రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ 2 మూవీ (Jailer 2 Movie) ఈరోజు (15-10-2026) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. గతంలో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 తీసారు. 76 ఏళ్ల వయసులో కూడా రజనీ లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని ఈ సినిమా చూస్తే అర్థమౌతుంది. ఇప్పటికీ అదే నడక.. అదే స్టైల్.. తలైవా కనిపిస్తే చాలు థియేటర్ ఈలలుతో మార్మోగిపోయింది.
ఇప్పుడు జైలర్ 2 మూవీ ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
ఈ సినిమా ప్రారంభంలో జైలర్ పార్ట్ వన్ మూవీ హైలెట్స్ ప్లే చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే జైలర్ మొదటి భాగం చూడనివాళ్ళకి సీక్వెల్ చూసేటప్పుడు ఒరిజినల్ స్టోరీ ఏంటనేది తెలియడం ముఖ్యం.
సరే, ఇప్పుడు జైలర్ 2 కథ విషయానికి వస్తే , తన స్నేహితుడు వర్మని చంపిన జైలర్ ఆచూకీ కోసం సూరజ్ వెంజరమూడు వెతుకుతుండటంతో సినిమా స్టార్ట్ అవుతుంది.
మరోపక్క రిటైర్డ్ జైలర్ టైగర్ వేలు ముత్తు (రజనీకాంత్) ఒక సూపర్ మార్కెట్లో సూపర్వైజర్ గా పనిచేస్తూ ప్రశాంత జీవనం గడుపుతుంటాడు. అయితే వర్మ స్నేహితుడు దిలీప్ ((సూరజ్ వెంజరమూడు) తన కోసం వెతుకుతున్నాడని గ్రహించిన జైలర్.. మూర్తి అనే వ్యక్తి ద్వారా సూరజ్ ను కలిసి వార్నింగ్ ఇస్తాడు. తన టార్గెట్ అతడు కాదని.. అతడి బాస్ బోధి కల్పక్ ( ఎస్ జే సూర్య ) ఆచూకీ చెబితే తనని వదిలేస్తానని చెప్తాడు. అందుకు దిలీప్ ఒప్పుకుంటాడు.
ఈ విషయం తెలుసుకున్న బోధి నేరుగా జైలర్ వద్దకు వచ్చి తనకు ద్రోహం చేయాలని చూసిన దిలీప్ ను చంపేసానని.. అంతేకాకుండా మాండ్య లో ఉంటున్న జైలర్ స్నేహితుడు నరసింహ ( శివరాజ్ కుమార్ ) ఫ్యామిలీని కిడ్నాప్ చేసినట్టు చెప్తాడు. వాళ్ళని విడిచి పెట్టాలంటే జైలర్ దగ్గరున్న మూడు విగ్రహాల కంటైనర్లు తనకు అప్పగించాలని కండిషన్ పెడతాడు.
అప్పుడు జైలర్ ఏం చేస్తాడు? తన స్నేహితుడి ఫ్యామిలీని సూర్య చెర నుంచి విడిపిస్తాడా? ఈ క్రమంలో జైలర్ కు అతని పాత స్నేహితులు ఏ విధంగా సాయం చేస్తారు? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
ఇప్పుడు రజనీ కాంత్ కి 76 ఏళ్ల వయసు.. ఈ వయసులో కూడా రజనీ గ్రేస్ ఏ మాత్రం తగ్గకుండా.. ఆయన ఇమేజ్ ఎక్కడా తగ్గకుండా..అభిమానులు తలైవా నుంచి ఎలాంటి నటన కోరుకుంటారో అలాంటి నటనను ఆయన నుంచి రాబట్టుకోవడంలో దర్శకుడు విజయం సాధించారు.
పిక్చర్ స్పీక్స్ అనే ఇంగ్లీష్ కొటేషన్ మాదిరి ఈ సినిమాకి రజనీ కటౌట్ స్పీక్స్ అనే కొటేషన్ చెప్పుకోవచ్చు. రజనీ కనిపిస్తే చాలు ఈలలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమాలో రజనీకి ఫైట్స్ ఉండవు.. సాంగ్స్ ఉండవు.. కానీ ఫైట్స్ వెనక రజినీ ఉంటాడు.. సాంగ్స్ వెనక రజినీ ఉంటాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే మిగిలినవాళ్ళు ఎంతమంది ఉన్నా రజనీ లేకపోతే ఈ సినిమాకి ఆ జోష్ రాదు.. ఆ పూనకాలు రావు. ఎందుకంటే జైలర్ లో నటించిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి హేమాహేమీలకు తోడు జైలర్ 2 లో మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ డమ్ ఉన్న నటులు కూడా యాడ్ అయ్యారు.
అయినా సరే తలైవా తనదైన స్టైల్ తో అందరినీ డామినేట్ చేసేశారు. ఇదిలా ఉండగా మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి సీనియర్ నటులు కూడా ఎటువంటి ఈగోలకు పోకుండా తలైవాకి గౌరవం ఇస్తూ చక్కటి సపోర్టింగ్ క్యారక్టర్లు చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ రివ్యూలో రజనీ కాంత్ ను ఎక్కువగా పొగుడుతున్నట్టు అనిపిస్తుంది కదా? సినిమా చూస్తే రజనీలో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదని మీరూ ఒప్పుకుంటారు. కొంతమంది హీరోల నటన చూస్తే మొనాటనీ వస్తుంది. కానీ రజనీ అలా కాదు.. ఎన్నిసార్లు చూసినా ఆ స్టైల్ ను మరోసారి చూడాలనిపిస్తుంది. అదే రజనీ మ్యాజిక్.
అయితే ఈ సినిమా ఫక్తు కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది.. అందులో సందేహమే లేదు. రజనీ కళ్ళజోడు తీస్తే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయి.. రజనీ కళ్ళజోడు పెట్టుకుంటే గాల్లో బాంబులు పేలుతాయి. ఈ సినిమాలో ఇటువంటి ఎలివేషన్లకు కొదవ లేదు.. కానీ.. రజనీ కాంత్ కు ఆ మాత్రం ఎలివేషన్లు ఇవ్వకపోతే ఫాన్స్ చూడలేరు.

అసలే తలైవా ఎలివేషన్లు భారీగా ఉంటాయి.. దానికి అనిరుధ్ బిజిఎం తోడైతే ఎలా ఉంటుంది? టాప్ లేచిపొద్ది.. అందుకే ఈ సినిమాకి హీరో ఒకరు కాదు..ఇద్దరు.. ఒకరు తెర మీద తన స్టైల్ తో మ్యాజిక్ చేసిన రజనీ అయితే.. ఆ రజనీ మ్యాజిక్ ను తన మ్యూజిక్ తో ఇంకో మెట్టు పైన నిలిపిన అనిరుధ్ రెండో హీరో అవుతాడు.
మళ్ళీ సినిమా విషయానికి వస్తే మొదటి గంట వరకు దర్శకుడు అసలు స్టోరీలోకి వెళ్లకుండా యోగిబాబు ..మూర్తి పాత్రల ద్వారా కామెడీ ట్రాక్ రన్ చేస్తూ సాగతీత సన్నివేశాలు పేర్చుకుంటూ పోయాడు. దాంతో స్టోరీ ఏంటో అర్థం కాక ఆడియన్స్ కొంత కన్ఫ్యూజ్ అవుతారు.
జైలర్ సూపర్ మార్కెట్లో పనిచేయడం దగ్గర్నుంచి మూర్తి దగ్గర కారు డ్రైవర్ గా పనిచేయడం వరకు కథనం ముందుకు వెళ్తుంది కానీ కథ వెళ్ళదు. యోగి బాబు.. మూర్తి క్యారెక్టర్లు కథనాన్ని సాగతీయడానికి.. కామెడీ ట్రాక్ కి పనికి వస్తాయే కానీ కథకు అవసరం లేదు.
ఎప్పుడైతే దిలీప్ ( సూరజ్ వెంజరమూడు ) పాత్రతో జైలర్ కనెక్ట్ అవుతాడో అప్పట్నుంచి జైలర్ 2 కథ మొదలౌతుంది. సూర్య ఎంట్రీ కథకు కొనసాగింపు అవుతుంది. రజనీ కాంత్.. సూర్యల మధ్య జరిగే మైండ్ గేమ్ థ్రిల్ పంచుతుంది.. ఇద్దరి మధ్య పోటాపోటీగా నడిచే యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. కాకపోతే వెంట వెంటనే వచ్చే పరస్పర కిడ్నాప్ ల సీన్లు సాగతీతలా అనిపిస్తుంది. ఇక పాటల్లో సూరజ్ వింజరమూడు డెన్ లో పూర్ణిమ చేసిన సాంగ్ బాగుంది.
ఇక ప్రీ క్లైమాక్సులో హృతిక్ రోషన్ ను దింపి చిత్ర దర్శకుడు .. బీజీఎమ్ తో సంగీత దర్శకుడు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. జైలర్ మాదిరే 2 లో దర్శకుడు గట్టి క్లైమాక్స్ ఎంచుకున్నాడు. కాకపోతే లాస్టులో విజయ సేతుపతి ని దింపి జైలర్ పార్ట్ 3 కూడా ఉండే అవకాశం ఉందని దర్శకుడు హింట్ ఇచ్చాడు.
ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో హేమాహేమీ నటులున్నా రజనీ కాంత్ వన్ మ్యాన్ ఆర్మీ మాదిరి సినిమాని తన భుజాన వేసుకుని నడిపించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే రొటీన్ కమ్మర్షియల్ సినిమాల మాదిరి రజనీ కాంత్.. సూర్య ల మధ్య కిందామీదా పడి కొట్టుకునే ఫైట్ సీన్లు ఏవీ ఉండవు.. జస్ట్ రజనీ అలా నుంచుంటాడు.. ఫైట్ సీన్లు రన్ అవుతుంటాయి. అలాంటి సీన్లే ఈ సినిమాను మరో మెట్టు పైన నిలిపాయి.
మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లలో శివ రాజ్ కుమార్ పాత్రకు కొంచెం స్కోప్ దక్కింది.. మిగిలిన ఇద్దరూ నామమాత్రంగా కనిపిస్తారు.. అలాగే వీల్ చైర్లో కూర్చునే మిథున్ చక్రవర్తి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాంత పాత్రలో విద్యాబాలన్ నటన బాగుంది. రమ్యకృష్ణ నటన కూడా బాగుంది కానీ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఆమె పాత్రకు స్కోప్ తగ్గింది.
సాంకేతికత
ముందే చెప్పినట్టు జైలర్ 2 మూవీలో రజనీకాంత్ మొదటి హీరో అయితే అదిరిపోయే బీజీఎమ్ తో థియేటర్ టాపులు లేపేసిన అనిరుధ్ రెండో హీరో అవుతాడు. రజనీ ఎలివేషన్ కు అనిరుధ్ బీజీఎమ్ తోడై ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తాయి. విజయ్ కార్తీక్ కన్నన్ ఫోటోగ్రఫీ కూడా బాగుంది. ఇక నిర్మాణ విలువల గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకోసం పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపిస్తుంది. చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా తీశారనిపిస్తుంది.
విశ్లేషణ
జైలర్ 2 పక్కా కమర్షియల్ సినిమా. లాజిక్కులు కోసం ..కథ కోసం వెతుక్కునేవారికి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కానీ రజనీ మార్క్ నటన చూడాలనుకునేవారికి.. రజనీ స్టైల్ చూడాలనుకునేవారికి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ఊర మాస్ జాతర.. అందుకే సినిమా మీద పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూడండి.. డిజప్పాయింట్ అయితే మాత్రం కారు. రజనీ స్టైల్ ఎలివేషన్లు చూడాలనుకునేవారు .. అనిరుధ్ స్టైల్ బీజీఎమ్ వినాలనుకునేవారు ఓటిటి వరకు ఆగకుండా థియేటర్లోనే చూడండి.. థ్రిల్ ఫీల్ అవుతారు.
నటీనటులు :రజనీకాంత్ , సూరజ్ వింజరమూడు , ఎస్ జె సూర్య , మిథున్ చక్రవర్తి , హృతిక్ రోషన్ , విద్యాబాలన్ , రమ్యకృష్ణ , మోహన్ లాల్ , శివరాజ్ కుమార్ , జాకీ ష్రాఫ్ తదితరులు
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
దర్శకత్వం : నెల్సన్
విడుదల : 15 -10 -2026
రేటింగ్ : 3 /5
