ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల వ్యూహకర్త , జనసురాజ్ పార్టీ (janasuraj party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (prasanth kishore) పేరు తెరమీదికి వచ్చింది . మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్ , బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టిన ప్రశాంత్ కిశోర్ , బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం అంటూ రకరకాల హెడ్ లైన్స్ తో వార్తా కధనాలు చక్కర్లు కొట్టాయి .
జులై 30 న బీహార్లోని బాంకిపూర్ లో జరిగిన ఉప ఎన్నిక . ఆగస్టు 3 న జరిగిన ఓట్ల లెక్కింపులో ఆ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి మీద ప్రశాంత్ కిషోర్ షుమారు 18 వేల ఓట్ల ఆధిక్యంతో గెలవడం ఈ కథనాలకు ప్రధాన ముడిసరుకు . ఈ ఉపఎన్నిక గెలుపుకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇచ్చిన హైప్ మాత్రం జనరల్ ఎలెక్షన్స్ ను మించిపోయి ఉంది . నిజానికి ఈ హైప్ ప్రశాంత్ కిశోర్ కూడా ఊహించి ఉండడు . అతడి గెలుపును పూర్తిగా అతడి వ్యక్తిగత తెలివితేటల ఖాతాలో వేసేసారు . అతడి గెలుపును అతడి బలం కింద జమకట్టేసారు . అతడి గెలుపును పూర్తిగా అతడి వ్యూహం కింద డిసైడ్ చేసేసారు . అంతేకానీ ప్రశాంత్ కిశోర్ గెలుపు వెనుక ఉన్న ఇతర అసలు కారణాలు కూడా ఉన్నాయనే విషయాన్ని విస్మరించారు. ఉపఎన్నికలో ప్రతి పార్టీ అభ్యర్థి గెలుపు ఓటముల వెనుక కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి . కుల సమీకరణాలు , స్థానిక పరిస్థితులు , ప్రత్యర్థి బలం , బలహీనత వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి . వీటిలో ఏ ఒక్క ఈక్వేషన్ తేడా వచ్చినా ఫలితాలు వేరుగా ఉంటాయి . ప్రశాంత్ కిశోర్ విషయంలో జరిగింది అదే . ఆ అంశాలేంటో ఒకసారి విశ్లేషణ చేసుకుందాం .
బీజేపీ కంచుకోట
సరే ఇప్పుడు బీజేపీ కంచుకోట బద్దలు కొట్టడం అంటే బాంకీపుర్ బీజేపీ కంచుకోట బద్దలు అయిందని అని మనం అర్ధం చేసుకోవాలి . ఈ హెడ్ లైన్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు . ఎందుకంటే ఈ స్థానం ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమోట్ అయిన నితిన్ నబీన్ సొంత అడ్డాగా పేరు పొందింది . వరుసగా ఐదు సార్లు గెలుపు బాటలో పయనించడంతో ఆ స్థానం బీజేపీకి , ముఖ్యంగా నితిన్ నబీన్ కి కంచుకోట అనడంలో ఎటువంటి సందేహం లేదు . పైగా బాంకీపుర్ స్థానం అంటే ఆషామాషీ స్థానం కూడా కాదు . సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత ఇలాకా . అటువంటి స్థానంలో గెలుపు మీద బీజేపీ దృష్టి పెట్టకుండా ఉంటుందా ? ముఖ్యంగా నితిన్ నబీన్ దృష్టి పెట్టకుండా ఉంటారా ? అయినా బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు కాబట్టి బాంకీపుర్ కంచుకోట బద్దలు కొట్టిన పీకే అని ఉపమానాలు ఇచ్చి ఉంటారు అనుకోవాలి .
బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం
ఈ టైటిల్ కూడా ప్రశాంత్ కిశోర్ కి యాప్ట్ గానే ఉంది . ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు పనిచేసిన ప్రశాంత్ కిశోర్ కి ముందు నుంచీ ఒక కోరిక ఉంది . బీహార్ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలనేది ఆ కోరిక . అనుకున్నట్టుగానే బీహార్ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాడు కానీ అది సొంతంగా కాదు . బిజినెస్ పరంగానే సక్సెస్ అయ్యాడు . 2015 లో కాంగ్రెస్ , ఆర్జేడీ , జేడీయూ కూటమి తరపున పనిచేసి విజయాన్ని సాధించిపెట్టాడు . కానీ అతడిలో అసంతృప్తి మాత్రం అలానే ఉండిపోయింది . తాను కూడా సొంతంగా రాజకీయాల్లో ఎదగాలని భావించి జనతాదళ్ ( యునైటెడ్ ) పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానం మొదలెట్టాడు . కానీ వ్యాపారంలో ప్రొప్రయిటర్ స్థానం వేరు , ప్రాంతీయ పార్టీలో పోస్ట్ వేరు అని గ్రహించటానికి పీకేకి ఎక్కువ సమయం పట్టలేదు .వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రాంతీయ పార్టీలో నిర్ణయాలు తీసుకోవడం కష్టమని తెలుసుకున్నాడు . అందుకే పార్టీలోనుంచి బయటికి వచ్చి తిరిగి బిజినెస్ మొదలెట్టాడు . సరే ఆ విషయం అలా ఉంచితే కొన్ని దశాబ్దాల తర్వాత ప్రశాంత్ కిశోర్ కోరిక నెరవేరి బీహార్ శాసన సభలో అడుగుపెట్టబోతున్నాడు . ఇప్పటిదాకా ఉన్న పార్టీలకు తోడు ఇకపై బీహార్ రాజకీయాల్లో పీకే ప్రస్థానం కూడా మొదలవబోతుంది కాబట్టి బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలౌతుంది అనే అనుకుందాం .
బీజేపీకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్
నిజానికి ఇక్కడ బీజేపీకి షాక్ ఇచ్చింది ప్రశాంత్ కిశోర్ కాదు . బాంకీపుర్ నియోజక వర్గ ఓటర్లే. వరుసగా ఐదు సార్లు నబీన్ ను గెలిపించిన ఓటర్లు ఆయన స్థానంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ ను ఎందుకు ఓడించారు ? అందుకు కారణం ఆయన వీక్ కాండిడేట్ అవడమే . చివరి నిమిషంలో వేరొక అభ్యర్థిని కాదని నీరజ్ పేరు తెరమీదికి రావడమే . బాంకీపుర్ స్థానంలో సరైన అభ్యర్థిని నిర్ణయించడంలో తడబడిన బీజేపీ స్థానిక నాయకత్వ వైఫల్యమే . పీకేని తక్కువగా అంచనా వేయడమే . పీకేని బీజేపీ స్థానిక నాయకత్వం తక్కువగా అంచనా వేయడానికి కూడా ఒక కారణం ఉంది . 2025 లో ప్రశాంత్ కిశోర్ జనసురాజ్ పార్టీ స్థాపించి బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గానూ , 238 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపాడు . ఆశ్చర్యంగా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రశాంత్ కిశోర్ జనసురాజ్ అభ్యర్థులు గెలవలేదు . నిజానికి షాకింగ్ న్యూస్ అంటే ఇది . పదేళ్లలో తొమ్మిదిసార్లు తన వ్యూహంతో పలు రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిశోర్ వ్యూహం తన పార్టీ కనీసం ఒక్క స్థానం కూడా గెలవడానికి పనిచేయలేదు . అందుకే బీజేపీ స్థానిక నాయకత్వం కూడా పీకేని లైట్ తీసుకుంది . బీహార్లో పీకే పార్టీ ఓటమి వార్తలు చూసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో పార్టీలు పీకే వ్యూహంతో కాకుండా తమ సొంత బలంతోనో , స్థానిక పరిస్థితుల వల్లనో గెలిచాయేమో అన్న అనుమానం కూడా వస్తుంది .
ప్రశాంత్ కిశోర్ గెలుపుకు కారణాలు
బీహార్లో బీజేపీ నాయకత్వం సామ్రాట్ చౌధురిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడంతో అక్కడ కుల సమీకరణాలు మారిపోయాయి . నితీష్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పీకే వైపు మళ్ళాయి . ముస్లిం ఓటర్లు కూడా గణనీయ శాతంలో తమ ఓట్లను పీకే ఖాతాలో వేశారు . బీహార్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవుల ఓట్లు కూడా పీకే ఖాతాలో జమ అయ్యాయి . ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ప్రచారంలో వెనుకబడ్డారు . మరోవైపు ఈ పరిస్థితులను పీకే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు . ఓటర్ల మనసులోని మాటను ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా రియాక్ట్ అయ్యాడు . అన్నిటికన్నా ముఖ్యమైన కారణం నీట్ పేపర్ లీక్ అంశం కూడా . నిజానికి నీట్ పేపర్ లీక్ ఆందోళనలు మొదట బీహార్ లోని పాట్నాలోనే ఎక్కువగా ఊపు అందుకుంది . ఈ నిరసనల ప్రభావం బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగానూ , ప్రశాంత్ కిశోర్ కి అనుకూలంగానూ పరిణమించాయి . దాంతో బాంకీపుర్ ఉపఎన్నికలో పీకే విజయం సులువైపోయింది .
గెలుపు తర్వాత ప్రశాంత్ కిశోర్ ఏమన్నారు ?
నిజానికి ఈ గెలుపును ప్రశాంత్ కిశోర్ ముందే ఊహించారో ? లేదో తెలీదు కానీ ఈ గెలుపు ఆయనకు కొండంత బలం ఇచ్చిందని అనిపిస్తుంది . అలా అనిపించటానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అతడికి ఇచ్చిన భారీ హైప్ కారణం అవుతుంది . ఆ విషయం తన గెలుపు తర్వాత ప్రశాంత్ కిశోర్ మీడియాలో చేసిన ప్రకటనలు చూస్తే తెలుస్తుంది . వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ‘ తన గెలుపు ప్రధాని మోదీకి గట్టి హెచ్చరిక . బీహార్లో సీఎం సామ్రాట్ చౌధురి పాలనపై తన గెలుపు రిఫరెండం లాంటిది . కాబట్టి తక్షణమే బీజేపీ అధిష్టానం ఆయన్ని ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించాలి . అన్నారు . విన్నారుగా .. బీహార్లో జరిగిన ఒక చిన్న ఉపఎన్నికలో ఈయన గెలుపు మోదీకి గట్టి హెచ్చరిక ఎలా అవుతుంది ? . బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడంతో మౌనవ్రతం పాటించిన ప్రశాంత్ కిశోర్ చివరికి ఉపఎన్నికలో కేవలం ఆ ఒక్కస్థానంలోనే గెలవడంతో ఏకంగా తన గెలుపు మోదీకి హెచ్చరిక అనడం నిజంగా షాకింగ్ న్యూస్ కాదూ ? ఎంతలో ఎంత మార్పు వచ్చింది . వాపును బలుపు అనుకున్నట్టుగా లేదూ ? ఈ గెలుపుతో పీకేలో ఆత్మవిశ్వాసం స్థానంలో తనమీద తనకు అతి విశ్వాసం ఏర్పడినట్టు లేదూ ?
ప్రశాంత్ కిశోర్ సక్సెస్ స్టోరీ
అలా అని ప్రశాంత్ కిశోర్ ని జీరో అనడం లేదు . అతడి ఖాతాలో నిజమైన విజయాలు కొన్ని ఉన్నాయి . బాంకీపుర్ ఉపఎన్నికలో పీకే గెలవడం కన్నా ముందు అతడు సాధించిన విజయాలు కొన్ని ఉన్నాయి . చెప్పుకుంటే వాటి గురించి చెప్పుకోవాలి . అసలుకు ప్రశాంత్ కిశోర్ కథ మొదలైందే బీజేపీతో . బీజేపీతోనే ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది . 2012 లోనే నరేంద్ర మోదీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి గుజరాత్ మోడల్ ను దేశానికి పరిచయం చేయడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉంది . మోదీ ఛరిస్మాని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అతడి ప్లాన్ లు వర్కౌట్ అయ్యాయి . ఎంతలా అంటే అన్ని రాష్ట్రాలు గుజరాత్ మోడల్ ను అనుసరించేంత .
అదే కాంబినేషన్ 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయడంతో అద్భుతమైన ఫలితాలు వచ్చి మోదీ వెనుతిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది . అప్పట్లో చాయ్ పే చర్చ కార్యక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది . అక్కడితో దేశంలోని రాజకీయ పార్టీల చూపు ప్రశాంత్ కిశోర్ మీద పడింది. అప్పటికే నరేంద్ర మోదీ ఛరిస్మా ప్రజల్లోకి వెళ్లిపోవడంతో బీజేపీకి కూడా పీకేతో పెద్దగా అవసరం పడలేదు . కానీ బీజేపీకి తన అవసరం లేకపోయినా బిజినెస్ రీత్యా ఇతర పార్టీల అవసరం పీకేకి ఉంది . అందుకే 2017 లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి , 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి , 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి , తమిళనాడులో డీఎంకే పార్టీకి వ్యూహకర్తగా పనిచేసి ఫలితాలు సాధించాడు . ఒక్క యూపిలోనే పీకే వ్యూహం పనిచేయలేదు .
ముగింపు
బాంకిపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ గెలవడం బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవడానికి అవకాశం ఉంది . అతడి రాజకీయ ప్రస్థానానికి ఈ గెలుపు తొలి మెట్టుగా ఉపయోగపడొచ్చు . అంతేకానీ ఆయన చెప్పినట్టు ఈ గెలుపు ప్రధాని మోదీకి గట్టి హెచ్చరిక అవడానికి అవకాశం లేదు . ప్రధానితో పోటీపడాలంటే పీకే దేశవ్యాప్తంగా ఆఫీసులు తెరవాలి. తెరిచినా అవి ఎంతవరకు నిలబడతాయో చెప్పలేం . ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలు చేసిన ఆప్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చూస్తున్నాం . కాబట్టి ప్రస్తుతానికి ప్రశాంత్ కిశోర్ బీహార్ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తే అదే అతడి రాజకీయ భవిష్యత్తుకు పునాది అవుతుంది .
