మామూలుగానే హర్రర్ థ్రిల్లర్ కామెడీ మూవీలకు మలయాళం సినీ ఇండస్ట్రీ పెట్టింది పేరు . ఆ జానర్లో మూవీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు ? పైగా హర్రర్ ,థ్రిల్లర్ జానర్ మూవీల్లో కామెడీ జానర్ కూడా మిక్స్ చేసి తియ్యాలంటే కత్తిమీద సాములాంటిది . ఎందుకంటే హర్రర్ , థ్రిల్లర్ జానర్లు కవల పిల్లలాంటివి . ఆ రెండూ ఎలా ఉన్నా మిక్స్ అయిపోతాయి . ఎలా చూసినా మనకు ఒకేలా కనిపిస్తాయి . కానీ ఆ కవల సోదరుల సరసన కామెడీ పిల్లను ఇరికించాలంటే దర్శకత్వ ప్రతిభ ఉండాలి . ఎందుకంటే కామెడీ పిల్ల ప్రభావం కవల సోదరుల మీద పడకూడదు . ఒకవేళ పడితే వాళ్ళిద్దరి డామినేషన్ తగ్గిపోయి అంతా కామెడీ పీసు అయిపోతుంది .
మే 28 న థియేటర్లలో రిలీజ్ అయి మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న కరక్కం హర్రర్ , థ్రిల్లర్ , కామెడీ మలయాళం మూవీ ఈ రోజునుంచి ( జులై 3) సోని లివ్ ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది . ఓటిటిలో మాత్రం ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని దూసుకుపోతుంది . ఇప్పుడు కరక్కం మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
కేరళ కోచికి చెందిన ధనుష్ ( శ్రీనాథ్ బసి ) తన మిత్రులతో కలిసి ఒక లాడ్జిలో నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటూ ఉంటాడు . అయితే అకస్మాత్తుగా లాడ్జిలో ఒక గ్యాంగ్ వల్ల గొడవ జరగడంతో ధనుష్ వ్యానులో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు . ఆ గ్యాంగుని తప్పించుకుని వచ్చిన ఖాజా కూడా ధనుష్ వ్యానులో చేరతాడు . ఇద్దరూ మద్యం మత్తులో సమాధులు ఉన్న చోటికి చేరతారు . అక్కడ సమాధుల మీద ఉన్న ఇత్తడి శిలువలను చూసి అవి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసుకుంటారు . అక్కడ మళ్ళీ తాగి సమాధుల మీదే పడుకుండిపోతారు . మెలుకువ వచ్చిన తర్వాత ఐదు సమాధులమీద ఉన్న శిలువలను పెకిలించి వ్యానులో వేసుకుని తిరిగి లాడ్జికి చేరతారు .
కానీ రూములోకి వచ్చిన తర్వాత వాళ్లకు విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి . ఎవరో గుర్తుతెలియని ఐదుగురు దయ్యాల రూపంలో కనపడటంతో ముందు మందు ప్రభావం వల్ల అయ్యుంటుందిలే అని పట్టించుకోరు . కానీ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లినా ఆ ఐదు దయ్యాలు ఫాలో అవడంతో భయపడి సైక్రియాట్రిస్టును కలుస్తారు . అతడు వీళ్లిద్దరికీ చెరో శిలువ చైన్ ఇచ్చి మెడలో వేసుకుంటే దయ్యాలు వాళ్ల జోలికి రావని అంటాడు . తనకి ఫీజు ఇవ్వడానికి వీళ్లిద్దరి దగ్గరా డబ్బులు లేకపోవడంతో వాళ్ళు దొంగిలించిన ఒక ఇత్తడి శిలువను ఫీజుగా తీసుకుంటాడు. కానీ అప్పట్నుంచి ఆ సైక్రియాట్రిస్టుకు కూడా విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి .
అసలు ఆ శిలువలకు ఐదు దయ్యాలకు ఉన్న కనెక్షన్ ఏంటి ?
తమకు విచిత్రమైన అనుభవాలు ఎదురవడానికి తాము దొంగిలించిన శిలువలే కారణమని తెలుసుకున్న ముగ్గురూ ఏం చేస్తారు ?
వీళ్ళని వెంబడిస్తున్న ఆ ఐదు దయ్యాల వెనుక ఉన్న అసలు కధేంటి ? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది ?
హర్రర్ , థ్రిల్లర్ జానర్ మూవీ అంటే ఏంటి ? మూవీ చూసే ప్రేక్షకులకు ఒళ్ళు గగుర్పొడచాలి. కొన్ని సన్నివేశాలను చూసి భయపడాలి . మరికొన్ని సన్నివేశాలను చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలి . అప్పుడు ఆ జానర్ కి సార్థకత చేరుతుంది . ఇందులో ఆ ఫీల్ తగ్గింది . అలాంటి ఫీల్ రాకపోవడానికి ఐదు దయ్యాల క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు ఒక కారణం . చనిపోకముందు వాళ్ళు డాన్సర్లు కాబట్టి అదే గెటప్పులో దర్శకుడు వాళ్ళని స్క్రీన్ మీదికి తీసుకువచ్చాడు . అఫ్కోర్స్ కళ్ళలో తెల్ల గుడ్లు , ముఖానికి కాటుకలు కూడా పూసారనుకోండి కానీ ప్రేక్షకులను భయపెట్టేలా మాత్రం ఆ ఐదు దయ్యాలు లేవు . దయ్యాలను చూసి హీరో భయపడితే చాలనుకున్నట్టున్నాడు దర్శకుడు . కానీ ప్రేక్షకులు కూడా భయపడాలని పసిగట్టలేకపోయాడు . ఆ ఐదు దయ్యాలను పర్ఫెక్ట్ గా డిజైన్ చేయకపోవడం దర్శకుడు చేసిన మొదటి తప్పు . ఎందుకంటే సినిమా మొత్తం ఆ ఐదు దయ్యాల చుట్టూనే తిరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ పాత్రల గెటప్ మీద మరింత జాగ్రత్తగా ఫోకస్ పెట్టి ఉండాల్సింది .
హీరో , అతడి స్నేహితుడు శిలువలను దొంగిలించి రూముకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆ ఐదు దయ్యాలు కనిపించినప్పుడు మనం కూడా కొంత థ్రిల్ ఫీల్ అవుతాము . కానీ పదేపదే ఆ ఐదు దయ్యాలు వీళ్ళముందుకు వచ్చి డాన్సులు చేయడం మొదలుపెట్టడంతో దయ్యాలంటే మనకు విరక్తి వస్తుంది . దానికి తోడు డిస్కో డాన్సర్లో మిథున్ చక్రవర్తి టైపు కాస్ట్యూమ్స్ కావడంతో వాళ్లలో డాన్సర్లు కనిపించారే కానీ దయ్యాలు కనిపించలేదు .
హర్రర్ , థ్రిల్లర్ సంగతి ఆలా ఉంచితే హీరో ఫ్రెండు ఖాజా ద్వారాను , సైక్రియాట్రిస్టు పాత్ర ద్వారానూ దర్శకుడు కొంత కామెడీకి ప్రయత్నించాడు . సరే , దయ్యాలను చూసి వాళ్ళు భయపడుతుంటే మనకు ఎలాగూ నవ్వు వస్తుందనుకోండి . ఫస్టాఫ్ లో కామెడీ పోర్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది .
సెకండాఫ్ లో వీళ్ళందరూ కలిసి ఆ ఐదు సమాధుల తాలూకూ బంధువులను వెతుక్కుంటూ వెళ్లడం , అక్కడ వీళ్ళకి చనిపోకముందు ఆ ఐదుగురి ఫ్లాష్ బ్యాక్ గురించి ఒక నిజం తెలవడం , వీళ్ళ ద్వారా ఆ ఐదు దయ్యాలు తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం వంటి సన్నివేశాలు మనకి కొంత క్యూరియాసిటీని కలుగచేస్తాయి . ఇక క్లైమాక్స్ రొటీన్ ఫార్మాట్ లోనే ముగుస్తుంది .
ఓవరాల్ గా కథ విషయం చూసుకుంటే ఇదే ప్లాట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. బతికున్నప్పుడు తమకు జరిగిన అన్యాయం మీద ప్రతీకారం తీర్చుకునే దయ్యాల లెక్క సినీ చరిత్రలో చాలా ఉంది . కాకపోతే దర్శకుడు కధనాన్ని నడిపించిన తీరు గురించి రెండు మాటలు చెప్పుకోవచ్చు . ఫస్టాఫ్ లో కొంత పోర్షన్ కామెడీ ప్లస్ హర్రర్ మిక్స్ చేసి పర్లేదు అనిపించాడు. ఇక సెకండాఫ్ లో కొంత పోర్షన్ హర్రర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ చేసి బాగానే చేసాడు అనిపించాడు . అలాగే ఈ రెండు భాగాల్లోనూ కొన్ని సాగతీత సన్నివేశాలు ఇరికించి దర్శకుడు మనల్ని విసిగించాడు .
ఆ విలన్ గారికీ , చనిపోయిన ఐదుగురికీ చంపుకునేంత పాత పగలు ఏమున్నాయో సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు . పోలీసులను మరీ అంత కామెడీ పీసులుగా ఎందుకు చూపించారో తెలీదు . శిలువలు , దయ్యాలు అంటూ స్లోగా కధనం నడిపిన దర్శకుడు చివర్లో అసలు కథలోకి వచ్చేసరికి ఎందుకంత ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్ లో స్పీడుగా వెళ్లారో తెలీదు .
ఎవరెలా చేసారు ?
ఇందులో ధనుష్ పాత్ర పోషించిన శ్రీనాథ్ మంజుమ్మల్ బాయ్స్ మూవీ చక్కటి నటన ప్రదర్శించాడు . ఈ మూవీలో కూడా ఇతడి నటన బాగానే ఉంది కానీ సూపర్ అనేలా మాత్రం లేదు . దర్శకుడు ఇతడి పాత్ర మీద కూడా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది . మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు పర్లేదు అనిపించారు .
సాంకేతికత
ఇలాంటి మూవీలో సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ , బీజీఎమ్ లు ప్రముఖ పాత్ర వహిస్తాయి . సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే పాతకాలం మూస పద్ధతులనే వాడారు . దయ్యాలు వస్తున్నాయంటే వోల్టేజ్ ప్రాబ్లమ్ మాదిరి లైట్లు వెలిగి ఆగి వెలగడం పురాతన కాలం నుంచి సినిమాల్లో చూస్తున్నవే . కాబట్టి అలాంటి పాత టెక్నిక్కులు ఈ కాలానికి పనికిరావు . బబ్లు అజు కెమెరా పనితనం సాధారణంగా ఉంది .
సామ్ అందించిన బీజీఎమ్ మాత్రం బాగుంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
హర్రర్ జానర్ మూవీ అనగానే ఇదేదో దయ్యాల సినిమా అని అర్థమై ఉంటుంది . సరిగా భయపెట్టే దర్శకుడు ఉండాలే కానీ వీటికీ మంచి డిమాండ్ ఉంది . అనుకున్నంతగా దర్శకుడు మనల్ని భయపెట్టలేకపోయినా కొంత థ్రిల్ అయితే అందించాడు . ఈ జానర్ మూవీలు ఇష్టపడేవారు వన్ టైమ్ వాచ్ కింద సోని లివ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో చూడొచ్చు .
నటీనటులు : శ్రీనాథ్ బసి , ప్రవీణ్ , అభిరామ్ రాధాకృష్ణన్ తదితరులు
సంగీతం : శ్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : బబ్లు అజు
నిర్మాత : అంకుష్ సింగ్
దర్శకత్వం : సుభాష్ లలిత సుబ్రమణియన్
విడుదల : సోని లివ్ ( 03-07-2026 )
రేటింగ్ : 2 / 5
