నిన్నటినుంచి ( ఆగస్టు 4 ) మరో మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ ఉయిర్ (Uyir movie) జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది . నిజ జీవితంలో కేరళ పోలీస్ చేసిన ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా దర్శకుడు పద్మకుమార్ ఉయిర్ మూవీని తెరకెక్కించారు . ఇంకో విశేషం ఏంటంటే ఈ మూవీకి కథా సహకారం అందించింది కూడా నిజ జీవితంలో ఒక పోలీస్ ఆఫీసరే . అందుకే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు మనకు రియల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ కనిపిస్తాయి . దర్శకుడు కూడా సాధ్యమైనంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా జరిగిన పోలీస్ కేసును ఉన్నది ఉన్నట్టుగా చూపించటానికి ప్రయత్నించాడు .
జూన్ 26 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టుకుంది . ఆగస్టు 4 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది . ఓటిటిలో కూడా ఈ మూవీ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది . మలయాళం మర్డర్ మిస్టరీ మూవీలకు ఉన్న క్రేజ్ అటువంటిది .
ఇప్పుడు ఉయిర్ మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
మూవీ స్టార్టింగ్ నాగపూర్ స్టేషన్ నుంచి మొదలౌతుంది . ట్రైన్ రన్నింగ్ లో ఉండగా తమ చిన్నారి కూతురు తప్పిపోయిందని తల్లితండ్రులు గమనిస్తారు . పోలీసులు చైల్డ్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుంటారు కానీ ఆ చిన్నారి ఆచూకీ తెలీదు .
కట్ చేస్తే ,
కేరళ కన్నూరు డిస్ట్రిక్ట్ లోని ధర్మడం పోలీస్ స్టేషన్ కి అజీబ్ ( రోషన్ మాధ్యు ) ప్రొబేషనరీ ఎస్సైగా వస్తాడు . అజీబ్ డ్యూటీలో జాయిన్ అయిన కొద్దిరోజులకే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొడుపల్లి విలేజ్ బావిలో ఒక మహిళ శవం ఉందని ఫోనొస్తుంది . ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అజీబ్ స్పాట్ కి వెళ్తాడు .
ఆ మహిళది సూసైడ్ అయి ఉంటుందని పోలీస్ అధికారులు భావిస్తారు . దానికి తోడు ఆ మహిళకు చెందినవారెవరూ రాకపోవడంతో సూసైడ్ కింద రాసుకుని కేస్ క్లోజ్ చేసేద్దామని అనుకుంటారు . కానీ అజీబ్ మాత్రం ఆ మహిళది మర్డర్ అయి ఉంటుందని అనుమానపడతాడు . పై అధికారి పర్మిషన్ తీసుకుని మర్డర్ కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు . ఇతడికి జాయ్ అనే ఇంకో సీనియర్ పోలీస్ సహాయంగా వస్తాడు .
చనిపోయిన మహిళ చేతిమీద రాజు అని కన్నడ భాషలో టాటూ ఉండటంతో ఆమె కర్ణాటక కు చెందిన వలస కూలీ శోభ అని తెలుసుకుంటాడు . అక్కడ్నుంచి ఎసై అజీబ్ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టి కర్ణాటక వెళ్లి అక్కడి పోలీసుల సాయంతో ఆమె భర్త రాజును పట్టుకుని తిరిగి కేరళ తీసుకొచ్చి మార్చురీలో ఉన్న శోభ శవాన్ని ఐడెంటిఫై చేయమంటారు. రాజు ఆమెను తన భార్యగా గుర్తిస్తాడు . ఆమెకు భువనేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని .. ఆ విషయం తనకు తెలిసి ఆమెకు దూరంగా ఉంటున్నానని , ఆమె ఎలా చనిపోయిందో తనకు తెలీదు అంటాడు. బాడీని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపే స్థోమత లేదు కాబట్టి పోలీసులనే ఆ ఫార్మాలిటీస్ పూర్తిచేయమని కోరి కాగితాల మీద సంతకాలు కూడా పెట్టి వెళ్ళిపోతాడు .
పోలీసులు కూడా శోభ మరణం సూసైడ్ కింద రాసుకుని ఆమెకు అంత్యక్రియలు కూడా జరిపించేస్తారు . అయితే పోలీసులు ఊహించని సంఘటన ఇక్కడ జరుగుతుంది . కర్ణాటక నుంచి వచ్చిన రాజు కుటుంబ సభ్యులు సంవత్సరం నుంచి రాజు కనిపించకుండా పోయాడని , పోలీసులు అతడ్ని ఇక్కడికి తీసుకొచ్చారని తెలుసుకుని వచ్చామని చెప్తారు . అప్పుడు రాజు ఫోటో చూపించి గుర్తుపట్టమంటే వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ పోలీసులు అవుతారు .
ఇంతకీ బావిలో పడి మరణించిన శోభ ఎవరు ?
శోభతో అక్రమ సంబంధం పెట్టుకున్న భువనేష్ ఎవరు ?
కర్ణాటక నుంచి పోలీసులు పట్టుకొచ్చిన రాజు ఎవరు ?
శోభది హత్యా ? ఆత్మహత్యా ?
ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ప్రొబేషన్ ఎస్సై అజీబ్ గతం ఏంటి ? అనేది మిగిలిన కథ
ఎలా ఉంది ?
ఈ మధ్య దురంధర్ మూవీతో స్క్రీన్ ప్లే విషయంలో కొత్త ట్రెండ్ మొదలైందిగా .. ఇందులో కూడా దర్శకుడు ప్రొబేషన్ ఆన్ డ్యూటీ – పార్ట్ 1 అనే ట్యాగ్ లైన్ తో నేరేషన్ మొదలుపెట్టాడు . ఇక మూవీ స్టార్టింగ్ ట్రైన్లో చిన్నారి మిస్సింగ్ తో మొదలౌతుంది . ఈ బిగినింగ్ కి స్టోరీకి ఉన్న లింక్ ఏంటనేది మనకు క్లైమాక్సులోనే తెలుస్తుంది . ఆ సీన్ తర్వాత అజీబ్ ప్రొబేషనరీ ఎస్సైగా కన్నూర్ పోలీస్ స్టేషన్ కి రావడం , కేస్ డైరీలు చూడటం , కంప్లైంట్స్ నోట్ చేసుకోవడం , డ్రంకెన్ డ్రైవ్ చెక్ లు చేయడం వంటి రొటీన్ పోలీసింగ్ తో మొదటి ముప్పై నిముషాలు కధనం నడుస్తుంది .
ఎప్పుడైతే బావిలో మహిళ శవం ఉందని పోలీసులకు కంప్లైంట్ వస్తుందో అప్పట్నుంచి కధనం మర్డర్ మిస్టరీ మోడ్ లోకి టర్న్ అవుతుంది . కొత్తగా వచ్చిన ఎస్సై అజీబ్ మర్డర్ కోణంలో కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి బయలుదేరడంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో కధనం నడుస్తుంది . అక్కడ్నుంచి జాయ్ అనే పోలీసుని వెంటబెట్టుకుని కర్ణాటక వెళ్లి అక్కడి పోలీసుల సాయంతో చనిపోయిన శోభ భర్త రాజును ట్రేస్ చేసి కేరళ తీసుకొచ్చి ఆమె డెడ్ బాడీని చూపించి కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని పంపించడంతో ఈ కేసులో ఏమీ పస లేదనుకుంటాం . కధనంలో సాగతీత కోసం దర్శకుడు ఈ సన్నివేశాలను వాడి ఉంటాడని అనుకుంటాం . బస్సులో అతడు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా ఇంతవరకు జరిగిన ఎపిసోడ్లో మనకు ఇంట్రెస్టింగ్ అనిపించే ప్లాట్ ఏదీ ఉండదు .
కానీ దర్శకుడు ఇక్కడే కథని మలుపు తిప్పాడు . ఆ మలుపే ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్ . కేరళ పోలీసులు పట్టుకొచ్చిన వ్యక్తి గురించి రాజు కుటుంబ సభ్యులు అసలు విషయాన్ని చెప్పడంతో అసలు కథ మొదలౌతుంది . మరి తాము పట్టుకొచ్చిన వ్యక్తి ఎవరు ? శోభ భర్త కాదా ? శోభ భర్త కాకపోతే ఇతనెవరు ? ఇతనికీ శోభకీ ఉన్న కనెక్షన్ ఏంటి ? ఆ వచ్చిన వ్యక్తి పోలీసులకు ఎందుకు అబద్దం చెప్పాడు ? అసలు శోభది హత్యా ? ఆత్మహత్యా ? అనే ప్రశ్నలకు సమాధానంగా దర్శకుడు సెకండాఫ్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నడిపిన తీరు ఆకట్టుకుంటుంది .
నిజానికి ఒక మర్డర్ మిస్టరీ మూవీ చూస్తున్నప్పుడు మన మైండ్ లో పై ప్రశ్నలు ఎదురవ్వాలి. అప్పుడే ఆ మర్డర్ మిస్టరీ కధనం పాకాన పడినట్టు అర్ధం . దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు . రాజు పాత్ర ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు పోలీసులతో పాటు మనకూ చాలా డౌట్లు వస్తాయి . ప్రశ్నలు ఎదురౌతాయి . ఆ ప్రశ్నలకు సమాధానం రావాలంటే క్లైమాక్స్ వరకు ఆగాల్సిందే అనే విషయం మనకు అర్థమైపోతుంది . ప్రేక్షకులను ఆ మాత్రం ఎంగేజ్ చేస్తే చాలు దర్శకుడి ఫార్ములా ఫలించినట్టే .
ఇక పోలీసులతో రాజు పాత్ర చెప్పే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎన్ని పాత ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతాయో .. అన్ని కొత్త ప్రశ్నలు కూడా ఎదురౌతాయి . దీనికి కారణం రిపీటెడ్ సీన్లే . సాధారణంగా ప్రతి మలయాళం మర్డర్ మిస్టరీ సినిమాలో రిపీటెడ్ సీన్లు ఉంటాయి . పోలీస్ భాషలో చెప్పాలంటే సీన్ రీ కన్స్ట్రక్షన్ అన్నమాట . ఈ రిపీటెడ్ సీన్స్ అనేది దర్శకులకు అతిపెద్ద టాస్క్ . నేరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి . ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేయకుండా అర్థమయ్యేలా సీన్ రిపీట్ చేయాలి . ఇందులో ఒకటే సీన్ ని పాత్రలు మార్చి రెండుమూడుసార్లు చూపిస్తాడు దర్శకుడు . కథనానికి ఇటువంటి రిపీటెడ్ సీన్లు అవసరం కాబట్టి మనమే అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్య ఉండదు . కానీ అర్ధం కాకపోతే మాత్రం గందరగోళమే .
ఇక లాజిక్కుల జోలికి వెళ్తే కొన్ని సన్నివేశాల్లో పోలీసులు చాలా అమాయకుల్లా కనిపిస్తారు . తమకు దొరికిన వ్యక్తి రాజు అవునో కాదో కనీస ఎంక్వైరీ చేయకుండా అతడ్ని పోలీస్ స్టేషన్ కి పట్టుకురావడం , అక్కడ అతడు చెప్పిన స్టోరీ విని జేబులో డబ్బులు పెట్టి మరీ పంపడం వంటి సన్నివేశాలు లాజికల్ గా మనల్ని కన్విన్స్ చేయవు . అది వదిలేస్తే ప్రీ క్లైమాక్సులో ఎస్సై అజీబ్ శోభ కేసులో అసలు హంతకుడ్ని పట్టుకునే సన్నివేశాలు ఉత్కంఠత రేకెత్తిస్తాయి .
ఇక క్లైమాక్స్ మాత్రం హృదయాలను మెలిపెడుతుంది . టైటిల్స్ క్రెడిట్ లో ఇప్పటివరకు దేశంలో మిస్ అయిన చిన్నపిల్లల డేటా చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే . చాలా మిస్సింగ్ చైల్డ్ కేసులు ఏళ్లతరబడి పోలీస్ ఫైల్స్ లో పెండింగ్ ఉండిపోతున్నాయి . వీటిలో ట్రేస్ అయినవి వేళ్ళ మీద మాత్రమే లెక్కపెట్టొచ్చు . చాలామంది చిన్నారులు తల్లితండ్రులకు దూరంగా పరాయి కిరాయి వ్యక్తుల పాదాల కింద జీవితాలు ముగిసిపోతున్నాయి. అలా నిజ జీవితంలో ఓపెన్ అయిన ఒక మిస్సింగ్ చైల్డ్ కేస్ ను కేరళ పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి పిల్లల్ని ముంబైలో ట్రేస్ చేసి వెనక్కి తీసుకొచ్చి తలితండ్రులకు అప్పచెప్పిన వాస్తవ సంఘటనకు ప్రతిరూపమే ఈ సినిమా . అందుకే క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనుకాకుండా ఉండలేరు .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమాలో కొద్ది పాత్రలు మాత్రమే లీడ్ రోల్ పోషించాయి . వారిలో మొదటివాడు ఎసై అజీబ్ పాత్ర పోషించిన రోషన్ మాధ్యు . నిజానికి ఈ సినిమాలో ఈ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుంది . ఇతడి నటన పర్లేదు కానీ బాడీ లాంగ్వేజ్ లోనూ , కొన్ని సన్నివేశాల్లోనూ తేలిపోయినట్టు అనిపించింది . బహుశా ఇతడి పక్కన బరువైన ( ఒడ్డుపొడుగు ) పాత్రలను పెట్టడం వల్ల అయ్యుంటుంది .
ఇక రాజు అలియాస్ భువనేష్ పాత్ర కూడా సినిమాలో కీ రోల్ ప్లే చేసింది . అతడి నటన కూడా బాగుంది .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .
సాంకేతికత
మణికందన్ అయ్యప్ప అందించిన సంగీతం బావుంది కానీ మధ్యలో అనవసరంగా ఐటెం సాంగ్ ఇరికించి పాడుచేశారు .
అజయ్ డేవిడ్ అందించిన ఫోటోగ్రఫీ బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ :
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి ఉయిర్ మూవీ నచ్చుతుంది . కాకపోతే స్లో నేరేషన్ అనేది భరించాలి . ఫస్టాఫ్ రొటీన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫార్మాట్లో కధనం సాగినా సెకండాఫ్ మాత్రం మనల్ని ఎంగేజ్ చేస్తుంది . కాకపోతే ఒకే సన్నివేశాన్ని పాత్రలను మార్చి రిపీట్ చేసే ఎపిసోడ్స్ మాత్రం జాగ్రత్తగా చూడాలి . ఇది మిస్ అయితే స్టోరీ మనకు అర్ధం కాదు .
జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి చూసేయండి .
నటీనటులు : రోషన్ మాధ్యు . బైజు సంతోష్ తదితరులు
సంగీతం : మణికందన్ అయ్యప్ప
సినిమాటోగ్రఫీ : అజయ్ డేవిడ్
దర్శకత్వం : పద్మకుమార్
విడుదల : (04-08-2026)
రేటింగ్ : 3 / 5
