చెక్ చేస్తారు. కానీ జేపీ పోలీసులను చూసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అతడ్ని పట్టుకుని స్టేషనుకి తీసుకొస్తారు.
తిరిగి స్టేషన్ నుంచి కూడా అతడు పారిపోవడానికి ప్రయత్నించడంతో జరిగిన ఘర్షణలో అనుకోకుండా తుపాకీ కాల్పుల్లో జేపీ మరణిస్తాడు. ఊహించని ఈ సంఘటనతో అలీనాతో సహా మిగిలిన ముగ్గురు పోలీసులు షాక్ అవుతారు.

ఇంతకీ ఈ జేపీ ఎవరు? పోలీసులను చూడగానే పారిపోవాలని ఎందుకు చూస్తాడు? లాకప్ లో జేపీ మరణించడంతో తమ ఉద్యోగాలు పోవడంతో పాటు హత్యా నేరంతో జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడిన ఆ నలుగురు పోలీసులు ఏం చేస్తారు? ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి హరి మీరాన్ చివరికి క్రైమ్ చిక్కుముడిని ఎలా విప్పుతాడు? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
క్రైమ్ సీన్ లో రియల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో సినిమాలో దర్శకుడు నూరు శాతం కళ్లకు కట్టినట్టు చూపించాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమా విజయానికి మొదటి మెట్టు అని చెప్పవచ్చు.
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా పట్టు సడలకుండా ఒకే టెంపోలో కథనాన్ని నడుపుతూ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా చేయాలంటే కథ ఒక్కటే సరిపోదు.. దానికి దర్శకత్వ ప్రతిభ కూడా ఉండాలి. పోలీస్ ప్రొసీజర్ తెలుసుకుని ఉండాలి. రియల్ క్రైమ్ కేసులను స్టడీ చేసి ఉండాలి.
ఈ సినిమా కోసం దర్శకుడు షాహాద్ అటువంటి గ్రౌండ్ వర్క్ బాగా చేశారనిపిస్తుంది. ఈ సినిమాలో కథ కన్నా కథనానికి ఎక్కువ మార్కులు పడతాయి. కథదేముంది? పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్.. కేసు తమ మీద పడకుండా పోలీసులు సాక్ష్యాధారాలు మాయం చేయడం అనే పాయింట్ ఆధారంగా కథ అల్లుకున్నారు.
అయితే అనుకోకుండా పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక లాకప్ డెత్ ఇన్సిడెంట్ ను ఉత్కంఠత రేకెత్తించేలా రెండు గంటల పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో కథనాన్ని రన్ చేయడంలోనే అసలు ప్రతిభ దాగి ఉంది.
ఒక పక్కన డిపార్ట్మెంట్ కి చెందిన పోలీస్ అధికారి తన డిపార్ట్మెంట్ పోలీసుల మీదనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం.. మరోపక్క ఆ పోలీస్ అధికారికి సాక్ష్యాధారాలు దొరక్కుండా మాయం చేసే పనిలో అలీనాతో పాటు మిగిలిన ముగ్గురు పోలీసులు ఆడిన మైండ్ గేమ్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తాయి.
ముఖ్యంగా సెకండాఫ్ నుంచి ఎత్తులకు పై ఎత్తులతో సాగిన మైండ్ గేమ్ ఆకట్టుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో దొంగా.. పోలీస్ ఉండరు. నేరంలో ఇరుక్కున్నవారూ పోలీసులే.. ఆ నేరం గుట్టు విప్పడానికి రంగంలోకి దిగింది కూడా పోలీసులే. ఈ పాయింటే ఈ సినిమా కథకి ప్రధాన బలం అవుతుంది.
ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి తన విధి నిర్వహణలో క్రిమినల్ కేసుల గుట్టును ఎలా ఛేదించింది అనే సంగతులను వివరిస్తూ గతంలో ఓ బుక్ రాస్తాడు. గమ్మత్తు ఏంటంటే ఈ కేసునుంచి బయటపడటానికి అలీనా ఆ బుక్ నే ఫాలో అయి ప్లాన్ చేస్తుంది. ఒక్కోసారి నేరస్తులకు పోలీస్ అధికారులు రాసే స్వీయ అనుభవాల పుస్తకాలు కూడా ఉపయోగపడతాయన్నమాట.
ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా పూర్తిస్థాయిలో ఉత్కంఠత రేకెత్తిస్తుంది. ఈ నలుగురు పోలీసులను బుక్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ హరి వేసే ప్రతి ఎత్తును అలీనా తెలివిగా తిప్పి కొట్టడం.. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు ఈ సినిమాని నిలబెట్టాయి. కోర్ట్ నుంచి బయటకు వచ్చిన నలుగురు పోలీసులు తమ ఫ్యామిలీలని కలుసుకునే సీన్ భావోద్వేగాలను రేకెత్తిస్తుంది.
కాకపోతే ఈ సినిమా కధకి మూలమైన జయప్రకాశ్ కోణాన్ని కూడా దర్శకుడు టచ్ చేయాల్సింది. లేట్ గా అయినాసరే జేపీ క్రిమినల్ ట్రాక్ గురించి తెలుసుకున్న ఆ నలుగురు పోలీసులు అతడి డెత్ ను ఎన్కౌంటర్ గా చూపించవచ్చు. ఈ విషయం అలీనా కూడా అంటుంది. నిజానికి అక్కడ జరిగింది కూడా అదే. ఎవరైనా క్రిమినల్ రివాల్వర్ తో పోలీసులను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్కౌంటర్ చేయడం రియల్ లైఫ్ లో చూసాం..రీల్ లైఫ్ లో కూడా చూసాం.
కానీ ఈ కేసులో తాము ఏదో నేరం చేసినట్టు నలుగురు పోలీసులు భయపడటం కన్విన్సింగ్ గా అనిపించదు. దానికి తోడు సిసి టీవీ ఫుటేజ్ లో అతడు తమని బెదిరించినట్టు లేదని అలీనా చెప్పడం కూడా జస్టిఫికేషన్ గా అనిపించదు. ఇటువంటి చిన్నచిన్న లోపాలు మినహా మిగిలిన కధనం చాలా గ్రిప్పింగ్ గా నడిచింది.
ఎవరెలా చేశారు?
పార్వతి తిరువోలు నటన సినిమాని ఒక మెట్టు పైన నిలిపింది. ఎక్కడా ఫీల్ చెడకుండా చాలా సహజంగా నటించింది. అలా అని సినిమా మొత్తం ఆమె ఒక్కతే తన భుజాన వేసుకుని నడిపించిందని చెప్పలేం.. ఏఎస్సై.. డ్రైవర్ శ్రీనాథ్.. దివ్య లు కూడా బాగా నటించారు. వీరితో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విజయ రాఘవన్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రియల్ లైఫ్ లో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అలాంటి మ్యానరిజం ప్రదర్శించారు.
సాంకేతికత
మజీబ్ ముజీద్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో అందించిన బిజిఎం స్కోర్ సన్నివేశాలకు అదనపు బలాన్ని ఇస్తుంది.
రోబీ రాజ్ ఫోటోగ్రఫీ పని తీరు కూడా బాగుంది. పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో అందించిన విజువల్స్ బాగున్నాయి.
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్లో మొదటినుంచి చివరివరకు ఒకే టెంపోలో కథనం నడుస్తుంది.
దర్శకుడు తాను రాసుకున్న కథ నుంచి ఇంచు కూడా పక్కకు జరగకుండా సీరియస్ టోన్ లోనే కథనాన్ని నడిపించుకుంటూ పోయారు. అందుకే సినిమాలో ఎక్కడా కామెడీ ట్రాక్ కనిపించదు. ఈ సినిమా చూడాలనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతానికి ఒరిజినల్ మలయాళం వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.
నటీనటులు : పార్వతి తిరువోలు, విజయ్ రాఘవన్, మాథ్యూస్ థామస్, వినయ్ ఫోర్ట్ తదితరులు
సంగీతం: మజీబ్ ముజీద్
సినిమాటోగ్రఫీ: రోబీ రాజ్
నిర్మాత: అర్జున్ సెల్వ
దర్శకత్వం: షహాద్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 9-10-2026
రేటింగ్: 3.5/5
