ఓటిటిలోకి వచ్చేసిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) – మూవీ రివ్యూ !

Spread the love

ఈ రోజు నుంచి ( జులై 17 ) సమంత లీడ్ రోల్ లో నటించిన మా ఇంటి బంగారం మూవీ (Maa Inti Bangaaram Movie) జియో  హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది . సమంత , ఆమె భర్త రాజ్ నిడిమోరి నిర్మాణంలో నందినిరెడ్డి దర్శకత్వం వహించిన మా ఇంటి బంగారం జూన్ 19 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . నెలతిరిగేలోపలే ఇప్పుడు జియో హాట్ స్టార్ ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది .

కొద్ది విరామం తర్వాత సమంత తన భర్తతో కలిసి నిర్మించి నటించిన ఈ మూవీ మీద ఇండస్ట్రీలో కూడా కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి . స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించడం , గతంలో సమంతతో  బేబీ సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం , ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్ తీసి రేటింగులు సాధించిన రాజ్ నిడిమోరి ఈ మూవీకి కథ రాసుకోవడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించడంతో అందరికళ్ళు ఈ బంగారం మీద పడ్డాయి . ఈ రోజు  చాలా సినిమాలను థియేటర్ల కన్నా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లే శాసిస్తున్నాయి . థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటిటిల్లో మంచి రేటింగులను సాధించి దూసుకుపోతున్నాయి .

ఇవాళ్టి రోజుల్లో బాగా టాక్ తెచ్చుకుంటే తప్ప ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్లి మూవీలు చూడటం తగ్గించేశారు . దానికి తోడు నెల తిరక్కుండానే మూవీలు ఓటిటీల్లో ప్రత్యక్షం అవుతుండటంతో చాలామంది ఇంట్లోనే చూడటానికి ప్రిఫర్ చేస్తున్నారు . ఇప్పుడు   థియేటర్ నుంచి ఓటిటిలోకి వచ్చిన మా ఇంటి బంగారం ఎలా ఉందో చూద్దాం . 

కధేంటంటే ?

టైటిల్స్ లోనే బాపు బొమ్మలతో ప్రారంభించడం ఫీల్ గుడ్ బిగినింగ్ అనిపిస్తుంది . మూడేళ్ళ తర్వాత భార్యాభర్తలు బస్సులో సొంతూరికి బయలుదేరడంతో కథ మొదలౌతుంది . ఎవరూలేని అనాధ అయిన స్వర్ణని (సమంత ) డాక్టర్ అనిరుధ్ ( దిగంత్ మంచాలే ) ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు . అయితే బల్లవరం గ్రామంలో ప్రముఖుడిగా పేరుపడిన అనిరుధ్ తండ్రికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు . దాంతో అనిరుధ్ మూడేళ్ళుగా కుటుంబానికి దూరంగా ఉంటాడు . ఈ పరిస్థితుల్లో అనిరుధ్ చెల్లెలి పెళ్లి నిశ్చయం అయిందని ఫ్యామిలీ మెంబర్ నుంచి పిలుపు రావడంతో స్వర్ణని తీసుకుని సొంతూరికి బయలుదేరతాడు .

బల్లవరం గ్రామంలో అత్తింట్లో అడుగుపెట్టిన స్వర్ణ అక్కడ అత్తమామలు ,  కొడుకులు , కోడళ్ళు , కూతుళ్లు , బామ్మ తో కూడిన ఉమ్మడి కుటుంబాన్ని చూసి సంతోషపడుతుంది . ఎవరూలేని అనాధ అయిన తనకు పెద్ద ఫ్యామిలీ ఉందని మురిసిపోతుంది . పెద్దలకు వీళ్ళ పెళ్లి ఇష్టం లేకపోవడంతో కుటుంబ సభ్యులు స్వర్ణతో మాట్లాడటానికి ఇష్టపడరు . ఎలాగైనా వాళ్ళందర్నీ మెప్పించి ఆ కుటుంబంలో తనూ ఒక మెంబర్ అవ్వాలని స్వర్ణ ప్రయత్నాలు మొదలుపెడుతుంది . తన స్నేహితురాలి సాయంతో కుటుంబంలో అందరికీ ఇష్టమైన ఫుడ్ వండిపెడుతూ మెల్లిగా వాళ్ళకి దగ్గర అవుతుంది .

ఒక పెద్ద ఫ్యామిలిలో పెద్ద కోడలిగా అడుగుపెట్టిన స్వర్ణ మెల్లిగా అందరికీ ఆప్తురాలు అవుతుంది . సరిగ్గా ఈ పరిస్థితుల్లో స్వర్ణ జీవితంలో జైల్లో ఉన్న కరుణ ( గుల్షన్ దేవయ్య ) రూపంలో పెద్ద కుదుపు ఏర్పడుతుంది . తన గతాన్ని భర్త కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టిన స్వర్ణ ..కరుణ వల్ల చిక్కుల్లో పడుతుంది .

ఇంతకీ జైల్లో ఉన్న కరుణ ఎవరు ? అతడు స్వర్ణ వెంబడి ఎందుకు పడుతుంటాడు ? అసలు స్వర్ణ గతం ఏంటి ? తనను వేధిస్తున్న కరుణకు ఆమె ఎలా బుద్ది చెప్తుంది ? చివరకు కరుణ సంగతి తెలుసుకున్న ఆ ఫ్యామిలీ ఏం చేసింది ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మూడేళ్ళ తర్వాత  బస్సులో సొంతూరికి వెళ్తున్న అనిరుధ్ తన కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆందోళన పడుతున్నప్పుడు మా ఆయన డాక్టర్ అని బస్సులో ప్యాసింజర్స్ కు చెప్పి అతడి మూడ్ డైవర్ట్ చేయడం , ర్యాలీ ఎదురొచ్చి బస్సు ఆగినప్పుడు కార్యకర్తలతో అమాయకంగా మాట్లాడుతూనే ఆలోచన రేకెత్తించే సన్నివేశాలతోనే సమంత మంచి బిగినింగ్ ఇచ్చింది .

ఇక అత్తారింట్లో అడుగుపెట్టి అక్కడి ఆచారవ్యవహారాలు తెలుసుకునే క్రమంలో తులసి చెట్టు దగ్గర పూజా కార్యక్రమాలు ఎలా చేయాలో తెలియక తికమక పడే సన్నివేశంలో సమంత నవ్వులు పూయిస్తుంది . తన తోడికోడలు ఇంటిల్లిపాదికీ ఇష్టమైనవి వండిపెడుతూ అందరికీ దగ్గరవడం చూసి తాను కూడా అలా అందరికీ దగ్గరవ్వాలని వంట చేయడం తెలిసిన తన స్నేహితురాలిని రంగంలోకి దింపి రహస్యంగా వంటలు చేయించి తానే చేసినట్టు ఇంట్లోవాళ్ళని నమ్మించి క్రెడిట్ కొట్టేయడం వంటి సన్నివేశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తరహాలో కధనం సరదాగా సాగుతుంది . ఈ సన్నివేశాల్లో సమంత , ఆమె స్నేహితురాలు ఇద్దరూ కలిసి చక్కటి హాస్యాన్ని కురిపించారు .

దానికి తోడు చాన్నాళ్లకు విలేజ్ మండువా లోగిలి ఇంట్లో మొత్తం ఫ్యామిలీతో చేసిన సందడి హాయిగా అనిపిస్తుంది . బామ్మ పాత్రలో చేసిన శ్రీలక్ష్మి చంటబ్బాయి మూవీలో తాను పలికిన తవికలనే ఇక్కడ పలకడం సమయోచితంగా ఆ సందర్భాన్ని గుర్తుచేసి చక్కటి కామెడీని  పండించింది .

ఎప్పుడైతే జైల్లో ఉన్న కరుణ స్వర్ణ కోసం వెతకడం మొదలుపెడతాడో కధనం సీరియస్ మోడ్ లోకి టర్న్ అవుతుంది . పైగా బాషా మూవీలో బాషా .. మాణిక్యం అయినట్టు ఝాన్సీ.. స్వర్ణ అయ్యిందని తెలిసిన తర్వాత కొంత క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది . ఆమె గతం ఏమై ఉంటుందా ? అని ఉత్సుకతతో ఎదురుచూస్తాం . ఈ మలుపే కధకు చాలా కీలకం అవుతుంది . అయితే స్వర్ణ గతాన్ని సరిగా ప్రొజెక్ట్ చేయడంలో దర్శకురాలు తడబడ్డారు . అక్కడ రజనీకాంత్ హీరో .. ఇక్కడ సమంత హీరోయిన్.. అంతే.. మిగతాదంతా దాదాపు సేమ్ టు సేమ్ .. అయితే ఇందులో బాషా స్థాయిలో మెరుపులు లేవు . ఝాన్సీ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించిన సమంత చివరకు కరుణ పెట్టే టార్చర్ తట్టుకోలేక బేలగా మారిపోతుంది . కుటుంబ సభ్యులకు తన గతాన్ని చెప్పాలా ? వద్దా ? అని సంఘర్షణలో పడుతుంది . ఎప్పుడైతే కధానాయిక సంఘర్షణలో పడిందో అప్పుడే ఆ పాత్రకు ఉన్న సూపర్ పవర్స్ కూడా తగ్గిపోతాయి .

ఇక ఫ్యామిలిలో ప్రతి పాత్రను జాగ్రత్తగా డిజైన్ చేసిన దర్శకురాలు కరుణ పాత్రను ప్రాపర్ గా డిజైన్ చేయలేదనిపిస్తుంది . ఆ క్యారక్టర్ చూస్తే వామ్మో అనిపించేలా ఉండాలి . కానీ ఎందుకో ప్రేక్షకులకు ఆ ఫీల్ రాదు . ఎంతసేపూ సమంత వెంటపడటానికే ఆ క్యారక్టర్ జీవితం సరిపోయింది . ప్రతినాయకుడి పాత్రను ఇంకాస్త జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది . రెండుమూడుసార్లు ఝాన్సీ అనే పేరు వాడుతూ  సమంత పాత్రకు భారీ ఎలివేషన్ ఇచ్చిన దర్శకురాలు అదే రేంజులో ఆమె ఫ్లాష్ బ్యాక్ ను రాసుకోలేకపోయారు . ఒక సన్నివేశంలో కరుణ తన అనుచరుడితో మాట్లాడుతూ ” నీ చేతిలో ఆమె ఛస్తే ఝాన్సీ అయి ఉండదు .. కానీ ఆమె చేతిలో నువ్వు ఛస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా ఝాన్సీ అయి ఉంటుందని” అంటాడు . కానీ సమంత  ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఆ రేంజులో ఊహించినంత ఉత్కంఠత కలిగించలేదు .

ఇక ఎప్పుడైతే సమంత ఫ్లాష్ బ్యాక్ తెలిసిపోయిందో స్టోరీ ప్రిడిక్టబుల్ అయిపోయి కొత్తగా చూడటానికి ఏమీ ఉండదు . స్వర్ణ కోసం కరుణ  జైల్లోనుంచి పారిపోయి రావడం , అప్పటికే డాక్టర్ అనిరుధ్ తో ఆమెకు పెళ్లయిందని తెలియడం , ఆ కుటుంబాన్ని నాశనం చేస్తానని ఆమె ఇంట్లోనే  తిరగడం వంటి రొటీన్ ఫార్మాట్ లో సెకండాఫ్ నడుస్తుంది కాబట్టి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు . పోలీస్ రికార్డులలో స్వర్ణ పేరు కూడా ఉందని తెలుసుకున్న ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడో క్లారిటీ లేదు . సీఎం పర్యటనలో అంతమంది పోలీసులు కనుక్కోలేని కిరాయి మూకల ఆచూకీ సమంత ఒక్కతే కనుక్కుని బస్సుని పొలిమేరలు దాటించడం సినిమాటిక్ లిబర్టీలో కుదురుతుందేమో కానీ లాజికల్ గా కుదరదు .  ముగింపు కూడా ఎంగేజింగ్ గా ఏమీ ఉండదు .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీ సమంతనే . ఒక పెద్ద కుటుంబంలో పెద్ద కోడలిగా ప్రవేశించిన పాత్రలో సగటు ఇల్లాలుగా ఎంత మంచితనం ప్రదర్శించాలో , ఎంత అమాయకత్వం ప్రదర్శించాలో అన్నీ సమపాళ్లలో ప్రదర్శించింది . అదే పాత్ర ఝాన్సీ పేరుతో మొదలెడితే శత్రువులను తుదముట్టించే అపరకాళిక అవతారంలో భయపెడుతుంది . రెండు డిఫరెంట్ షేడ్స్ లోనూ సమంత చక్కగా నటించి మెప్పించింది . కాకపోతే కొన్ని సన్నివేశాల్లో సమంత బాగా చిక్కిపోయినట్టు కనిపించి తేలిపోయింది .

ఇక సమంత భర్త అనిరుధ్ పాత్ర పోషించిన దిగంత్ మంచాలే పాత్రకు పెద్దగా స్కోప్ లేదు . కేవలం స్వర్ణ భర్తగా మినహా ఆ పాత్రకు ఇతర ప్రత్యేకతలు ఏమీ లేవు .

కరుణ పాత్ర పోషించిన గుల్షన్ దేవయ్య బాడీ లాంగ్వేజ్ బాగానే ఉంది కానీ అతడ్ని చూస్తుంటే ఒక్కోసారి విజయ్ దేవరకొండ , ఒక్కోసారి కమల్ హాసన్ గుర్తుకొస్తారు . ఓన్ ఐడెంటిటీతో ట్రై చేస్తే బాగానే షైన్ అవుతాడు .

ఇక ఈ మూవీలో చెప్పుకోదగ్గ పాత్ర ఒకటుంది . ఆమె సమంత స్నేహితురాలిగా నటించిన మంజూష . నిజానికి ఈమె పాత్ర ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది . పల్లెటూరి స్నేహితురాలి పాత్రలో చాలా సహజంగా నటించింది . 

శ్రీలక్ష్మి , గౌతమి , శ్రీనివాస్ గవిరెడ్డి , వడ్లమాని శ్రీనివాస్ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు .

సాంకేతికత 

సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం బాగుంది . ఓం ప్రకాష్ కెమెరా పనితనం కూడా బాగుంది . నిర్మాణ విలువలు బాగున్నాయి .

విశ్లేషణ

మా ఇంటి బంగారం మూవీ ఫస్టాఫ్ జోష్ గా సాగుతుంది . అత్తింటివాళ్లకు దగ్గర అవడం కోసం సమంత పడే తిప్పలు నవ్విస్తాయి . పెళ్లి తర్వాత కొత్తగా అత్తింట్లో అడుగుపెట్టే కోడలు అక్కడి ఆచారవ్యవహారాలకు తగ్గట్టుగా తనను తాను ఎలా మలుచుకుంటుందో అని చూపించిన తీరు బాగుంది .పెళ్ళికళతో ఇల్లంతా కళకళలాడటం , ఉమ్మడి కుటుంబం రోజులను గుర్తుచేసేలా ఫ్యామిలీ ఆంతా ఒకే ఇంట్లో ఉండటం , కోడలు అయినా కూతురిలా చూసుకునే అత్తగారు , కొడుకు మీద అలిగినా బిపి టాబ్లెట్లు ఇస్తే మాత్రం ఆ తండ్రి బుద్దిగా వేసుకోవడం , వంటల్లో పోటీలు పడే తోడికోడళ్లు , వదినలను బాగా చూసుకునే ఆడపడుచులు , ఆ ఫ్యామిలీ బాండింగ్ హాయిగా అనిపించి చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చూస్తున్న అనుభూతి ఇస్తుంది  .

ఇక సెకండాఫ్ మాత్రం కధనం యాక్షన్ డ్రామాలోకి టర్న్ అయి ప్లాట్ చేంజ్ అవడంతో తిరిగి కనెక్ట్ కావడనికి కొద్ది సమయం పడుతుంది . ఇక్కడ సమంత ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మనం ఊహించినంతగా థ్రిల్ పంచకపోవడంతో కొంచం డిజప్పాయింట్ అవుతాము . దానికి తోడు సెకండాఫ్ తర్వాత స్టోరీ ఆంతా ప్రిడిక్టబుల్ మోడ్ లోనే కొనసాగడంతో కొత్తదనం ఏమీ అనిపించదు .

ఓవరాల్ గా చూసుకుంటే మా ఇంటి బంగారం మూవీ ఎక్కడా బోర్ కొట్టదు . అలా బోర్ కొట్టకుండా చూడటానికి సమంత చేసిన మ్యాజిక్కే ప్రధాన కారణం అవుతుంది .

నటీనటులు : సమంత , దిగంత్ మంచాలే , గుల్షన్ దేవయ్య , శ్రీలక్ష్మి , గౌతమి తదితరులు

సంగీతం : సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్

నిర్మాత : రాజ్ నిడిమోరి

దర్శకత్వం : నందిని రెడ్డి

విడుదల : జియో హాట్ స్టార్ (17-07-2026 ) 

రేటింగ్ : 2.75 / 5 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!