రంభ ఊర్వశి మేనక మూవీ (OTT) రివ్యూ- సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యిందా?

Spread the love

అల్లరి నరేష్, సురభి జంటగా నటించిన రంభ ఊర్వశి మేనక మూవీ సెప్టెంబర్ 25 , 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతకుముందు సెప్టెంబర్ 4 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి నెల తిరక్కుండానే ఓటిటిలోకి వచ్చింది. ఫాంటసీ , కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకి రాజేష్ దండా దర్శకత్వం వహించారు.
ఇప్పుడు రంభ ఊర్వశి మేనక లు ఎలా ఉన్నారో చూద్దాం.

కధేంటంటే?

విశ్వామిత్రుడి ఎంట్రీతో సినిమా మొదలౌతుంది. అయితే ఈ సినిమా కథ విశ్వామిత్రుడిది కాదు.. రంభ ఊర్వశి మేనక ల కోసం విశ్వామిత్రుడి వెనుక తల్లకిందులుగా తపస్సు చేస్తున్న ఓ డ్రామా కంపెనీ వ్యక్తిది.

అతడి ఘోర తపస్సుకు మెచ్చిన రంభ ఊర్వశి మేనక లు ప్రత్యక్షం అయి అతడికి ఒక మ్యాజిక్ బుక్ ఇస్తూ.. ఆ పుస్తకం పైన వారు చెప్పినట్టుగా ముగ్గు వేసినప్పుడల్లా ప్రత్యక్షం అయి కోరిన వరాలు ఇస్తామని చెప్పి మాయం అయిపోతారు.

అలా ఆ పుస్తకం తరతరాలుగా వంశస్తుల చేతులు మారుతూ చివరికి సూరి తండ్రి చేతిలో పడుతుంది. ఆ పుస్తకం మహత్యం గురించి తెలుసుకున్న సూరి (అల్లరి నరేష్) ఎలాగైనా ఆ ముగ్గు గీసి రంభ ఊర్వశి మేనక లను రప్పించి తాను పెద్ద హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

కానీ పూర్వీకులు చెప్పినట్టుగా అతడు ముగ్గు గీయలేకపోవడంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా రంభ ఊర్వశి మేనకలు ప్రత్యక్షం కారు. దీనికి తోడు ఒకపక్క అప్పుల వాళ్ళు తమ బాకీలు చెల్లించాలని అతడి వెంట పడుతుంటారు. మరోపక్క సూరి తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరుతుంది. డాక్టర్లు ఆమెకు సర్జరీ చేయాలని.. అందుకు యాభై లక్షలు ఖర్చు అవుతాయని చెప్తారు.

ఈ పరిస్థితుల్లో సూరి ఫుల్లుగా తాగి ఆఖరి ప్రయత్నంగా ఆ ముగ్గు వేస్తాడు. దాంతో రంభ ఊర్వశి మేనకలు ప్రత్యక్షం అయి ఏం వరం కావాలో కోరుకోమంటారు.

అప్పుడు సూరి వాళ్ళని ఏం వరం కోరుకుంటాడు?
తల్లి సర్జరీకి అవసరమైన యాభై లక్షలు సూరి ఎలా సంపాదిస్తాడు?
ప్రేమించిన చిన్ను తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సూరి అప్పుల బారి నుంచి బయటపడి ఆమెను పెళ్లి చేసుకుంటాడా? లేదా? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

విశ్వామిత్రుడికి తపో భంగం కలిగించటానికి ఇంద్రుడు రంభని పంపించాడని పురాణ కథల్లో చదువుకున్నాం కదా.. కానీ రంభ ఊర్వశి మేనకలు ప్రత్యక్షం అవడం ద్వారా మాత్రమే తనకు తపో భంగం కలగాలని ఒక డ్రామా కంపెనీ వ్యక్తి తల్లకిందులుగా తపస్సు చేస్తున్న సీన్ తోనే దర్శకుడు సినిమాని మొదలెట్టడంతోనే ఫాంటసీ జానర్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడర్ధమైంది కదా.. ఇదొక కల్పిత కథ.. ఫాంటసీ జానర్ కి కామెడీ మిక్స్ చేసి దర్శకుడు అల్లుకున్న ఓ కల్పిత కథ. కాబట్టి ఈ సినిమాలో లాజిక్కులు ఉండవు.. ఓన్లీ మ్యాజిక్కులే ఉంటాయి.

ఇక ఇప్పుడు కాసేపు లాజిక్కులన్నీ పక్కన పెట్టేసి సినిమా చూద్దాం. సరే ఈ సినిమాలో లాజిక్కుల సంగతి వదిలేద్దాం.. పోనీ దర్శకుడు చేసిన మ్యాజిక్కుల సంగతేవన్నా ఉందేమో చూద్దామా అంటే అదీ కనిపించదు. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. అటు లాజిక్కులు లేక.. ఇటు మ్యాజిక్కులు లేక ఆడియన్స్ సినిమా దేనికోసం చూడాలి? కామెడీ కోసమా? అదీ ఆశించిన స్థాయిలో లేకపోతే? ప్రేక్షకుడు కూడా రంభ ఊర్వశి మేనకల కోసం తల్లకిందులుగా తపస్సు చేయాలి.

కథ చూస్తే ఎప్పుడో ఎన్టీఆర్ యమగోల కాలం నాటి గోల. పోనీ కథనం అయినా ఎంగేజ్ చేస్తుందా? అంటే అదీ అంతంత మాత్రమే అయ్యింది. ఈ మధ్య ఇలాంటి కథతోనే ఒక సినిమా వచ్చింది. ఒక దేవతా పుస్తకంలో పది పేజీలు ఉంటాయి. ఒక్కో పేజీలో ఒక్కో కోరిక రాసుకుంటే నెరవేరుతుంది. అదే పుస్తకాన్ని కొద్దిగా అటూఇటూ తిప్పి రంభ ఊర్వశి మేనకల పుస్తకంగా మలిచినట్టు అనిపిస్తుంది.

ఇక దర్శకుడు పూర్తిగా కామెడీ ట్రాక్ ను నమ్ముకుని ఈ ప్రయోగం చేసినట్టున్నారు. అందుకోసం మనల్ని కడుపుబ్బ నవ్వించే అల్లరి నరేష్, వీకే నరేష్, శ్రీనివాస రెడ్డి , వెన్నెల కిషోర్ లను దింపడం వరకు దర్శకుడు సరైన నిర్ణయమే తీసుకున్నారు. నవ్వించడంలో ఈ నలుగురూ ఒకరికొకరు పోటీ పడగల సత్తా ఉన్న వారు.

కానీ తేడా ఎక్కడ కొట్టిందంటే దర్శకుడు నలుగురి నుంచి సరైన ఔట్పుట్ రాబట్టలేకపోయారు. ఉన్నవాళ్లలో వీకే నరేష్ కొంచం నవ్వించగలిగాడు. వెన్నెల కిషోర్ అయితే రొటీన్ అనిపించాడు. అసలు కథలోకి రావడానికి కూడా దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ఇంటర్వెల్ బెల్ కొడితే కానీ రంభ ఊర్వశి మేనకలు కిందికి దిగి రారు. అప్పటిదాకా సూరి లవ్ ట్రాక్.. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడి ట్రాక్.. అప్పులోళ్ళ ట్రాక్.. ఇంద్రుడి ట్రాక్.. ఇలా ఒకటొక ట్రాక్ లు విడగొట్టుకుంటూ ఫస్టాఫ్ రన్ చేశారు.

పోనీ సెకండాఫ్ లో అయినా రంభ ఊర్వశి మేనకలు దిగొచ్చారని మనం సంబరాలు చేసుకుంటున్నంతలోనే ఇంద్రుడి శాపంతో ఆ ముగ్గురి పవర్స్ లాగేసుకోవడంతో వాళ్ళ పరిస్థితి జబర్దస్త్ కు ఎక్కువ.. సినిమాకి తక్కువ అయిపోయింది. ఈ సినిమాకి ఆ మూడు క్యారెక్టర్లు ఇంపార్టెంట్ అని తెలిసి కూడా దర్శకుడు వాళ్లతో అద్భుతాలు చేయించకపోవడంతో డిజప్పాయింట్ చేస్తుంది. రంభ ఊర్వశి మేనకల క్యారెక్టరైజేషన్ మీద దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

దాదాపు సెకండాఫ్ మొత్తం స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉండటంతో మనల్ని పెద్దగా ఎంగేజ్ చేయదు. అల్లరి నరేష్, వీకేనరేష్, శ్రీనివాస రెడ్డి లు పండించిన కామెడీ సినిమాని కొంత ఆదుకుంటుంది.

సినిమాలో తల్లీకొడుకుల ఎమోషన్స్ కూడా పూర్తిస్థాయిలో పండలేదు అనిపిస్తుంది.

చివరికి శ్రీకాంత్ సినిమాలో వెంకటేశ్వర స్వామి దిగొచ్చి సందేశం ఇచ్చినట్టు ఈ సినిమాలో ఇంద్రుడు దిగొచ్చి అల్లరి నరేష్ కు సందేశం ఇవ్వడంతో ముగుస్తుంది. ఓవరాల్ గా కథ కోసం కాకుండా కామెడీ పీసులు పీసులుగా చూసేవాళ్ళకి ఈ సినిమా అంతగా నిరాశ పరచదు.

ఎవరెలా చేశారు?

రంభ ఊర్వశి మేనకల కన్నా ముందు ఈ సినిమాలో నలుగురి గురించి చెప్పుకోవాలి. వారిలో మొదటివారు అల్లరి నరేష్.. ఇతడు చక్కటి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు.. ఇతడి కెరీర్ మొదలు పెట్టిందే కామెడీ హీరోగా.. ఈ మధ్య కాలంలో సీరియస్ షేడ్స్ క్యారెక్టర్ లలో కూడా నటించి మెప్పిస్తున్నాడు. మళ్ళీ ఈ సినిమాలో ఫుల్ లెన్త్ కామెడీ రోల్ చేసారు. బాగానే చేశాడు కానీ అల్లరి నరేష్ గత కామెడీ సినిమాలతో పోలిస్తే ఇందులో ఎక్కడో ఏదో లోటు కనిపిస్తుంది.

అలాగే వీకే నరేష్ కూడా.. సెకండ్ ఇన్నింగ్స్ లో వీకే నరేష్ తన కామెడీ టైమింగ్ తో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో కాస్తోకూస్తో నవ్వుకోవడం జరిగిందంటే అది వీకే నరేష్ కనిపించినప్పుడు మాత్రమే.

శ్రీనివాస రెడ్డి కూడా తన సహజసిద్ధమైన స్టైల్ లో నటించి మెప్పించాడు.
వెన్నెల కిషోర్ నటన కామెడీకి ఎక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్టుకి తక్కువలా ఉంది.
చిన్ను పాత్ర పోషించిన సురభి నటన బాగానే ఉంది కానీ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. రంభ , ఊర్వశి , మేనక పాత్రల్లో రాశి సింగ్ , విష్ణుప్రియ , ప్రిశాసింగ్ లు గ్లామర్ గా కనిపించారు.

సాంకేతికత

చైతన్య భరద్వాజ్ అందించిన సంగీతం బాగానే ఉంది.
రామ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.

విశ్లేషణ

ముందే చెప్పినట్టు ఈ సినిమాలో లాజిక్కులూ.. మ్యాజిక్కులూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా అప్పుడప్పుడూ కాసేపు నవ్వుకుందాం అనుకుని చూడండి.. పెద్దగా డిజప్పాయింట్ కారు.

ఫాంటసీ చుట్టూ అల్లుకున్న కల్పిత కథకు కాస్తంత హాస్య రసాన్ని తగిలించి మనల్ని నవ్వించడానికి దర్శకుడు తన వంతు ప్రయత్నం చేశారు. నచ్చితే నవ్వండి.. నచ్చకపోతే వదిలేయండి.. అంతేకానీ రంభ ఊర్వశి మేనకల కోసం మాత్రం ప్రయత్నాలు చేయకండి.

సరే, వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఈ సినిమా చూడాలనుకునేవాళ్లు అమెజాన్ ప్రైమ్ లో ఓ లుక్కేయండి.

నటీనటులు: అల్లరి నరేష్, వీకే నరేష్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, సురభి తదితరులు
సంగీతం: చైతన్య భరధ్వాజ్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
నిర్మాత: రాజేష్ దండా
దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
ఓటిటి: అమెజాన్ ప్రైమ్
విడుదల: 25 -09 -2026
రేటింగ్: 2/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *