జూన్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న పీటర్ కన్నడ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ IMDB 9 / 10 రేటింగుతో దూసుకుపోతుంది . ఇప్పటిదాకా క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు మలయాళం సినీ ఇండస్ట్రీ పెట్టింది పేరు అనుకున్నాం . కానీ కన్నడ సినీ ఇండస్ట్రీ కూడా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో పేరు సంపాదించుకుంటున్నారని పీటర్ మూవీ చూసినవాళ్లకు అర్ధం అవుతుంది .
భాష ఏదైనా ఆ జానర్లో మూవీలు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారనడానికి పీటర్ మూవీకి ఓటిటిలో వస్తున్న రేటింగులే ఉదాహరణ .
సుఖేష్ శెట్టి దర్శకత్వంలో రాజేష్ ధ్రువ నటించిన పీటర్ సినిమాకి రవి నిర్మాతగా వ్యవహరించారు .
ఇప్పుడు పీటర్ మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
కేరళ , కర్ణాటక సరిహద్దుల్లోని కొడుగులో తల్లితండ్రులతో కలిసి పీటర్ నివసిస్తూ ఉంటాడు . పీటర్ బైబిల్ తో పాటు భాగవతాన్ని కూడా కంఠస్తా పటించగలడు . అందుకే గ్రామంలోని కృష్ణ మందిర్ లో తన ఆధ్వర్యంలో స్నేహితులతో కలిసి ప్రాచీన చెండె వాయిద్య సంగీత ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు . వీళ్ళు నిర్వహించే చెండె సంగీత కార్యక్రమానికి మంచి పేరు వస్తుంది .
దాంతో అదేఊరికి చెందిన చెడు వ్యసనాలకు బానిస అయిన బఠాణి తన ఆధ్వర్యంలోనే చెండె సంగీత కార్యక్రమం జరగాలని పోటీగా కొంతమందితో కలిసివచ్చి డ్రమ్ములు వాయిస్తూ ఉంటాడు . అయితే ఈ కార్యక్రమంలో ఎవరో వెనకనుంచి బఠాణి తలమీద కొట్టడంతో అతడు కోమాలోకి వెళ్ళిపోతాడు . ఈ విషయం తెలిసిన బఠాణి అన్న పీటర్ మీద పగ పెంచుకుంటాడు .
ఇదిలా ఉండగా అనుకోని ఒక సంఘటనతో పీటర్ తల్లి మతిస్థిమితం లేనిదానిలా మారిపోతుంది . తండ్రి తాగుడుకు బానిస కావడంతో తల్లి బాధ్యతలను పీటర్ చూసుకోవాల్సి వస్తుంది . ఈ పరిస్థితుల్లో మీరా అనే అమ్మాయి పీటర్ ను ప్రేమిస్తుంది . వీరి ప్రేమాయణం సాగుతుండగానే బఠాణి మరణించాడని పీటర్ కు తెలుస్తుంది . బఠాణి అన్నయ్య చంపడానికి బయలుదేరాడని శంబు అనే స్నేహితుడు పీటర్ కి చెప్పి అతడ్ని ఊరు విడిచి పారిపొమ్మని భయపెడతాడు . దాంతో పీటర్ ఉన్నపళంగా ఊరు విడిచి పారిపోతాడు . తిరిగి ఏడాది తర్వాత అతడు ఊరికి తిరిగివస్తాడు .
పీటర్ ఊరు విడిచి పారిపోయిన తర్వాత ఏం జరిగింది ?
పీటర్ తల్లికి మతిస్థిమితం తప్పడానికి కారకులు ఎవరు ?
పీటర్ ని ప్రేమించిన మీరా ఏమౌతుంది ?
అతడి ఇంటికి అనుకుని ఉన్న ఇంట్లో అద్దెకు దిగిన రాధ ఎవరు ?
ఆమె పీటర్ మీద పగ ఎందుకు పెంచుకుంటుంది ?
చివరికి పీటర్ ఏం చేస్తాడు ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో మూవీ తీయడానికి దర్శకుడు ఎన్నుకున్న లొకేషన్ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది . కర్ణాటక హిల్ స్టేషన్ కొడుగు ప్రాంతంలోని చక్కటి పచ్చటి ప్రకృతి మధ్య షూటింగ్ పూర్తిచేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థ్రిల్ తో పాటు నేత్రానందం కూడా కలిగిస్తుంది . ఒక పక్కన పచ్చటి ప్రకృతిని ఆస్వాదిస్తూనే మరోపక్క క్రైమ్ థ్రిల్లర్ కధనం వెంబడి పరుగులు పెట్టడం ప్రేక్షకులకు కొత్తరకం అనుభూతినిస్తుంది .
పాత జ్ఞాపకాలతో పీటర్ తన సొంతూరికి బయలుదేరడంతో కథ మొదలౌతుంది . ఎప్పుడైతే పీటర్ విలేజికి చేరుకుంటాడో అప్పట్నుంచి ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి . దానికి తోడు పీటర్ తన స్నేహితులతో కలిసి కృష్ణ మందిర్ ప్రాంగణంలో చెండె అనే ప్రాచీన సంగీత కార్యక్రమాలు చేయడంతో మూవీ ఆహ్లాదకరంగా సాగిపోతుంది . అదే కార్యక్రమంలో బఠాణి గాయపడటం , తర్వాత మరణించడంతో స్టోరీ క్రైమ్ మోడ్ లోకి టర్న్ అవుతుంది .
ఈ మూవీలో దర్శకుడు ఒక్కో క్యారక్టర్ కు ఒక్కో ఫ్లాష్ బ్యాక్ సృష్టించాడు . ఆ ఫ్లాష్ బ్యాక్ లు తెలిస్తే కానీ కథ మనకు అర్ధం కాదు . వేరే ఊరికి పారిపోయిన పీటర్ అలా ఎందుకు పారిపోయాడో తెలియాలంటే అతడి ఫ్లాష్ బ్యాక్ తెలియాలి . అలాగే పీటర్ తల్లి పిచ్చిదానిలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియాలంటే ఆమె ఫ్లాష్ బ్యాక్ తెలియాలి . పీటర్ ఇంటిపక్కనే ఉండే పిటి టీచర్ రాధ అతడి మీద ఎందుకు పగబట్టిందో తెలియాలంటే ఆవిడ ఫ్లాష్ బ్యాక్ తెలియాలి . పీటర్ ఊరు విడిచి పారిపోయిన తర్వాత అతడి స్నేహితుడు శంభు ఏం చేసాడో తెలియాలంటే అతడి ఫ్లాష్ బ్యాక్ తెలియాలి . ఇలా దర్శకుడు ఫస్టాఫ్ లో పరిచయం చేసిన ప్రతి క్యారక్టర్ వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండేలా కథ రాసుకున్నారు . ఆ పాత్ర స్వభావం తెలియాలంటే మనకు ఆ ఫ్లాష్ బ్యాక్ తెలియాలి . అందుకే ఫస్టాఫ్ లో ఒక్కో పాత్రను ప్రవేశపెట్టిన దర్శకుడు సెకండాఫ్ లో ఒకటొకటిగా ఒక్కో పాత్ర స్వభావాన్ని బయటపెడుతూ క్లైమాక్సులో రాధ ఎవరనేది రివీల్ చేస్తాడు . ఇంతవరకు కధనం గ్రిప్పింగ్ గానే సాగుతుంది . ఇక క్లైమాక్స్ మాత్రం రొటీన్ కమ్మర్షియల్ మూవీల ఫార్మాట్ లోనే ముగుస్తుంది . అందువల్ల ముగింపు థ్రిల్ ఫీలయ్యేది ఏమీ ఉండదు .
పీటర్ తల్లి పిచ్చిదానిలా మారడం వెనుక ఉన్న కారణాన్ని దర్శకుడు ప్రొజెక్ట్ చేసిన తీరు బాగుంది. తల్లీకొడుకుల బాండింగ్ , ఫ్యామిలీ ఎమోషన్లు , సెంటిమెంట్లు లాంటివి ముడిపెట్టి సన్నివేశాలు అల్లారు కాబట్టి మనకి పెద్దగా బోర్ కొట్టదు కానీ ప్రధాన కధకు ఈ పిచ్చిగోల అవసరమా అనిపిస్తుంది . చెప్పాలంటే అసలు కధకి పీటర్ తల్లి పిచ్చికి సంబంధం లేదు కానీ దర్శకుడు ఈ ఎపిసోడ్ తో ఒక ఉప కథను నడిపించారు .
ఇక పీటర్ పక్క ఇంట్లో దిగిన రాధ క్యారక్టర్ ఎవరనే మిస్టరీని చివరివరకు రివీల్ చేయకుండా దర్శకుడు కధనాన్నినడిపిన తీరు బాగానే ఉంది కానీ క్లైమాక్స్ చూసినా ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవలేదంటే ఆ క్యారక్టర్ ప్రిడిక్టబుల్ గా ఉండటమే కారణం . ఇక క్లైమాక్సులో పీటర్ స్నేహితుడు శంభు పోషించిన రోల్ పూర్తిగా రొటీన్ రొడ్డకొట్టుడే . ఇందులో కొత్తదనం లేదు . పైగా ప్రీ క్లైమాక్సులో శంభు గురించి మెడికల్ షాప్ అతడూ , పీటర్ ఫ్రెండ్ చెప్పినమాటలబట్టి ఆ క్యారక్టర్ స్వభావం అర్థమైపోయింది . చీటింగ్ చేసింది అతడు కాకపోతే ఆశ్చర్యపడాలి కానీ అతడే అని ముందే తెలిసినప్పుడు క్లైమాక్సులో ప్రేక్షకుడు ఎందుకు ఆశ్చర్యపడతాడు . కాకపోతే ప్రీ క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపిన దర్శకుడు క్లైమాక్సులో మాత్రం తడబడ్డాడు . క్లైమాక్స్ కూడా అదే టెంపోతో ముగించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది .
ఇక లాజికల్ గా చూస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి . మొబైల్ కూడా తుప్పల్లో వదిలేసి పారిపోయిన పీటర్ వేరే ఊర్లో ఎవరో అనామకుడి దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుని తన స్నేహితుడు శంభుకు ఫోన్ చేయడం వరకు బాగానే ఉంది కానీ అదే ఫోను అంతకుముందే సంపాదించి తన ప్రేయసి మీరాతో ఎందుకు మాట్లాడలేకపోయాడు ? అనే ప్రశ్న చాలామందికి వస్తుంది . ఈ రోజుల్లో చేతిలో ఫోను లేకపోయినా అడుగడుగునా పబ్లిక్ ఫోనులకు లోటు లేదు . మరి మీరాతో మాట్లాడటానికి పీటర్ కు ఫోన్ కూడా దొరకలేదా ? బఠాణి మర్డర్ అయ్యాడని తెల్సినతర్వాతైనా పోలీసులు ఎంటర్ అవ్వాలి కదా ? కానీ ఈ మూవీలో చివరివరకు అసలు పోలీసులే కనపడరు .
ఇప్పుడు మూవీకి ప్లస్ అయిన విషయాల గురించి మాట్లాడుకుందాం . మొదటి ప్లస్ ప్రకృతి అందాలే . సాధారణంగా డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలంటే కళ్ళుపోడుచుకున్నా కానరాని చీకట్లో చూడటమే అనుకుంటాం కదా ? కానీ ఈ మూవీ స్పెషల్ ఏంటంటే అందమైన ప్రకృతిలో కూడా క్రైమ్ థ్రిల్లర్ కధనాన్ని నడపడం.. డే లైట్ లో కూడా సహజత్వం చెడకుండా థ్రిల్లింగ్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది . కధనం కూడా ఒక ఫ్లోలో కొనసాగుతుంది కాబట్టి ఎక్కడా బోర్ కొట్టదు . నేరుగా క్లైమాక్సులోనే కాకుండా దర్శకుడు ఫస్టాఫ్ లోనూ , సెకండాఫ్ లోనూ కొన్ని ట్విస్టులు పెట్టి ఉంటే బాగుండేది . ఇక మూవీ ప్రారంభంలోనే పీటర్ ద్వారా మతసామరస్యం గురించి దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది .
ఎవరెలా చేసారు ?
టైటిల్ కి తగ్గట్టు ఈ సినిమా అంతా దాదాపు పీటర్ చుట్టూనే తిరుగుతుంది . పీటర్ పాత్రలో విజయ్ ధ్రువ నటన బాగుంది . మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు నటించారు .
సాంకేతికత
రిత్విక్ మురళీధర్ అందించిన సంగీతం బాగానే ఉంది .
ప్రకృతి దృశ్యాలను మరింత అందంగా చూపించడంలో గురుప్రసాద్ కెమెరా పనితనం బాగుంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి పీటర్ మూవీ నచ్చుతుంది . ఒకపక్కన కొడుగు కొండప్రాంత అందాలను చూపిస్తూనే దర్శకుడు కధనాన్ని క్రైమ్ మోడ్ లోకి మలుపుతిప్పిన తీరు బాగుంది .
ఫస్టాఫ్ ఆహ్లాదంగా మొదలైన కధనం సెకండాఫ్ లోకి వచ్చేసరికి పూర్తిస్థాయి క్రైమ్ థ్రిల్లర్ గా మారి ఉత్సుకత కలిగిస్తుంది . అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో కన్నడతో పాటు తెలుగు , తమిళ ,భాషల్లో కూడా అందుబాటులో ఉంది . ఈ జానర్ మూవీలు ఇష్టపడేవాళ్లు ఒక లుక్ వేయండి.
నటీనటులు : విజయ్ ధ్రువ , రవిక్ష శెట్టి , జాన్వీ రాయల తదితరులు
సంగీతం : రిత్విక్ మురళీధర్
సినిమాటోగ్రఫీ : గురుప్రసాద్
నిర్మాత : రవి
దర్శకత్వం : సుఖేష్ శెట్టి
విడుదల : అమెజాన్ ప్రైమ్ (05-06-2026)
రేటింగ్ : 2.75 / 5
