Reporting Live Movie Review (OTT) – నేటి సమాజానికి ఇలాంటి జర్నలిస్టులు కావాలి !

Spread the love

పరిణితి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన రిపోర్టింగ్ లైవ్ సినిమా (Reporting Live Movie) అక్టోబర్ 9 , 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియో వెర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేసింది.

ఇసుక మాఫియా దందాను వెలికి తీసిన ఓ రిపోర్టర్ సాహస స్ట్రింగ్ ఆపరేషన్ కథే రిపోర్టింగ్ లైవ్ సినిమా అసలు కథ. ఇప్పుడు రిపోర్టింగ్ లైవ్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

అజాద్ భారతి న్యూస్ ఛానల్ లో సంధ్య (పరిణితి చోప్రా ) రిపోర్టర్ గానూ.. వినోద్ (దేవేన్ భోజనాని) కెమెరా మెన్ గానూ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ముందునుంచీ సంధ్యకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఇష్టం. ఆమె ఇష్టాలను కెమెరా మెన్ వినోద్ కూడా ప్రోత్సహిస్తుంటాడు.

ఇదిలా ఉండగా ఓ రోజు మహారాష్ట్రలోని విసర్గామ్ అనే గ్రామంలోని బ్రిడ్జి మీద నుంచి స్కూల్ బస్ వెళ్తుండగా అది కూలిపోయి 17 మంది స్కూల్ పిల్లలు మరణిస్తారు. ఈ న్యూస్ కవర్ చేయడానికి సంధ్య.. వినోద్ లు ఆ గ్రామానికి వెళ్తారు. గ్రామస్తులు మాత్రం గ్రహణం ప్రభావం వల్లనే తమ గ్రామానికి ఇలాంటి అరిష్టం జరిగిందని నమ్ముతారు.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి గారు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందచేసే విషయమై మాట్లాడుతుండగా శివ (అమోల్ పాలేకర్ ) అనే వృద్ధుడు తమ గ్రామంలో బ్రిడ్జి కూలిపోవడానికి గ్రహణం కారణం కాదని.. ఇసుక మాఫియా వల్లనే కూలిపోయిందని చెప్తాడు.

మంత్రి గానీ.. గ్రామస్తులు కానీ అతడి మాటలను పట్టించుకోరు.. కానీ అక్కడే ఉన్న సంధ్య మాత్రం ఇసుక మాఫియా దందా ను వెలికి తీయాలని నిర్ణయించుకుని శివని కలిసి ఇంటర్వ్యూ చేస్తుంది.

ఆ ఇంటర్వ్యూలో ఇసుక మాఫియా గురించి శివ ఏం చెప్తాడు? శివ చెప్పిన సమాచారం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన జర్నలిస్ట్ సంధ్యకు ఎలాంటి విషయాలు తెలుస్తాయి? ఇసుక మాఫియా వెనుక ఉన్న గోల్డెన్ స్కై గ్రూప్ అధినేత ఎవరు? సంధ్య ఇన్వెస్టిగేషన్ కి టీవీ ఛానల్ యాజమాన్యం ప్రోత్సాహం ఇస్తుందా? లేదా? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

రిపోర్టింగ్ లైవ్ సినిమా కోసం దర్శకుడు ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. అందుకే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా కనిపించవు.

సాధ్యమైనంత వరకు నేటి సమాజంలో జరుగుతున్న సైలెంట్ స్కాం ను ఉన్నది ఉన్నట్టు చూపడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సినిమాలో హీరోయిజం ఉంటుంది కానీ హీరో ఉండడు. రియల్ లైఫ్ లో ఒక లేడీ జర్నలిస్ట్ తన పరిధిలో ఎంతవరకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయగలదో అంతవరకే సినిమాలో ఆమె పాత్రను దర్శకుడు ప్రోజెక్ట్ చేశాడు.

అంతేకానీ ఒక లేడీ జర్నలిస్టుకు లేనిపోని శక్తులు తగిలించి నేల విడిచి సాము చేసేలా సినిమాటిక్ లిబర్టీతో ఆ పాత్ర స్వరూపాన్ని మార్చివేయలేదు. ఈ సినిమాలో ఆయుధాలు కనిపించవు.. పొట్టు పొట్టు కొట్టుకునే ఫైటింగులు ఉండవు. మొత్తం సినిమాని ఒక మీడియా జర్నలిస్ట్ కలం..ఒక కెమెరా మెన్ కెమెరా నడిపిస్తాయి.

ఒకప్పుడు జర్నలిస్టులు అంటే సమాజంలో చాలా గౌరవం ఉండేది.. కానీ ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు జర్నలిజం రంగంలోకి ప్రవేశించారో అప్పటినుంచి జర్నలిజం తన రూపు మార్చుకుని ఎర్నలిజం అయ్యింది. జర్నలిస్ట్ కాస్తా ఎర్నలిస్ట్ అయ్యాడు.

ప్రస్తుతం జర్నలిజం రంగంలో చాలావరకు ఒక్కో మీడియా సంస్థ ఒక్కో రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్న సంగతి తెలిసిందే. యధా యాజమాన్యం.. తథా జర్నలిస్ట్ అన్నట్టు తయారైంది పరిస్థితి. అలా అన్ని సంస్థలు.. జర్నలిస్టులు అందరూ అదే బాటలో ఉన్నారని అర్థం కాదు. కొంతమంది నిజాయితీపరులు కూడా ఉన్నారు. కానీ గతంతో పోలిస్తే జర్నలిజం రంగం కూడా కొంత బ్రష్టు పట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు కాసులకు అమ్ముడుపోయిన మీడియా సంస్థ యాజమాన్యం కోణంలోనూ.. నిఖార్సైన జర్నలిస్ట్ కోణంలోనూ కథ రాసుకుని తెరకెక్కించారు.

ఇసుక మాఫియా దందాను వెలికి తీసే ప్రయత్నంలో సంధ్య.. వినోద్ లు ఎటువంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కుంటారు? ఇసుక మాఫియా కి ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఎందుకు భయపడతాయి? అసలు సహజ వనరు అయిన ఇసుకను అక్రమంగా తవ్వి తీయడం వల్ల పర్యావరణానికి ఏర్పడే ముప్పు ఏంటి? అనే కోణంలో ఫస్టాఫ్ కథనం నడుస్తుంది.

ఇక సెకండాఫ్ వచ్చేసరికి కథలో సంఘర్షణ మొదలౌతుంది. సంధ్య.. వినోద్ ల మీద వృత్తి పరమైన ప్రెజర్ పెరగడం.. మేనేజ్మెంట్ కో ఆపరేషన్ లేకపోవడం.. ఫ్యామిలీకి బెదిరింపులు రావడం.. బెదిరింపులకు భయపడి వినోద్ కూడా ఈ ఆపరేషన్ నుంచి దూరం అవడం వంటి రొటీన్ ఫార్మాట్లో స్టోరీ రన్ అవడంతో కొంత బోర్ ఫీల్ వస్తుంది. ఇదే సమయంలో కథనంలో వేగం కూడా తగ్గడంతో మనల్ని పెద్దగా ఎంగేజ్ చేయదు.

తిరిగి ప్రీ క్లైమాక్స్ లో సంధ్య.. వినోద్ లు కలిసి సీనియర్ జర్నలిస్ట్ జేపీ సాయంతో ఇసుక మాఫియా దందా వెనుక ఆధారాలను సంపాదించడంతో కథనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

ఇక క్లైమాక్స్ సీన్ ను కూడా దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా సహజంగానే ముగించాడు. ఇంతా చేసి ఇలాంటి ముగింపు ఏంటా? అని ఒక క్షణం అనుకుంటాం. కానీ క్షణం తర్వాత నిజ జీవితంలో అలాంటి కథలకు అలాంటి ముగింపులే ఉంటాయన్న సత్యం గుర్తొచ్చి ఆగిపోతాం..నిజానికి ఆ ముగింపు మన హృదయాలను టచ్ చేస్తుంది.

ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా మంచిది.. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సబ్జెక్ట్ ను ధైర్యంగా తెర మీదకి తీసుకువచ్చాడు. పైకి కనిపించకపోయినా అంతర్లీనంగా రోజు రోజు కీ పర్యావరణ వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని కళ్ళకు కట్టాడు.

నదిలో ఉండాల్సిన ఇసుక కాంక్రీట్ జంగిల్ లోకి చేరుతుండటంతో ముందు ముందు నదీ జలాలకు.. పంట పొలాలకు ఎటువంటి పరిణామాలు ఎదురౌతాయి? అనే ఆలోచనను ఈ సినిమా ద్వారా రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.

ఎవరెలా చేశారు?

ఈ సినిమా మొత్తంమీద కొన్ని పాత్రలే ప్రధాన భూమిక పోషించాయి. వాటిలో సంధ్య పాత్ర పోషించిన పరిణితి చోప్రా .. వినోద్ పాత్ర పోషించిన దేవేన్ భోజనాని .. ఈ ఇద్దరూ సినిమాని తమ భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించగా అజాద్ భారతి న్యూస్ ఛానల్ యాజమాన్యం శ్యామ్ (శేఖర్ సుమన్ ) విదుర (అదిల్ హుస్సేన్ ) పాత్రలు సపోర్టింగ్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన నాజర్ నుంచి దర్శకుడు పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేకపోయారు.

సాంకేతికత

విజయ్ ప్రకాష్ అందించిన సంగీతం బాగుంది
ఆర్ వేల్ రాజ్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా సాండ్ మైనింగ్ సీన్లను విజవలైజ్ చేసిన తీరు బాగుంది.
నిర్మాణ విలువలు పర్లేదు.

విశ్లేషణ

ఎవరైనా నదీ తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పరిశీలనగా చూడండి. రోజు రోజుకీ అక్కడ ఇసుక మాయమైపోయి నదీ జలాలు కూడా అడుగంటిపోయి ఉంటాయి. అదే సమయంలో మెట్రో నగరాల్లో హై రైజ్ అపార్ట్మెంట్లు చూడండి.. ఆకాశాన్ని తాకుతుంటాయి.

ఈ సినిమాలో శివ అనే వృద్ధుడి చేత సహజ వనరు అయిన ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల భవిష్యత్ తరాలు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా సందేశాత్మకంగా చెప్పిస్తాడు. ఆయన మాటలు వింటే మన కళ్ళముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయా? అని అనిపించక మానదు.

నిజానికి ఇది సినిమా కాదు.. నిజ జీవితంలో కూడా సంధ్య లాంటి జర్నలిస్టులు చేయాల్సిన పనులకు ఒక గైడ్ లాంటిది. అందుకే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు. బట్ సాధారణ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆలోచింపచేస్తుంది.

నటీనటులు : పరిణితి చోప్రా , దేవేన్ భోజనాని , నాజర్ , అమోల్ పాలేకర్ , శేఖర్ సుమన్ , అదిల్ హుస్సేన్ తదితరులు
సంగీతం : విజయ్ ప్రకాష్
సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్
నిర్మాత: పార్థ కిరణ్ ఠాగూర్
దర్శకత్వం: ధృవ్ త్రిపాఠి
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
స్ట్రీమింగ్ డేట్: 9 -10 -2026
రేటింగ్: 3 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *