ప్రస్తుతం ఓటిటిలో జంతు ప్రేమికులను ఆకట్టుకునే ఓహ్ మై డాగ్ హిందీ మూవీ (Ohh My Dog Movie) ట్రెండింగ్ అవుతుంది. అక్టోబర్ 1 , 2026 నుంచి ఓహ్ మై డాగ్ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతకుముందు ఆగస్టు 7 , 2026 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాని ఒరిజినల్ హిందీ వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఓహ్ మై డాగ్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
సేనాపతి అనే పోలీస్ డాగ్ కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడంతో సినిమా మొదలౌతుంది. కరడుగట్టిన నేరస్తులను పట్టివ్వడంలో సేనాపతి చేసిన సేవలకు గానూ పోలీసులు నివాళులు అర్పిస్తారు. సేనాపతి మరణంతో దాని పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలని యజమాని బాధపడతాడు.
కట్ చేస్తే,
భోపాల్ నుంచి అస్సాం వచ్చిన అప్పు ( మహి రాయ్ ) అనే కుర్రాడి కుటుంబానికి మోమో అనే డాగ్ అంటే ప్రాణం. మెమోని కూడా తమ ఫ్యామిలీ మెంబర్ మాదిరి పెంచుతారు. అయితే ఒకరోజు అప్పు.. మోమో తో బంతి ఆడుతుండగా బాల్ తేవడానికి వెళ్ళిన మోమో తిరిగి కనిపించకుండా పోతుంది. మోమో మిస్సింగ్ తో బాధ తట్టుకోలేని అప్పు తన తల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు.
ఇదిలా ఉండగా బీహార్ లో కన్స్ట్రక్షన్ పని చేసే కుర్రాడు ప్రిన్స్ కూడా ఆస్కర్ అనే డాగ్ ను పెంచుకుంటూ ఉంటాడు. ఆస్కర్ కి కూడా ప్రిన్స్ అంటే ప్రాణం. తన యజమాని లేకుండా క్షణం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రిన్స్ మాయం అవుతాడు. మెడికల్ మాఫియా గ్యాంగ్ ప్రిన్స్ ను కిడ్నాప్ చేశారని తర్వాత తెలుస్తుంది.
ఇంతకీ మోమో కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? మెడికల్ మాఫియా గ్యాంగ్ ప్రిన్స్ ను ఎందుకు కిడ్నాప్ చేస్తారు? కనిపించకుండా పోయిన తన డాగ్ కోసం అప్పు .. కిడ్నాప్ అయిన తన యజమాని ప్రిన్స్ ను కనిపెట్టడానికి ఆస్కర్ లు ఏం చేస్తారు? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
సినిమా గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే జంతు ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతుంది. నమ్మకద్రోహం చేసే మనుషులైనా ఉంటారేమో కానీ మూగజీవాలు ఉండవనేది ఈ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న ప్రధానమైన పాయింట్.
తప్పిపోయిన తన యజమానిని వెతికి పట్టుకోవడం కోసం ఆస్కర్ అనే డాగ్ రంగంలోకి దిగితే.. తప్పిపోయిన తన డాగ్ కోసం అప్పు అనే యజమాని రంగంలోకి దిగుతాడు. ఈ సినిమాలో దర్శకుడు యజమాని కోణంలోనూ.. డాగ్ కోణంలోనూ స్టోరీని సమాంతరంగా నేరెట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రేమతో ఆదరిస్తే మూగ జీవులు విశ్వాసంగా ఎలా పడి ఉంటాయో కళ్ళకు కట్టారు. అదే సమయంలో ఆ మూగ జీవుల పట్ల మనుషుల్లోని రాక్షసులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు అనేది కూడా దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు చూస్తే నిజంగా ఆ మూగ జీవులను ఇంత కిరాతకంగా హింసించే రాక్షసులు ఇంకా ఈ భూమ్మీద ఉన్నారా? అని వాళ్ళ మీద అసహ్యం వేస్తుంది. అదే సమయంలో మోమో (డాగ్) కనిపించకుండా పోవడంతో తమ ఫ్యామిలీ మెంబర్ మిస్ అయినంతగా ఆ తల్లీకొడుకులు బాధ పడటం మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందనే నమ్మకాన్ని కలిగించాయి.
మోమో (డాగ్) మిస్ అవడం.. తల్లీ కొడుకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం.. అదే సమయంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పని చేసే ప్రిన్స్ అనే కుర్రాడు కిడ్నాప్ కావడం.. అతడి కోసం ఆస్కర్ (డాగ్) వెతుకులాట మొదలుపెట్టడం వంటి సన్నివేశాలతో దర్శకుడు ఫస్టాఫ్ లో కథనాన్ని నడిపారు.
ఇక సెకండాఫ్ నుంచే అసలు కథ మొదలౌతుంది. లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ తన డాగ్ ఆచూకీ కోసం అప్పు చేసే ప్రయత్నాలు.. అలాగే తన యజమాని ఆచూకీ కోసం ఆస్కర్ (డాగ్) చేసే విన్యాసాలు మనల్ని ఎంగేజ్ చేస్తాయి. ఎంతసేపూ హీరోలకు ట్రాన్స్ఫార్మర్లు పగిలిపోయే ఎలివేషన్లు ఇస్తే విజిల్స్ కొట్టడానికి అలవాటు పడిపోయిన మనకు మూగజీవాలు కూడా హీరోలకు తక్కువేం కాదు అంటూ ఈ సినిమాలో దర్శకుడు వాటికి కూడా ఒక భారీ ఎలివేషన్ ఇచ్చి మనచేత విజిల్స్ కొట్టిస్తాడు.
వెంటపడుతున్న కుక్కని బెదరగొట్టడానికి తనవాళ్లందరికీ ఫోన్లు చేసి స్పాట్ కు రమ్మంటాడు ఓ గ్యాంగ్ మెంబర్. అతడి పిలుపు అందుకున్న కొంతమంది రౌడీలు కత్తులు కటార్లు పట్టుకుని వస్తారు. ఇటుచూస్తే ఒక మూగజీవి.. అటుచూస్తే కొంతమంది నరరూప రాక్షసులు. అంతమందిని చూసి ఆ మూగజీవి పారిపోలేదు. గొంతెత్తి పెద్దగా అరిచింది.. అంతే ఒక్కసారిగా వందల మూగజీవాలు బిలబిలమంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాయి.
ఆ సీన్ చూస్తే మనుషులకన్నా ఆ మూగజీవాలే ఎన్నో రెట్లు మెరుగు అనిపిస్తుంది. సాటి జీవి కష్టంలో ఉంటే ఒక్క పిలుపుకి వంద మూగ జీవాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. అదే ప్లేసులో మనిషి ఉంటే వందమంది సాటి మనుషులు వస్తారు కానీ ఒకరిద్దరు నిజంగా సాయం చేసేవాళ్ళు మినహా మిగిలిన వాళ్ళు సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అనిపించింది.
కాకపోతే ఎప్పుడైతే కథలో పోలీసుల పాత్ర రివీల్ అవుతుందో అప్పట్నుంచి సినిమా ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. అక్కడ్నుంచి సినిమా ముందుకు సాగుతుంది కానీ మనల్ని పెద్దగా ఎంగేజ్ చేయదు. దానికి తోడు దర్శకుడు ఆస్కర్ చేత మాగ్జిమం పరుగు పందేలు చేయించాడు కానీ దాని క్యారెక్టర్ ను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేయలేకపోయాడు.
ఎంతసేపూ మెడికల్ మాఫియా గ్యాంగ్ మెంబర్ ను చేజ్ చేయడంతోనే ఆస్కర్ పని సరిపోయింది. దర్శకుడు దాని చేత దాదాపు అస్సాం అంతా పరుగులు పెట్టించాడు. ఆస్కర్ ఎపిసోడ్ మొత్తాన్ని దర్శకుడు కథనాన్ని సాగతీయడానికి వాడుకోవడంతో మనకు విసుగు వస్తుంది.
ఇక క్లైమాక్స్ మినహా దర్శకుడు కావలసినంత ఎమోషన్స్ పండించలేకపోయాడు. ఆ మధ్య చార్లీ 777 అనే సినిమా వచ్చింది. దర్శకుడు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎమోషన్స్ పేర్చుకుంటూ పోయాడు. అందుకే ఆ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథనంలో భావోద్వేగాల సంఘర్షణకు.. ఎమోషన్స్ కు దర్శకుడు ఇంకా స్కోప్ ఇవ్వాల్సింది.
ఇక దర్శకుడు తన కథనంలో లాజిక్కులను పట్టించుకోకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ముందుకెళ్లిపోయాడు. అంతోటి సీనియర్ ఆర్టీఏ అధికారికి కూడా తెలియని ఎన్నో విషయాలను ఒక పదిహేనేళ్ల కుర్రాడు చెప్తుండటం అంత కన్విన్సింగ్ గా ఉండదు. ఈ సినిమాలో ఆ కుర్రాడు ఒక్కడే పేరుమోసిన డిటెక్టివ్ తరహాలో పాత్ర పోషించడం కొంచం ఎక్కువైనట్టు ఉంది.
ఈ సినిమాకి క్లైమాక్స్ సీన్ ప్రధాన బలాన్ని అందిస్తుంది. సెన్సిటివ్ ఇష్యూకి డివోషనల్ టచ్ ఇస్తూ దర్శకుడు సినిమాని ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో మోమో .. ఆస్కర్ అనే రెండు డాగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తే వాటిలో ఆస్కర్ కే ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. కానీ దర్శకుడు ఆస్కర్ ను సరిగా వాడుకోలేకపోయారు అనిపిస్తుంది. దాదాపు సెకండాఫ్ అంతా దానికి పరిగెత్తడంతోనే సరిపోయింది. ఇక మోమో పాత్రకు పెద్ద స్కోప్ దక్కలేదు.

వీటి తర్వాత అప్పు పాత్ర పోషించిన కుర్రాడికి మార్కులు పడతాయి. తనకిచ్చిన పాత్రకు మహి రాయ్ న్యాయం చేశాడు. మిగిలిన వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికత
మంగేష్ ధక్కడే అందించిన సంగీతం బాగానే ఉంది.
మాతే హెర్బయి అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా ఫుల్ మూన్ లాంటి కొన్ని విజువల్స్ ఆయన కెమెరా పనితనానికి అద్దం పట్టాయి. నిర్మాణ విలువలు కూడా పర్లేదు.
విశ్లేషణ
ముందే చెప్పినట్టు జంతు ప్రేమికులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్ చూసిన వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. కాకపోతే దర్శకుడు ఆ రెండు మూగ జీవాలకు ఇంకాస్త స్కోప్ ఉండే విధంగా పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది.
మనం పెట్టే పిడికెడు ఆహారం తిని ఆ మూగ జీవాలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అన్నదానికి ఉదాహరణగా క్లైమాక్స్ సీన్ లో ప్రిన్స్.. ఆస్కిల్ నోట్లో బిస్కట్ పెట్టే సీన్ ను దర్శకుడు సింబాలిక్ గా చూపించిన తీరు బాగుంది. కాకపోతే ఈ సినిమా చూడాలనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.
నటీనటులు: పంకజ్ త్రిపాఠి , మహి రాయ్ , సులక్షణా బారువా తదితరులు
సంగీతం: మంగేష్ ధక్కడే
సినిమాటోగ్రఫీ: మాతే హెర్బయి
నిర్మాత: రాజేష్ భరధ్వాజ్
దర్శకత్వం: అమిత్ రాయ్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్ ( 01 -10 -2026 )
రేటింగ్: 3/5
