SIR ప్రక్రియలో దొర్లిన అవకతవకలపై విచారణ జరపాలని..CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్దికాలంగా కాంగ్రెస్ పార్టీ అధినేత.. లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ లీడర్ అయిన రాహుల్ గాంధీ (Rahul Gandhi Lop) ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఆయన నేతృత్వంలో జరిగిన నిరసనలు వేరు.. ఈరోజు జరిగిన నిరసన కార్యక్రమం వేరు.
గతంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదంతో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బాపూ ఘాట్ వద్దకు వెళ్లి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియచేయడం అయిపోయింది. తర్వాత ఇండియా కూటమి నేతలను వెంట పెట్టుకుని రాష్ట్రపతిని కలిసి SIR అవకతవకల మీద విచారణ జరిపించాలని వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది.

ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు జరిపే పద్ధతులు ఇలాగే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలు మినహా ఎవరికీ ఆక్షేపణలు ఉండవు. అయితే అదే దూకుడులో SIR అవకతవకల మీద విచారణ జరపాలని సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ కి ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ లేఖ పంపించడం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.
ప్రభుత్వ కార్యక్రమాల్లో కానివ్వండి.. ప్రభుత్వ వ్యవస్థలలో కానివ్వండి.. రాజ్యాంగబద్ధ సంస్థలలో కానివ్వండి అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు భావిస్తే సదరు అంశాలను చట్ట సభల్లో చర్చకు తీసుకురావచ్చు.. లేదా గవర్నర్ కానీ రాష్ట్రపతికి గానీ విజ్ఞాపనలు అందచేయవచ్చు.. ఇదీ కాకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.
వీటిలో రాహుల్ గాంధీ మొదట చెప్పిన మార్గాలను ఇప్పటికే పాటించారు.. ఇక ఆయన చేతిలో మిగిలింది న్యాయస్థానాలను ఆశ్రయించడం. న్యాయస్థానాలను ఆశ్రయించడం అంటే కేవలం న్యాయ ప్రక్రియలో అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా పిటిషన్ వేయడమే.
కానీ SIR అవకతవకలపై విచారణ జరిపించాలని CJI కి విజ్ఞాపన పత్రం అందచేయడం కోసం ఆయన అపాయింట్మెంట్ కోరుతూ లేఖ పంపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచింది. బహుశా ఒక రాజకీయ పార్టీ CJI ని నేరుగా కలిసి విజ్ఞాపన అందచేయాలని అనుకోవడం ఇదే మొదటిసారి అనుకుంటా.
అందుకే ఈ అంశం మీద CJI వెంటనే స్పందించారు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదులు సమర్పించే సంప్రదాయం ఇప్పటివరకు లేదని.. ఏవైనా ఫిర్యాదులు ఉంటే న్యాయ ప్రక్రియకు లోబడి న్యాయస్థానంలో పిటిషన్ వేయడం ద్వారా కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చని ఆయన చెప్పారు.
అయినా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కూటమి నేతలు సుప్రీమ్ కోర్ట్ మార్చ్ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే CJI చెప్పినట్టు నేరుగా ఆయన్ని కలవకుండా ర్యాలీగా వెళ్ళి సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.
ఇది కొంతవరకు పర్లేదు కానీ ఇలాంటి కొత్త సాంప్రదాయాలకు అనుమతులు ఇస్తే ముందుముందు ప్రతి రాజకీయ పార్టీ ర్యాలీగా సుప్రీమ్ కోర్టుకు వెళ్లి పిటిషన్లు వేయడం మొదలు పెడతారు. కోర్టులో పిటిషన్ వేయడం కన్నా ర్యాలీ ద్వారా తమకు వచ్చే మీడియా కవరేజ్ మీదనే రాజకీయ పార్టీలు ఎక్కువగా దృష్టి పెడతాయి.
దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద రాజకీయాల ప్రభావం పడే అవకాశం ఉండటంతో పాటు న్యాయ వ్యవస్థల మీద ఉన్న గౌరవం పలుచన అయ్యే అవకాశం కూడా ఉంది.
సరే.. ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కాబట్టి సరిపోయింది.. అదే ఇదే అవకాశాన్ని అదునుగా తీసుకుని అసాంఘిక శక్తులు సుప్రీమ్ కోర్ట్ ప్రాంగణంలోకి జొరబడి విధ్వంసం సృష్టించి ఉంటే న్యాయ వ్యవస్థ గౌరవం ఏమైపోయి ఉండేది?
కోర్టులో పిటిషన్ వేయడానికి ప్రతి పౌరుడికీ హక్కు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇలా లక్షలాదిమందితో ర్యాలీగా వెళ్ళి పిటిషన్ వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు.
అక్టోబర్ 10 న ఢిల్లీలో CJP చేసిన ఆందోళనలను పక్కా ప్లాన్ ప్రకారం కట్టడి చేసిన ఢిల్లీ పోలీసులు ఈ రోజు కూటమి నేతలకు సుప్రీమ్ కోర్ట్ వరకు మార్చ్ చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారు? ఈ రోజు జరిగిన సుప్రీమ్ కోర్ట్ మార్చ్ మీద అత్యున్నత న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
అయితే ఈ రోజు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు సుప్రీమ్ కోర్టు వరకు నిర్వహించిన ర్యాలీని నేషనల్ న్యూస్ ఛానల్స్ లో చూసిన తర్వాత పరిశీలనలోకి వచ్చిన కొన్ని అంశాలు!
బస్ లో బయలుదేరిన నేతలు
ఇండియా కూటమి నేతలు ఈ రోజు సుప్రీమ్ కోర్ట్ వరకు తలపెట్టిన ర్యాలీని యథాప్రకారం బస్ లో బయలుదేరడం ద్వారానే మొదలుపెట్టారు. అయితే ఇప్పటిదాకా విడిగా ఆందోళనలు చేస్తున్న యాక్టివిస్ట్ నేహా బోరా ఈసారి ఇండియా కూటమి ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఆమె కూడా ప్రియాంక గాంధీ తో కలిసి బస్ లో బయలుదేరారు.
మూడు విధాలుగా సాగిన ర్యాలీ
బస్ లో బయలుదేరిన నేతలు కొంతదూరం వెళ్లాక బస్ దిగి నడవడం మొదలుపెట్టడంతో ఒక్కసారిగా జనం తోసుకు వచ్చేశారు.బహుశా బస్ లో ఉండటం వల్ల జనానికి కనిపించడం లేదని భావించి నేతలు పాదయాత్ర మొదలు పెట్టి ఉంటారు. ఇక మూడో ఫేజ్ లో నేతలు పాదయాత్ర ఆపి ఓపెన్ టాప్ వ్యాన్ ఎక్కి ర్యాలీ కంటిన్యూ చేశారు.
భద్రతా వైఫల్యం
రాహుల్ గాంధీ..ప్రియాంక.. నేహా బోరాలు బస్ దిగి పాదయాత్ర చేయడం మొదలు పెట్టడంతో కార్యకర్తలు.. అభిమానులు ఒక్కసారిగా తీసుకుని ముందుకు వచ్చి రాహుల్ గాంధీ మీద పడిపోయారు. సాధారణంగా రాహుల్ గాంధీకి మూడంచెల భద్రత ఉంటుంది. ఎవరైనా రాహుల్ గాంధీ సమీపానికి రావాలంటే ఈ మూడు అంచెల భద్రతా వలయాన్ని చేధించుకుని రావాలి. ఇదిలా ఉండగా జనం రాహుల్ దగ్గరకి రాకుండా కనీసం రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్టు లేరు.

రాహుల్ అసహనం
జనంలోకి రావడం రాహుల్ కి ఇదే మొదటిసారి కాదు.. జోడో యాత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయనకు ప్రజలతోనే పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. కార్యకర్తలు ఎంతమంది మీదికి వచ్చినా చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి రాహుల్ గాంధీ ఈ రోజు మాత్రం ఎందుకో సహనం కోల్పోయినట్టు కనిపించింది.
పాదయాత్ర గా రాహుల్ గాంధీ ముందుకు కదులుతున్న సమయంలో కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేయడానికి ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావడంతో సహనం కోల్పోయిన రాహుల్ గాంధీ ఆగ్రహంతో వారిని వెనక్కి నెట్టేయడం కనిపించింది.
కొరవడిన సమన్వయం
పాదయాత్రలో కార్యకర్తలు తోసుకు రావడంతో నాయకులు ప్లాన్ మార్చి ఓపెన్ టాప్ వ్యాన్ తెప్పించి అందులో ఎక్కారు.. అయితే ఇక్కడా గందరగోళం ఏర్పడింది. వ్యాన్ ఎక్కడానికి నాయకులు పోటీ పడటంతో ఎవరు ఎక్కుతున్నారో తెలియకుండా పోయింది.. ఈ సందట్లో ఓ కార్యకర్త కూడా వ్యాన్ ఎక్కేసి రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చేశాడు. అది గమనించిన సెక్యూరిటీ అతడ్ని కిందికి తోసేశారు.
ఓపెన్ టాప్ వ్యాన్ లో ఎవరు ఎక్కాలనే విషయంలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరు పడితే వాళ్ళు ఎక్కేసారు. దాంతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అతి ప్రయత్నం మీద వ్యాన్ ఎక్కగాలిగారు.
రాహుల్ డామినేషన్
పేరుకి ఇండియా కూటమి ర్యాలీ అయినా ఇవాల్టి నిరసన కార్యక్రమంలో మొదటినుంచి చివరి వరకు రాహుల్ గాంధీ డామినేషన్ కనిపించింది. అఖిలేష్ యాదవ్, తేజస్విని యాదవ్ , సీపీఐ, సిపిఎమ్ నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నా వాళ్ళు కేవలం బ్యాక్ బెంచిలకు మాత్రమే పరిమితం అయ్యారు.
మొత్తం కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ లీడ్ తీసుకుని ముందుకు నడిపించడం కనిపించింది.. ఆయన తర్వాత ప్రియాంక గాంధీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
మెట్రో స్టేషన్లు బంద్
అక్టోబర్ 10 CJP ఆందోళన సమయంలో మెట్రో సర్వీసులను బంద్ చేయించడం మంచి ఫలితాలు ఇవ్వడంతో పోలీసులు ఈ రోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు కొన్ని మెట్రో స్టేషన్లు బంద్ చేయించారు.
కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన ఢిల్లీ
పోలీసులు మెట్రో సర్వీసులను బంద్ చేయించినప్పటికీ కూటమి పార్టీల కార్యకర్తలతో ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోయాయి. దీంతో ర్యాలీ నెమ్మదిగా ముందుకు సాగింది.
రాహుల్ తరపున పిటిషన్
అనుకున్న టైముకి ర్యాలీ సుప్రీమ్ కోర్టుకు చేరుకోకపోవడంతో రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేకపోయారు. దాంతో రాహుల్ తరపున ఆయన న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ తో పాటు మొత్తం 11 మంది పిటిషన్ దాఖలు చేయగా.. ప్రతివాదిగా CEC పేరుని నమోదు చేశారు. ఈ పిటిషన్లో ప్రభుత్వ పెద్దలను ఎవరినీ ప్రతివాదులుగా చేర్చలేదు.
పోటాపోటీ ప్రెస్ మీట్లు
ఒక పక్కన ఈ ర్యాలీ కొనసాగుతుండగానే బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ తీరును తప్పు పట్టారు. అదే సమయంలో CJP తరపున సౌరవ్ దాస్ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ తీరును తప్పు పట్టారు.
ముగింపు
మొత్తానికి ఇవాళ్టి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఒక విషయం అర్థమౌతుంది. కూటమి నేతల అసలు ఉద్దేశ్యం కేవలం సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేయడం కాదు.. తమ ఆందోళనను దేశం యావత్తు దృష్టికి తీసుకు రావడం అసలు ప్లాన్. ఆ ప్లాన్ లో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ వీధుల్లో ఆయన నడిపిన డ్రామా జాతీయ.. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. తద్వారా SIR అంశంలో రాహుల్ గాంధీ తన వాయిస్ ను మరింత బలంగా వినిపించగలిగారు.
