త్రికాల (Trikala Movie ) మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 9 నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది . శ్రద్దాదాస్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో అజయ్ , ఆమని , మాస్టర్ మహేంద్రన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ మూవీకి రాధికా శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించగా మణి తెల్లగుటి దర్శకత్వంలో తెరకెక్కించారు .
త్రికాల ప్రోమో పోస్టర్ చూడగానే ఇదొక మైథలాజికల్ , సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ జానర్ మూవీ అని అర్థమైపోతుంది . ఈ జానర్లో మూవీలు చూడటానికి చాలామంది ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు . మేలో థియేటర్లలో రిలీజ్ అయి మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న త్రికాల మూవీ ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చి మంచి రేటింగులను సాధించింది .
ఇప్పుడు త్రికాల మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
గో సంరక్షణ ప్రాముఖ్యతతో కథ మొదలౌతుంది . గోమాత ప్రాముఖ్యత గురించి బామ్మ తన మనవరాలికి చెప్తూ వందల సంవత్సరాల క్రితం ఒక జమీందారు మూర్ఖంగా గో అపచారం చేయడంతో ఆ వంశానికే కాదు ..ఊరికీ అరిష్టం చుట్టుకుంటుంది . భర్త చేసిన తప్పు తెలుసుకున్న జమిందారిణి గ్రామదేవత కాటేరమ్మ విగ్రహాన్ని ఊళ్ళో ప్రతిష్టించి ముడుపులు కడుతుంది . దాంతో గ్రామంలో అరిష్టాలు తగినప్పటికీ కర్మ ఆ జమీందారుల వంశాన్ని వెంటాడుతూనే ఉంటుంది .
ఆ వంశంలో ఆఖరివాడైన దేవిశ్రీప్రసాద్ కూడా తన పూర్వికులు చేసిన అపచారం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు . అతడికి పిల్లవాడు పుట్టగానే భార్య మరణిస్తుంది . ఆ పిల్లవాడే వైతరణి ( అజయ్ ) . పుట్టుకతోనే సూర్యరశ్మిని భరించలేని ఒక రకమైన వ్యాధితో బాధపడుతుంటాడు . అందుకే ఎక్కువ సమయం చీకట్లోనే గడుపుతుంటాడు . బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ముఖానికి మాస్క్ వేసుకుంటాడు . జమీందారు రెండో భార్య ఆమని మాత్రం ఆ పిల్లవాడిని తన సొంతకొడుకులా చూసుకుని పెంచుతుంది .
విచిత్రమైన సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్న వైతరణి చిన్నతనంలోనే తండ్రిని హత్య చేయడంతో బాలుర కారాగారంలో ఉంచుతారు . అక్కడ అతడికి వైద్యం చేయడానికి సైక్రియాట్రిస్టు మాయ ( శ్రద్ధాదాస్ ) రంగంలోకి దిగుతుంది . ఈ క్రమంలో అతడి గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటుంది . కారాగారం నుంచి ఇంటికి వచ్చిన వైతరణి పినతల్లిని కూడా చంపేసి తానూ చనిపోతాడు . అక్కడ్నుంచి అతడి ఆత్మ ఆ బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది .
మరోపక్క తప్పిపోయిన తన ప్రేయసి నిధి కోసం శివ ( మాస్టర్ మహేంద్రన్ ) సైక్రియాట్రిస్టు మాయతో కలిసి ఆ బంగ్లాలోకి చేరతాడు . అక్కడ వీళ్ళకి విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి .
వైతరణి గత జన్మ వృత్తాంతం ఏంటి ?
నిధిని వెతుక్కుంటూ బంగ్లాలోకి అడుగుపెట్టిన శివకు ఎటువంటి అనుభవాలు ఎదురౌతాయి?
తండ్రిని చంపిన వైతరణి పినతల్లిని కూడా ఎందుకు చంపుతాడు ?
కుమారి ఖండంలో మునులు చెప్పిన త్రికాల ఎవరు ?
త్రికాలకు , వైతరణి కి ఉన్న సంబంధం ఏంటి ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
ఈ సినిమా ఎలా ఉందో సింపుల్ గా చెప్పాలంటే కష్టం . కథతో పాటు , కాలాలతో పాటు మనమూ పరిగెత్తాలి . పదినిముషాల క్రితం మనం అనుసరిస్తున్న కథ వేరు , పదినిమిషాల తర్వాత మనం అనుసరిస్తున్న కథ వేరు అవడంతో రకరకాల ఫీలింగ్స్ వస్తాయి . ఆదిత్య 369 మూవీలో బాలయ్య టైమ్ మెషిన్ లో రకరకాల కాలాలకు ప్రయాణం చేసినట్టు త్రికాలలో కూడా మనం రకరకాల కాలాలకు ప్రయాణం చెయ్యాలి . ఇప్పటి కాలంలో ఏం జరుగుతుందో తెలియాలంటే గత కాలంలో ఏం జరిగిందో తెలుసుండాలి . ఎక్కడా గొలుసు తెగకుండా చూడాలి . థియేటర్లో అంటే తప్పదు కాబట్టి ఆ రెండుగంటలూ కదలకుండా సీట్లోనే కూర్చుని చూస్తాము . కానీ ఓటీటీల్లో అలా కాదు కదా ? కొంతమంది మధ్యలో బ్రేక్ ఇచ్చి చూస్తారు . అలా పొరపాటున మధ్యలో బ్రేక్ ఇచ్చి ఈ మూవీ చూశామా మనం ఎక్కడున్నామో అర్ధం కాక కొంచం కన్ఫ్యూజ్ అవుతాము .
దర్శకుడు సినిమాని కధలా చెప్పుకుంటూ పోయాడు . చిన్నప్పుడు చదివిన చందమామ పుస్తకంలోని చిన్నచిన్న కధల్లా ఇందులో కూడా దర్శకుడు భరత ఖండం , కుమారి ఖండంతో మొదలెట్టి శంకరపల్లి వరకు మనల్ని తీసుకొస్తాడు .
కధలో పునర్జన్మ అనే పాయింటు ఉంది కాబట్టి గత జన్మ వృత్తాంతం కూడా చూపాల్సిందే . కాబట్టి త్రికాలకు , వైతరణి కి మధ్య జన్మజన్మల ఫ్లాష్ బ్యాకులు చూపించడం కూడా తప్పనిసరి అవుతుంది . ఇందులో తప్పు పట్టేది ఏమీ లేదు . అయితే త్రికాల కథను తెరకెక్కించడంలో దర్శకుడు అక్కడక్కడా తడబడ్డారు . ఎడిటింగ్ వైఫల్యమో , నేరేషన్ ప్రాబ్లమో తెలీదు కానీ సినిమాని ఫాలో అవడంలో ప్రేక్షకుడు కొంత కన్ఫ్యూజ్ అవుతాడు .
ఇక ఫస్టాఫ్ లో బామ్మ మనవరాలికి కథ చెప్పడం , జమీందారు కుటుంబానికి తగిలిన శాపం , వైతరణి బాల్యం , హీరో శివ తండ్రీకొడుకుల మొబైల్ ఫోన్ సన్నివేశాలతో మనం అసలు కథలోకి వెళ్ళం . సెకండాఫ్ లో ఎప్పుడైతే శివ వైతరణి బంగ్లాలోకి అడుగుపెడతాడో అప్పట్నుంచి మెల్లిగా అసలు కథలోకి వెళ్తుంటాం . శివ బంగ్లాలోకి అడుగుపెట్టడంతో ప్రేక్షకులు కూడా హర్రర్ జోన్ లోకి వస్తారు .
అయితే ఊరి బయట రంగులు వెలిసి , పిచ్చిమొక్కలు మొలిచిన పాడుబడ్డ బంగ్లా ఉండటం , దయ్యాలు సంచరిస్తున్నాయనే భయంతో ఊరి జనం ఆ బంగ్లావైపు వెళ్ళకపోవడం , హీరో మాత్రం అదేదో పిక్నిక్ స్పాట్ మాదిరి బంగ్లాలోకి వెళ్లడం , అక్కడ పొడుగాటి గోళ్ళతో గాల్లో చేతులు ఊపడం , ఆ గోళ్లు చూసి సైడ్ క్యారెక్టర్లు భయపడటం గతంలో చాలా సినిమాల్లో చూసేసాం . హర్రర్ అంటే పొడుగాటి గోళ్లు చూపించడం అనే పాత ఫార్మాట్ లోనే ఇంకా ఉంటే ఎలా ? హర్రర్ సీన్ చూస్తే భయపడాల్సింది సినిమాలో సైడ్ క్యారెక్టర్లు కాదు ప్రేక్షకులు అని తెలుసుకోకపోతే ఎలా ? కాబట్టి బంగ్లాలో చూపించిన హర్రర్ సీన్లు ఏమాత్రం థ్రిల్ పంచకపోగా కొన్ని సన్నివేశాలు అనవసరమైన సాగతీతలా అనిపించాయి .
నిజానికి నటనలో అజయ్ ఇప్పటికే చాలా సినిమాల్లో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు . సన్నివేశాలకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో అతడిది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఉంటుంది . అలాంటి అజయ్ లోని నటుడ్ని వాడుకోకండా ముఖానికి మాస్క్ వేయడం దర్శకుడు చేసిన ఇంకో తప్పు . పైగా ఆ మాస్క్ వేయడం వల్ల క్యారక్టర్ కు వచ్చిన అదనపు ప్రయోజనం ఏముందో తెలీదు కానీ ఒక చక్కటి నటుడి నుంచి ముఖకవళికలతో కూడిన నటన మిస్ అయ్యాం .
ఇక కుమారి ఖండం , ఋషులు , రాక్షసుల పోరాటాలు , శక్తులను ఆయుధంతో నిక్షిప్తం చేసి త్రికాల వర్మకు అందివ్వడం ఈ మధ్యనే వచ్చిన తేజ సజ్జా సినిమాని గుర్తుచేస్తుంది . ఋషులు త్రికాల అండాన్ని భద్రపరచడం , తిరిగి కలియుగంలో దానికి శక్తిని ప్రసాదించి పునరుజ్జీవం అయ్యేలా పూజలు చేయడం , ఆ అవతారమే కలియుగంలో వైతరణి రూపంలో పాపాత్ములను వెంటాడుతోందని చెప్పడం , దీనికి కొనసాగింపుగా రెండో భాగం కూడా ఉంటుందని దర్శకుడు హింట్ ఇవ్వడంతో అన్ని సినిమాల్లానే త్రికాల మూవీ కూడా ముగుస్తుంది .
అన్నీ విమర్శలేనా ? సినిమాలో ఒక్కటంటే ఒక్కటైనా మంచి సన్నివేశాలు లేవా ? అంటే ఉన్నాయనే చెప్తా . త్రికాల కోసం దర్శకుడు ఎన్నుకున్న గో సంరక్షణ , కర్మ సిద్ధాంతం , పునర్జన్మ పాయింట్లు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేవే . కర్మ సిద్ధాంతం గురించి బామ్మతో మనవరాలికి కథ చెప్పించడం ద్వారా సినిమా మొదలుపెట్టిన విధానం బాగుంది . హీరో తండ్రికి పొలంలో బర్త్ డే పార్టీ చేయడం , తండ్రికి బర్త్ డే గిఫ్టుగా కొడుకు మొబైల్ ఫోన్ కొనివ్వడం , స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియక అవస్థలు పడి నవ్వు తెప్పించే తండ్రి .. వంటి సన్నివేశాలు సరదాగా నాచురల్ గా ఉన్నాయి . కుమారి ఖండం గురించి చెప్తున్నప్పుడు చూపించిన విజువల్స్ బాగున్నాయి . వైతరణి గురించి సైక్రియాట్రిస్టు మాయ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి . వైతరణి పెద్దయ్యాక నడిచిన కధనం బాగుంది .
ఎవరెలా చేసారు ?
త్రికాలలో అందరికన్నా ముందు చెప్పుకోవాల్సింది వైతరణి పాత్ర గురించే . ఈ పాత్రలో అజయ్ నటన బాగుంది . కాకపోతే ఎక్కువ భాగం మాస్కుతో ఉండటంతో అతడి నుంచి పూర్తిస్థాయి నటనను మనం ఆశించలేం .
ఇక సవతి తల్లి పాత్రలో ఆమని నటన బాగుంది . కన్నకొడుకు కాకపోయినా వైతరణి విషయంలో ఆమె చూపించిన ఎమోషనల్ బాండింగ్ వర్కౌట్ అయ్యింది .
కధకి సైక్రియాట్రిస్టు మాయ పాత్ర కీలకమే కానీ నటించటానికి శ్రద్ధాదాస్ కు ఫుల్ స్కోప్ దక్కలేదు .
దేవిశ్రీప్రసాద్ నటన బాగుంది
హీరో మహేంద్రన్ నటన పర్లేదు .
సాంకేతికత
సాజిద్ హుమాయూన్ అందించిన నేపధ్య సంగీతం పర్లేదు .
పవన్ చెనై కెమెరా పనితనం ఈ మూవీకి ప్లస్ అవుతుంది . ముఖ్యంగా త్రికాల ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆ పనితనం కనిపిస్తుంది .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి . దర్శకుడు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఔట్పుట్ బాగానే తీయగలిగారు .
విశ్లేషణ
మైథలాజికల్ హర్రర్ థ్రిల్లర్ జానర్ మూవీలు చాలామంది ఇష్టపడతారు . కాకపోతే ఇలాంటి మూవీలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ . రెండుగంటలపాటు సినిమా చూసే ప్రేక్షకుడికి ఉత్సుకత కలిగించేలా సన్నివేశాలు ఉండాలి . మలుపులు ఉండాలి . అన్నిటికన్నా ముఖ్యం సౌండ్ తో భయపెట్టేలా ఉండాలి .
త్రికాల కోసం దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ నేరేషన్ లో తడబడినట్టు అనిపిస్తుంది . కథ వివిధ కాలాల చుట్టూ పరిగెడుతుంది కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మరింత జాగ్రత్తగా నేరేట్ చేసి ఉంటే బాగుండేది . ఓవరాల్ గా సినిమా బోర్ కొట్టదు కానీ ఇందులో ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం వస్తుంది .
వన్ టైమ్ వాచ్ మూవీ కింద అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో ఓ లుక్ వేయండి .
నటీనటులు : అజయ్ , ఆమని , మాస్టర్ మహేంద్రన్ , దేవిశ్రీప్రసాద్ తదితరులు
సంగీతం : సాజిద్ హుమాయూన్
సినిమాటోగ్రఫీ : పవన్ చెనై
నిర్మాత : రాధికా శ్రీనివాస్
దర్శకత్వం : మణి తెల్లగూటి
విడుదల : అమెజాన్ ప్రైమ్ ( 10-07-2026 )
రేటింగ్ : 2.5 / 5
