Bethlehem Kudumba Unit Movie Review (OTT) – ప్రేమలు దర్శకుడి మరో ప్రేమకథా చిత్రం!

Spread the love

నివిన్ పౌలి, మమిత బైజు జంటగా నటించిన బెత్లెహామ్ కుటుంబ యూనిట్ మలయాళం మూవీ ( Bethlehem Kudumba Unit Movie) సెప్టెంబర్ 4,2026 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మూడువందల కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఈ రోజు (అక్టోబర్ 2, 2026) అదే సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్లో ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

రిలీజుకు ముందే ఈ సినిమా మలయాళంలో మంచి క్రేజ్ సాధించింది. ప్రేమలు సినిమా తీసిన గిరీష్ AD ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం.. ప్రముఖ మలయాళం నటులు దిలీష్ పోతన్ , ఫహాద్ ఫాసిల్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం వహించడం సినిమా మీద అంచనాలు పెంచాయి.
మరి అందరి అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందో? లేదో? ఇప్పుడు చూద్దాం.

కధేంటంటే?

కుటుంబ పరిస్థితుల వల్ల ఆశ్లే (మమిత బైజు) ఉన్న ఇంటిని వదిలి వేరే ఊరికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. అలా షిఫ్ట్ అయిన ఆశ్లేకి ఓ చర్చ్ కి సంబంధించిన బెత్లెహాం కుటుంబ యూనిట్ పరిచయం అవుతుంది. ఆశ్లే దిగిన ఇంటికి ఎదురు ఇంట్లో జస్టిన్ (నివిన్ పౌలి) తన తమ్ముడు జోయెల్ (సంగీత్ ప్రతాప్) తో కలిసి ఉంటాడు. తమ్ముడు జోయెల్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటాడు. జస్టిన్ క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఊళ్ళో మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఏజ్ బార్ అయినా కూడా జస్టిన్ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే మిగిలిపోతాడు. జస్టిన్ పెళ్లి చేసుకోకపోవడానికి కూడా ఒక కారణం ఉంది.

ఈ నేపథ్యంలో ఎదురింట్లో దిగిన ఆశ్లే మొదటి చూపులోనే జస్టిన్ ను ప్రేమిస్తుంది. అదే విషయం అతడితో ప్రపోజ్ చేస్తుంది. కానీ జస్టిన్ మాత్రం తనకూ ఆమెకూ 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ ప్రేమ తనకిష్టం లేదంటాడు.

వయసు వచ్చినా జస్టిన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి?
జస్టిన్ గతం తెలుసుకున్న తర్వాత కూడా ఆశ్లే అతడ్ని ప్రేమిస్తుందా?
చివరికి వీరి ప్రేమను ఇరు కుటుంబాల వాళ్ళు అంగీకరిస్తారా? లేదా? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

కథ చదివిన తర్వాత మీకేమనిపించింది? పాత చింతకాయ పచ్చడి అనిపించిందా? కొత్తదనం ఏమీ లేదు కదా అనుకుంటున్నారా? గతంలోనే ఇలాంటి ప్రేమ కథలు చాలా సినిమాల్లో చూసేసాం అనుకుంటున్నారా?

అవున్నిజమే.. మీ సందేహాలన్నీ నిజమే. ఈ సినిమాకి మలయాళంలో 300 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే అందుకు కారణం కథ కాదు. ఆకట్టుకునే కథనం అందుకు కారణం. ప్రేమ కథలు చెప్పడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. మన కె రాఘవేంద్ర రావు BA గారు హీరోయిన్ల బొడ్డు మీద ఫ్రూట్స్ విసురుతూ ఎన్నో లవ్ స్టోరీ సినిమాలని మ్యూజికల్ ఎంటర్టైనర్ గా మలిచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అది ఆయన శైలి. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అలాంటి సినిమాలను కూడా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఇంకొంతమంది దర్శకులు లవ్ స్టోరీలను పోయెటిక్ గా తెరకెకిస్తారు. అంటే దృశ్య కావ్యం అంటారే అలా అన్నమాట. అలా తెలుగు సినిమాల్లో కూడా అందమైన ప్రేమ కథా దృశ్య కావ్యాలు చాలా వచ్చాయి.

ప్రేమ కథలను అందమైన దృశ్య కావ్యంగా మలిస్తే ఏమౌతుంది? ఇదిగో ఇలా మూడొందల కోట్ల కలెక్షన్ వస్తుంది. ఈ సినిమాలో జరిగింది అదే. దర్శకుడు స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఆడియన్స్ ని సినిమాలో ఎంగేజ్ చేశాడు. ఈ సినిమాలో లిప్ లాకులు ఉండవు.. ఐటెం సాంగులు ఉండవు.. హీరోయిన్ అర్థ నగ్న ప్రదర్శనలు ఉండవు. హీరో ఎలివేషన్లు ఉండవు. ఈ తరం అమ్మాయికి.. పాత తరం అబ్బాయికి మధ్య ప్రేమను కలిపి కథ చెప్పుకుంటూ పోయాడు. ఎప్పుడైతే ఆ రెండు పాత్రలకు మనం కనెక్ట్ అవుతామో అప్పట్నుంచి కథతో పాటు మనం కూడా ప్రయాణిస్తాం.

ఇక మన భాషలో చెప్పుకోవాలంటే తనకన్నా పదమూడేళ్ళ పెద్ద అయిన పెళ్ళికాని ఓ అంకుల్ ని కాలేజీ చదువు పూర్తి చేసుకున్న నేటి తరానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించడం విచిత్రంగానే అనిపిస్తుంది. ఆ అమ్మాయి ప్రత్యేకంగా ఆ అంకుల్ ని ప్రేమించడానికి ఏవన్నా ప్రత్యేక కారణాలు ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.

ఇక హీరో.. హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ మొదలెట్టడం కూడా దర్శకుడు సింపుల్ గా కానిచ్చేశాడు. ఆ అమ్మాయి కిటికీలోంచి ఎదురింటి అంకుల్.. సారీ.. హీరోని చూడటం.. వెంటనే ప్రేమలో పడిపోవడం పాత తరం వాళ్ళకి కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలా అని హీరోగారికి స్పెషల్ క్వాలిటీస్ ఏమీ ఉండవు. కొందరిలా ఇతడూ తాగుతాడు.. ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్ లో అతడికో లవ్ స్టోరీ ఉంటుంది. ఏజ్ ఎలాగూ ఎక్కువే.. అయినా ఆ అమ్మాయి అతడినే ప్రేమిస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే.. అలా అన్నమాట.

సరే.. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది..అలాంటివేమీ పట్టించుకోరు అంటారా? అయితే ఓకే.. ఆ పాయింట్ వదిలేద్దాం. ఫస్టాప్ లో పాత్రల పరిచయాలు..హీరోయిన్.. హీరో గారి మీద మనసు పారేసుకోవడాలు.. హీరో ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడాలు.. హీరో తమ్ముడి షార్ట్ ఫిలిమ్స్ షూటింగులతో కథనాన్ని రన్ చేసిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్ తో హీరోయిన్ ప్రేమకు హీరోగారితో ఓకే చెప్పిస్తాడు.

ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఈ లవ్ స్టోరీకి ఏజ్ గ్యాప్ అనేది మెయిన్ పాయింట్ కాబట్టి దర్శకుడు సెకండాఫ్ లో కథనాన్ని అటునుంచి నరుక్కుంటూ వచ్చాడు. ఆశ్లేని ప్రేమించటానికి జస్టిన్ ఒప్పుకుంటాడు కానీ కండిషన్స్ పెడతాడు. ఒకరకంగా కండిషనల్ లవ్ అన్నమాట. తమ ప్రేమ నలుగురికీ తెలియకుండా సీక్రెట్ గా ప్రేమించుకోవాలనేది ఒక కండిషన్. తనకన్నా పదమూడేళ్ళ చిన్న అమ్మాయితో లవ్ ఎఫైర్ నడపడానికి హీరో పడే అవస్థలు మనకు నవ్వు తెప్పిస్తాయి. తన ప్రేమ విషయంలో గుట్టుగా ఉన్న జస్టిన్ తమ్ముడి ప్రేమ విషయంలో మాత్రం ఓపెన్ సపోర్ట్ చేయడం కథలో భాగంగా బాగానే కుదిరింది.

కాకపోతే తమ్ముడి లవ్ ట్రాక్ కామెడీకి ఎంత పనికొస్తుందో.. సాగతీతకు కూడా అంతే పనికొస్తుంది. ఒక టైమ్ లో మనకి విసుగు కూడా వస్తుంది. ఒక పక్కన జస్టిన్ లవ్ స్టోరీని నడిపిస్తూనే తమ్ముడి లవ్ స్టోరీ కూడా ట్రాక్ మీదకి తీసుకురావడంతో ఒకే టికెట్ మీద రెండు ప్రేమ కథా చిత్రాలను చూసిన ఫీలింగ్ వస్తుంది. తమ్ముడి లవ్ ట్రాక్.. ప్రేమికురాలి అన్నయ్య గ్యాంగ్ ఛేజింగులు..ఫైటింగులు.. దృశ్య కావ్యంలా సాగిపోతున్న కథనానికి స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డు వస్తూ ఉంటాయి.

సరే కాసేపు ఆ తమ్ముడి లవ్ ట్రాక్ పక్కనబెడదాం. మరి ఈ సినిమాని నిలబెట్టిన అంశాలేంటి? అని ప్రశ్నించుకుని చూస్తే మనకు కొన్ని సమాధానాలు దొరుకుతాయి. వాటిలో మొదటిది ముందే చెప్పినట్టు దర్శకుడి స్క్రీన్ ప్లే మ్యాజిక్. మమిత బైజు క్యూట్ ఎక్స్ప్రేషన్స్ ఈ లవ్ స్టోరీకి కొత్త పరిమళం అద్దింది. లేటు వయసులో ఘాటు ప్రేమను పండించలేక నివిన్ పౌలి పడే అవస్థలు సినిమాని మరో మెట్టు పైకి చేర్చాయి. క్లైమాక్స్ కూడా సుత్తి లేకుండా స్మూతుగా ముగించిన విధానం బాగుంది.

ఎవరెలా చేశారు?

ఈ సినిమా మొత్తం మీద మనకు ఓ పది పాత్రలు కనపడతాయేమో? కానీ సినిమాని నిలబెట్టింది మాత్రం రెండే రెండు పాత్రలు. వాటిలో మొదటిది ఆశ్లే పాత్ర.. రెండోది జస్టిన్ పాత్ర.. ఆశ్లే పాత్రలో మమిత బైజు తన క్యూట్ ఎక్స్ప్రేషన్స్ తో పూర్తి న్యాయం చేసింది. హీరోకి తనకి ఏజ్ గ్యాప్ కనపడాలని అలా డిజైన్ చేశారేమో తెలీదు కానీ ఈ సినిమాలో మమిత బైజు మరీ చిన్న పిల్లలా కనిపించింది.
ఇక జస్టిన్ పాత్రలో నివిన్ పౌలి పెళ్ళికాని ప్రసాదులా అవస్థలు పడే పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

సాంకేతికత

విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి అదనపు బలం అవుతుంది. సందర్భోచితంగా పడే బిట్లను మ్యూజిక్ డిపార్ట్మెంట్ చక్కగా ట్యూన్ కట్టారు.

అజ్మల్ సాబు అందించిన ఫోటోగ్రఫీ కూడా బాగుంది. కేరళ సహజ అందాలను చక్కగా క్యాప్చర్ చేశారు. గోవా ట్రిప్ ను విజువలైజ్ చేసిన తీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

ప్రేమలు సినిమా చాలామంది చూసే ఉంటారు కదా? మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా హిట్ కొట్టింది. ఆ సినిమాకి కూడా ఇదే దర్శకుడు దర్శకత్వం వహించారు. ఆ సినిమాని నడిపించింది కూడా దర్శకుడి స్క్రీన్ ప్లే మ్యాజిక్కే.. ఆయన అదే మ్యాజిక్ ని ఈ సినిమాలో కూడా మరోసారి రిపీట్ చేశాడు. అందుకే ఈ సినిమా చూసేటప్పుడు మనకు ఆ సినిమా తాలూకు కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి.

ఓవరాల్ గా రెండు సినిమాలు చూస్తే మనకు ఒక విషయం అర్థమౌతుంది. దర్శకుడు కథ కన్నా కథనాన్ని ఎక్కువగా నమ్ముకుంటాడు. తనదైన శైలిలో కథనాన్ని ముందుకు నడుపుతూ పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్న విషయం.. స్లో నేరేషన్ విషయాన్ని ప్రేక్షకులు మర్చిపోయేలా చేసి మెల్లిగా పాత్రలతో కనెక్ట్ అయ్యే విధంగా మలచడంలోనే ఆ దర్శకుడి టాలెంట్ ఉంది.

ఇక ఏ ప్రేమ కథ చూసినా ఏమున్నది గర్వకారణం.. రెండు లిప్ లాకులు.. నాలుగు సాంగులు.. నల్ల శాలువా కప్పుకోనుడు..ఎడబాటు.. ఏడ్పు బాటలు.. చివరికి ది ఎండ్ కార్డ్ వేయుడు.. ఇత్యాది ఘట్టాలన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇది అటువంటి డీప్ లవ్ స్టోరీ కాదు.. డీసెంట్ లవ్ స్టోరీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రిమోట్ బటన్లు మార్చకుండా మొదటి నుంచి చివరి వరకు హాయిగా చూడొచ్చు.
జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి చూసేయండి.

నటీనటులు: నివిన్ పౌలి, మమిత బైజు, సంగీత్ ప్రతాప్ తదితరులు
సంగీతం : విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు
నిర్మాత: దిలీష్ పోతన్ , ఫహాద్ ఫాసిల్
దర్శకత్వం: గిరీష్ AD
ఓటిటి: జియో హాట్ స్టార్
విడుదల: 02-10-2026
రేటింగ్: 3/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *