ఫ్లై దుబాయ్ విమాన ప్రమాదం నుంచి 174 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన ఇండియన్ పైలట్ Smith Machhar – ప్రపంచం మెచ్చిన భారతీయుడు !

Spread the love

దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్లాల్సిన అంతర్జాతీయ ఫ్లై దుబాయ్ విమానం సెప్టెంబర్ 30 న దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుంది. మెల్లిగా విమానం 30 వేల అడుగుల ఎత్తులోకి చేరుకుని సాఫీగా ముందుకు వెళ్లిపోతుంది. ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ ప్రయాణీకులను పలకరిస్తూ రిఫ్రెష్మెంట్స్ సర్వ్ చేస్తున్నారు.

కొంతమంది మ్యాగజైన్లు చదువుకుంటున్నారు. మరికొంత మంది తమ సీట్లలో విశ్రాంతిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. ఇంకొంతమంది న్యూస్ పేపర్లు తిరగేయడం మొదలు పెట్టారు.

విమాన ప్రయాణాల్లో ఇదంతా సాధారణంగా జరిగేదే. కానీ అప్పటిదాకా ఆ 174 మంది ప్రయాణీకులకు తెలియని విషయం ఒకటుంది. రిలాక్స్డ్ గా సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న వాళ్ళకి రేపు తమ విమాన ప్రయాణమే అన్ని మీడియాలలో మెయిన్ న్యూస్ హెడ్ లైన్ కాబోతుందని ఆ క్షణాన వరకు వాళ్ళకు తెలీదు. ఒకే ఒక్కడి సాహసం వల్ల తమ 174 ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలబడ్డాయని ఆ క్షణాన వాళ్లెవరికీ తెలీదు.

కట్ చేస్తే,

అదే విమానం కాక్పిట్ లో ఉగ్రవాదానికి..మానవత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విమానం నడుపుతున్న పైలట్ మీదికి కో పైలట్ కత్తితో దూసుకొచ్చి విమానాన్ని కూల్చేయాలని బెదిరించాడు. పైలట్ కి అసలు విషయం అర్థమైంది. ఇప్పటిదాకా తన పక్కన కూర్చున్నది కేవలం కో పైలట్ మాత్రమే కాదని.. ఉగ్రవాద భావనను నరనరాన నింపుకున్న నరరూప రక్షసుడని అర్థమైంది.

ఆ పైలట్ ఒక్క క్షణం ఆలోచించాడు. విమానం కూలిపోతే పోయేది తమ ఇద్దరి ప్రాణాలు మాత్రమే కాదు. తమ మీద భరోసాతో హాయిగా నిశ్చింతగా విమానంలో ప్రయాణిస్తున్న 174 మంది ప్రాణాలు కూడా.. వారిలో ఆరుగురు పసివాళ్ళు కూడా ఉన్నారు. ఒకే ఒక్క ఉన్మాది వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవాలా? ఎక్కడో కూర్చుని నెట్ వర్క్ నడుపుతున్న ఉగ్రవాదుల దుశ్చర్యకు అన్నెం పున్నెం ఎరుగని అమాయకులు బలి కావాలా? విమానం నడుపుతున్న పైలట్ మదిలో ఒకేసారి రకరకాల ప్రశ్నలు దొర్లడం మొదలు పెట్టాయి.

చివరికి ఒక ధృఢ నిశ్చయానికి వచ్చాడు. తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా సరే విమానంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ల ప్రాణాలు కాపాడాలి. ఏం జరిగితే అది జరుగుతుందిలే అని కో పైలట్ కి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తూ విమానాన్ని ముందుకే రన్ చేయడం ప్రారంభించాడు.

దాంతో కో పైలట్ లోని రాక్షసుడు పూర్తిగా బయటికి వచ్చాడు. ఫ్లైట్ కంట్రోల్ సిస్టం తన చేతిలోకి తీసుకోవడానికి ముందుకు దూసుకువచ్చాడు. అదే సమయంలో తన చేతిలో ఉన్న కత్తితో పైలట్ ను విచక్షణా రహితంగా పొడవడం మొదలు పెట్టాడు. ఊహించని ఈ దాడికి పైలట్ కూడా మొదట కంగారు పడ్డాడు. కాక్పిట్ లో ఈ ఇద్దరూ మినహా మూడో వ్యక్తి లేడు. ఇద్దరికీ పెనుగులాట మొదలైంది.ఈ పెనుగులాటలో ఫ్లైట్ 30 వేల అడుగుల ఎత్తునుంచి సగానికి 15 వేల అడుగుల ఎత్తుకి దిగిపోయింది.

ఇది ఇలాగే కొనసాగితే ఫ్లైట్ ఏ క్షణాన అయినా కూలిపోవచ్చని పైలట్ పసిగట్టాడు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ కి హైజాక్ కోడ్ పంపించాడు. కోడ్ పంపించి ATC ని అలర్ట్ చేసినప్పటికీ ఆలస్యం అయ్యే కొద్దీ ఫ్లైట్ కంట్రోల్ సిస్టం కో పైలట్ చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని పైలట్ పసిగట్టాడు. అందుకే ఒకపక్క కో పైలట్ తో ఫైట్ చేస్తూనే అతడు చూడకుండా కాక్పిట్ డోర్ ఓపెన్ చేశాడు.

దాంతో అప్పటిదాకా కాక్పిట్ లో జరుగుతున్న యుద్ధం ప్రయాణీకుల కంట పడింది. వాళ్ళు కూడా పానిక్ కాకుండా ధైర్యంగా ముందుకొచ్చి కో పైలట్ ను పట్టుకుని బంధించారు. అప్పటికే ఒంట్లో శక్తి హరించుకుపోయిన పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వివిధ దేశాలకు చెందిన 174 మంది ప్రయాణీకులు హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుని కన్నీటితో ఆ పైలట్ కి నమస్కారాలు పెట్టారు. తీవ్ర గాయాల పాలైన పైలట్ కి ప్రస్తుతం సోదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. మొదట్లో ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని అనధికార వార్తలు బయటికి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారని వైద్యులు చెబుతున్నారు.

ఏంటీ? ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కానేకాదు.. ఒక వీరోచిత పైలట్ కి.. ఉగ్రవాద మూలాలు నింపుకున్న కో పైలట్ కి మధ్య ఆకాశ మార్గంలో నిజంగా జరిగిన యుద్ధమే. ఒకే ఒక్క పైలట్ సాహసం వల్ల 174 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా నిలబడ్డాయన్నది నూరు శాతం నిజంగా జరిగిన సంఘటనే.

ఇంతకీ ఆ పైలట్ ఎవరో కాదు. స్మిత్ మచ్చర్ (smith machhar) అనే భారతీయుడు. ఈయన స్వరాష్ట్రం గుజరాత్ అయినప్పటికీ ముంబైలో సెటిల్ అయ్యారు. గతంలో స్పైస్ జెట్ ఎయిర్ వేస్ లో పది సంవత్సరాల పైలట్ అనుభవం ఉన్న మచ్చర్ ఈ మధ్య ఫ్లై దుబాయ్ విమాన సర్వీసులలో తన పైలట్ వృత్తిని కొనసాగిస్తున్నారు.

ఆగండాగండి.. ఈ హీరో కథ ఇంతటితో అయిపోలేదు. నిన్నటినుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ హీరో పేరు మారుమోగిపోతోంది. కేవలం 174 మంది ప్యాసింజర్లే కాదు యావత్ ప్రపంచం మచ్చర్ కి సెల్యూట్ కొడుతుంది.
తన ప్రాణాలకు తెగించి వివిధ దేశాలకు చెందిన 174 మంది ప్రాణాలు కాపాడిన మచ్చర్ భారతీయుడు కావడం తమకు గర్వ కారణం అనీ .. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఈజ్ ఎ హీరో అని ప్రధాని నరేంద్ర మోదీ X వేదికగా స్పందించారు. పెను ప్రమాదం నుంచి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన పైలట్ కి సెల్యూట్ చేస్తున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ X లో పోస్ట్ చేశారు. అదే బాటలో ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు కూడా పైలట్ సాహస కృత్యానికి సెల్యూట్ చేశారు. ఈ పరంపర ఆగడం లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తూనే ఉన్నాయి.

ముగింపు

కో పైలట్ దుశ్చర్య వెనుక ఉన్న కారణాలపై ఇప్పటివరకు పూర్తి సమాచారం బయటికి రాలేదు. బహుశా ఒకట్రెండు రోజుల్లో అధికారుల దర్యాప్తులో పూర్తిస్థాయిలో బయటికి రావొచ్చు.

అయితే ఈ ఘటనలో సామాన్య మానవులకు కూడా కొన్ని సందేహాలు వస్తాయి. అంతర్జాతీయ విమానాలు నడిపే పైలట్.. కో పైలట్ ఆరోగ్య పరిస్థితులను నిపుణులైన వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఆల్కహాల్.. డ్రగ్స్ టెస్టులు కూడా ఉంటాయి. అంతేకాదు వారి మీద ఏవియేషన్ అధికారుల నిఘా కూడా ఉంటుంది.

అంతర్జాతీయ విమానాలు నడిపే పైలట్లకు అర్హత.. అనుభవం విషయాల్లో కఠినమైన నిబంధనలు ఎలాగూ ఉంటాయి. ఇంత పకడ్బందీ సిస్టమ్ ఉండగా కో పైలట్ దుశ్చర్యను ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారు? సహజంగా అంతర్జాతీయ విమానాల్లో అత్యంత ఆధునిక సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ బిల్ట్ అయి ఉంటుంది కదా? మరి కో పైలట్ చేతికి కత్తి ఎక్కడ్నుంచి వచ్చింది?

ఈ సందర్భంగా గతంలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ విమాన ప్రమాదం సమయంలో కూడా కాక్పిట్ లో పైలట్.. కో పైలట్ మధ్య జరిగిన సంభాషణ బ్లాక్ బాక్సులో రికార్డ్ అయ్యింది. అందులో ఫ్యూయల్ వాల్వ్ ఎందుకు షట్ చేశావని పైలట్.. కో పైలట్ మీద అరవడం రికార్డ్ అయ్యిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇకముందు ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా ఏవియేషన్ వ్యవస్థలో కఠినమైన నిబంధనలు తీసుకొస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది కూడా.

ఇదిగో నిన్న జరిగిన సంఘటనతో ప్రపంచ దేశాలు ఏవియేషన్ వ్యవస్థలో కఠిన నిబంధనలు.. సేఫ్టీ ఫీచర్స్ మీద మరింత శ్రద్ధ పెట్టాలని అర్థమౌతుంది. ఏదిఏమైనా తన ప్రాణాలను ఫణంగా పెట్టి 174 మంది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ మచ్చర్ కి రచ్చబండ కబుర్లు తరపున కూడా అభినందనలు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *