తెలుగు నటుడు సుహాస్ ప్రతినాయకుడి పాత్రలో తమిళనాట తొలిసారి తెరంగేట్రం చేసిన సినిమా మండాడి (Mandadi Movie). సెప్టెంబర్ 10,2026 న తమిళ భాషలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్టోబర్ 8, 2026 నుంచి మండాడి సినిమా తెలుగు వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
తమిళనాట క్రేజ్ తెచ్చుకున్న నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించడం..ప్రతినాయకుడిగా తెలుగు నటుడు సుహాస్ నటించడంతో అటు తమిళ చిత్ర పరిశ్రమలోను.. ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ విడుదలకు ముందే ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి.
మరి అందరి అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా ఉందో? లేదో ఇప్పుడు చూద్దాం.
కథేంటంటే?
సముద్ర తీరానికి అనుకుని ఉన్న కళింగ పట్నం విలేజ్ లో అమ్మవారి జాతర జరుగుతుంటుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా మల్లేష్ అనే కుర్రాడు సాట్టా పులి (సుహాస్) కొడుకు కిషోర్ మీద కత్తితో దాడి చేసి చంపబోతాడు. కానీ ఈ దాడి నుంచి కిషోర్ తప్పించుకుంటాడు. తన కొడుకు మీద దాడి చేసిన మల్లేష్ ని చంపేయడానికి సాట్టా పులి తన మనుషులను పంపిస్తాడు. దీంతో భయపడిన మల్లేష్ హైదరాబాదులో ఉంటున్న ముత్తు కాళీని (సూరి) కలిసి జరిగింది చెప్తాడు.
విషయం తెలుసుకున్న కాళీ 20 సంవత్సరాల తర్వాత తిరిగి కళింగ పట్నం వస్తాడు. అక్కడ పెద్దల సమక్షంలో ఇరువురు రాజీ ఫార్ములా మాట్లాడుకుంటారు. కళింగ పట్నం లో జరిగే పడవ పందేలలో ఏ జట్టు అయితే గెలుస్తుందో వారికే అక్కడ ఆధిపత్యం అప్పగించబడుతుంది.. ఓడిన జట్టు ఊరు విడిచి పెట్టి వెళ్ళిపోవాలి. ఈ ఒప్పందానికి సాట్టా పులి… కాళీ లు ఒప్పుకుంటారు.
అసలు మల్లేష్ పులి కొడుకు మీద ఎందుకు దాడి చేస్తాడు? 20 సంవత్సరాల క్రితమే కాళీ ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటి? సాట్టా పులి.. కాళీ ల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? చివరకు పడవ పందేలలో ఏ జట్టు గెలుస్తుంది? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ డ్రామా కథలతో చాలా సినిమాలు వచ్చాయి. జల్లికట్టు.. కబడ్డీ..క్రికెట్.. కుస్తీ పోటీలు.. బైక్ రేసింగ్ ఎక్సెట్రా.. ఎక్సెట్రా అన్నమాట. ఏ సినిమా చూసినా మూల కథ దాదాపు ఒకేలా ఉంటుంది.
నేటివిటీని బట్టి కొన్ని సినిమాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.. కొన్ని కనెక్ట్ కావు.. సపోజ్ జల్లికట్టు సినిమా మీద తమిళ ఆడియన్స్ కనెక్ట్ అయిన విధంగా ఇతర భాషల ఆడియన్స్ కనెక్ట్ కారు. తెలుగు వారికి సంక్రాంతి ఎలాగో.. తమిళులకు జల్లికట్టు అలాంటిది. అందువలన స్పోర్ట్స్ డ్రామా మూవీలు ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు.. సంస్కృతీ సంప్రదాయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్లో శ్రీకాకుళం జిల్లా కళింగ పట్నం ప్రాంతంలో కథ మొదలైనట్టు చూపించారు కానీ సినిమా చూస్తున్న వాళ్ళకు తెలుగు నేటివిటీ ఎక్కడా కనిపించదు. ఒక్క సుహాస్ మినహా మిగిలిన నటులు తమిళులు కావడం.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సంభాషణలు.. డబ్బింగ్ కుదరకపోవడం ఈ సినిమాకి మైనస్ అవుతుంది.
ఇక కథ విషయానికి వస్తే ముందే చెప్పినట్టు స్పోర్ట్స్ డ్రామా సినిమాలన్నీ ఒకే మూసలో ఉన్నట్టు కనిపిస్తాయి. దానికి తోడు ఈ సినిమాలో అసలు కథలోకి రావడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు.
పులికి.. కాళీకి మధ్య గొడవలు ఏంటి? అసలు గొడవలు ఎందుకు వచ్చాయి? మల్లేష్ పులి కొడుకును ఎందుకు చంపాలనుకుంటాడు? కళింగ పట్నంలో పడవ పందేలకు పులి వ్యాపారాలకు ఉన్న లింక్ ఏంటి? లాంటి ప్రశ్నలకు సెకండాఫ్ లో కానీ మనకు సమాధానాలు దొరకవు. అప్పటిదాకా అసలు స్టోరీ ఏంటో తెలియక కొంత కన్ఫ్యూజ్ అవుతాం.
ఎప్పుడైతే దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాడో అప్పుడు సినిమా కథ మొత్తం అర్థమైపోతుంది. ఒక్క స్టోరీ అర్థమవడమే కాదు.. తర్వాత ఏం జరుగుతుందో కూడా అర్థమైపోతుంది. ఇక అక్కడ్నుంచి స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉండటంతో మనల్ని పెద్దగా ఎంగేజ్ చేయదు.
కాకపోతే అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే మనల్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తుంది. ముని పాత్రలో సత్యరాజ్ ఎంటర్ అవడం.. కాళీ లవ్ ట్రాక్.. తండ్రీ కొడుకుల ట్రాక్ (సుహాస్) ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా మీద తిరిగి కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.
ఇక సినిమా ప్రమోషన్స్ లో మాత్రం మండాడిలో సుహాస్ పాత్ర నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని భారీ హైప్ ఇచ్చారు. కానీ సినిమా చూసిన వారికి సుహాస్ పాత్రలో అంత హైప్ ఏమీ లేదనిపిస్తుంది. నిజానికి సుహాస్ చక్కటి టాలెంట్ ఉన్న నటుడు.. హీరోగా ఎంత బాగా చేయగలడో..ప్రతినాయకుడిగా కూడా అంతే బాగా చేయగలడు.
సుహాస్ నటన తమిళులకు కొత్తేమో కానీ తెలుగు వారికి సుపరిచితమే. సాట్టా పులి పాత్రలో సుహాస్ నటన చూసిన తెలుగువాళ్లకి దర్శకుడు అతడి నుంచి పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేదు అని అర్థమౌతుంది.
ఇక ఈ సినిమా మూల కథ పడవ పందేల నేపథ్యంలో రాసుకున్నారు కాబట్టి సినిమాలో ఎక్కువ భాగం మనకి పడవ పందేలే కనిపిస్తాయి.. అది సహజమే కానీ సమాంతరంగా కథని నడిపించకుండా ఎంతసేపూ పడవలు సముద్రంలోకి తోలడం..తెరచాపలు చుట్టటం.. తాళ్ళు కట్టడం వంటి సన్నివేశాలే రిపీట్ కావడంతో కొంత బోర్ కూడా కొడుతుంది. ఇక ముత్తు కాళీ ఇరవై ఏళ్ళ క్రితమే ఊరు విడిచిపోవడం వెనుక ఉన్న కారణాన్ని దర్శకుడు సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.
ఇప్పుడు లాజిక్కుల సంగతి మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ముత్తు కాళీ ..సాట్టా పులి వర్గాలు ఒకరినొకరు తన్నుకుంటారు..పొడుచుకుంటారు..కొంతమందికి చేతులు కట్ అవుతాయి.. మరికొంతమందికి ఒళ్ళంతా కుట్లు పడతాయి. అయినా పోలీసులు మాత్రం ఆ ఊర్లోకి ఎంటర్ అవరు. అలా అని కళింగపట్నం పోలీసులు ..చట్టాలు లేని ప్రత్యేక ఐలాండ్ కాదు. మరీ పోలీస్ కనపడకపోతే బాగోదు అనుకున్నారేమో ఆఖర్లో పడవ పందేలు జరుగుతున్నప్పుడు జనాల్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన ఒకే ఒక్క పోలీసుని మాత్రం చూపించారు.
క్లైమాక్స్ పడవ పందేలే ఈ సినిమాని ఒక మెట్టు పైన నిలబెడతాయి. ముఖ్యంగా సముద్రంలో పడవ పందేలు జరుగుతున్న సమయంలోనే సుడి గుండం ఏర్పడటం.. ఆ సుడి గుండంలో కాళీ పడవ చిక్కుకుని బయట పడటం వంటి సీన్లను విజువలైజ్ చేసిన తీరు బాగుంది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమా మొత్తాన్ని రెండు పాత్రలే బలంగా నడిపించాయి. సాట్టా పులి పాత్రలో సూరి.. కాళీ పాత్రలో సుహాస్ లు పోటీ పడి నటించారు. కాకపోతే సుహాస్ నుంచి దర్శకుడు పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేకపోయారు. సత్యరాజ్ కు కూడా మంచి పాత్ర పడింది కానీ సినిమాలో ఆయనకు ఇంకా స్కోప్ ఇవ్వాల్సింది. సినిమాలో సత్యరాజ్ పాత్రకు మంచి ఎలివేషన్ ఉంటుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. చివరికి ఆయన పాత్రని ముగించిన తీరు కట్టప్ప నుంచి ఏవేవో ఎక్స్పెక్ట్ చేసిన చాలామందిని నిరుత్సాహపరుస్తుంది.
సాంకేతికత
జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అందించిన బిజిఎం బాగుంది.
అలాగే ఎస్ ఆర్ ఖదీర్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్సు సీన్ లో సముద్రంలోని సుడి గుండాలను విజువలైజ్ చేసిన తీరు చాలా బాగుంది.
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

విశ్లేషణ
మండాడి సినిమా పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిందింది. పడవ పందేలు చూసేవారికి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా కథ సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్ల జీవితాలతో కూడా ముడిపడి ఉంది. కానీ దర్శకుడు సినిమాలో మృత్సకారుల జీవితాల జోలికి వెళ్ళలేదు.
సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రెండు వర్గాల నడుమ ఉన్న విభేదాలకు, పగలకు.. పడవ పందేలకు ముడిపెట్టి దర్శకుడు కథ రాసుకున్నట్టున్నారు. తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్ నాయకులు రాజకీయాల్లో తేల్చుకున్నట్టు ..ఈ సినిమాలో నాయకుడు ..ప్రతినాయకుడు పడవ పందేల్లో తేల్చుకుంటారు. అందుకే ఈ సినిమా తమిళ ఆడియన్సుకి ఎక్కువగా కనెక్ట్ అయ్యింది.
ఓవరాల్ గా ఈ సినిమా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ కొంత ఎంగేజ్ చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఓ లుక్కేయండి.
నటీనటులు : సుహాస్ , సూరి, సత్యరాజ్ తదితరులు
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎస్ ఆర్ ఖదీర్
నిర్మాత: వెట్రిమారన్
దర్శకత్వం: మదిమారన్ పుహలేంది
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 8-10-2026
రేటింగ్: 2.5/5
