జయరాం , ఊర్వశి తదితరులు నటించిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ పరిమళ అండ్ కో మూవీ ( Parimala and Co movie ) జులై 10 న జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది . దర్శకుడు పాండిరాజ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ చేస్తూ మర్డర్ మిస్టరీని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన తీరు బాగుంది .
క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ ..కామెడీ వేరు వేరు జానర్లు అయినా సరే దర్శకుడు ఏ ఒక్క జానర్ ఫీల్ చెడకుండా దేనికదే బాలన్స్ చేసుకుంటూ చివరివరకు కధనాన్ని నడిపారు . కథ సాధారణ మధ్య తరగతి కుటుంబాల లైఫ్ స్టైల్ తో ప్రారంభం అయి సడెన్గా మర్డర్ మిస్టరీ మోడ్ లోకి టర్న్ తీసుకుంటుంది . భయపెట్టే సన్నివేశాలను కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నవ్వుతూ చెప్పడం ఒక ఆర్ట్ . ఆ ఆర్ట్ పరీక్షలో దర్శకుడు పాస్ అయ్యాడు . అందుకే ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారు .
ఇప్పుడు పరిమళ అండ్ కో మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిమళ అండ్ కో లో ఎవరుంటారంటే ఓ మధ్యతరగతి ఇంటాయన పరిమళ ( జయరాం ) ఆయనకు తోడుగా ఇంటావిడ స్వరాజ్యం ( ఊర్వశి ) వీళ్ళకి తోడుగా పరాశక్తి , మధుమిత అనబడే ఇద్దరు కూతుళ్లు ఉంటారు .
మూడువందల రూపాయల డేటా రీఛార్జ్ చేయాలంటే గుడ్లు తేలేసే మధ్యతరగతి పరిమళ , ఇంట్లోవాళ్ళకి కావాల్సింది వండిపెట్టడం మినహా మరేమీ తెలియని అమాయక ఇల్లాలు స్వరాజ్యం , చదువులతోపాటు ఇంట్లో అల్లర్లలో కూడా పోటీపడే ఇద్దరు కూతుర్లు .. ఇదీ ఆ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ .
తాము కట్టాల్సిన ఇంటి అద్దెలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఎలాగోలా సంసారాన్ని లాక్కోస్తుంటాడు పరిమళ . పేరుకి మధ్యతరగతి కుటుంబమే కానీ సంతోషాలు పంచుకునే క్షణాలలో మాత్రం ఆ కుటుంబం అపర కుబేరులు .
హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబానికి వర్గీస్ అనే లోకల్ రౌడీ రూపంలో ఇబ్బందులు మొదలౌతాయి . పరిమళ చిన్నకూతురు మధుమిత వెంటపడుతూ పెళ్లిచేసుకుంటానని వేధిస్తుంటాడు . అతడంటే తనకు అసహ్యం అని చెప్పినా వినకుండా వెంటపడుతుంటాడు. ఈ క్రమంలో ఒకసారి పరిమళ పెద్ద కూతురు పరాశక్తితో కూడా గొడవ పెట్టుకుంటాడు . విషయం తెలుసుకున్న పరిమళ , స్వరాజ్యం లు తమ కూతుళ్ళ జోలికి రావద్దని అతడ్ని హెచ్చరిస్తారు . అయినా వర్గీస్ వేధింపులు ఆగలేదు .
దాంతో ఇంట్లో సమావేశమైన పరిమళ అండ్ కో వర్గీస్ ను మర్డర్ చేయడమే సమస్యకు పరిష్కారం అని భావిస్తారు . నిజానికి వాళ్ళు సరదాగా అనుకుంటారు కానీ నలుగురిలో ఎవరికీ మర్డర్ చేసేంత ధైర్యం లేదు .
ఈ పరిస్థితుల్లో వర్గీస్ మర్డర్ అవుతాడు . తమ నలుగురిలో ఒకళ్ళు ఈ మర్డర్ చేసి ఉంటారని ఎవరికి వాళ్ళు అనుమానపడతారు . కానీ పైకి ఎవరూ పెదవి విప్పరు . ఈ పరిస్థితుల్లో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్పెక్టర్ ఎంపురియన్ రంగంలోకి దిగుతాడు .
ఇంతకీ వర్గీస్ ను ఎవరు మర్డర్ చేస్తారు ?
ఈ నలుగురిలో ఎవరికైనా వర్గీస్ మర్డర్ తో సంబంధం ఉందా ?
ఇన్స్పెక్టర్ ఎంపురియన్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
ఇంటాయన , ఇంటావిడ ,ఇద్దరు కూతుళ్లు..మధ్య తరగతి కుటుంబం .. అద్దె కోసం ఓనర్ రావడం , అద్దె ఇవ్వలేక ఏదోఒకటి చెప్పి వాయిదా వేయడం , ప్రతిదీ బడ్జెట్ వేసుకుని ఖర్చుపెట్టుకోవడం , పెరిగిపెద్దయినా అల్లరి చేస్తూ సందడి చేసే కూతుళ్లు , ఎవరికేం కావాలో రుచికరంగా వండిపెట్టే ఇల్లాలు ..ఇలా సినిమా మొదలైన తర్వాత ముప్పై నిమిషాల వరకు మనకు మధ్యతరగతి పరిమళ అండ్ ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది . ఈ ఫ్యామిలీని చూస్తున్నప్పుడు మనకు ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు కళ్ళముందు కనిపిస్తాయి . సున్నితమైన హాస్యంతో ఆ ఫ్యామిలీని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు మొదటి రౌండ్ లోనే సక్సెస్ అయ్యాడు .
తమను ఇబ్బందిపెడుతున్న వర్గీస్ నిజంగానే మర్డర్ అయ్యాడు . మరి పరిమళ అండ్ కో లో నలుగురూ ఈ మర్డర్ తాము చేయలేదంటే తాము చేయలేదని ఒట్లు వేసుకుంటారు . మరి వర్గీస్ ను ఎవరు మర్డర్ చేసారు ? ఇదేకదా ప్రశ్న ? దర్శకుడు ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడంలో రెండో రౌండ్ విజయం సాధించాడు .
వర్గీస్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్పెక్టర్ ఎంపురియన్ రంగంలోకి దిగుతాడు కదా ? అతడి ఇన్వెస్టిగేషన్లో వర్గీస్ తల్లితో పాటు బిజినెస్ ప్రత్యర్థుల మీద కూడా అనుమానాలు వస్తాయి కానీ హంతకుడు ఎవరై ఉంటారు అనేదానికి సరైన ఎవిడెన్స్ దొరకదు . మరోపక్క పోలీసులు తమను అనుమానిస్తున్నారేమో అనుకుని పరిమళ అండ్ కో పడే కంగారు .. దృశ్యం మూవీలోలాగా పోలీసులు అడిగే ప్రతిప్రశ్నకు నాకేం తెలీదు అనే సమాధానం చెప్పాలని ఫ్యామిలీ అంతాకలిసి నిర్ణయించుకోవడాలు నవ్వు తెప్పిస్తాయి .
ఫస్టాఫ్ లో పరిమళ ఫ్యామిలీ పరిచయం , మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడం , నోరుతిరగని పేరుతో ఉండే హౌస్ ఓనర్ కి ఏదో ఒక వంక చెప్పి అద్దె వాయిదా వేయడం వంటి సన్నివేశాలతో కామెడీగా సాగిపోతుంది .
సెకండాఫ్ వచ్చేసరికి మర్డర్ మిస్టరీలోకి స్టోరీ టర్న్ అవడంతో దాదాపు కధనం అంతా వర్గీస్ మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరుగుతుంది . అయితే ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసరికి వర్గీస్ ను ఎవరు మర్డర్ చేసారో తెలిసిపోతుంది . కానీ అదే ఈ కధకు ముగింపు అయి ఉంటే సినిమా పల్టీ కొట్టేది . ఇక్కడే దర్శకుడు కథను మలుపు తిప్పాడు . ఆ మలుపే సినిమాకి ప్రధాన బలుపు అవుతుంది . ఆఖరి ఇరవై నిమిషాల్లో వచ్చే ట్విస్టులు మనల్ని వావ్ అనుకునేలా చేస్తాయి . థ్రిల్ పంచుతాయి . క్లైమాక్స్ ఏంటో చెప్తే స్పాయిలర్ అవుతుంది .. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీకి పరిమళ అండ్ కో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు . పరిమళ పాత్రలో జయరాం ఒదిగిపోయాడు . అతడిలో ఒక మధ్యతరగతి తండ్రి కనపడటమే ఆ పాత్రకు న్యాయం జరిగిందనటానికి ఉదాహరణ . అలాగే స్వరాజ్యం పాత్రలో ఊర్వశి చాలా చక్కగా నటించింది. ఇద్దరూ కామెడీ పోర్షన్ ని కించిత్తు ఎక్కువ , తక్కువ చేయకుండా బాలన్సుడ్ గా లీడ్ చేసారు .
వీళ్ళ ఇద్దరు కూతుళ్లుగా నటించిన పరాశక్తి , మధుమితలు క్యూట్ గా ఉండటమే కాకుండా క్యూట్ గా నటించారు కూడా . వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సింది ఇన్స్పెక్టర్ ఎంపురియన్ పాత్ర గురించి . చిరుతిళ్ళు తింటూ ఒకరకమైన మ్యానరిజంతో పాత్రను రక్తి కట్టించారు . ప్రీ క్లైమాక్స్ వరకు సాదాసీదాగా కనిపించినా క్లైమాక్స్ లో మాత్రం ఆ పాత్ర పోషించిన మిస్కిన్ తన విశ్వరూపం చూపించారు . పోలీస్ పాత్రలో అతడి బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది .
ఇక హీరో సంతోష్ శోభన్ కూడా ఇందులో ముఖ్యమైన రోల్ వేసాడు కానీ అతడి పాత్రను సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది . క్లైమాక్స్ సన్నివేశాలకు ఆ పాత్రే లీడ్ అయినప్పుడు సంతోష్ శోభన్ కు ఇంకొంచం స్కోప్ ఇవ్వాల్సింది .
అలాగే నోరుతిరగని పేరుతో ఎదురుపడే కమెడియన్ యోగిబాబు నుంచి దర్శకుడు పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేకపోయారు .
సాంకేతికత
ఫాక్సన్ అందించిన సంగీతం బాగానే ఉంది కానీ కొన్ని థ్రిల్ సన్నివేశాల్లో పడాల్సిన బీట్లు పడలేదు అనిపిస్తుంది .
జార్జ్ విలియమ్స్ అందించిన ఫోటోగ్రఫీ బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
కామెడీ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి పరిమళ అండ్ కో మూవీ నచ్చుతుంది . ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్టాఫ్ కు బాగా కనెక్ట్ అవుతారు . మర్డర్ మిస్టరీ జానర్ ఇష్టపడేవారికి సెకండాఫ్ నచ్చుతుంది . ముఖ్యంగా ఆఖరి ఇరవై నిమిషాల్లో వచ్చే ట్విస్టులు థ్రిల్ పంచుతాయి . కామెడీకి థ్రిల్లర్ మిక్స్ చేసి దర్శకుడు స్క్రీన్ ప్లే నడిపిన తీరు బాగుంది .
జీ ఫైవ్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఈ జానర్ మూవీలు ఇష్టపడేవారు ఓ లుక్ వేయండి
నటీనటులు : జయరాం , ఊర్వశి , సంతోష్ శోభన్ , యోగిబాబు , మిస్కిన్ తదితరులు
సంగీతం : ఫాక్సన్
సినిమాటోగ్రఫీ : జార్జ్ విలియమ్స్
నిర్మాత : కుమారన్
దర్శకత్వం : పాండిరాజ్
విడుదల : Z 5 (10-07-2026 )
రేటింగ్ : 3 / 5
