స్లీపర్ బస్సులు ఓకే కానీ..అదే డేంజర్ !

Spread the love

నాయకులు గిరి గీసి తెలుగు రాష్ట్రాన్ని విడదీసారే కానీ ప్రజలు మాత్రం విడిపోలేదు అనే విషయం రాత్రి అమీర్ పేటలో విజయవాడ వైపు వెళ్ళే బస్సులను, తెల్లారి విజయవాడ నుంచి ఎల్బి నగర్లో ఆగే బస్సులను చూస్తే తెలుస్తుంది .

ఆంధ్రా వాళ్ళు తెలంగాణా వచ్చి బంధువుల ఇళ్లలో దిగి పనులు చూసుకుని వెళ్తున్నారు..
అలాగే తెలంగాణా వాళ్ళు ఆంధ్రా బంధువుల ఇళ్లలో దిగి పనులు చూసుకుని వస్తున్నారు.

అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది రాజకీయ నాయకులు పెట్టిన మంట గురించి కాదు..
బస్సుల గురించి .

ఇంతమందినీ ఇవాళ్టికీ అటుఇటూ కలుపుతున్న వాటిలో బస్సులు కూడా ఒకటి .

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా విజయవాడ – హైదరాబాదుల మధ్య బస్సుల రద్దీ బాగానే ఉండేది . ఆర్టీసీ వాళ్ళు సూపర్ డీలక్స్, ఏసీ బస్సులు నడిపితే ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులతో పాటు సెమీ స్లీపర్ బస్సులు కూడా నడిపేవారు . తర్వాత సెమీ స్లీపర్ బస్సుల స్థానంలో స్లీపర్ బస్సులు రంగప్రవేశం చేశాయి . లగ్జరీ పెరిగినప్పుడు ఛార్జీలు కూడా పెరుగుతాయి.. అలాగే పెరిగాయి కూడా .

లేటెస్టుగా ఎలక్ట్రిక్ స్లీపర్ బస్సులు కూడా రోడ్డెక్కాయి . మొన్న నేను గుంటూరు నుంచి హైదరాబాదుకు ఎలెక్ట్రిక్ బస్సులోనే వచ్చాను . మామూలు రోజుల్లో Rs 1100/- ఛార్జ్ చేస్తారు. రద్దీ రోజుల్లో 1500 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తారు

సరే ఈ ఛార్జీల సంగతి అలా ఉంచితే ఎలెక్ట్రిక్ బస్సుల ఆపరేటర్లు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు . అఫ్కోర్స్ ఇది వాళ్ళ అవసరం కోసమే అనుకోండి . హైదరాబాదు వచ్చే దారిలో సూర్యాపేట దగ్గర ఉన్న ఓ హోటల్ తో కొంతమంది ప్రైవేట్ బస్ ఆపరేటర్లు టై అప్ పెట్టుకున్నారు . ఈ టై అప్ ప్రకారం ఆ హోటల్లో ఈవీ ఛార్జింగ్ ఏర్పాటు చేసుకున్నారు. బస్ అక్కడ ఆగి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే షుమారు 45 నిమిషాలు పడుతుంది . టైమ్ డిలే అని పాసింజర్లు గోల చేయకుండా ఆ హోటల్లో ఫ్రీ ఫుడ్ ఏర్పాటు చేశారు . ఫ్రీ ఫుడ్ అంటే జస్ట్ స్మాల్ బౌల్ లో ఫ్రైడ్ రైస్, కర్రీ , ఏదన్నా స్నాక్ ఇస్తారు .

దాంతో కాంప్లిమెంట్ ఫుడ్ దొరికిందని పాసింజర్లు హ్యాపీ
ఈవీ ఛార్జింగ్ టైమ్ దొరికిందని బస్ ఆపరేటర్లు హ్యాపీ
టై అప్ వల్ల బిజినెస్ రావడంతో పాటు పబ్లిసిటీ వస్తుందని హోటల్ యాజమాన్యం హ్యాపీ
తోటల్గా ఆల్ హ్యాపీస్ .

అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అసలు విషయం ఇది కాదు
ఎలెక్ట్రిక్ స్లీపర్ బస్సుల్లో బెర్తుల గురించి

మనలో చాలామంది ట్రైన్ జర్నీ చేసి ఉంటారు . జనరల్ కానివ్వండి ..ఏసీ కానివ్వండి .. హాయిగా ఎవరికి వారికి ఇండివిడ్యువల్ బెర్త్ ఉంటుంది ..ఎవడి ప్రైవసీ వారికుంటుంది . పక్కడికి అసౌకర్యం అన్న మాటే ఉండదు .

కానీ స్లీపర్ బస్సులో అలా కాదు .. బస్ లోపల ఒకవైపు సైడ్ సింగిల్ బెర్తులు ఉంటాయి ..వీటితో ఇబ్బంది లేదు . కానీ ఇంకో సైడ్ డబుల్ బెర్తులు ఉంటాయి .. ఈ డబుల్ బెర్తులతోనే అసలు ఇబ్బంది . ఇప్పుడు గుంటూరు నుంచి హైద్రాబాదు వరకు ఎలెక్ట్రిక్ స్లీపర్ బస్సులో ప్రయాణించిన నా అనుభవం చదవండి .

స్లీపర్ బస్సులో నాకు అలాట్ అయిన సింగిల్ బెర్త్ లో ఇలా పడుకున్నానో లేదో బస్ కుర్రాడు తట్టి లేపి ” సార్! ఏమనుకోకుండా పక్కన ఉన్న డబుల్ బెర్త్ తీసుకుంటారా? మేడం మీ బెర్త్ తీసుకుంటారు.. ప్లీజ్” అన్నాడు

కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఎవరో అమ్మాయి ముఖమాటంగా చూస్తుంది .
“ఆ అమ్మాయికి ఏ బెర్త్ వచ్చింది?” అని అడిగా ,

పక్కనే ఉన్న డబుల్ బెర్త్ చూపించాడు . అక్కడ ఆల్రెడీ ఓ కుర్రాడు గుర్రు పెట్టి నిద్ర పోతున్నాడు .
నాకు కోపం వచ్చింది .

“సింగిల్ బెర్త్ ఖాళీ లేనప్పుడు ఆమెకు డబుల్ బెర్త్ టికెట్ కొట్టకూడదు కదా? అలా ఎలా ఇస్తారయ్యా? అర్థరాత్రి ఈ దుకాణం ఏంటయ్యా బాబూ?”అన్నాను కోపంగా .

“సార్ ప్లీజ్.. సార్..” అన్నాడు వాడు

తప్పేది ఏముంది? ఆ అమ్మాయి వాడి పక్కన పడుకోలేదు.. నేను వాడి పక్కన పడుకోక తప్పలేదు

సరే అని వాడి పక్కనే డబుల్ బెర్తులో అలా పడుకున్నానో లేదో అయ్యగారు గురక మొదలెట్టారు .
బస్ ముందుకు వెళ్తూనే ఉంది కానీ నా నిద్ర అస్సలు కదల్లేదు . ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది .

అప్పుడు గుర్తుకొచ్చారు ఆర్టీఏ అధికారులు .. అసలుకు ప్రైవేట్ బస్సుల్లో డబుల్ బెర్తులకు అధికారులు ఎలా పర్మిషన్లు ఇచ్చారో అర్థం కాలేదు.. బస్ ఆపరేటర్లు ఎక్కువ టికెట్లు తెగుతాయని ఇలా అడ్డదిడ్డంగా ఒకే క్యాబిన్లో డబుల్ బెర్తులు ఇరికించడం సరైనదేనా? ఈ విధానం వల్ల పాసింజర్లకు కలిగే అసౌకర్యం ఆర్టీఏ అధికారులు గమనించారా ? అని చాలా ప్రశ్నలు వేసుకున్నాను .

అప్పుడు స్లీపర్ బస్సుల విషయంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి .

సీటింగ్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చిన ఆపరేటర్

ఆ మధ్య కర్నూల్ దగ్గర ఒక ఏసీ స్లీపర్ బస్ లో అగ్నిప్రమాదం జరిగి చాలామంది ప్రయాణీకులు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే . ఈ ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు దర్యాప్తు చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి . కాగితాల ప్రకారం ఆ బస్ కి సీటింగ్ వరకే పర్మిషన్ ఉంది . కానీ బస్ ఆపరేటర్ నిబంధనలను తుంగలోకి తొక్కి సేఫ్టీ ఫీచర్స్ ను పక్కనబెట్టి అడ్డదిడ్డంగా సీటింగ్ ఆల్ట్రరేషన్ చేయించి స్లీపర్ గా మార్చాడు .

అదీ కాకుండా ఆ బస్ వేరే రాష్ట్రం ఆర్సీ తో తిరుగుతుంది . కాలపరిమితి ముగిసినా సదరు బస్ ఆపరేటర్ బస్సుకి ఫిట్నెస్ చేయించలేదు . దానికి కట్టాల్సిన టాక్సులు కూడా పెండింగులు ఉన్నాయి. డాక్యుమెంట్ల పరంగా ఇన్ని లోపాలు ఉన్నా ఆ బస్ తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా తిరుగుతుంది . దీనంతటికీ కారణం అధికార పరిధులు .. నెంబర్ ప్లేట్ ఎక్కడైతే రిజిస్టర్ అయ్యిందో అక్కడే వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ చేయించాలి . ఈ బస్ ఆపరేటర్ వేరే రాష్ట్రంలో తనకు అనుకూలంగా ఉన్న అధికారితో ఫిట్నెస్ జరిపించకుండానే పర్మిషన్లు తెచ్చుకున్నాడు .

సరే ఆ పర్మిషన్ల సంగతి అలా ఉంచితే నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ బస్ ని స్లీపర్ బస్ గా మార్చేశాడు దీనంతటికీ కారణం వ్యాపార లాభమే . సీటింగుతో ఉన్న అదే బస్సును స్లీపర్ గా మారిస్తే రెట్టింపు లాభం వస్తుంది . కానీ ప్రయాణీకుల భద్రతకు గ్యారంటీ లేదు .
కానీ ఈ విషయాన్ని పట్టించుకునే నాధుడు ఎవడు ? జరగకూడని ప్రమాదం జరిగిన తర్వాత కళ్ళు తెరిస్తే ఉపయోగం ఏంటి ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ప్రమాదం జరిగిన తర్వాత ఎంక్వైరీ వేయడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ?

స్లీపర్ బస్ క్యాబిన్లకు అద్దాలు వేసిన బస్ ఆపరేటర్

ఈ మధ్య హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు ఒక స్లీపర్ బస్సును తనిఖీ చేస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది . సాధారణంగా స్లీపర్ బస్ లోపల ఉండే క్యాబిన్లలో ఇరువైపులా బెర్తులు ఉంటాయి . ఈ బెర్తులు ఓపెన్ గానే ఉండాలనేది ఆర్టీఏ నిబంధన . కానీ ఈ బస్ ఆపరేటర్ ఒక అడుగు ముందుకు వేసి క్యాబిన్లకు స్లైడింగ్ అద్దాలు వేయించాడు. ఇది ఎంత ప్రమాదకరం అంటే బస్ ఏదన్నా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ప్రయాణీకులు కనీసం ఎమర్జన్సీ విండో నుంచి కూడా బయటికి రాలేరు . రెండువైపులా క్లోజెడ్ గా ఉన్న గ్లాస్ విండోస్ తో ప్యాసింజర్లు లోపలే ఇరుక్కుపోయే అవకాశం ఉంది . పచ్చిగా చెప్పాలంటే బస్సులో స్లీపర్ క్యాబిన్లను ఓయో రూములుగా మార్చేశాడు .

అదృష్టవశాత్తు ఆర్టీఏ అధికారులు ఆ బస్సును తనిఖీ చేసి సీజ్ చేసారు . బస్ డ్రైవర్ని ప్రశ్నిస్తే అలా బెర్త్ క్యాబిన్ లను గ్లాస్ విండోతో క్లోజ్ చేయడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు . ప్రైవేట్ కార్యకలాపాలు చేసుకోవడానికి అనువుగా ఉండటంతో కొంతమంది ప్యాసింజర్లు టికెట్ ఎంతైనా కొనుక్కుంటున్నారని చెప్పాడు . ఇది కదా అసలైన ప్రమాదం . కొంతమంది కోసం అందరి ప్రాణాలను రిస్కులో పడెయ్యడం ఎంతవరకు కరెక్ట్ ?

నిత్యం తెలుగు రాష్ట్రాల మీదుగా వందలాది బస్సులు తిరుగుతూ ఉంటాయి . దూర ప్రయాణాల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలనేది రవాణా శాఖ నిబంధన . కానీ వీటిలో సగానికి పైగా బస్సులు సింగిల్ డ్రైవర్ తోనే రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి . దానికి తోడు డ్రంకెన్ డ్రైవ్ కూడా ప్యాసింజర్ల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి . ఈ మధ్య ఇలాగే ఒక బస్ డ్రైవర్ మితిమీరి తాగి నిర్లక్ష్యంగా బస్ నడపడం గమనించిన ప్రయాణీకులు 100 కి డయల్ చేసి ప్రాణాలు కాపాడుకున్నారు .

మళ్ళీ ముందు చెప్పిన నా అనుభవం దగ్గరికి వస్తాను . స్లీపర్ బస్సుల్లో పక్కపక్కనే అనుకుని ఉండేలా డిజైన్ చేసిన డబుల్ బెర్త్ క్యాబిన్లకు ఆర్టీఏ అనుమతి ఉందా ? ఒకవేళ అనుమతి ఉంటే ఏ రకంగా అనుమతి ఇచ్చారు ? అసాంఘిక కార్యకలాపాలకు , అనైతిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా ఉన్న డబుల్ బెర్త్ ప్రయాణీకుల భద్రతను ఏ విధంగా కాపాడుతుంది ? ముక్కుముఖం తెలియని ఇద్దరు ప్యాసింజర్లకు ఒకే బెర్త్ అలాట్ చేయడం వల్ల చైన్ స్నాచింగ్ వంటి సంఘటనలు జరిగే అవకాశం లేదంటారా ? సీటింగ్ కూడా పక్కపక్కనే ఉన్నా ఓపెన్ గా ఉండటంతో రిస్క్ తక్కువ . కానీ స్లీపర్ బస్సుల్లో ఏర్పాటు చేసిన బెర్త్ డిజైన్ల వల్ల మాత్రం అంతోకొంతో రిస్క్ మాత్రం ఉంది .

కాబట్టి కొంతమంది బస్ ఆపరేటర్లు స్లీపర్ బస్సుల పేరిట ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న అడ్డగోలు పనులను అడ్డుకుని ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా రవాణా శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి .

( నోట్ : పిక్ లో ఉన్న బస్ ఇమేజ్ కేవలం అందరి అవగాహన కోసం అంతర్జాలం నుంచి సేకరించబడింది )


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!