Lurk (Eyes On The Prey) Movie Review – ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ!

Spread the love

సైజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ లర్క్ (Lurk Movie) గత జులై 24 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఒరిజినల్ మలయాళం వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమాకి ప్రముఖ మలయాళ దర్శకుడు నిషాద్ దర్శకత్వం వహించారు. అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి రావడం వెనుక మానవ మృగాల స్వార్థం ఉందనే పాయింట్ ఆధారంగా దర్శకుడు కథ రాసుకుని లర్క్ మూవీని తెరకెక్కించారు.
ఇప్పుడు లర్క్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే?

కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకుని చిన్నప్పర అనే విలేజ్ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అటవీ జంతువులు తమ గ్రామంలోకి వస్తుండటంతో గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కు మంటూ జీవిస్తూ ఉంటారు.

ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన మహిళను ఒక పులి చంపేయడంతో గ్రామస్తులు భయపడి కలెక్టర్ ను కలిసి అడవిలోని జంతువులు తమ గ్రామంలోకి రాకుండా ఎలెక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించమని కోరతారు. ఈ విషయాన్ని కలెక్టర్ మంత్రి (సైజ్ కురుప్) దృష్టికి తీసుకురావడంతో ఆయన అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఈ సమావేశంలో కలెక్టర్.. ఎస్పీ.. ఫారెస్ట్ ఆఫీసర్ తదితరులు పాల్గొంటారు. అడవి జంతువులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాటిని గ్రామాలకు దూరంగా ఉండే వేరే అడవిలో వదిలి పెట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

అడవి జంతువుల ప్రాణాలకు ప్రమాదం లేకుండా తనదగ్గరున్న రైఫిల్ తో మత్తు ఇంజెక్షన్ షూట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ జయరామ్ కు ఈ టాస్క్ అప్పగిస్తారు.

అసలు అడవిలో ఉండే ఏనుగులు.. పులులు గ్రామంలోకి ఎందుకు వస్తున్నాయి? అడవి జంతువులను పట్టుకునే టాస్క్ ను డాక్టర్ జయరామ్ ఎలా పూర్తి చేస్తారు? అటవీ సంపద మీద ఎవరి కన్ను పడుతుంది? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

లర్క్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న పాయింట్ మంచిదే.. కానీ ఆ పాయింటుని వెండి తెర మీద ప్రెజెంట్ చేయడంలో ఆయన తడబడ్డారు.

నిజానికి లర్క్ అనేది కేవలం ఒక సినిమా కథ మాత్రమే కాదు. నిజ జీవితంలో ఇప్పటికీ ఎదురవుతున్న సమస్య. మీరు గమనించారా? ఈ మధ్య కూడా తిరుమల నడక దారిలో పులుల సంచారం గురించిన వీడియోలు బయటికి వచ్చాయి. గతంలో కూడా నడక దారిలో చాలామంది భక్తులు పులుల బారిన పడి గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలతో భయపడిన భక్తులు నడక దారిలో ఫెన్సింగ్ వేయించమని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే ‘ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కానివ్వమని ‘ ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకోవడం మన రాజకీయ నాయకులకు అలవాటు కదా? మళ్ళీ ఇంకో పులి వచ్చేదాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.

లర్క్ సినిమా కథ కూడా ఇదే. అడవిలో ఉండే పులి గ్రామంలోకి వచ్చి మహిళను చంపేస్తుంది. మరో ఏనుగు ఇంకో మహిళను కాలితో తొక్కి చంపేస్తుంది. జంతువులు తమ గ్రామంలోకి రాకుండా ఎలెక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించమని గ్రామస్తులు అధికారులను కోరతారు. సర్వే చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్తారు అధికారులు. కానీ నిర్ణయాలు తీసుకోరు.

ఫస్టాఫ్ లో దర్శకుడు పర్యావరణ పరిరక్షణ విషయంలో వ్యవస్థల తప్పులను ఎత్తి చూపుతూ కథనాన్ని నడిపారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి రావడం వెనుక మానవ మృగాల స్వార్థం ఉందనే పాయింట్ ఆధారంగా కథనాన్ని నడిపారు. ఓవరాల్ గా సినిమా మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే కొనసాగుతుంది.

అటవీ సంపద మీద కన్నేసిన కొన్ని మానవ మృగాలు.. పర్యావరణ పరిరక్షణకు తూట్లు పొడుస్తూ చేసే వికృత చేష్టల వల్లనే అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని దర్శకుడు ఇచ్చిన చక్కటి సందేశం అయితే బాగానే ఉంది కానీ ఆ సందేశాన్ని తెర మీద మరింత ఎఫెక్టివ్ గా ప్రోజెక్ట్ చేయడంలో మాత్రం ఆయన తడబడ్డారు.

దీనికి కారణం దర్శకుడు సినిమాలోని పాత్రలను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోకపోవడం. మరీ ముఖ్యంగా డాక్టర్ జయరామ్ పాత్ర ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. సినిమాకి అతడి పాత్ర కీలకం. ఆ పాత్ర ద్వారా అటవీ పరిరక్షణ గురించి మంచి సందేశం ఇవ్వొచ్చు. కానీ సరైన పాత్రకి స్త్రీ లోలత్వం అద్ది క్యారెక్టర్ లేకుండా చేసేసారు.

ఇక సినిమాలో ఆ లేడీ కలెక్టర్.. లేడీ ఎస్పీలు మినహా అందరూ తాగుతారు. ఈ ఒక్క విషయంలో మాత్రం దర్శకుడు మహిళలకు గౌరవం ఇచ్చాడు. మంత్రి గారు మందు తాగుతూ తాను ఆడవాళ్ల ముందు మందు తాగనని ఏదో జోక్ కూడా వేస్తాడు.

ఆడవాళ్ళతో ఎఫైర్ పెట్టుకునే డాక్టర్ జయరామ్ తో.. ఓ క్యారెక్టర్ ‘ ఇంతమంది ఆడవాళ్లు నిన్ను లైక్ చేయడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అనడుగుతాడు. దానికి డాక్టర్ నవ్వుతూ ‘ లవ్ ఈజ్ ది సీక్రెట్ ‘ అంటాడు. కామానికి దర్శకుల వారు ఇచ్చిన ఈ నిర్వచనానికి ఇక మాటల్లేవ్..మాట్లాడుకోవడాలు ఉండవు.

సరే, మలయాళం సినిమాల్లో స్లో నేరేషన్ ఎప్పుడూ ఉండేదే.. ఆ సంగతి అలా ఉంచుదాం. ఏ సినిమాకైనా.. ఏ దర్శకుడైనా ప్రేక్షకులను ముందు కథ అనే ముగ్గులోకి దింపాలి.. అక్కడ్నుంచి వాళ్ళని కథతో పాటు ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలి. అప్పుడే ఆడియన్స్ సినిమాలో ఎంగేజ్ అవుతారు

ఈ సినిమాలో కూడా దర్శకుడు ఫస్టాఫ్ ప్రారంభంలోనే ఆడియన్స్ ని కథ అనే ముగ్గులోకి దింపాడు. అంతే.. ఇక అక్కడ్నుంచి కథ ఆ ముగ్గు చుట్టూనే తిరగడం మొదలు పెట్టింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కథ అక్కడక్కడే తిరుగుతుండంతో ప్రేక్షకులు బలవంతంగా ముగ్గులోనుంచి బయట పడాల్సిన పరిస్థితులు వస్తాయి.

ఎంతసేపూ అడవిలో ఉండే పులి..ఏనుగు.. గ్రామంలోకి రావడం.. విషయం తెలియగానే గ్రామస్తులు కాగడాలు పట్టుకుని పరిగెత్తడాలు.. ఈ విషయం తెలియగానే డాక్టర్ జయరామ్ తన తుపాకీ మెడలో వేసుకుని అడవిలోకి బయలుదేరడం.. అక్కడ జంతువులకు మత్తు ఇంజెక్షన్ గుచ్చి విజయ గర్వంతో బయటికి రావడం.. రిపీటెడ్ గా రిపీట్ అవడంతో సహనం నశించిన ప్రేక్షకులు కూడా మత్తు ఇంజెక్షన్ చేయించుకోవడం కోసం ఉరకాల్సి వస్తుంది. అంతిమంగా దర్శకుడు సినిమాలో సందేశం కన్నా సందేహాలను ఎక్కువ మిగిల్చారు.

ఎవరెలా చేశారు?

మంత్రి గారి పాత్ర పోషించిన కురుప్ సైజు నటన సహజంగా ఉంది. పనిలోపనిగా సినిమాలో ఆయనకు మంచి డైలాగులు పడ్డాయి. సినిమాలో డాక్టర్ జయరామ్ పాత్ర కీలకం అయినప్పటికీ ఆయన పాత్రను సరిగా డిజైన్ చేయలేకపోయారు అనిపిస్తుంది. ఇక మిగిలినవాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికత

ప్రకాష్ అలెక్స్ అందించిన సంగీతం బాగుంది.. ముఖ్యంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అందించిన బిజిఎం బాగుంది.
రాజీష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఈయన అందించిన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ విజువల్స్ కూడా బాగున్నాయి . ముఖ్యంగా ఏనుగు గ్రామంలోకి వచ్చిన సీన్.. పులి నీటిలో దిగిన సీన్ బాగా క్యాప్చర్ అయ్యాయి. ఇక నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా యావరేజ్ అనిపించవచ్చు. అలా యావరేజ్ అనిపించడానికి కూడా ఒక కారణం ఉంది. రెగ్యులర్ మలయాళం సినిమాల్లో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. ట్విస్టులు ఇందులో ఉండవు. సినిమాలో కొన్ని సీన్లు చూస్తే అటవీ పరిరక్షణ కోసం తీసిన డాక్యుమెంటరీ ఫిలిం ఏమో అన్నంత అనుమానం కూడా మనకు వస్తుంది.

ఈ సినిమా కోసం దర్శకుడు గట్టి సందేశం అయితే రాసుకున్నారు కానీ దానికి ఎటువంటి కమర్షియల్ హంగులను అద్దకపోవడంతో ఫ్లేవర్ మిస్ అయి చప్పగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగించినట్టు అనిపిస్తుంది.

అందుచేత వన్ టైమ్ వాచ్ మూవీ కింద సినిమాలు చూడాలనుకునే వారు మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో ఒరిజినల్ మలయాళం వెర్షన్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతున్న లర్క్ మూవీ మీద ఓ లుక్కేయండి.

నటీనటులు: సైజు కురుప్, జాఫర్ ఇడుక్కి , అంజు వర్గీస్ తదితరులు
సంగీతం: ప్రకాష్ అలెక్స్
సినిమాటోగ్రఫీ: రాజీష్
నిర్మాత: నిషాద్
దర్శకత్వం: నిషాద్
ఓటిటి: అమెజాన్ ప్రైమ్
స్ట్రీమింగ్ డేట్: 1-10-2026
రేటింగ్: 2/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *