గతంలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ పిలుపు సందర్భంగా జరిగిన అల్లర్ల అనుభవాల నుంచి ఢిల్లీ పోలీసులు పాఠం నేర్చుకున్నట్టున్నారు. అందుకే ఈ సారి అటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే పక్కా ప్లానింగ్ తో CJP ఆందోళనను కట్టడి చేసి హాట్సాఫ్ ఢిల్లీ పోలీస్ అనిపించుకున్నారు.
మూడు రోజుల ముందు నుంచే ప్లాన్
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 10 న ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం పోలీసుల అనుమతి కోరుతూ మూడురోజుల ముందే CJP కోర్ టీమ్ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు సమర్పించారు. గత అనుభవాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు CJP నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ విషయం వెంటనే వారికి చెప్పలేదు. చెప్తే వాళ్ళు కోర్టుకు పోతారని కూడా ఢిల్లీ పోలీసులకు తెలుసు. అందుకే ఈ సారి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అక్టోబర్ 10 న ఢిల్లీ మెట్రోతో పాటు చుట్టుపక్కల నుంచి ఢిల్లీ వచ్చే రైళ్ల సర్వీసులను కాన్సిల్ చేయించారు. బట్ అదే సమయంలో క్రితం రోజు వరకు మెట్రో సర్వీసులు బంద్ అవుతాయనే విషయంలో క్లారిటీ ఇవ్వకుండా కావాలనే తొక్కి పట్టి ఉంచారు. ఎందుకంటే మెట్రో సర్వీసులు ఖచ్చితంగా బంద్ అవుతాయని తెలిస్తే CJP కార్యకర్తలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని ఢిల్లీ పోలీసులకు తెలుసు. అందుకే ఆ విషయంలో కూడా పక్కా ప్లానింగ్ తో వ్యవహరించారు.
మరోపక్క ట్రాన్స్పోర్ట్ విషయాన్ని CJP నేతలు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అందుకే బెంగుళూరులో ఏర్పాటు చేసిన సమావేశం మీద దృష్టి పెట్టి అందరూ అటుపోయారు. ఎప్పుడైతే CJP నేతల అటెన్షన్ డైవర్ట్ అయ్యిందో అప్పుడు ఢిల్లీ పోలీసులు చకచకా పావులు కదిపారు.
200 కంపెనీలకు పైన CRPF దళాలు
గతంలో ఢిల్లీలో జరిగిన CJP పార్లమెంట్ మార్చ్ ఆందోళనలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో స్థానికంగానే కాకుండా ఢిల్లీ బోర్డర్ ఊళ్ళ నుంచి విద్యార్ధులు.. యువకులు తరలి వచ్చారు. ముందు రోజు రాత్రి వరకు జంతర్ మంతర్ వద్ద గుమి గూడిన CJP కార్యకర్తలు పట్టుమని వందకు మించి లేకపోవడంతో అదనపు బలగాల అవసరం లేదని భావించి ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం చేశారు.
కానీ మర్నాడు ఉదయానికల్లా ఢిల్లీలో పరిస్థితులు మారిపోయాయి. పోలీసులు ఊహించని విధంగా చీమల దండులా కాక్రోచ్ దండులు ఒకేసారి ఢిల్లీ వీధులను ముంచెత్తాయి. దాంతో వారిని కట్టడి చేయడానికి లోకల్ ఫోర్స్ సరిపోలేదు.
అందుకే ఈ సారి 200 కంపెనీలకు పైగా CRPF దళాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్.. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. ఇంటిలిజెన్స్ పోలీస్.. క్రైమ్ బ్రాంచ్ పోలీస్.. ఇలా దాదాపు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అదనపు బలగాలను రప్పించుకున్నారు.
హోటళ్లను జల్లెడ పట్టారు
ఢిల్లీ పోలీస్ అంతటితో ఆగలేదు. ఢిల్లీతో పాటు బోర్డర్ ఊళ్లలోని హోటళ్లు.. లాడ్జీలను జల్లెడ పట్టారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని లాడ్జీలు ఖాళీ చేయించి గ్రామాలకు పంపించేశారు. దీంతో ఢిల్లీలోని లాడ్జీలు అన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు ఈ పనులన్నీ ఒక రోజు ముందుగానే పూర్తి చేశారు.
ఇంటర్నెట్ బంద్
నిమిషాలు.. గంటల్లో వందలాది మంది CJP కార్యకర్తలు జంతర్ మంతర్ చేరుకోవడం వెనుక ఇంటర్నెట్ ప్రధాన వారధిగా పనిచేసిందని ఢిల్లీ పోలీసులు పసిగట్టారు. ఒక ప్రత్యేక యాప్ ద్వారా CJP కార్యకర్తలు ఎప్పటికప్పుడు టచ్ లో ఉండటమే కాకుండా సమాచార మార్పిడి క్షణాల్లో జరిగిపోతుందని గమనించారు.
అందుకే ఒక రోజు ముందు నుంచే ఢిల్లీలోని కొన్ని కీలక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. దీనికి తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముఖ్యమైన నేతల మొబైల్ ట్రాక్ రికార్డ్ ను మానిటర్ చేశారు. దానివల్ల వారి కదలికల గురించి పోలీసులకు ముందుగానే సమాచారం అందింది.

అందుకే యూ ట్యూబర్ ధృవ్ రాతీ.. అభిజిత్ , రాంకా వంటి CJP కోర్ టీమ్ ను సకాలంలో డిటైన్ చేయగలిగారు. అభిజిత్ అండ్ టీమ్ ను ఢిల్లీ పోలీసులు ఏకంగా విమానంలోనే అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.
ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద నిఘా
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బంద్ చేయించిన ఢిల్లీ పోలీసులు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా నిఘా పెట్టారు. లోకల్ క్యాబ్ లు.. ఆటోలతో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ప్రతి వాహనాన్ని ఆపి చెక్ చేశారు. అలా చెక్ చేస్తున్న సమయంలోనే పోలీసులకు కొందరు CJP కార్యకర్తలు దొరికారు.
ముఖ్యమైన కూడళ్లు మూసివేత
భారీగా జనం గుమిగూడే అవకాశం ఉన్న కన్నాట్ ప్లేస్ వంటి కొన్ని ముఖ్యమైన కూడళ్లను ఢిల్లీ పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి బ్లాక్ చేసేసారు. CEC ప్రధాన కార్యాలయానికి వెళ్లే అన్ని దారులను ముందుగానే మూసేసారు.
లిక్కర్ షాపుల బంద్
ఆందోళనలతో అసాంఘిక శక్తులు జొరబడకుండా పోలీసులు ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గత జులై నెలలో జరిగిన అందోళనలలో కనిపించిన కొంతమంది రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో లిక్కర్ షాపులు బంద్ చేయించారు.
మీడియాకి స్వేచ్ఛ ఇచ్చిన పోలీసులు
నిన్నటి ఆందోళనలో ఢిల్లీ వీధుల్లో పోలీసు బలగాలు ఎంత పెద్దఎత్తున కనిపించాయో..దేశ..విదేశీ మీడియా ప్రతినిధులు కూడా అంతే పెద్ద సంఖ్యలో కనిపించారు.ఆందోళనలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు ఢిల్లీ పోలీసులు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా తగినంత స్వేచ్ఛ ఇవ్వడం కనిపించింది.
ఇంటిలిజెన్స్ పోలీసులు
సాధారణ జనంలో కలిసిపోయిన ఇంటిలిజెన్స్ పోలీసులు ఆధునిక ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా కొంతమంది CJP కార్యకర్తలను గుర్తుపట్టి అదుపులోకి తీసుకున్నారు.
బాడీ కెమెరాలు
క్రితంసారి జరిగిన ఆందోళనల్లో పోలీసులు తమపై అక్రమంగా లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపిస్తూ కొంతమంది CJP కార్యకర్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ కేసు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తుంది.
అందుకే ఈ సారి అటువంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ఢిల్లీ పోలీసులు బాడీ కెమెరాలను తమ యూనిఫామ్ కు తగిలించుకున్నారు. దీంతో పోలీసుల చర్యలు ఎప్పటికప్పుడు లైవ్ లో రికార్డ్ అవుతుండటంతో ఈసారి పోలీసుల మీద ఆరోపణల వెల్లువ కూడా తగ్గింది. న్యాయస్థానాల నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పెర్ఫెక్ట్ గా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
సహనం ప్రదర్శించిన పోలీసులు
ఢిల్లీ ఆందోళనలను నేషనల్ న్యూస్ చానల్స్ లో చూసిన వాళ్ళకి గతంతో పోలిస్తే ఈసారి పోలీసుల సహనం స్పష్టంగా కనిపిస్తుంది. క్రితంసారి దొరికినవాళ్లని దొరికినట్టు లాఠీ లతో బాదిన పోలీసులు ఈసారి సాధ్యమైనంతవరకు లాఠీలకు పని చెప్పకుండా వాళ్ళని వ్యాన్ ఎక్కించడం కనిపించింది. అయితే అదే సమయంలో వ్యాన్ ఎక్కడానికి మొండికేసిన కొంతమందిని మాత్రం ఈడ్చుకెళ్లడం కూడా కనిపించింది.
ముగింపు
గత జులైలో CJP నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంలో చెలరేగిన అల్లర్లతో పోలిస్తే ఈసారి అక్కడక్కడా జరిగిన చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది అని చెప్పొచ్చు. ఢిల్లీ పోలీసులు ఇకముందు కూడా CJP నిరసనలను తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీ వ్యూహంతో వ్యవహరిస్తే ఆందోళనలు ప్రశాంతంగా ముగియడమే కాకుండా సాధారణ పౌరులు ఇబ్బంది పడకుండా ఉంటారు. అన్నట్టు నిన్నటి ఆందోళనల సమయంలోనే కారుల్లో .బైకుల్లో తమ కార్యాలయాలకు వెళ్తున్న సాధారణ పౌరులకు పోలీసులు దగ్గరుండి దారి ఇవ్వడం కూడా టీవీల్లో కనిపించింది.
ఇదిలా ఉండగా తాము అదుపులోకి తీసుకున్న CJP కోర్ టీమ్ ను ఢిల్లీ పోలీసులు ఈ ఉదయం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో హాజరుపరిచారు. కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో వారు విడుదల అయ్యారు. అయితే CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ మీద తమ పోరాటం కొనసాగుతుందని CJP చీఫ్ అభిజిత్ మీడియాతో చెప్పారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులు ముందుముందు ఇదేరకమైన వ్యూహంతో వ్యవహరిస్తే అసాంఘిక శక్తుల బెడద కూడా తగ్గుతుందని టీవీల్లో న్యూస్ కవరేజ్ చూసిన సాధారణ పౌరులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద ఈసారి ఢిల్లీ పోలీసులు పక్కా ప్లానింగ్ తో CJP ఆందోళనను కట్టడి చేయడంతో నెటిజన్లు హాట్సాఫ్ ఢిల్లీ పోలీస్ అంటున్నారు.
