కేరళలో సంచలనం రేకెత్తించిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు కమల్ కె ఎమ్ పద మూవీని (Pada Movie ) తెరకెక్కించాడు . 2022 లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోయింది . తర్వాత ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చి IMDB లో మంచి రేటింగ్ తెచ్చుకుంది .
కుంచకో బోబన్ , జోజు జార్జ్ , వినాయకన్ , దిలీష్ పోతన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన పద మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
నిజానికి ఇది కథ కాదు .. నిజంగా జరిగిన సంఘటనే . 1996 లో అప్పటి కేరళ ప్రభుత్వం భూ సవరణ చట్టం బిల్లు బిల్లు తీసుకొచ్చింది . ఈ బిల్లు వల్ల ఆదివాసీలు భూములపై తమ హక్కులను కోల్పోయే పరిస్థితులు వచ్చాయి . ఆదివాసీలకు మద్దతుగా అప్పట్లో కేరళలో ఆందోళనలు కూడా జరిగాయి . అయినా ప్రభుత్వం దిగిరాలేదు . ఈ పరిస్థితుల్లో ఆదివాసీలకు మద్దతుగా అతివాద భావాలు ఉన్న అయ్యన్ కాళీ పద రంగంలోకి దిగింది .
శాంతియుత నిరసనలతో ప్రభుత్వాన్ని దారిలోకి తేవడం కష్టమని వారు గుర్తించారు . అందుకే కళ్ళార బాబు , శివన్ కుట్టి , రమేషన్ , అజయన్ అనే నలుగురు అయ్యన్ కాళీ ఉద్యమకారులు తమ డిమాండ్లను ప్రభుత్వం చేత ఒప్పించుకోవడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు . అదే జిల్లా కలెక్టర్ కిడ్నాప్ . ముందు కలెక్టర్ ను కిడ్నాప్ చేసి ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడదాం అనుకుంటారు . కానీ తర్వాత ప్లాన్ మార్చి కలెక్టర్ ను కలెక్టరేట్ లోనే బంధించి డిమాండ్లు పెట్టాలి అని నిర్ణయించుకుంటారు . ఇందుకోసం పిస్టళ్లు , మందుగుండు సామాగ్రి కూడా సిద్ధం చేసుకుంటారు .
కలెక్టర్ ను ఆయన కార్యాలయంలోనే బంధించాలని రెక్కీ కూడా వేస్తారు . కానీ వీళ్ళు వెళ్లినరోజే కలెక్టర్ సెలవు పెట్టడంతో తిరిగి మర్నాడు వెళ్లి కలెక్టర్ను ఆయన ఛాంబర్లోనే కట్టేసి ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియచేస్తారు . ఈ విషయం సీఎం కి తెలిసి సమస్య పరిష్కార బాధ్యతను చీఫ్ సెక్రటరీ రాజశేఖరన్ కి ( ప్రకాష్ రాజ్ ) అప్పచెబుతాడు .
దాంతో ఉద్యమకారులతో చర్చలు జరిపేందుకు చీఫ్ సెక్రటరీ రంగంలోకి దిగుతాడు . మరోపక్క కేరళ పోలీసులు కలెక్టరేట్ ను రౌండ్ చేస్తారు .
ఈ పరిస్థితుల్లో అయ్యన్ కాళీ సభ్యులు చీఫ్ సెక్రటరీకి తమ డిమాండ్లు ఎలా తెలియచేస్తారు?
కలెక్టర్ ను కాపాడటానికి వచ్చిన పోలీసులు ఏం చేస్తారు ?
అయ్యన్ కాళీ గ్రూపు సభ్యుల చేతుల్లో బందీ అయిన కలెక్టర్ ఏం చేస్తాడు ?
చివరికి వీరి డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
ముందే చెప్పినట్టు ఇది కథ కాదు . కేరళలో వాస్తవంగా జరిగిన సంఘటన . కానీ వాస్తవాలను ఉన్నదున్నట్టుగా చూపిస్తే అది సినిమా అవదు . డాక్యుమెంటరీ అవుతుంది . కాబట్టి చాలామంది దర్శకులు వాస్తవ సంఘటనలను సినిమాగా మలిచేందుకు కొంత లిబర్టీ తీసుకుంటారు . కానీ ఈ సినిమాలో దర్శకుడు చేసిన సాహసం ఏంటంటే ఎటువంటి రంగులు అద్దకుండా జరిగిన సంఘటనలను యధాతధంగా కళ్లముందుంచారు . అందుకే కేరళ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది .
1996 లో నలుగురు అయ్యన్ కాళీ పద సభ్యులు అప్పటి పాలక్కాడ్ కలెక్టర్ ను కలెక్టరేట్ లోనే నిర్బంధించి డిమాండ్లు పెడితే మీడియాలో సంచలన వార్తా కధనాలు ప్రసారం అయ్యాయి . కేవలం నలుగురంటే నలుగురు పక్కాగా ప్లాన్ చేసుకుని కేరళ సీఎం కు ముచ్చెమటలు పట్టించారు . ఇదంతా ఒక్కరోజులోనే జరిగింది .
కలెక్టర్ నిర్బంధం వార్త తెలియగానే ప్రజా సంఘాలు , ప్రజా ప్రతినిధులు , మీడియా , పోలీసులతో కలెక్టరేట్ నిండిపోయింది .
మరోపక్క కలెక్టర్ ను కుర్చీకి కట్టేసిన నలుగురు అయ్యన్ కాళీ సభ్యులు ఆయన ల్యాండ్ ఫోన్ నుంచే చీఫ్ సెక్రటరీతో చర్చలు జరిపి తమ డిమాండ్లు చెప్తారు . కలెక్టర్ ను కుర్చీకి కట్టేసిన అయ్యన్ కాళీ సభ్యులు కూడా తమలో మానవత్వం ఉందని నిరూపించుకుంటారు . కలెక్టర్ వాష్ రూమ్ కి వెళ్లాలంటే తాడు విప్పేసారు . అతడికి ఆకలి అవుతుందేమో అని తాము తెచ్చుకున్న అరటి పళ్లనే అతడికి కూడా ఇస్తారు .
వీరిలో మానవత్వం మిగిలే ఉందని కేవలం ఆదివాసీల హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా ముందుకొచ్చారని కలెక్టర్ కూడా గమనిస్తాడు . అందుకే ఓ సీన్ లో ‘ నిజానికి ఆదివాసీల హక్కుల కోసం మీ ప్రాణాలను పణంగా పోరాడుతున్నారు . కానీ మీరు ఎంచుకున్న ఈ మార్గం సరైంది కాదు . ఆదివాసీల హక్కులను కాపాడాలని నాకూ ఉంది . కానీ నేను ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయాల్సిన ఉద్యోగిని మాత్రమే . శాంతియుతంగా ప్రభుత్వంతో చర్చలు జరపండి .. నేను కూడా మీకు సహకరిస్తాను ‘ అంటాడు .
విశేషం ఏంటంటే ఈ మూవీలో మనకు విలన్లు కనపడరు . ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులుగా చీఫ్ సెక్రటరీ , కలెక్టర్ , ఎస్పీలు తమ బాధ్యతలను నిర్వర్తిస్తే , ఆదివాసీల కోసం అయ్యన్ కాళీ పద సభ్యులు తమ పోరాటం తాము చేసారు . ఒకపక్కన నిర్బంధంలో ఉండి కూడా కలెక్టర్ ఒక వృద్ధ దంపతుల సమస్యను పరిష్కరించడం బాగుంది . అయితే అయ్యన్ కాళీ సభ్యులు పిస్తోళ్లు , బాంబులతో కలెక్టర్ ను బెదిరించడం మానవత్వం కాదనే ప్రశ్నకు కూడా దర్శకుడు క్లైమాక్సులో సమాధానం చెప్పాడు . అఫ్కోర్స్ క్లైమాక్స్ సీన్ కూడా నిజంగా జరిగిందే అనుకోండి . ఇలా దర్శకుడు అందరిలోనూ మంచే చూపించటానికి ప్రయత్నించాడు . సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కేరళ ప్రభుత్వానికి అనుకూలంగానో , అయ్యన్ కాళీ పద గ్రూపుకు వ్యతిరేకంగానో కథను మార్చలేదు .
కాకపోతే స్క్రీన్ ప్లే లో ప్రధాన లోపం ఏంటంటే మూవీ మొత్తం కలెక్టర్ ఛాంబర్ , చీఫ్ సెక్రటరీ చాంబర్ల చుట్టూనే తిరుగుతుంది . నిజానికి ఇది లోపం కూడా కాదు . దర్శకుడు కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్ళలేదు . అలా వెళ్లి ఉంటే ఢిల్లీనుంచి కమెండోలు హెలీకాఫ్టర్లో కలెక్టర్ ఛాంబర్ పైన దిగడం , తలుపులకు బాంబులు పెట్టి లోపలికి రావడం , అక్కడ నలుగురు అయ్యన్ కాళీ సభ్యులతో హోరాహోరీగా ఫైట్ చేయడం , చివరికి నలుగురు కిడ్నాపర్లను చంపి కలెక్టర్ ను కాపాడటం వంటి హై వోల్టేజ్ సీన్లు ఉండేవి . దర్శకుడు మొదటినుంచి చివరివరకు వాస్తవ సంఘటనల చుట్టూనే కధనాన్ని నడిపిన తీరు బాగుంది .
ఈ మూవీలో క్లైమాక్స్ సీన్లు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి . ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మధ్యవర్తిగా జయపాలన్ అనే సీనియర్ లాయర్ను ఒప్పించడం , ఆ లాయర్ కూడా తన షరతులకు ప్రభుత్వం ఒప్పుకుంటేనే మధ్యవర్తిగా వస్తానని చెప్పడం , చీఫ్ సెక్రటరీతో చర్చలు జరిపి న్యాయమూర్తి సమక్షం లోనే చర్చలు జరగాలని కోరడం , ఆచారి అనే న్యాయమూర్తి కలెక్టర్ ఛాంబర్లోనే అయ్యన్ కాళీ సభ్యులతో చర్చలు జరపడం వంటి సీన్లు రక్తి కట్టిస్తాయి .
చర్చలు ముగిసిన తర్వాత జడ్జ్ ఆ నలుగురితో ‘ మీరు ఆదివాసీల హక్కుల కోసం ముందుకు రావడం సరైనదే కానీ ఇలా ఆయుధాలతో రావడం మాత్రం నేరమే ‘ అంటాడు . అప్పుడు ఆ నలుగురు తమ దగ్గరున్న ఆయుధాలు బొమ్మ తుపాకులనీ , కేవలం ప్రభుత్వ అటెన్షన్ కోసం అవి వాడాము కానీ ఎవరికీ హాని తలపెట్టాలని తమ ఉద్దేశ్యం కాదని చెప్పడం, కలెక్టర్ కూడా వాళ్ళు తనని బాగా చూసుకున్నారని చెప్పడంతో జడ్జ్ వాళ్ళను అరెస్ట్ చేయకుండా బేషరతుగా విడుదల చేయాలని ఆదేశిస్తాడు . ఈ సినిమా మొత్తంలో వాస్తవ సంఘటనకు విరుద్ధంగా జరిగిన ఒకే ఒక్క సన్నివేశం ఇదే . క్లైమాక్సులో నలుగురినీ పోలీసులు వదిలేసినట్టు చూపించారు కానీ నిజానికి అప్పటి కలెక్టర్ దగ్గర్నుంచి కంప్లైంట్ తీసుకుని కేరళ పోలీసులు వీరి మీద కేసులు పెట్టి అరెస్టులు కూడా చేసారు . ఈ పాయింట్ కూడా దర్శకుడు టచ్ చేసాడు కానీ ఒరిజినల్ వెర్షన్లో చూపించాడు .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురు నటులూ చక్కటి నటులే .పెర్ఫార్మన్స్ విషయంలో ఒకరిని ఎక్కువ , ఒకరిని తక్కువ చేసి చెప్పలేం . కుంచకో బోబన్ , జోజు జార్జ్ కొంచం సాఫ్ట్ గా కనిపిస్తే , వినాయకన్ , దిలీష్ పోతన్ లు కొంచం అగ్రెసివ్ గా కనిపిస్తారు . నలుగురూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు .
సాంకేతికత
విష్ణు విజయ్ అందించిన సంగీతం బాగుంది .
సమీర్ తాహిర్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
కమెర్షియల్ ఫార్ములా సినిమాలు చూడటానికి ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు . ఈ వాస్తవ సంఘటన కేరళలో జరిగింది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు . ఈ రెండు విషయాలను పక్కనబెట్టి చూస్తే మూవీ చాలామందికి నచ్చుతుంది .
ఎక్కడో అడవుల్లో ఉండే ఆదివాసీల హక్కులను కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అయ్యన్ కాళీ పద పేరుతో ఉద్యమం చేసిన ఆ నలుగురి పోరాటం మాత్రం మనల్ని కదిలిస్తుంది . ఇంతకీ పద అంటే తెలుగులో సైన్యం అని అర్ధం .
అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద చూడొచ్చు .
నటీనటులు : కుంచకో బోబన్ , జోజు జార్జ్ , వినాయకన్ , దిలీష్ పోతన్ తదితరులు
సంగీతం : విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ : సమీర్ తాహిర్
దర్శకత్వం : కమల్ కె ఎమ్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.75 / 5
