శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన వదంతి 2 మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ( Vadhandhi Season 2 Web Series ) ఈ నెల 7 ( ఆగస్టు 7 ) నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది . గతంలో తమిళ నటుడు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన వదంతి వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా ఇప్పుడు వదంతి 2 రిలీజ్ చేసారు . అయితే ఇందులో శశికుమార్ ప్రధాన పాత్ర పోషించాడు . ప్రస్తుతం ఈ సిరీస్ తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది . ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లతో ఉంటుంది .
ఇప్పుడు వదంతి 2 వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
చెన్నై – మధురై మధ్య 8 లైన్ల హైవే శంకుస్థాపన పనులను ప్రారంభించటానికి కేంద్రమంత్రి మాన్ సింగ్ రావడంతో కథ మొదలౌతుంది . అక్కడ కేంద్రమంత్రి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రారంభోత్సవానికి సూచనగా వర్కర్లు బుల్డోజర్ తో మట్టి తవ్వడం మొదలుపెడతారు . అయితే ఎవరూ ఊహించని విధంగా అక్కడ మట్టి తవ్వుతున్నప్పుడు ఒక అస్థిపంజరం బయటపడుతుంది . దీంతో అందరూ షాక్ అవుతారు .
చివరికి ఈ విషయం కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం సృష్టించేదాకా వెళ్తుంది . కేంద్రానికి క్రెడిట్స్ దక్కకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వమే కావాలని అక్కడ అస్తిపంజరాన్ని సృష్టించిందని మీడియాలో కధనాలు వస్తాయి . దీంతో ఆ అస్థిపంజరం కేసును ఎస్పీ రితికా నాయర్ ( అనఘా ) సవాల్ గా తీసుకుంటుంది . ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సమర్థుడైన నిజాయితీకల అధికారి కోసం వెతికినప్పుడు పదంబత్తూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న మూసా రాజా ( శశికుమార్ ) ఆమె దృష్టిలో పడతాడు . అందుకే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యతను అతడికి అప్పగిస్తుంది .
ఈ కేసును టేకప్ చేసిన మూసా రాజా తన స్నేహితుడైన మరో ఎస్సై రామర్ ను (వివేక్ ప్రసన్న) తనకు సహాయంగా పిలిపించుకుంటాడు . ఈ ఇద్దరూ కలిసి అస్థిపంజరం దొరికిన చోట తిరిగి తవ్వకాలు జరిపిస్తే ఇంకో అస్థిపంజరం బయటపడుతుంది . కానీ అందులో బ్రాస్లెట్ తో కూడిన చేయి మాత్రమే దొరుకుతుంది . ఆ బ్రాస్లెట్ ఆధారంగా ఎస్సై మూసా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు . అతడి ఇన్వెస్టిగేషన్లో ఆ బ్రాస్లెట్ జల్లికట్టు ఆడే మణి ది ( యశ్వంత్ ) అని తెలుస్తుంది . మరోపక్క అప్పటికే ఇదే కేసులో మణి జైలు జీవితం అనుభవిస్తుంటాడు.
ఇంతకీ ఆ అస్థిపంజరాలు ఎవరివి ?
వాటికీ మణికి ఉన్న లింక్ ఏంటి ?
అసలు ఆ హత్యలు ఎవరు చేసారు ? ఎందుకు చేసారు ?
ఎస్సై మూసా రాజా ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటుంది కదా ? ఇందులో మొదటి మూడు , ఆఖరి మూడు ఎపిసోడ్లు అసలు కథ . మధ్యలో వచ్చే రెండు ఎపిసోడ్లు అసలు కధకు కనెక్ట్ చేస్తూ మానవ తప్పిదం వల్ల పోలీస్ ఫోరెన్సిక్ రిపోర్టుల్లో ఎలాంటి తప్పులు దొర్లుతాయో తెలిపే ఉపకథ . నిజానికి ఈ అస్థిపంజరాల మర్డర్ మిస్టరీ స్టోరీకి మధ్యలో వచ్చే ఫోరెన్సిక్ ఎపిసోడ్లు అవసరం లేదు . ఆ ఎపిసోడ్ల వల్ల మనకు ఫోరెన్సిక్ పరిజ్ఞానం పెరగడం మినహా కధకు పెద్దగా అవసరం లేదు . క్లైమాక్స్ చూసినవారికి ఆ విషయం అర్ధమౌతుంది .
ఇక మొదటి మూడు ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్ గానే సాగుతాయి . కేంద్రమంత్రి గారి ప్రారంభోత్సవంలో అస్థిపంజరాలు బయటపడటం , ఎసై మూసా ఈ కేసును టేకప్ చేయడం , తనకు సహాయంగా ఇంకో ఎస్సై రామర్ ను తెచ్చుకోవడం , తమకు దొరికిన బ్రాస్లెట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం చకచకా జరిగిపోతాయి . ఇక్కడ రామర్ క్యారక్టర్ గురించి రెండు మాటలు చెప్పుకోవాలి . సీరియస్ టోన్ లో సాగే ఈ సిరీస్ లో అప్పుడప్పుడు వాతావరణాన్ని తేలిక చేస్తూ హాస్యాన్ని పండించడంలో రామర్ పాత్ర ఉపయోగపడింది . ఎందుకంటే రామర్ పక్కన లేకుండా చివరివరకు ఎస్సై మూసా ఒక్కడినే చూడలేం . ఎందుకంటే ఈ సిరీస్ లో ఎస్సై మూసా నవ్వడం దాదాపు కనిపించదు . ఎందుకో ఎప్పుడూ విచారంగానే ఉంటాడు .
అన్నట్టు ఇందులో ఎస్సై మూసా పాత్రలో నటించిన శశికుమార్ గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి . ఈయన అతిమంచితనం పాత్రల్లో సెట్ అయినంతగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో సెట్ అవడు . అందుకు ఉదాహరణ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ . ఆ మూవీ చూసినవాళ్ళకి ఆ విషయం అర్ధమౌతుంది . ఇతడ్ని అరెస్ట్ చేద్దామని వచ్చిన పొలిసు కూడా దణ్ణం పెట్టి వెళ్ళిపోతాడు . బుగ్గన పులిపిరి కాయ పెట్టి , నుదుటున గాటు పెట్టి , చేతిలో కత్తి పెట్టి మర్డర్ సీన్ చేయమన్నా ‘ నన్ను క్షమించండి .. డైరెక్టర్ ఈ మర్డర్ చేయమన్నాడు కాబట్టి చేస్తున్నా ‘ అని జాలిగా ఫేస్ పెడతాడు . ఆ ఫేస్ అటువంటిది. అలాంటి ఫేసుకి దర్శకుడు ఈ సిరీస్ లో కఠినమైన ఖాకీ యూనిఫామ్ అప్పచెప్పాడు . యూనిఫామ్ కఠినమైనదే కానీ శశికుమార్ కఠినమైనవాడు కాదని దర్శకుడు షూటింగులో గ్రహించి ఉంటాడు .
ఈ సిరీస్ లో అతడి చుట్టూ చేసిన క్యారెక్టర్లు అందరూ నిజ జీవితంలో కూడా పోలీసులేమో అన్నంత బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించారు . కానీ శశికుమార్ మాత్రం యధాప్రకారం సాఫ్ట్ గా కనిపిస్తాడు . సరే అతడి క్యారక్టర్ డిజైన్ సంగతి అలా ఉంచితే లాజికల్ గా కూడా ఇందులో కొన్ని పొరపాట్లు కనిపిస్తాయి . కేంద్ర , రాష్ట్రాలను కుదిపేసిన అస్థిపంజరాల కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి డిపార్ట్మెంట్లో ఇంకెవరూ దొరకనట్టు ఎస్పీ సైతం ప్రోటోకాల్ ను పక్కనబెట్టి ఎస్సైని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి అతడ్ని బతిమిలాడి ఒప్పించడం, ఐజి దగ్గర ఎస్పీ స్థాయి అధికారిణి కూడా ఎస్సైతో సమానంగా నిలబడి మాట్లాడటం వంటి సన్నివేశాలు లాజికల్ గా సింక్ కావు . ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రొసీజర్స్ కళ్లకుకట్టినట్టు చూపించడం మీద ఫోకస్ పెట్టిన దర్శకుడు పోలీస్ ప్రొసీజర్ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని నడిపించేసాడు .
మాములుగా ఏ మర్డర్ స్టోరీ అయినా కిల్లర్ ఆచూకీ కోసం సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో మొదలౌతుంది . కానీ ఈ సిరీస్ లో కిల్లర్ మణి అని , అతడికి కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష వేయడంతోనే కథ అయిపోయింది అనుకుంటాం . కానీ దర్శకుడు మాత్రం ఇక్కడ్నుంచే అసలు కథని మొదలుపెట్టాడు . ఈ పాయింట్ మనకు కొంచం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆ హత్యలు మణి చేసాడని పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం , కోర్ట్ అతడికి శిక్ష వేయడం కూడా అయిపోయిన తర్వాత ఎస్సై మూసా మాత్రం మణి ఈ హత్యలు చేసి ఉండడని , హంతకులు ఇంకెవరో అయ్యుండొచ్చనే అనుమానంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది .
ఇంతవరకు మనకు థ్రిల్ బాగానే పంచిన దర్శకుడు కూడా ఫోరెన్సిక్ లైనుకు వెళ్లి మనం ఊహించని మలుపు తీసుకున్నాడు . అయితే మొదటి మలుపు మనకు థ్రిల్ పంచితే రెండో మలుపు మాత్రం విసుగు తెప్పిస్తుంది. ఎంతసేపు డిఎన్ఏ టెస్టులు అంటూ అనుమానితులను పెంచుకుంటూ పోయి ప్రతివాడి నోట్లో పుల్ల పెట్టి పరీక్షలు చేయడం , అవి ల్యాబ్ కి పంపడం , అక్కడొక డాక్టర్ లుంగీ కట్టుకుని టెస్టులు చేయడం , రిపోర్టులు ఇవ్వడం వంటి సీన్లతో కథ అంగుళం కూడా ముందుకు కదలక అక్కడక్కడే తిరుగుతుంది . ఈ ఎపిసోడ్లు కధనాన్ని సాగదీయటానికి పనికొచ్చాయే కానీ కథను ముందుకు నడపటానికి పనికి రాలేదు .
మళ్ళీ ఎప్పుడైతే ఎస్సై మూసా జైలుకి వెళ్లి మణితో మాట్లాడటం , అతడి స్నేహితుడు ప్రభా తో మాట్లాడటం , ఇంకో స్నేహితుడు సుందరేశన్ ను పట్టుకోవడం వంటి సన్నివేశాలతో తిరిగి మెయిన్ స్టోరీకి కనెక్ట్ అవుతాము . సుందరేశన్ దొరకడం కధకి కీలక మలుపు అవుతుంది . అంతకుముందు దర్శకుడు మణి , దివ్య , ప్రభా , అతడి ప్రియురాలి మధ్య చిన్న లవ్ స్టోరీ నడిపినా మరీ బోర్ కొట్టకుండా క్లుప్తంగా ముగించేశాడు . ఈ సిరీస్ మొత్తానికి మనం ఊహించనిది ఏమైనా ఉందంటే అది మణి చెల్లెలు వెంబ వ్యవహారం , సుందరేశన్ ఫ్యామిలీ వ్యవహారం.. చివరి ఎపిసోడ్లలో దర్శకుడు క్లైమాక్స్ ను ఉత్కంఠభరితంగా ముగించిన తీరు బాగుంది .
ఈ సిరీస్ ఆల్మోస్ట్ మణి చుట్టూనే తిరుగుతుంది . ప్రాణంగా ప్రేమించిన దివ్యను , చెల్లి వెంబను అతడే చంపివుంటాడని పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక సరైన కారణాలను దర్శకుడు సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు . అసలు స్టోరీలో లాజిక్ అక్కడే మిస్ అయినట్టు అనిపిస్తుంది . పైగా కోర్టులో జడ్జ్ అతడికి శిక్ష వేసినా అతడు ఒక్కమాట మాట్లాడడు . పైగా తాను నేరం ఒప్పుకోవడానికి ఎస్సై మూసాతో అతడు చెప్పిన కారణం కూడా జస్టిఫికేషన్ గా అనిపించదు . మణి చెల్లి వ్యవహారం గురించి దివ్య అన్నయ్య నీలకంఠన్ కి ఆల్రెడీ తెలిసి అతడు అందరికీ చెప్పేస్తాడు కూడా . అలాంటప్పుడు తన చెల్లి వ్యవహారం గురించి ఎవరికీ తెలియకూడదనే తాను ఇన్నాళ్లు మాట్లాడకుండా ఉన్నానని మణి చెప్పడం లాజికల్ గా కుదరలేదు .
ఎవరెలా చేసారు ?
ఎస్సై మూసా పాత్రలో శశికుమార్ బాగానే నటించాడు కానీ దర్శకుడు అతడి క్యారక్టర్ ఇంకాస్త హార్డ్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది . అయినప్పటికీ ఇందులో అతడు కనిపించిన ప్రతిసారీ గుడ్ పోలీస్ అనుకుంటాం .
ఎస్పీ రితికా నాయర్ పాత్రలో అనఘా నటన బాగానే ఉంది కానీ ఆమె పాత్రను కూడా దర్శకుడు సరిగా డిజైన్ చేయలేకపోయారనిపిస్తుంది .
ఇక ఎస్సై రామర్ పాత్రలో వివేక్ ప్రసన్న నటన సహజంగా ఉంది . కామెడీని కూడా మోతాదు మించకుండా ఎంతవరకు పంచాలో అంతవరకు పంచాడు .
మణి పాత్రలో కుర్రాడు యశ్వంత్ నటన బాగుంది .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు నటించారు .
సాంకేతికత
సైమన్ కింగ్ అందించిన సంగీతం బాగానే ఉంది .
శరవణన్ రామస్వామి అందించిన ఫోటోగ్రఫీ బాగుంది . కొన్ని దృశ్యాలలో విజువలైజేషన్ బాగుంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ లు ఇష్టపడేవారికి వదంతి 2 వెబ్ సిరీస్ నచ్చుతుంది కానీ ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ విడిగా చూసుకుంటే మధ్యలో వచ్చే ఎపిసోడ్లు కొంచం బోర్ కొట్టిస్తాయి . కొన్ని ఎపిసోడ్లలో లాజిక్కులు కూడా మిస్ అవుతాయి .
పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కి దర్శకుడు కొంచం ఫ్యామిలీ డ్రామా కూడా కలిపి కధనాన్ని నడిపించారు . క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ అయినా అనవసర రక్తపాతాలకు , మితిమీరిన అశ్లీలతకు చోటు లేకుండా దర్శకుడు కధనాన్ని నడిపిన తీరు రిలీఫ్ ఇస్తుంది .
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి . సిరీస్ సంగతి ఎలా ఉన్నా శశికుమార్ అతిమంచితనం మీకు నచ్చుతుంది .
నటీనటులు : శశికుమార్ , అనఘా , వివేక్ ప్రసన్న , యశ్వంత్ తదితరులు
సంగీతం : సైమన్ కింగ్
సినిమాటోగ్రఫీ : శరవణన్ రామస్వామి
దర్శకత్వం : ఆండ్రు లూయిస్
విడుదల : అమెజాన్ ప్రైమ్ ( 07-08-2026 )
రేటింగ్ : 2.5 / 5
