దూరదర్శిని మూవీలో నటించిన ప్రధాన నటులు కొత్త వారు అయినా నేను సినిమా చూడటానికి ఒక కారణం ఉంది . దూరదర్శిని మూవీ ట్రైలరే ఆ కారణం . పచ్చని పంటపొలాలతో కనువిందు చేస్తున్న పల్లె నేపధ్యం .. పాత రోజులను గుర్తు చేసే దూరదర్శన్ లోని శుక్రవారం చిత్రలహరి ప్రోగ్రాం..ఆ ప్రోగ్రాం చూడటం కోసం ఇరుగుపొరుగు అందరూ సాయంత్రమే ఇంట్లో చేరడం .. నేడే చూడండి వెంకటేష్ , దివ్యభారతి నటించిన బొబ్బిలి రాజా సినిమా అంటూ మైకులో అరుస్తూ మనముందునుంచి వెళ్లే గూడు రిక్షా ..ఇలాంటి పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఆ ట్రైలర్ సాగింది .
ఒక్కోసారి ట్రైలర్లు కూడా మనల్ని సినిమా చూడటానికి ప్రోవోక్ చేస్తాయి . వెంటనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న దూరదర్శిని మూవీ చూసా . అయితే ట్రైలర్లో చూసిన విధంగా మూవీ ఆకట్టుకుందా? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
కథ మట్టపర్రు అనే విలేజ్ నుంచి మొదలౌతుంది . మెడికల్ క్యాంప్ కోసం బయలుదేరిన ఓ డాక్టర్ దారిలో మట్టపర్రు విలేజ్ లో టీ తాగడానికి ఆగుతాడు . కానీ అతడు టీ తాగుతున్న సమయంలో ఆ ఊళ్ళో కులమతాల పట్టింపులు లేకుండా అందరూ కలిసి ఉండటం గమనిస్తాడు . అదే విషయం టీ బడ్డీ రంగయ్యను అడిగితే , ఒకప్పుడు తమ ఊర్లో కూడా కుల ,మత పట్టింపులు ఉన్నాయి కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటన తర్వాత అందరూ ఆ పట్టింపులను విడిచిపెట్టి కలిసిమెలిసి ఉంటున్నారని చెప్తాడు .
అతడు చెప్పే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ,
పేద కుటుంబానికి చెందిన హరి ( సువిక్షిత్ ) సంపన్న కుటుంబానికి చెందిన వాణిని (గీతికా రతన్ ) ను ప్రేమిస్తాడు . తమ కులాలు వేరైనా సరే వాణి కూడా హరిని ప్రేమిస్తుంది . ఈ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమకు దూరదర్శిని చిత్రలహరి ప్రోగ్రాం అడ్డాగా మారుతుంది . ఊర్లో పేకబాబు ఇంట్లోనే టీవీ ఉండటంతో చిత్రలహరి ప్రోగ్రాం చూడటానికి ఊరి జనం పేకబాబు ఇంటికి వస్తుంటారు . అలా వచ్చినవాళ్లలో హరి , వాణి లు కూడా ఉంటారు . అక్కడే వారి పరిచయం ప్రేమగా మారుతుంది .
అయితే అప్పటికే వాణి మీద మనసుపడిన పేకబాబు వీరి ప్రేమ విషయం తెలుసుకుని ఈర్ష్యతో వాణి అన్న పరశురామ్ కు లేనిపోనివి చెప్పి విద్వేషం రగిలిస్తాడు . తన చెల్లెలు వేరే కులం వాడిని ప్రేమించిందని తెలుసుకుని పరశురామ్ హరి తండ్రిని కొట్టి వార్నింగ్ ఇస్తాడు.అంతేకాదు హరి అంతు కూడా చూస్తానని బెదిరిస్తాడు .
పరశురామ్ బెదిరింపులతో హరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ?
తాను ప్రేమించిన వాణిని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు ?
వీళ్లిద్దరు వెళ్ళిపోతున్న సంగతి పసిగట్టిన పేకబాబు ఏం చేస్తాడు ?
చివరికి హరి తాను ప్రేమించిన వాణిని పెళ్లిచేసుకుంటాడా ? లేదా ? అనేది మిగిలిన కథ
ఎలా ఉంది ?
నేను ముందు చెప్పినట్టుగా ట్రైలర్లో చూపించిన విధంగా సినిమా ఉంటే వేరే లెవెల్లో ఉండేది . కానీ మూవీలోకి వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు . తను చెప్పాలనుకున్న , చూపించాలనుకున్న పాయింటు మీద ఫోకస్ పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు . ఇక్కడ కథ గురించి పెద్దగా చర్చ కూడా అనవసరం . రైటర్లకు లవ్ స్టోరీలు రాయడం చాలా తేలికైపోయింది . పేదింటి హీరో , పెద్దింటి హీరోయిన్ .. ఇద్దరి కులాలు వేరు .. హీరోయిన్ తండ్రో , అన్నో విలన్ అవతారం ఎత్తి వీరి ప్రేమకు అడ్డం పడటం .. తమ ప్రేమకు పెద్దవాళ్ళు అడ్డువస్తున్నారని హీరో , హీరోయిన్లు గోడకేసి తలలు బాదుకుంటూ విషాద గీతాలు పాడుకోవడం.. హఠాత్తుగా ఓ కొత్త క్యారక్టర్ ఎంటర్ అయి డప్పుపట్టుకుని కడవలకొద్దీ కన్నీరు కార్చే పాట హృదయవిదారకంగా పాడటం .. అవి చూసి మనం కర్చీఫులు తడిపేసుకోవడం .. చివరికి కథ సుఖాంతమో , దుఃఖాంతమో చేయడం అనే థీమ్ తో అప్పటికప్పుడు ఇన్స్టంట్ ఫుడ్ వండి వార్చి మన ముఖాన పడేస్తున్నారు .
ఆ మూస కథలనే నిర్మాతలు నమ్ముకుని పెట్టుబడులు పెడుతున్నారు . ఆ రొటీన్ కథలకే కొద్దిగా పోపు చేర్చి కొంతమంది దర్శకులు వడ్డించేస్తున్నారు . దూరదర్శిని కూడా ఆ కోవలోకే వస్తుంది . పైగా ఈ సినిమా చూస్తే మనకు బోలెడు సినిమాలు గుర్తుకొస్తాయి . సరే ప్రేమలకు కొత్త కధలు ఎలాగూ దొరకడం లేదు . పోనీ చక్కటి స్క్రీన్ ప్లే తోనైనా ఆకట్టుకునే విధంగా తీస్తే కథ గురించి ఎవరూ పట్టించుకోరు . కానీ ఇందులో అది కూడా మిస్ అయ్యింది.
ఈ సినిమా టైటిల్ దూరదర్శిని కి ఇద్దరినీ కలిపింది అనేది ట్యాగ్ లైన్ . ఓకే ఇంతవరకు బాగానే ఉంది . దూరదర్శన్ లో చిత్రలహరి ప్రోగ్రాం చూడాలంటే వాణి తో సహా అందరూ పేకబాబు ఇంటికి రావాల్సిందే . మరోపక్క ఆ ఊర్లో ఆగర్భ శ్రీమంతుడు , రైస్ మిల్ ఓనరు , లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఉత్సవాలు నిర్వహించే ధనవంతుడు అయిన వాణి అన్న పరశురామ్ ఇంట్లో మాత్రం టీవీ కొనలేని నిరుపేదవాడు . దర్శకుడు ఇంత చిన్నపాయింటును ఎలా మర్చిపోయాడు ? పోనీ ఆ టీవీ ఏదో పరశురామ్ ఇంట్లోనే పడేస్తే సరిపోయేది కదా ?
నిజానికి దర్శకుడు ఎంచుకున్న దూరదర్శన్ చిత్రలహరి ప్రోగ్రాం చాలా మంచి పాయింటు. ఎందుకంటే చిత్రలహరి ప్రోగ్రాం తలచుకోగానే చాలామందికి పాత రోజులు గుర్తుకొస్తాయి . ఎవరిదాకో ఎందుకు చిత్రలహరి ప్రోగ్రాం చూడటానికి శుక్రవారం సాయంత్రం నుంచే ఇరుగుపొరుగు మా ఇంట్లో చేరేవారు . మధ్యలో ప్రోగ్రాం బ్లర్ వస్తే మేడమీదికి వెళ్లి యాంటెన్నా అటూఇటూ తిప్పేవాళ్ళం . ఈ మూవీలో కూడా హీరో హీరోయిన్లు చిత్రలహరి ప్రోగ్రాం లోనే కలుసుకుని ప్రేమించినట్టు చూపించారు కానీ ఎందుకో పాత రోజులనాటి ఫీల్ రాలేదు . అప్పట్లో చిత్రలహరి వారానికి ఒకరోజు శుక్రవారం మాత్రమే వచ్చేది . కానీ ఇందులో మాత్రం ప్రతిరోజూ చిత్రలహరి వేశారు .
మధ్యలో ఆ మిలిట్రీ ఆయన , గర్భవతి అయిన అతడి భార్యల పాత్రలను ఎందుకు తీసుకొచ్చారో తెలీదు . ఇంతాచేస్తే ఆ గర్భవతి పాత్రను అర్దాంతరంగా ఎందుకు ముగించారో తెలీదు . ఆ పాత్రను అలా ముగిస్తే భావోద్వేగాలు వరదలై పారుతాయని ఊహించారేమో ?
భావోద్వేగాలు అంటే గుర్తొచ్చింది . లవ్ స్టోరీలకు చాలా ముఖ్యమైన ముడిసరుకు భావోద్వేగాలు . అందులోనూ హీరో ,హీరోయిన్ల మధ్య టన్నుల కొద్దీ భావోద్వేగాలు కురిసినప్పుడే సీన్ పండుతుంది . కానీ ఈ మూవీలో హీరోయిన్ కొంతవరకు పర్లేదు కానీ హీరో మాత్రం భావోద్వేగాలు పండించడంలో కొంత వెనుకబడ్డాడు . దాదాపు ప్రతి సీన్ లోనూ ఒకేరకమైన ఎక్స్ప్రెషన్ తో కనిపిస్తాడు .
ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో ప్రతి పాత్రకు శాపం ఉన్నట్టుంది . గర్భవతి అయిన మిలిట్రీ ఆయన భార్య పాత్ర మధ్యలోనే ముగుస్తుంది . చివర్లో హీరో తల్లి పాత్ర ముగుస్తుంది.తండ్రి పాత్ర పిచ్చెక్కుతుంది . హీరోయిన్ అన్న పాత్ర ఏమౌతుందో తెలీదు? సరే పేకబాబు అంటే విలన్ కాబట్టి అతడి పాత్రను ఎలాగూ ముగించకతప్పలేదు . పాత్రలను డిజైన్ చేసే విషయంలో దర్శకుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టు లేదు .
మరి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి పాజిటివ్ పాయింట్స్ ఒక్కటి కూడా లేదా ? అంటే ఉన్నాయి . చక్కటి పల్లెటూరి వాతావరణం , పిల్ల కాలువ వంతెన , మండువా లోగిళ్ళు , హీరో పక్కన అచ్చమైన పల్లెటూరి ఫ్రెండ్స్ , పల్లెలో ఊరి బయట దుకాణంలో రంగమ్మత్త సారాయి అంగడి , సైకిల్ తొక్కుకుంటూ తిరగడం , గూడు రిక్షా బండి మైకులో సినిమా ప్రకటనలు , గోదారి పడవలు .. ఇలా కళ్ళకు ఆహ్లాదకరంగా కనిపించే దృశ్యాలు కొన్ని ఉన్నాయి . ఆ సన్నివేశాలే ఈ సినిమాకి ప్లస్ అవుతాయి . ఈ విషయంలో దర్శకుడి టేస్టుకు మెచ్చుకోవాలి . స్టూడియోలు , సెట్టింగులను నమ్ముకోకుండా చక్కటి పల్లె నేపథ్యంలో సినిమాని తెరకెక్కించాడు . ఇవన్నీ పాత రోజులను గుర్తుకుతెచ్చేవే . దర్శకుడు ఇలాంటి వింటేజ్ సన్నివేశాల మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది . హీరో స్నేహితులుగా బండ బలరాజుతో పాటు మరో ఇద్దర్ని తీసుకున్న దర్శకుడి ఛాయిస్ బాగుంది . ఆ ముగ్గురూ పల్లెటూరి హాస్యాన్నిచక్కగా పండించారు .
చివరగా క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది . తల్లితండ్రులను బాగా చూసుకోవాలని పిల్లలకు ఇచ్చిన సందేశం బాగుంది కానీ తలితండ్రుల మాట వినక లేచిపోయిన హీరో ,హీరోయిన్లతో వచ్చిన సమస్యలే కదా ఇవన్నీ అన్న పాయింట్ దర్శకుడు మిస్ అయినట్టున్నారు . చివరికి ఆ మెసేజుకి , సినిమా ముగింపుకి సింక్ అవలేదు .
ఎవరెలా చేసారు ?
హరి పాత్ర పోషించిన సువిక్షిత్ పల్లెటూరి కుర్రాడి ఆహార్యంలో సరిపోయాడు కానీ నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ కావాలి . ముఖ్యంగా లవర్ బాయ్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెషన్స్ మార్చుకుంటూ ఉండాలి .
ఇక వాణి పాత్రలో నటించిన గీతికా పల్లెటూరి అమ్మాయి గెటప్ లో బాగానే నటించింది . ఇందులో బాలరాజు పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి . ఇప్పటికీ పల్లెకు వెళితే ఇలాంటి బలరాజులు మనకి చాలామంది కనిపిస్తారు . బాలరాజు నటన చాలా సహజంగా ఉంది . మిగిలిన ఇద్దరు మిత్రులు కూడా సహజంగా నటించారు .
సాంకేతికత
ఈ మూవీలో అందరికంటే ముందు ఫోటోగ్రఫీ విభాగం గురించి చెప్పుకోవాలి . చక్కటి పల్లెటూరి అందాలను మరింత అందంగా చూపించిన ఘనత సునీల్ పొన్నం కి దక్కుతుంది . సునీల్ కెమెరా పనితనం ఈ మూవీకి అడ్వాంటేజ్ అవుతుంది .
తర్వాత ఆనంద్ గుర్రన అందించిన సంగీతం కూడా బాగానే ఉంది .
నిర్మాణ విలువలు బాగున్నాయి .
విశ్లేషణ
పల్లెటూరు , గూడ్స్ రిక్షా బండిలో సినిమా ప్రచారాలు , దూరదర్శన్ లో చిత్రలహరి ప్రోగ్రామ్ ల గురించి తల్చుకుంటే మనం పాత రోజులకు వెళ్తాం . ఆ రోజులను మళ్ళీ రీ కలెక్ట్ చేసుకోవడానికైనా ఇలాంటి మూవీలు చూడాలనిపిస్తుంది . కథ పాతదే ..కధనంలో మెరుపులు ఉండవు . అవేమీ మనల్ని పెద్దగా ఇంప్రెస్ చేయవు . కానీ ఓసారి అలా పల్లెకు వెళ్లి పాత రోజులను గుర్తుకుతెచ్చుకుందాం అనుకునేవాళ్లు మాత్రం వన్ టైమ్ వాచ్ కింద అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీని చూడొచ్చు .
నటీనటులు : సువిక్షిత్ , గీతికా రతన్ , జెమిని సురేష్ , బాలరాజు తదితరులు
సంగీతం : ఆనంద్
సినిమాటోగ్రఫీ : సునీల్ పొన్నం
నిర్మాత : జయశంకర రెడ్డి
దర్శకత్వం : కార్తికేయ బొమ్మి
విడుదల : అమెజాన్ ప్రైమ్ ( 26-07-2026 )
రేటింగ్ : 2 / 5
