ఈమధ్య కాలంలో ..అసలా మాటకొస్తే గత కొన్నేళ్లుగా వంగవీటి మోహన రంగాతో కలిసి తిరిగి పనిచేసిన అభిమానుల్లోనూ , సాయం పొందిన బాధితుల్లోనూ వినవస్తున్న మాట రంగన్న లేని లోటు కనిపిస్తుంది అని . అభిమానులు ఇలా అనుకోవడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
అది చెప్పుకునేముందు ఈ మధ్య విజయవాడలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం
గాదె సాయికృష్ణ మిస్సింగ్
విజయవాడకే చెందిన గాదె సాయికృష్ణ మీద ఎప్పటినుంచో రౌడీ షీట్ ఉంది . అతడు చేసిన నేరాల మీద స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి . పోలీస్ కేసులు భరించలేక అతడు ప్రకాశం జిల్లా మార్కాపురం వలస వెళ్ళిపోయి లోకల్ లేబర్ గా పనిచేస్తున్నాడు . అయితే సాయికృష్ణ తల్లి చెప్పిన వివరాల ప్రకారం మే 9 విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మార్కాపురం వచ్చి సాయికృష్ణను పట్టుకుపోయారు .
సాయికృష్ణ తిరిగి మార్కాపురం చేరకపోవడంతో తాను కృష్ణలంక పీఎస్ సిఐ నాగరాజును కలిసి తన కొడుకు ఆచూకీ గురించి నిలదీయడంతో అసలు తాము అతడ్ని అరెస్ట్ చేయలేదని ఒకసారి , నీ కొడుకు చచ్చిపోయాడనుకో అని మరోసారి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని ఆమె వాపోయింది .
అప్పటినుంచి ఆమె తన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం , సరైన సమాధానం రాకపోవడం జరుగుతూనే ఉంది . జూన్ 4 బెజవాడ బార్ అసోసియేషన్ జోక్యం చేసుకుని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో పోలీసుల తీరుపై సీరియస్ అయిన న్యాయస్థానం జూన్ 29 వ తేదీన సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది .
ఈలోపు విజయవాడలో కొన్ని రాజకీయ పార్టీల నేతృత్వంలోని అఖిలపక్షం నుంచి , పౌర సంఘాల నుంచి నిరసనలు వ్యక్తం అవడంతో పోలీస్ ఉన్నతాధికారులు సిఐ నాగరాజును విఆర్ లో పెట్టారు .
సాయికృష్ణది లాకప్ డెత్తే – అంబటి రాంబాబు
మరోపక్క ఈ ఇస్స్యూ మీద వైసిపి నాయకుడు అంబటి రాంబాబు స్పందించారు . సాయికృష్ణది ఖచ్చితంగా లాకప్ డెత్తే అని , వెంటనే ఈ విషయంపై న్యాయవిచారణ జరిపి దోషులను సస్పెండ్ చేసి శిక్షించాలని మీడియాలో మాట్లాడుతూ డిమాండ్ చేసారు .
సోషల్ మీడియాలో వైరల్ అయిన సాయికృష్ణ ఫోటోలు
సాయికృష్ణను కృష్ణలంక పీఎస్ పోలీసులే చంపారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి . ఈ ఫోటోల్లో సాయికృష్ణ ఒళ్ళంతా తీవ్ర గాయాలతో చనిపోయినట్టు కనిపిస్తుంది . అతడి కాలిగోర్లు కూడా ఊడబెరికినట్టు కనిపిస్తుంది . ఈ ఫోటోలు నిజమైనవేనా ? లేకపోతే మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసారా అనేది ప్రశ్నార్ధకమే?
సీఎం స్పందన
సింగపూర్ టూర్ నుంచి తిరిగొచ్చిన సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు . సాయికృష్ణ మిస్సింగ్ కేసును సమీక్షించిన సీఎం వెంటనే సిఐ నాగరాజును సస్పెండ్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు . అలాగే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇచ్చే బాధ్యతలను రాజమండ్రి ఎస్పీ నరసింహ కిశోర్ కు అప్పగించినట్టు తెలిపారు .
సీఎం స్పందనతో మొదలైన పరామర్శలు
తప్పిపోయిన సాయికృష్ణ ఒక సామాజిక వర్గానికి చెందినవాడు అవడం , ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామని కొందరు నేతలు రంగంలోకి దిగడంతో పరిస్థితిని గమనించిన సీఎం దిద్దుబాటు చర్యలు చేపట్టారు . సిఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు , దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారిని నియమించడం వంటి ప్రకటనలతో సరిపుచ్చకుండా కొంతమంది పార్టీ నాయకులను పరామర్శలకు పంపారు . అందులో భాగంగా గద్దె రామ్మోహన్ వంటి టిడిపి నాయకులు సాయికృష్ణ తల్లిని కలిసి పరామర్శించారు . దీంతో వైసిపి నాయకులు కూడా పోటాపోటీగా సాయికృష్ణ తల్లిని కలిసి పరామర్శించటానికి బయలుదేరారు .
సాయికృష్ణ కనిపించకుండా పోయి నేటికీ నలభై రోజులు
చూసారుగా మే 9 మార్కాపురంలో కనిపించకుండా పోయిన సాయికృష్ణ కనిపించకుండా పోయి నేటికి నలభై రోజులు అవుతుంది . షుమారు 25 రోజుల తర్వాత బెజవాడ బార్ అసోసియేషన్ జోక్యంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది . షుమారు ముప్పై తొమ్మిది రోజుల తర్వాత సీఎం స్పందించారు .. సిఐ సస్పెండ్ అయ్యారు . ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఐపీఎస్ అధికారి నియమితం అయ్యారు . justice delayed is justice denied అని ఇంగ్లీష్ లో ఓ కొటేషన్ ఉంది . సాయికృష్ణ విషయంలో జరిగింది ఇదే . పోలీసులు తన కొడుకును చంపేసి ఉంటే కనీసం బూడిద అయినా ఇవ్వండి ..బతికుంటే తిరిగి తనకి అప్పగించాల్సిందిగా కనిపించిన వాళ్లతో చెప్పుకుని కన్నీరుమున్నీరు అవుతుంది . ఈరోజుకి అతడు బతికున్నాడో లేడో తెలీదు . పనిలో పనిగా సోషల్ మీడియాలో కొందరు అతడి నేరాల చిట్టా ప్రస్తావిస్తున్నారు . అతడి నేరాలకు ఏడేళ్లు శిక్ష వేయాలా ? యావజ్జీవం వేయాలా ? ఉరిశిక్ష వేయాలా ? అనే నిర్ణయాన్ని విచారణ చేసే న్యాయస్థానాలు తీసుకుంటాయి . ముంబై తాజ్ హోటల్లో అన్నెంపున్నెం ఎరుగని టూరిస్టులని అందరూ చూస్తుండగానే పిట్టల్లా కాల్చిచంపిన కసబ్ ని కూడా తీహార్ జైల్లో ఉంచి ఇడ్లి వడ కాఫీ ఇచ్చి విచారణ చేసారు . ఒక వ్యక్తి పోలీసుల చేతికి చిక్కి కనిపించకుండా పోయి నలభై రోజులు అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదంటే లోపం ఎవరిది ? ప్రశ్నించే గొంతులు ఏవి ? పోరాటం చేసే నాయకత్వం ఏది ?
ఇప్పుడు మళ్ళీ వంగవీటి మోహన రంగా నాయకత్వం విషయానికి వద్దాం .
షుమారు నాలుగు దశాబ్దాల క్రితం విజయవాడ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ లో ఓ రిక్షా కార్మికుడు మరణించాడు . పోలీసులు అతడి డెడ్ బాడీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హడావుడిగా పోస్టుమార్టం జరిపించి శవాన్ని భార్యకు అప్పగించి త్వరగా అక్కడ్నుంచి తీసుకెళ్లిపోమని చెప్పారు .
కానీ ఆమె రంగన్న వస్తే కానీ తన భర్త శవాన్ని అక్కడ్నుంచి కదిలించేది లేదని కూర్చుంది . ఆ సమయంలో వంగవీటి మోహన రంగా హైద్రాబాదులో ఉన్నారు . విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన కారులో బయలుదేరి విజయవాడ ప్రభుత్వాసుపత్రి చేరుకున్నారు . దాంతో పోలీసుల్లో టెన్షన్ పెరిగిపోయింది .
ముందు రంగా నడుస్తుండగా వందలాది రిక్షా కార్మికులు వెంటరాగా రిక్షా కార్మికుడి శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు . అయితే హఠాత్తుగా ఊరేగింపు హోమ్ మినిస్టర్ ఉన్న స్టేడియం వైపు మళ్లింది . వెళ్ళటానికి వీల్లేదన్నారు పోలీసులు .. వెళ్లి తీరతాను అన్నారు వంగవీటి . అనడమే కాదు వందలాది రిక్షా కార్మికులతో కలిసి స్టేడియం చేరుకొని లాకప్ డెత్ కేసులో హోమ్ మినిష్టర్ సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు . కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తామని , సంబంధిత పోలీసులను సస్పెండ్ చేస్తామని ఆయన హామీ ఇచ్చిన తర్వాతనే వంగవీటి అక్కడ్నుంచి కదిలారు . అంతేకాదు ఎమ్మెల్యే నిధుల్లోనుంచి రిక్షా కార్మికుడి కుటుంబానికి సాయం అందించారు .
రంగా ఒక పోరాటం
80 వ దశకంలో పోరాటమే ఊపిరిగా వంగవీటి చేసిన ఉద్యమాలు ఆనాటి ప్రజలకు తెలుసు . బడుగు బలహీన వర్గాలపై జరిగే అరాచకాలను , అన్యాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి ప్రశ్నించే మొదటి గొంతు వంగవీటిది అయ్యేది . విజయవాడలోనే కాదు .. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ ధైర్యంగా ముందుకొచ్చి నిలబడే మొదటి వ్యక్తి మోహన రంగా .
ఒక బక్కపల్చని వ్యక్తి రాజీలేని పోరాటంతో బలమైన ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు . ఆనాడు చేసిన పోరాటాలే వంగవీటి రంగాను జననాయకుడిగా చేసాయి . ఆయన మరణించి 38 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అభిమానులు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని ఊరువాడా విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్నారు .
ఇక ప్రస్తుతానికి వస్తే ఒక్క సాయికృష్ణ విషయంలోనే కాదు .. గత కొన్నేళ్లుగా బడుగు , బలహీన వర్గాల మీద జరిగే అన్యాయాల మీద , ఇంకెన్నో విషయాల మీద ధైర్యంగా ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతు లేదు .. పోరాటం చేసే నాయకత్వం లేదు . చాలామంది పేపర్ పులుల మాదిరి తయారయ్యారు . మీడియాలో ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు . వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే రియల్ టైగర్ ఏడి ? నమ్ముకున్న ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా కల్పించే నాయకుడేడి ? వంగవీటి జయంతి , వర్థంతి లకు విగ్రహాలకు దండలు వేసి ఆయన్ని ఓన్ చేసుకోవాలని అన్ని పార్టీల నాయకులు ప్రయత్నించడం మినహా రంగా ఆశయాలను కొనసాగించే పటిష్టమైన నాయకత్వం ఏది ? రంగా పేరు చెప్పుకుని కొంతమంది నాయకులు బాగుపడ్డారు అనేది కాదనలేని సత్యం . వాళ్ళ సంగతి అలా ఉంచితే నమ్ముకున్న నిజమైన అభిమానులు మాత్రం ఇప్పటికీ రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు . ప్రస్తుతం వాళ్ళకి కావాల్సిందల్లా వంగవీటి తరహా నాయకత్వం .. వంగవీటి తరహా పోరాట స్ఫూర్తి .. వంగవీటి తరహా భరోసా .
అందుకే వంగవీటి మోహన రంగా లేని లోటు తెలుస్తుంది అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు .
