ముఖ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఏ స్పై (Mukhbir The Story of a Spy) యాక్షన్ మూవీ (OTT) రివ్యూ !

Spread the love

జులై 10 , 2026 నుంచి ZEE 5 ఓటిటిలో ముఖ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఏ స్పై ( Mukhbir The Story of a Spy ) యాక్షన్ మూవీ / సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది . జైన్ ఖాన్ దురాని , ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ సిరీస్ కి శివరామ్ నాయర్ దర్శకత్వం వహించారు . ప్రస్తుతం జీ 5 లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది .

యాక్షన్ స్పై జానర్ మూవీలకు ఆడియన్స్ లో మంచి క్రేజు ఉంటుంది . హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ భాషలో అయినా ఆ జానర్ మూవీలు చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు . ఒకప్పుడు రోజర్ మూర్ నటించిన జేమ్స్ బాండ్ సినిమాలు సి క్లాస్ సెంటర్లలో కూడా హౌస్ ఫుల్ అయ్యేవి . తెలుగులో స్పై సినిమాలను మొదలెట్టి సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లోనే సంచలనం సృష్టించారు .

ఈ మధ్య కాలంలో దురంధర్ మూవీ సృష్టించిన కలెక్షన్ల సునామీ ఎవరూ మర్చిపోలేరు . అఫ్కోర్స్ ఈ సిరీస్ దురంధర్ కన్నా ముందే రిలీజ్ అయ్యింది . ఇప్పుడు ఓటిటిలోకి వచ్చింది . ముఖ్బీర్ అనే టైటిల్ కన్నా ది స్టోరీ ఆఫ్ స్పై అనే ట్యాగ్ లైన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది . మరి ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఈ స్పై ఉన్నాడో ? లేడో ? ఇప్పుడు చూద్దాం .

కధేంటంటే ?

1965 కాలం నాటి ఇండో – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కథ మొదలౌతుంది . ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ పాక్ తో కాల్పులు విరమించి సంయమనం పాటిస్తున్నఇండియా మీద పాక్ కవ్వింపు చర్యలు పాల్పడటం ఆపలేదు . మరోపక్క కాశ్మీర్ ను తమ భూభాగంలో కలిపేసుకోవాలని పాక్ కుట్రలు పన్నుతుందని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలకు తెలుస్తుంది .

అందుకే ఇండియా తరపున ఒక సీక్రెట్ ఏజెంటును పాక్ కు పంపి వారి పన్నాగం తెలుసుకుని ఎదుర్కోవాలని రా అధికారి మూర్తి ( ప్రకాష్ రాజ్ ) భావిస్తాడు . సరిగ్గా ఈ సమయంలో చిరు దొంగతనాలు చేసే కమ్రాన్ ( జైన్ ఖాన్ దురాని ) అతడి కంట్లో పడతాడు . కమ్రాన్ కు ట్రైనింగ్ ఇచ్చి చిన్నప్పుడు పాక్ లో ఒక కుటుంబం ఇంట్లో తప్పిపోయిన కొడుకు రూపంలో మారుపేరుతో అక్కడికి పంపిస్తాడు .

మారుపేరుతో పాక్ చేరుకున్న కమ్రాన్ అక్కడి కుటుంబాన్ని నమ్మించి వారింట్లోనే ఉంటూ స్పై ఆపరేషన్లు మొదలెడతాడు . ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా పాక్ లో అడుగుపెట్టిన కమ్రాన్ స్పై ఆపరేషన్ కోసం అక్కడ ఏం చేసాడు ? ఎవరికీ అనుమానం రాకుండా పాక్ కార్ల డీలర్ ను , మిలిటరీ బ్రిగేడియర్ ను , మేజర్ జనరల్ ను ఎలా నమిస్తాడు ? భారత్ లో భారీ కుట్రకు ప్లాన్ చేసిన పాక్ ఆర్మీ అధికారుల పన్నాగాన్ని ఎలా బయటపెడతాడు ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

ఇండియా – పాకిస్తాన్ స్పై సినిమాలంటే కాశ్మీర్ నుంచే మొదలెట్టాలని మన దర్శకులు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు . ఈ సినిమా కథ కూడా బోర్డర్ నుంచే మొదలౌతుంది . పాక్ బోర్డర్ దాటి కాశ్మీర్లో అడుగుపెట్టి ఒక ఇంట్లో చేరిన ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ పట్టుకోవడంతో కథ మొదలుపెట్టిన తీరు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది . అందులో పట్టుబడిన కమ్రాన్ ఇండియన్ ఆర్మీకి ఒక కోడ్ వర్డ్ చెప్పి ఢిల్లీలోని ఇంటిలిజెన్స్ అధికారి మూర్తికి ఫోన్ చేయమని చెప్పడంతో స్టోరీ మీద క్యూరియాసిటీ పెరుగుతుంది .

ఈ ఎపిసోడ్ తర్వాత కథ తిరిగి రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది . రా అధికారులు ఆఫీసుకు వెళ్తుంటే మూర్తి దృష్టిలో కమ్రాన్ పడటం , డిపార్ట్మెంట్లో సమర్థులు ఎవరూ లేనట్టు కమ్రాన్ ను మారువేషంలో పాకిస్తాన్ పంపించాలనుకోవడం , ట్రైన్డ్ ఏజెంటును కాకుండా ఓ కొత్త కుర్రాడ్ని ఇండియన్ ఏజెంటుగా పంపటానికి డిపార్ట్మెంట్ అంతా తర్జనభర్జనలు పడటం , వాఘా బోర్డర్ నుంచి కమ్రాన్ సునాయాసంగా పాక్ చేరుకోవడం , చేరుకున్న కొద్దిరోజుల్లోనే పాక్ ఆర్మీ బ్రిగేడియర్ , ఆర్మీ జనరల్లను నమ్మించడం , ఏకంగా ఆర్మీజనరల్ బేగం తోనే అఫైర్ పెట్టుకోవడం , కట్టుదిట్టమైన భద్రతను లెక్కచేయకుండా నేరుగా ఆర్మీ జనరల్ ఇంటికే వెళ్లడం , సినిమాటిక్ లిబర్టీలో కుదురుతాయేమో కానీ లాజికల్ గా కుదరదు .

పైగా ఫస్టాఫ్ అంతా ఎటువంటి యాక్షన్ డ్రామా లేకుండా రొటీన్ గా సాగిపోతుంది . మేజర్ జనరల్ కు , బ్రిగేడియర్ కు మధ్య వచ్చే సన్నివేశాలు మందు తాగడానికి , సిగార్ వెలిగించటానికి , సాగతీత కు పనికొచ్చాయే కానీ కథను ముందుకు తీసుకెళ్లడానికి పనికిరాలేదు . ఆ మాటకొస్తే సెకండాఫ్ లోకి వచ్చిన తర్వాత కూడా కథ అక్కడక్కడే తిరుగుతుంటుంది .

మధ్యలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నడుపుదామని దర్శకుడు చూసారు కానీ ఎందుకో ఆ ప్రయత్నం మానుకున్నారు . లేకపోతే అదో గంట కాలక్షేపం అయ్యేది . ది స్టోరీ ఆఫ్ ఏ స్పై అని ట్యాగ్ లైన్ తగిలించడం బాగానే ఉంది కానీ అందుకు తగట్టుగా యాక్షన్ సన్నివేశాలేవి ? ఎంతసేపు ఏజెంట్ కి హీరోయిన్ తోనూ , బేగం తోనూ సరిపోయింది .

వీళ్ళు సరిపోరన్నట్టు మధ్యమధ్యలో మెడలో దేవానంద్ టైపు మఫ్లర్ వేసుకుని ఒక ఐఎస్ఐ చీఫ్ తిరుగుతుంటాడు. ఈ సినిమాలో ఆయన పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటాడు . ఇక ఎంట్రీలో ఒక పాక్ బ్రిగేడియర్ కి భారీ ఎలివేషన్ ఇచ్చి చివరికి కామెడీ పీసును చేసేసారు . ఇక ఆ మేజర్ జనరల్ విషయానికి వస్తే పాత సినిమాల్లో మన జగ్గయ్యగారిలా సిగార్ కాలుస్తూ అటూఇటూ తిరుగుతుంటాడే కానీ ఆయన జాబ్ ఏంటో ఎవరికీ అర్ధం కాదు .

అసలుకు స్పై స్టోరీ అని ట్యాగ్ లైన్ ఇచ్చినందుకైనా బేసిగ్గా ఉండాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఏవి ? చివరి పదినిమిషాల వరకు ఒక్కటంటే ఒక్క బుల్లెట్ పేలదు . ఒక ఛేజింగులు లేవు , ఒక ఫైటింగులు లేవు , అడుగడుగునా ఉత్కంఠత రేకెత్తించే మైండ్ గేములు లేవు , భారీ స్థాయిలో పతాక సన్నివేశాలు లేవు . ఇవేమీ లేకుండా స్పై సినిమా అని టైటిల్ పెడితే ప్రేక్షకులు డిజప్పాయింట్ అవకుండా ఎలా ఉంటారు ? కనీసం ఆ హీరో కమ్రాన్ ఫిట్నెస్ అన్నా చూసుకోవాలి కదా ? దేశం కోసం శత్రుదేశంలో ఒక హత్య చేసినందుకు గర్వపడకపోగా మన స్పై ఏజెంట్ భోరున ఏడ్చినప్పుడే కధలో గాఢత పోయింది . దర్శకుడు ఆ కుర్రాడిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు సింపుల్గా ఏదో ఒక లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాల్సింది . బాడీ లాంగ్వేజ్ ఏ మాత్రం లేని అతడ్ని పెట్టి స్పై సినిమా / సిరీస్ తీద్దామనుకున్న దర్శకుడి తెగువకు ఆశ్చర్యపోవాల్సిందే .

పోనీ క్లైమాక్స్ అయినా సరిగా ముగించారా అంటే అదీ లేదు . పాక్ వెళ్లి ఈ చేతుల్తో హత్య చేసానని హీరో భోరున ఏడవడం , దేశం కోసం ఆ మాత్రం హత్య చేస్తే తప్పేమిటి ? అని ఆ పాత్రను బతిమిలాడుతూ ప్రకాష్ రాజ్ హితబోధ చేయడం ,చివరికి అదే క్యారక్టర్ మళ్ళీ పెట్టేబేడా సర్దుకుని పాక్ వైపు వెళ్లడం వంటి సన్నివేశాలు చూసినప్పుడు దర్శకుడు క్యారెక్టర్లను సరిగా డిజైన్ చేయలేకపోయారనిపిస్తుంది . పైగా ప్రతి క్యారక్టర్ ను గందరగోళంలో పడేసారు .

స్పై మూవీ అని ట్యాగ్ లైన్ ఇచ్చాం కాబట్టి సీక్రెట్ కోడ్స్ ఇవ్వకపోతే బాగోదు అనుకున్నారో ఏంటో కానీ దర్శకుడు ఒకట్రెండు చోట్ల ట్రాన్సిస్టర్ ను , స్పూన్లను వాడారు . ఆ సన్నివేశాలు కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి . ఇక అదేదో సినిమాలో బొమ్మ వేసి కింద దాని పేరు కూడా రాయమంటాడు శ్రీహరి . ఎందుకంటే కనీసం కిందరాసిన వాక్యం చూసైనా ఆ బొమ్మను గుర్తు పెట్టొచ్చని అతగాడి ఆశ . అలాగా ఈ సినిమాలో దర్శకుడు లాల్ బహదూర్ శాస్త్రిని , ఇందిరాగాంధీని కూడా దింపారు . కానీ టైటిల్స్ చూస్తేనే వారెవరో మనకు అర్ధం అవుతుంది .

ముఖ్బీర్ లో బాగున్న విషయాలేంటని చూస్తే కథాకాలానికి తగ్గట్టు 1965 -70 ల నాటి కాలాన్ని కళ్ళముందుకు తీసుకురావడంలో దర్శకుడి కృషి ఫలించింది . అప్పటి నేటివిటీకి తగ్గట్టు గళ్ళ చొక్కాలు , పాత ఫియట్ కారు , లాంబ్రెట్టా స్కూటర్ లాంటివి విజువలైజ్ చేసిన తీరు బాగుంది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా / సిరీస్ కి ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో హీరో జైన్ ఖాన్ దురానీని సెలెక్ట్ చేసుకోవడమే దర్శకుడు చేసిన మొదటి తప్పు . ఈ పాత్రకు ఏ రకంగా చూసినా అతడు న్యాయం చేయలేదు . ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే నటించాడు .

సాంకేతికత

అభిషేక్ నైల్వాల్ అందించిన సంగీతం బాగానే ఉంది .
డిమో పోపోవ్ అందించిన ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
నిర్మాణవిలువలు పర్లేదు .

విశ్లేషణ

ఈ మధ్య ఓటిటీల్లో వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ బాగా పెరుగుతుంది . అందులోనూ స్పై యాక్షన్ డ్రామా మూవీలకు ఇంకాస్త ఎక్కువ క్రేజు ఉంటుంది . అయితే వీటిలో కొన్ని వెబ్ సిరీస్ లు imdb లో మంచి రేటింగులు సాధించి దూసుకుపోతున్నాయి . దానితో అందరికళ్ళు వెబ్ సిరీస్ ల మీద పడ్డాయి . జీ 5 డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కూడా ఓటిటిలో మంచి రేటింగ్ సాధించింది .

కానీ ఏ సినిమా అయినా , సిరీస్ అయినా సమీక్షకుడి దృష్టి కోణం బట్టి రివ్యూ మారుతూ ఉంటుంది . అది అందరికీ నచ్చాలని లేదు . అలాగే అందరికీ నచ్చకపోవాలని కూడా లేదు. జీ 5 లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ కింద ఒక లుక్ వేయొచ్చు .

నటీనటులు : జైన్ ఖాన్ దురానీ , ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం : అభిషేక్ నైల్వాల్
సినిమాటోగ్రఫీ : డిమో పోపోవ్
దర్శకత్వం : శివరామ్ నాయర్
విడుదల : ZEE 5 (10-07-2026)
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!