వంద దేవుళ్ళు (Vanda Devullu Movie) మూవీ (OTT) రివ్యూ !

Spread the love

ఆగస్టు 7 , 2026 నుంచి బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ , దర్శకుడు శశి కలయికలో రూపొందిన మరో సినిమా వంద దేవుళ్ళు ( Vanda Devullu Movie ) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ZEE5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది . జూన్ 19 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది .

ఈ మూవీ మీద అంచనాలు ఏర్పడటానికి హీరో విజయ్ ఆంటోని , దర్శకుడు శశి లు ప్రధాన కారణం . ఎందుకంటే వీరిద్దరి కలయికలో తల్లి ప్రేమ ప్రధాన అంశంగా వచ్చిన బిచ్చగాడు మూవీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే . అందుకే టైటిల్స్ లోనే బిచ్చగాడు మూవీలో తల్లి ప్రేమను తెలియచేస్తే , వంద దేవుళ్ళు మూవీ తల్లి మనసును తెలియచేస్తుంది అని ట్యాగ్ లైన్స్ ఇచ్చారు .

వంద దేవుళ్ళు పూర్తిగా ఓ అమ్మ కథ . అమ్మ కూడా మనిషే అని , అమ్మకూ ఓ మనసుంటుంది అనే పాయింట్ ఆధారంగా కథ నడుస్తుంది . అన్నట్టు ఇది పూర్తిగా కల్పిత కథ కాదు . 1999 లో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా దర్శకుడు శశి కథను అల్లుకుని తెరకెక్కించాడు .

ఇప్పుడు వంద దేవుళ్ళు మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

ఈ సినిమాలో కథను చెప్పడం చాలా కష్టం . ఎందుకంటే ఇది ఓ అమ్మ కథ . సమాజంలో ఇప్పటికీ వాసవి లాంటి తల్లులు చాలామంది ఉన్నారు . కొందరు కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త జీవితాలను ప్రారంభిస్తే , మరికొందరు సమాజం నుంచి అవహేళనలు ఎదుర్కొని గతాన్ని తల్చుకుంటూ కుమిలిపోతూ ఉంటారు . ఈ మూవీలో వాసవి కథ మొదటి కోవలోకి వస్తుంది .

26 ఏళ్లకే భర్తను కోల్పోయిన వాసవిని (శ్వాసిక) చూడటానికి సొంతవాళ్లే ముఖం చాటేస్తారు . ఇద్దరు మగపిల్లలు .. ముందూ , వెనుకా ఆస్తిపాస్తులు లేవు .. ఏ రోజు కూలి ఆ రోజు చేస్తే గానీ పైసలు రావు . ఇద్దరు కొడుకులను బాగా చదివించుకోవాలని కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది . మరోపక్క భర్త లేని ఆమెను సమాజం చిన్న చూపు చూస్తూ ఉంటుంది . ఇంట్లో ఎలక దూరిందని పొరపాటున లైట్ వేస్తే అర్ధరాత్రి వేళ ఇంట్లో లైట్ ఎందుకు వెలిగింది అని ఇరుగుపొరుగు అనుమానంతో సూటిపోటి మాటలతో ఆమెను అవహేళన చేయడం మొదలుపెడతారు .

అయినా ఆమె ఇవేమీ పట్టించుకోకుండా కష్టపడి పిల్లలకు చదువులు చెప్పిస్తుంది . పెద్ద కొడుకు భాస్కర్ ( అజయ్ దీషాన్ ) ఇంజినీరింగ్ చదువు పూర్తిచేసుకుని సొంతంగా ఐటి కోచింగ్ సెంటర్ పెట్టుకుంటాడు . చిన్న కొడుకు వివేక్ ( శక్తి ) చదువుకుంటూనే ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు . అయినా వాసవి మాత్రం తనకాళ్ల మీద తాను నిలబడాలని అనుకుని పనులకు వెళ్లడం మానదు . ఆమె కష్టాలు చూసి బడిలో పాఠాలు చెప్పే మాస్టారు మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించమని సలహా ఇస్తాడు . అప్పటికే అయినవాళ్ల నుంచి , ఇరుగుపొరుగు నుంచి అవమానాలు పడిన వాసవి తిరిగి పెళ్లిచేసుకోవడానికి మొగ్గు చూపుతుంది కానీ పెళ్లీడుకొచ్చిన కొడుకుల్ని ఇంట్లో పెట్టుకుని 42 ఏళ్ళ వయసులో పెళ్లిచేసుకోవడం సరికాదేమో అంటుంది . అయినా తన కొడుకుల అభిప్రాయం కూడా తెలుసుకున్నాకే ఆలోచన చేయొచ్చులే అనుకుంటుంది . అలా అనుకుంటుంది కానీ మళ్ళీ పెళ్లిచేసుకోవాలనే ఆలోచనను పక్కనబెడుతుంది .

అయితే ఈ విషయం వాసవి కొడుకులకు తెలుస్తుంది . తల్లి మళ్ళీ పెళ్లిచేసుకోవాలనే ఆలోచనను కొడుకులు సమర్థిస్తారా ? లేదా ?
తల్లి ఆలోచన తెలిసిన పెద్ద కొడుకు భాస్కర్ ఏం చేస్తాడు ?
తన పెళ్లి ఆలోచన చేసిన కొడుకులకు వాసవి పెట్టిన కండిషన్ ఏంటి ?
ఏడుకొండలు ఎవరు ? అతడి గతం ఏంటి ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

చదివారుగా ..ఈ మూవీ గురించి కధలా చెప్పడం చాలా కష్టం . నిజ జీవితంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు శశి వాసవి జీవితాన్ని నేరేట్ చేసుకుంటూ వచ్చాడు. భర్తను కోల్పోయి చిన్న పూరిపాకలో నివసిస్తున్న వాసవి కధతోనే మూవీ మొదలౌతుంది . ఆమె ప్రపంచమంతా ఆ ఇద్దరు కొడుకులే . కొడుకులకు కూడా తమ కోసం తల్లి పడే కష్టాలు , త్యాగాలు తెలుసు . అన్నిటికన్నా సమాజం వల్ల ఆమె పడే అవమానాలు తెలుసు .

సినిమా మొదలైన ముప్పై నిమిషాల వరకు కొడుకులను బాగా చదివించడం కోసం వాసవి కష్టపడి పనులు చేయడం , చదువుల కోసం తల్లిని విడిచిపెట్టి దూరం వెళ్లలేక కొడుకులు ఆమె దగ్గరే ఉండిపోవడం , భర్త తోడు లేని వాసవిని ఊరి జనాలు మాట్లాడే సూటిపోటి మాటలతోనే కధనం నడుస్తుంది .

ప్రథమార్థంలో చాలా భాగం నేటి సమాజంలో భర్తను కోల్పోయిన ఆడదాని జీవితం ఎలా ఉంటుందో చెప్పడం మీద దర్శకుడు ఫోకస్ పెట్టాడు . తాను పనిచేసే కంపెనీలో కష్టమర్లకు పేపర్లు తెచ్చిస్తే వాళ్ళు అవి తీసుకోకుండా యజమాని చేత్తో ఇమ్మని అడుగుతారు . దాంతో అసలు విషయం అర్ధమైన యజమాని ఇకపై బొట్టు పెట్టుకుని ఆమెను పనిలోకి రమ్మంటాడు.

అలాగే దేవుడి ఊరేగింపు వెళ్తుంటే ఆమె ఉన్నపళంగా ఆగిపోయి తలుపు వెనుక దాక్కుంటుంది . ఇలాంటి అవమానాలను వాసవి ఎన్నో భరిస్తూ పనులు చేస్తూ ఉంటుంది .
అందుకే ఈ అవమానాలకు చెక్ పెట్టడానికి మళ్ళీ పెళ్ళిచేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు కదా అని మాస్టారు సలహా ఇస్తే , ” చిన్నప్పట్నుంచి నాకు రెండు చేతులకూ గోరింటాకు పెట్టుకోవడం , చక్కగా బొట్టు పెట్టుకోవడం ఇష్టం ..నేనే కాదు ఏ ఆడపిల్ల అయినా ఇష్టపడుతుంది.. కానీ దురదృష్టం 26 ఏళ్లకే నన్ను వాటికి దూరం చేసింది . నా భర్తను నేను మర్డర్ చేసినా నాకు ఓ ఏడేళ్లు శిక్ష పడేదేమో ..కానీ ఆయన చనిపోయి నాకు జీవితాంతం శిక్ష వేసాడు” ..అని వాసవి చెప్పిన సమాధానం హృదయాలను మెలిపెడుతుంది .

ఆల్మోస్ట్ ఫస్టాఫ్ అంతా వాసవి జీవితంలోని సంఘర్షణల చుట్టూ , కొడుకులతో నడిచే భావోద్వేగ సన్నివేశాల చుట్టూ కధనం నడుస్తుంది . వాసవి కష్టాలను చూస్తున్న మనకు ఆమె మీద జాలి వేస్తుంది . అలాగే సమాజంతో ధైర్యంగా పోరాడుతూ కష్టపడి తన కొడుకులను చదివించుకుంటున్న ఆమె తెగువకు హ్యాట్సాఫ్ అనాలనిపిస్తుంది . అంతలా దర్శకుడు వాసవి పాత్ర చుట్టూ కధనాన్ని నడిపిన తీరు బాగుంది .

అయితే సెకండాఫ్ వచ్చేసరికి కథ వాసవి నుంచి పక్కకు జరిగి కొడుకుల వైపుకు వెళ్ళింది . దీంతో కధనంలో లీనమైపోయి అప్పటిదాకా క్యారీ అవుతున్న మన ఎమోషన్స్ కూడా పక్కకు వెళ్తాయి . కొడుకుల ప్రేమ గోల , యూ ట్యూబర్ అతి , పెద్దిరెడ్డి గొడవ ఫక్తు కమర్షియల్ ఫార్మాట్లోకి టర్న్ అయి విసుగు తెప్పిస్తుంది . ఒక ఎమోషన్స్ కి కనెక్ట్ అయిన ప్రేక్షకులను దర్శకుడు తిరిగి కమ్మర్షియల్ ప్రపంచంలోకి తీసుకొచ్చేసాడు . ఇంకేముంది మాములు గొడవే ..ఒక దశలో ఎవరి పెళ్లి చేయాలని ఎవరు పట్టుబడుతున్నారో అర్ధం కాదు . తల్లేమో కొడుకుని పెళ్లిచేసుమంటుంది . కొడుకేమో తల్లిని పెళ్లి చేసుకోమంటాడు . రెండో కొడుకేమో తల్లికి పెళ్లి చేయాలని తన ప్రేమకు బ్రేకప్ చెప్పేస్తాడు . దీంతో అసలు కథ పక్కకు వెళ్ళిపోయి వాళ్ల ముగ్గురి పెళ్లిళ్ల గురించిన చర్చలతో గందరగోళం అయిపోతుంది . ఆ క్షణాన అసలు పెళ్లి ఎవరికి చేయాలో అర్ధం కాక మనం విజయ్ ఆంటోనీ కోసం వెతుకుతాం .

సమయానికి ఏడుకొండలు ( విజయ్ ఆంటోనీ ) వచ్చి పట్టాలు తప్పిన రైలును తిరిగి ట్రాక్ మీదకు తెస్తాడు . అసలు ఇంతసేపు ఈ విజయ్ ఆంటోనీని దర్శకుడు ఎందుకు పక్కనబెట్టాడో తెలీదు . వాసవి పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి గంటన్నర టైమ్ తీసుకున్న దర్శకుడు విజయ్ ఆంటోనీ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం అర్ధగంటే సమయం కేటాయించాడు . కనీసం సెకండాఫ్ బిగినింగ్ నుంచైనా విజయ్ ఆంటోనీని రంగంలోకి దింపి ఉంటే మరింత బాగుండేది .. బహుశా క్రికెట్లో సీనియర్ ప్లేయర్ అపోజిట్ క్రీజులో నిలబడి జూనియర్ ప్లేయర్ కి లిఫ్ట్ ఇచ్చినట్టు విజయ్ ఆంటోనీ తన మేనల్లుడు అజయ్ కి (ఇందులో భాస్కర్ పాత్ర ) లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడేమో .. పోనీలెండి .. కనపడిన కాసేపైనా విజయ్ ఆంటోనీ తన మార్క్ చూపించాడు .

ఇక క్లైమాక్స్ సీన్లో దర్శకుడు చేసిన ఒక మంచి పనీ ఉంది .. ఒక పొరపాటు కూడా ఉంది . మంచి పనేంటంటే పెద్దిరెడ్డి మనుషులు ఓ వందమంది కత్తులు కటార్లతో వస్తే విజయ్ ఆంటోనీ లుంగీ పైకి ఎగకట్టి మన బోయపాటి మూవీల స్టైల్లో గాల్లో ఫైటింగులు చేస్తాడేమో అని భయపడతాం . కానీ దర్శకుడు ఆ సీన్ ని సింపుల్ గా ముగించేసిన తీరు బాగుంది . ఇప్పుడు దర్శకుడు చేసిన పొరపాటు ఏంటంటే క్లైమాక్స్ సీన్ అనేది ఈ సినిమాకి గుండెకాయలాంటిది . చక్కటి భావోద్వేగాలకు , కర్చీఫులు తడిచిపోయేంత బోలెడంత ఎమోషనల్ కనెక్టవిటీ కి స్కోప్ ఉన్న సీన్ అది . కానీ ఆ యూ ట్యూబర్ బ్యాచును దింపి దర్శకుడు క్లైమాక్సును కామెడీ పీసును చేసేసాడు . క్లైమాక్స్ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది .

అన్నట్టు నిజ జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకున్న ఏడుకొండలు , వాసవి , ఆమె కొడుకులను దర్శకుడు క్లైమాక్సులో చూపిస్తాడు .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకుని నడిపించిన పాత్ర వాసవి . ఆ పాత్రలో శ్వాసిక బాగా నటించింది అని చెప్పడం కంటే జీవించింది అనడం కరెక్ట్ . కూలి పనులు చేసుకునే భర్త తోడు లేని మహిళ జీవితాలు ఎలా ఉంటాయో దగ్గర్నుంచి చూసి పరిశీలించి నటించినట్టు ఉంది . పర్ఫెక్ట్ గా నటించింది . ఆమె నడిచే తీరు , డైలాగ్ డెలివరీ , ముఖంలో హావభావాలు పలికించిన తీరు ఇంప్రెసివ్ గా ఉన్నాయి .

ఇక ఆమె ఇద్దరు కొడుకుల పాత్రల్లో అజయ్ , శక్తిల నటన బాగుంది . చాలా బాలన్సుడ్ గా అతి చేయకుండా పాత్ర పరిధి మేరకు నటించారు .

ఇక ఏడుకొండలు అలియాస్ విజయ్ ఆంటోనీ స్క్రీన్ మీదికి వచ్చిన తర్వాతనే ప్రేక్షకులు రీ కనెక్ట్ అయ్యారు . కనిపించింది కాసేపైనా బాగా నటించాడు . కానీ విజయ్ ఆంటోని పాత్రకు ఇంకాస్త స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది .

సాంకేతికత

బాలాజీ శ్రీరామ్ అందించిన సంగీతం బాగానే ఉంది .
దర్శన్ కిర్లోష్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

వంద దేవుళ్ళు మూవీ కోసం దర్శకుడు రాసుకున్న స్టోరీ కొత్తదేమీ కాదు . సమాజంలో ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం . న్యూస్ పేపర్లు తిరగేస్తే అప్పుడప్పుడూ ఇలాంటి వార్తలు కనిపిస్తూ ఉంటాయి . అలా కనిపించిన ఒక వార్తనే దర్శకుడు కధగా మలుచుకుని తెరకెక్కించాడు . అంతెందుకు ఈ మధ్య కాలంలోనే నలభై దాటిన ఓ గాయనికి ఆమె కొడుకు , కూతురు కలిసి మళ్ళీ పెళ్ళిచేసారు .

కాబట్టి వంద దేవుళ్ళు కథ మనకు తెలిసిన విషయమే అయినా ఆడియన్సుకు కనెక్ట్ అయ్యే విధంగా నేరేట్ చేయడం ద్వారా దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు . ఇక ఫస్టాఫ్ లో కనెక్ట్ అయినంతగా సెకండాఫ్ బిగినింగ్ మనం కనెక్ట్ కాము . దీనికి కారణం దర్శకుడు మెయిన్ స్టోరీనుంచి కొంతసేపు పక్కకి వెళ్లడమే . అక్కడక్కడా ఎదురయ్యే కొన్ని సాగతీత సన్నివేశాలు మినహా సినిమా ఒక ఫ్లోలో రన్ అవుతుంది . ZEE5 లో తెలుగులోనే అందుబాటులో ఉంది కాబట్టి ఓ లుక్కేయండి .

నటీనటులు : విజయ్ ఆంటోనీ , శ్వాసిక , అజయ్ , శక్తి తదితరులు
సంగీతం : బాలాజీ శ్రీరామ్
సినిమాటోగ్రఫీ : దర్శన్ కిర్లోష్
దర్శకత్వం : శశి
విడుదల : ZEE5 ( 07-08-2026 )
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!