నటుడు బ్రహ్మాజీ నటించిన హ్యాంగ్ మ్యాన్ ( Hangman movie ) జులై 3 న నేరుగా సన్ నెక్స్ట్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది . సినిమా నిడివి కూడా తక్కువే . దర్శకుడు తాను చెప్పదల్చుకున్న కథను మొత్తం 78 నిమిషాల్లో చెప్పి ముగించేశారు . బ్రహ్మాజీ రూపాయి కాయిన్ లాంటివాడు . కాయిన్ కి బొమ్మ , బొరుసు అనే రెండు పార్శ్వాలు ఉన్నట్టే బ్రహ్మాజిలో కూడా కాయిన్ కి ఒకవైపు చూస్తే చక్కటి కామెడీ టైమింగుతో మనల్ని కడుపుబ్బ నవ్విస్తాడు . ఇంకోవైపు సీరియస్ పాత్రల్లో మనల్ని మెప్పిస్తాడు . రంగమార్తాండలో బ్రహ్మానందానికి ఎటువంటి పాత్ర పడిందో హ్యాంగ్ మ్యాన్ లో బ్రహ్మాజీకి అటువంటి పాత్ర పడింది . నిర్మాణ సంస్థ విడుదల చేసిన బ్రహ్మాజీ పోస్టర్ చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్ధం అవుతుంది . అయితే ఈ మూవీ అనేక బాలారిష్టాలు ఎదుర్కుని వాయిదాల మీద వాయిదాలు పడి ఫైనల్గా నేరుగా ఓటిటిలోకి వచ్చింది .
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమా తీసినట్టు మేకర్స్ టైటిల్స్ లోనే చెప్పేసారు . ఆ రియల్ ఇన్సిడెంట్ ఏంటనేది మనకి సినిమా మొదట్లోనే తెలుస్తుంది .
ఇప్పుడు హ్యాంగ్ మ్యాన్ మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
2012 డిసెంబర్ 31 న అందరూ నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటూ ఉంటారు . ఎంగేజ్మెంట్ అయి పెళ్లిపీటలు ఎక్కబోయే ఒక యువజంట కూడా అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు సెలెబ్రేట్ చేసుకుని ఇంటి బాట పడతారు . అయితే సరిగ్గా వాళ్ళు రోడ్డుమీదకు వచ్చేసరికి ఓ ప్రైవేట్ బస్ రావడంతో అందులో ఎక్కుతారు . కానీ ఆ బస్సులో అప్పటికే ఫుల్లుగా తాగేసిన ఐదుగురు పోకిరీలు ఉంటారు . పోకిరీలు ఆ అమ్మాయి మీద అసభ్యంగా కామెంట్లు చేయడంతో ప్రియుడు వాళ్లతో గొడవ పడతాడు . వాళ్ళు ఆ అబ్బాయిని కొట్టి బస్సులోనే ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి హతమారుస్తారు .
దాంతో పోలీసులు ఆ ఐదుగురినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు . న్యాయస్థానాల్లో ఈ కేసు విచారణ షుమారు పదేళ్లకు పైగా సాగుతుంది . విచారణ సమయంలోనే అందులో ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోతారు . మిగిలిన ముగ్గురుకీ న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తుంది . ఈ తీర్పుపై రాష్ట్రపతి క్షమాభిక్ష కు కూడా అప్పీల్ చేస్తారు కానీ ప్రెసిడెంట్ దాన్ని కొట్టివేస్తారు .
దాంతో పోలీసులు ఉరి తీసే తలారి శివయ్యకు ( బ్రహ్మాజీ ) కబురుపెడతారు . అప్పుడు శివయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? శివయ్య కూతురి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? ముద్దాయిలను ఉరి తీయడానికి కొడుకుతో కలిసి జైలుకు వెళ్లిన శివయ్య ఏం చేస్తాడు ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
అసలుకు ఈ సినిమాకి ఇంగ్లీషులో హ్యాంగ్ మ్యాన్ అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు . కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఉరి శిక్షను అమలుచేసే వ్యక్తిని తలారి అంటారు . ఈ మూవీకి తెలుగులోనే తలారి అని టైటిల్ పెడితే ఇంకాస్త వైబ్ గా ఉండేది కదా ? లేనిపోని ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టారో తెలీదు . అన్నట్టు ఇదే టైటిల్ కి చిన్న తోకలు తగిలించి ఎప్పుడో రిలీజ్ అయిన హాలీవుడ్ , బాలీవుడ్ మూవీలు కూడా ఉన్నాయి . ఆ మూవీలకు , దీనికీ కనెక్షన్ ఉందో లేదో తెలీదు . ఎందుకంటే ఆ హాలీవుడ్ మూవీ నేను చూడలేదు .
సరే , టైటిల్ సంగతి అలా ఉంచితే సినిమా సంగతి చూద్దాం . హ్యాంగ్ మ్యాన్ కోసం దర్శకుడు ఎన్నుకున్న పాయింట్ కొత్తదే . కోర్ట్ ఆదేశాల ప్రకారమే అతడు తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినా అతడికీ ఒక మనఃసాక్షి ఉంటుంది అనే పాయింటుతో కథ అల్లుకున్నారు . ముగ్గురిని ఉరి తీసినందుకు ఒక్కో తలకు పాతికవేలు చొప్పున డెబ్భైఐదు వేల రూపాయలు ఇస్తారని శివయ్యకు ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పినా అతడు సంతోషపడడు . ఓ సన్నివేశంలో కొడుకు , భార్య అంటారు .. ఇలా మనుషుల్ని చంపి డబ్బులు సంపాదించడం కూడా ఒక పనేనా ? అని . ఆ మాటలతో శివయ్యలో కూడా ఎక్కడో గిల్టీ మొదలౌతుంది . ఈ వృత్తి తన తాత నుంచి తండ్రికి , తండ్రి నుంచి తనకు సంక్రమించిందని , తననుంచి కొడుకును కూడా నేర్చుకోవాలని చెప్తాడు . అయినా సరే మనసులో ఉన్న అపరాధభావన పోదు .
మైనర్ బాలికను చంపిన ఓ వాచ్ మెన్ కు కోర్ట్ ఉరిశిక్ష విధిస్తే శివయ్య అతడ్ని ఉరి తీయడానికి ముందుకురాడు . అతడు నేరం చేసినట్టు సరైన ఆధారాలు లేవని టీవీల్లో చూడటంతో .. తెలియక ఒక నిర్దోషిని ఉరి తీస్తున్నానా ? అన్న భావనతో రగిలిపోతాడు .
ఇలా ఫస్టాఫ్ అంతా శివయ్య మానసిక సంఘర్షణతో నలిగిపోతుంటాడు. ఉరిని అమలుచేసేముందు తలారి ఏ విధంగా సిద్దం అవుతాడు అనేది దర్శకుడు చూపించిన తీరు బాగుంది . ముద్దాయిల మెడ సైజుకి అనుగుణంగా తాడును చుట్టడం , ముద్దాయి బరువుకి అనుగుణంగా తాడును ఇసుక బస్తాలకు కట్టి చెట్టుకు వేలాడదీసి పరీక్షించడం , ఆ బరువును ఆ తాడు తట్టుకోగలదా ? లేదా ? అని చెక్ చేసుకోవడం , హ్యాంగ్ అయిన తర్వాత ఎన్ని సెకండ్లకు బస్తా కంభంలోకి దిగుతుందో చూడటం లాంటి సన్నివేశాలతో ఉరికి ముందు తలారులు ఏ విధంగా సన్నద్ధం అవుతారో చూపించిన విధానం బాగుంది .
ఇదే సన్నివేశంలో శివయ్య తన కొడుక్కి ‘ కోర్ట్ ఆదేశాలప్రకారం ఉరి తీయడమే తన పని అని అయితే ఉరి తీసేముందు ఇంత కసరత్తు ఎందుకుచేస్తామంటే .. సాధ్యమైనంతవరకు ఉరి తీసేటప్పుడు అతడికి నొప్పి తెలియకుండా చూడటానికి ప్రయత్నిస్తా ‘ అని చెప్తాడు . అందుకే సరైన కొలతలతో ఉరి తీస్తే నొప్పి కూడా తెలియకుండా క్షణాల్లో ప్రాణాలు పోతాయని చెప్తాడు . ఇదంతా ఎందుకంటే ఒక వ్యక్తిని ఉరి తీసేముందు తలారి అనుభవించే మానసిక సంఘర్షణ గురించి తెలియచెప్పటానికే .
అందుకే కొన్ని జైళ్లలో తలారులు ముద్దాయి మెడకు ఉరితాడు చుట్టేముందు ‘ కోర్ట్ ఆదేశాల ప్రకారమే నేను ఉరి శిక్షను అమలుచేస్తున్నాను . నీపై వ్యక్తిగతంగా నాకు ఎటువంటి విరోధం లేదు ‘ అని సంజాయిషీ ఇచ్చుకునే ధోరణిలో చెప్తారు . అఫ్కోర్స్ , ఈ మూవీలో ఆ సన్నివేశం లేదనుకోండి .
సెకండాఫ్ లో శివయ్య కూతురి ఫ్లాష్ బ్యాక్ , బస్సులో చనిపోయిన అమ్మాయిలో తన కూతురిని చూసుకోవడం , ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన ముగ్గురు ముద్దాయిల మెడకు తన చేతులతోనే ఉరితాడు తగిలించిరావాల్సి ఉండటం వంటి సన్నివేశాలతో కధనం నడుస్తుంది . క్లైమాక్స్ సన్నివేశం బాగుంది కానీ లాజిక్ గురించి ఆలోచించకూడదు .
ఉరి తీసేముందు ముద్దాయిలకు షేవింగ్ చేయడం , ఆరోగ్య పరీక్షలు చేయడం లాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి . ఎందుకో దర్శకుడు అలాంటి ప్రొసీజర్స్ ను పట్టించుకోలేదు . మేజిస్ట్రేట్ , జైలర్ , డాక్టర్ వంటి అతికొద్దిమందితోనే తలారి చేత ఉరిశిక్షను అమలుచేస్తారు . ఇందులోకి తలారి కొడుకును ఎలా అనుమతించారో తెలీదు . అందులో మొబైల్ ఫోన్స్ ఎలా అనుమతించారో తెలీదు . పైగా తలారి తన ఇష్టం వచ్చినట్టు ముగ్గుర్నీ ఉరి తీయడం సినిమాటిక్ లిబర్టీలో కుదురుతుందేమో కానీ లాజికల్ గా కుదరదు .
ఓవరాల్ గా ఈ సినిమా ఒక తలారి మానసిక వ్యధని ప్రతిబింబిస్తుంది .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమా మొత్తం తలారి శివయ్య చుట్టూనే తిరుగుతుంది . బ్రహ్మాజీ ఈ సినిమాకి వన్ మ్యాన్ ఆర్మీ అవుతాడు . మొత్తం సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు . ఒక్కో సన్నివేశంలో బ్రహ్మజీని చూస్తుంటే ఈయన నిజ జీవితంలో కూడా తలారి ఏమో అన్నంత సహజంగా నటించాడు . సినిమా సంగతి ఎలా ఉన్నా నటన పరంగా బ్రహ్మాజీకి అవార్డు ఇవ్వడం సముచితమే .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు నటించారు .
సాంకేతికత
ఉదయ్ గుర్రాల అందించిన ఫోటోగ్రఫీ బాగుంది .
నేపధ్య సంగీతం కూడా బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో ఉరిశిక్షల నేపథ్యంలో చాలా సినిమాలు చూసాం కానీ ఉరిని అమలుచేసే తలారి మానసిక సంఘర్షణ అనే పాయింటు ఆధారంగా అల్లుకుని తెరకెక్కించిన హ్యాంగ్ మ్యాన్ ఇప్పుడు చూస్తున్నాం . ఉరి తీయబోయేముందు తలారి ఏ విధంగా సన్నద్ధం అవుతాడో చూపించిన సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి . క్లైమాక్స్ సందేశం బాగానే ఉంది కానీ దర్శకుడు ముగింపుని మరింత శ్రద్దగా ప్లాన్ చేసుంటే బాగుండేది .
78 నిమిషాల నిడివి కలిగిన చిన్న సినిమానే కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఇంట్లోనే సన్ నెక్స్ట్ ఓటిటిలో ఓ లుక్ వేయొచ్చు .
నటీనటులు : బ్రహ్మాజీ , వినయ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఉదయ్ గుర్రాల
సంగీతం : కమ్రాన్
నిర్మాత : అజయ్ మైసూర్
దర్శకత్వం : విహాన్
విడుదల : సన్ నెక్స్ట్ ( 03-7-2026 )
రేటింగ్ : 2.5 / 5
