మీరు గమనించారా? CJP ఇండియాలో పాదం మోపకముందు వరకూ దేశ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు రాజకీయ పంధాలోనే సాగేవి. ప్రతిపక్షాలు తమ నిరసనలను తొంబై శాతం మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలియచేసేవి. పార్లమెంటులో ప్రశ్నించడం.. నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని పార్లమెంట్ ఆవరణలో నిరసనలు తెలియచేయడం వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. తమ నిరసనలకు రావాల్సిన కవరేజ్ వచ్చిందని తెలియగానే దాని సంగతి మర్చిపోయి ఇంకో అంశం ఎత్తుకునేవారు. కానీ కాక్రోచ్ జనతాపార్టీ ( CJP ) రాకతో నిరసనల గళం మారి నయా ట్రెండ్ వచ్చింది. అదే డిజిటల్ నిరసనల ట్రెండ్. దేశంలో మారుతున్న నిరసనల ట్రెండ్ గురించి చిన్న విశ్లేషణ చేసుకుందాం.
బలహీన ప్రతిపక్షం
కేంద్రంలో అయినా .. రాష్ట్రంలో అయినా ప్రభుత్వాల నుంచి మంచి పరిపాలనను రాబట్టాలంటే సమర్ధవంతమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రశ్నించే గొంతుక ఉండాలి. పాలనలో ప్రభుత్వాలు పొరపాట్లు చేస్తే , తప్పులు చేస్తే ప్రతిపక్షాలు వాటిని ఆధారాలతో సహా వెలికితీయడమే కాకుండా విమర్శనాత్మకంగా ప్రశ్నించి సరిదిద్దుకునే పరిస్థితులు కల్పించాలి. అప్పుడే ప్రజలకు ప్రతిపక్షాల మీద నమ్మకం ఏర్పడుతుంది.
గతంలో ప్రతిపక్షాలు ఇలాంటి సమర్ధవంతమైన పాత్ర పోషించాయి కూడా. ఇందిరాగాంధీ హయాంలో పెట్రోల్ రేటు పైసా పెరిగినా కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేసేవారు. ప్రతిపక్షాల వత్తిడికి తలొగ్గి పెంచిన ధరలను ప్రభుత్వాలు తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో కమ్యూనిస్టుల ప్రభావం కూడా తగ్గిపోయి ఆఖరికి పేపర్ ప్రకటనలకే పరిమితం అయిపోయిన పరిస్థితులు వచ్చాయి. వెస్ట్ బెంగాల్..కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూలిపోవడం ఇందుకు ఉదాహరణ.
సరే ప్రస్తుతానికి వస్తే , కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. సోనియా , రాహుల్ గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం అవడం సంగతి అందరికీ తెలిసిందే.
కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని నిర్మించడంలో నరేంద్ర మోడీ నూరు శాతం విజయం సాధించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్రంలో వరుసగా మూడుసార్లు బిజెపి ప్రభుత్వం ఏర్పడటానికి కూడా మోడీ ఛరిష్మానే కారణమనేది కూడా ఎవరూ కాదనలేని సత్యం. నరేంద్ర మోడీ కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు..తాను కూడా బలమైన నాయకుడిగా ఎదిగారు.
అదేసమయంలో మరోవైపు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తొలినాళ్లలో నాయకత్వ లేమిని ఎదుర్కొంది. పివి నరసింహారావు తర్వాత ఆ పార్టీని అంత సమర్థవంతంగా నడిపించిన నాయకులు లేరు. రాహుల్ గాంధీ నాయకత్వంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బిజెపి పని మరింత తేలికైంది. దానికితోడు తొలినాళ్లలో రాహుల్ గాంధీ కూడా పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదు. ఒకరకంగా అప్పట్లో ఆయన పార్టీ కోసం పార్ట్ టైమ్ జాబ్ మాత్రమే చేసేవారు. ఎక్కువగా విదేశీ పర్యటనల్లో ఉండేవారు.
దాంతో మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. నరేంద్ర మోదీ రెండు టెర్ముల పాలనలోనూ ఇదేరకమైన పరిస్థితులు కొనసాగాయి. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలెట్టారో ఆయన నాయకత్వ సామర్థ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. యాత్ర ద్వారా ఒకపక్కన నేరుగా ప్రజలతో మమేకం అవుతూనే ఇంకోపక్కన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ ను మలుపు తిప్పిందీ.. ఆయనలో నాయకత్వ సామర్ధ్యాన్ని వెలికితీసిందీ జోడో యాత్రనే.
అయితే అప్పటికీ రాహుల్ గాంధీ తన నిరసనలను రాజకీయ పంధాలోనే కొనసాగించేవారు. అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన పెద్దగా వాడుకున్నట్టు లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ప్రజలకు సత్వరమే కనెక్ట్ కావడానికి సోషల్ మీడియాని మించిన డిజిటల్ సాధనం మరోటి లేదు. ఈ విషయాన్ని అందరికన్నా ముందు గుర్తించిన వారు నరేంద్ర మోదీ. గుర్తించడమే కాదు. అందివచ్చిన అవకాశాన్ని ఆయన చక్కగా వాడుకున్నారు. అప్పట్లో చాయ్ పే చర్చా కార్యక్రమం మోదీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడింది.
ఈ విషయంలో రాహుల్ గాంధీ పూర్తిగా వెనుకబడిపోయారు. మోదీ తరహాలో ఈయన సోషల్ మీడియాని పూర్తిస్థాయిలో వాడుకోవడంలో విఫలం అయ్యారు. కనీసం అటువంటి కార్యక్రమాలకు ప్రత్యామ్నాయంగా ప్రణాళికలు కూడా రూపొందించలేకపోయారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా అందివస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోలేకపోయారు. ఇదంతా గతం .. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ దృక్పధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో తనలోని ప్రశ్నించే తత్వానికి మరింత పదును పెంచుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పోరాట పంధాని గమనించిన ఎవరికైనా అర్ధమౌతుంది.
CJP రాకతో మారిన పరిణామాలు
ఇండియాలో నీట్ పేపర్ లీక్ సృష్టించిన ప్రకంపనలు అందరికీ తెలిసిందే. నిజానికి నీట్ పేపర్ లీక్ విషయంలో కూడా ప్రతిపక్షాలు సమర్ధవంతమైన పాత్ర పోషించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాలో స్థిరపడిన అభిజిత్ దీప్కె అనే కుర్రాడు సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించడం .. గంటల్లోనే ఆ ప్లాట్ ఫామ్ కి లక్షల్లో ఫాలోవర్స్ యాడ్ అవడంతో కథ కొత్తమలుపు తిరిగింది. అయితే అప్పటి సిజెఐ వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ స్థాపించారు కాబట్టి ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ అభిజిత్ ఇండియా రావడంతో CJP అజెండా మారిపోయింది.
అప్పటికే నివురుగప్పిన నిప్పులా రగులుతున్న నీట్ పేపర్ లీక్ ఉద్యమాన్ని అభిజిత్ హైజాక్ చేసారు. అప్పటికీ ఈ కాక్రోచుల గురించి బిజెపి పెద్దగా పట్టించుకోలేదు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర CJP కి చెందిన నాయకులు సమావేశం అయితే పట్టుమని పదిమంది కూడా లేరని ఇదే సోషల్ మీడియా ద్వారా గేలి చేసారు. కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ వాడకంలో జెన్ జి కుర్రాళ్ళు తమకన్నా అడుగు ముందే ఉన్నారని ఆ పార్టీ పసిగట్టలేకపోయింది. ముందురోజు చూస్తే పట్టుమని పదిమంది లేరు. కానీ మరుసటి రోజు కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ కి పిలుపునిస్తే ఢిల్లీ వీధులు జనసంద్రంతో నిండిపోయాయి. ఇదెలా సాధ్యం? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకే ఒక్క డిజిటల్ యాప్ లక్షల మంది విద్యార్థులను ఢిల్లీ వీధుల్లోకి రప్పించిందని తర్వాత తెలిసింది.
కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చిన పార్లమెంట్ మార్చ్ ఇప్పటివరకూ దేశంలో జరిగిన నిరసనల గతినే మార్చివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మూడు టెర్ముల పాలనలో కాంగ్రెస్ పార్టీతో సహా మరే పార్టీ సాధించలేని విజయాన్ని కేంద్రమంత్రి ని రాజీనామా చేయించడం ద్వారా ఒక చిన్న డిజిటల్ పార్టీ సాధించింది. సరే , ఇక్కడికి అభిజిత్ వచ్చిన పని అయిపొయింది కదా? అయినా సరే ఆయన తిరిగి అమెరికాకు వెళ్లిపోలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేని పనిని తాము చేయగలిగామని అహంకారం తలకెక్కించుకుంది. దాంతో ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారినట్టు CJP కూడా ఫక్తు పొలిటికల్ పార్టీ మాదిరి తన అజెండాని మార్చుకుంది. నీట్ ఉద్యమం ఇచ్చిన స్పూర్తితో మరిన్ని పోరాటాలు చేయాలని విద్యా వ్యవస్థ .. ప్రభుత్వ బడులు అంశాన్ని తలకెత్తుకున్నారు. కానీ ఆ ప్రయోగం అంతగా సక్సెస్ అయినట్టు ఎక్కడా వార్తలు రాలేదు.
ఉద్యమాన్ని హైజాక్ చేసిన రాహుల్ గాంధీ
నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా తాము చేయలేకపోయిన పోరాటాన్ని ఒక డిజిటల్ పార్టీ చేయగలిగిందనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించారు. ఇక్కడే రాహుల్ గాంధీ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మార్చ్ తర్వాత ఆయన నేరుగా జంతర్ మంతర్ వెళ్లి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను కలవలేదు. ఆయన అలా కలిసి ఉంటే విద్యార్థుల ఉద్యమానికి పొలిటికల్ కలర్ వచ్చేది. ఢిల్లీ మార్చ్ తో వచ్చిన క్రేజ్ ని రాహుల్ గాంధీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. విద్యార్థుల గొంతుకల తరపున పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొవ్వోతుల ర్యాలీ పేరుతొ భారీ ఎత్తున నిరసనలు చేసారు. అకస్మాత్తుగా రాహుల్ గాంధీలో వచ్చిన ఈ మార్పును చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ ఒకటి మాత్రం నిజం. నీట్ పేపర్ లీక్ అంశంలో రాహుల్ గాంధీ కూడా దేశం యావత్తు దృష్టిని తనవైపు మళ్లించుకునేలా చేయగలిగారు.
ఇక ఇక్కడినుంచి కథ అందరికీ తెలిసిందే. CJP చేసే ప్రతి పోరాటం వెనుక కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతు ఉంటుంది. అలాగే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని జనంలో ప్రమోట్ చేయడంలో CJP ముందుంటుంది. ప్రస్తుతానికి CJP , కాంగ్రెస్ పార్టీలు ఇదే వ్యూహంతో ముందుకెళ్తాయి.
అప్పుడు NEET ..ఇప్పుడు SIR
అయితే కాంగ్రెస్ .. CJP లకు కలిసివచ్చే మరొక అంశం సర్ రూపంలో తాజాగా తెరమీదికి వచ్చింది. నిజానికి ఈ సర్ వివాదం ఇప్పటిది కాదు. ఏడాది నుంచి ఈ వివాదం నలుగుతూనే ఉంది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎలెక్షన్ల సమయంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేసారు. అయితే అప్పట్లో న్యాయస్థానాలు కూడా సీఈసీ తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేయడంతో ఆ అంశం తాత్కాలికంగా తెరమరుగు అయ్యింది. అయితే ఇటీవల కాలంలో ఎన్నికల సంఘంలోని మిగిలిన ఇద్దరు సభ్యులు.. సర్ విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తమకు తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నట్టు వచ్చిన వార్తలు సర్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే రాహుల్ వ్యాఖ్యలకు ఊతం ఇచ్చాయి. దాంతో తిరిగి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని మరోసారి తెరమీదకు తీసుకు వచ్చారు.
బారికేడ్ ఎక్కిన రాహుల్ గాంధీ
సాధారణంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు చేసే విషయంలో కొన్ని ప్రోటోకాల్ ఇష్యులు కూడా ఉంటాయి. కానీ ఈ రోజు సీఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన రాహుల్ గాంధీ ప్రోటోకాల్ ఇష్యులన్నీ పక్కనబెట్టి సామాన్య కార్యకర్తలా బారికేడ్లు ఎక్కి జాతీయ జెండాని ఊపుతూ నిరసన వ్యక్తం చేయడం ఆయనలోని దూకుడు తత్వాన్ని తెలియచేస్తున్నాయి. బహుశా ఒక ప్రతిపక్ష నాయకుడు బారికేడ్లు ఎక్కి మరీ నిరసన వ్యక్తం చేయడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిదేమో?
సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్ ఫామ్
ఇప్పుడిదంతా ఎందుకంటే రాహుల్ గాంధీ పోరాట పంధాలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ప్రశ్నించే తత్వంతో కూడిన ప్రతిపక్ష నాయకుడి పాత్రను ఇన్నాళ్లకు ఆయన తన చేతుల్లోకి తీసుకున్నట్టు అనిపిస్తుంది. పార్ట్ టైమ్ రాజకీయాల నుంచి ఫుల్ టైమ్ రాజకీయాలకు ఆయన షిఫ్ట్ అవుతున్నట్టు ఉంది.
రాహుల్ గాంధీ కూడా డిజిటల్ మంత్ర బాటలో పయనిస్తున్నారని ఆయన రూపొందించిన సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్ ఫామ్ చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. దేశంలో ఏ మూల..ఎక్కడ నిరసన కార్యక్రమాలు జరిగినా ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నమోదు చేస్తారు. తద్వారా భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా అనుసంధానం చేసి తమ వాయిస్ ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్తున్నారు. ఈ యాప్ ఏర్పాటు చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటో అర్ధమయ్యే ఉంటుందనుకుంటాను.
ముగింపు
ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యం మెరుగుపడినప్పటికీ నరేంద్ర మోడీ వంటి బలమైన నేతను ఎంతవరకు ఎదుర్కోగలరనేది భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.
