బాలన్ ది బాయ్ (Balan The Boy movie) మూవీ (OTT) రివ్యూ !

Spread the love

జులై 31 నుంచి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బాలన్ ది బాయ్ ( Balan The Boy movie) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ZEE 5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది . జూన్ 19 , 2026 లో థియేటర్లలో రిలీజ్ అయిన బాలన్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోయింది .

ఈ సినిమా గురించి చెప్పుకునేముందు డైరెక్టర్ గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. గతంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా చాలామంది చూసే ఉంటారు . విహార యాత్రకు వెళ్లిన స్నేహితుల్లో ఒకడు లోయలో పడిపోతే ఇంకో స్నేహితుడు తన ప్రాణాలను పణంగా పెట్టి అతడ్ని కాపాడుతాడు . ఆ సినిమాలో ప్రతి సీన్ ఉత్కంఠత రేపేలా ఉంటుంది .ఆ సినిమా డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలోనే బాలన్ ది బాయ్ సినిమా కూడా రావడంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది . ఈ సినిమా డైరెక్టర్ కి బాయ్ అనే టైటిల్ అచ్చొచ్చిందేమో .. రెండు సినిమాల టైటిల్స్ లో బాయ్ ఉన్నాడు .

ఇప్పుడు బాలన్ ది బాయ్ మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

అనగనగా ఒక అడవి .. ఆ అడవికి అనుకుని ఉన్న విలేజ్ లో ఒక చిన్న ఫ్యామిలీ జీవనం కొనసాగిస్తూ ఉంటారు . తండ్రి జీపు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు . అయితే ఒకరోజు పనిమీద అడవికి వెళ్లిన తండ్రిని ఏనుగుల గుంపు తొక్కి చంపేస్తాయి . ఆ ఊర్లో నా అనుకునేవాళ్లు లేని ఆ తల్లి ఈ వార్త తెలుసుకుని షాక్ అవుతుంది . బతకడం కోసం కొడుకుని తీసుకుని పట్టణానికి వస్తుంది .

ఆగండాగండి .. ఇదే స్టోరీ అనుకున్నారా ? అసలు స్టోరీ వేరే ఉంది . భర్త లేని మహిళ మీద సమాజం ఎటువంటి చూపు చూస్తుందో దర్శకుడు రెండుమూడు సన్నివేశాల్లో ముందే చెప్పేసాడు . అందుకే ఆ తల్లి సమాజం ప్రభావం తన ఆరేళ్ళ కొడుకు మీద పడకుండా జాగ్రత్తలు పడుతుంది . తమ జీవితాన్నే కధలుగా కొడుక్కు చెప్తూ ఉంటుంది . ఆ కొడుక్కి తెలిసింది కూడా ఒక్కటే .. తండ్రి లేడు .. అంతా అమ్మే చేయాలి . అందుకే అమ్మ ఏమి చెబితే అది చేస్తాడు . ఏమి చెప్పమంటే అదే చెప్తాడు .

సమాజానికి దూరంగా కొడుకుని పెంచడం వెనుక ఆ తల్లికి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి . కొడుకు పుట్టుక కూడా జైలులోనే అవడం ఆ చేదు జ్ఞాపకాలకు నాంది . అందుకే ఈ కథ జైలునుంచే మొదలౌతుంది . జైలులో శిక్ష పూర్తి చేసుకుని ఆరేళ్ళ కొడుకుతో ఓ తల్లి బయటి ప్రపంచంలోకి రావడంతో సినిమా మొదలౌతుంది . పాత జ్ఞాపకాల నీడ కూడా తమ మీద పడకుండా ఉండాలని ఏకాంతంగా ఉండే ప్రదేశాలను ఆమె ఎంచుకుంటుంది . అందుకే తమ ఐడెంటిటీ ఎవరికీ తెలీకుండా ఉండటానికి కొడుక్కి , తనకు రోజుకో పేరు పెట్టుకుని తిరుగుతుంటుంది . అప్పటికీ ఒంటరి ఆడది కావడంతో కొంతమంది మగవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు . కానీ ఎప్పుడైతే తనకు అవమానం జరుగుతుందని భావిస్తుందో అప్పుడు తన మకాం ను వేరే చోటికి మార్చేస్తుంది .

ఇలా ఆమె సాగిస్తున్న ప్రయాణం ఒక మామ్మ ఇంట్లో కేర్ టేకర్ గా చేరడంతో కుదురుకుంటుంది . కొడుకుని కూడా స్కూల్లో చేర్పిస్తుంది . అంతా సవ్యంగా సాగుతుంది అనుకునే టైములో ఆమె జీవితంలో తిరిగి పెద్ద కుదుపు ఏర్పడుతుంది . ఒక హత్య కేసులో ఇరుక్కుని కొడుక్కి దూరం అవుతుంది .

అప్పుడేం జరుగుతుంది ?
హత్య కేసులో ఇరుక్కున్న తల్లి ఏమై పోతుంది ?
తల్లి జాడ తెలియకపోవడంతో ఆ కొడుకు ఏం చేస్తాడు ?
చివరికి ఆ తల్లీ కొడుకులు కలుసుకుంటారా ? లేదా ? అనేది మిగిలిన కథ

ఎలా ఉంది ?

చిన్నప్పుడు నేను పాపం పసివాడు అనే సినిమా చూసా .. ఆ సినిమాలో తల్లితండ్రుల నుంచి తప్పిపోయిన ఆ పసివాడు అమ్మా చూడాలి .. నిన్నూ నాన్నని చూడాలి .. నాన్నకి ముద్దులు పెట్టాలి అంటూ ఎడారిలో ఏడుస్తూ పాడుతుంటే నాతోసహా థియేటర్లో ఉన్నవాళ్లు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయారు . నిజంగానే ఆ పసివాడ్ని చూసి అయ్యో పాపం పసివాడు అని జాలి పడ్డాం . అందులో ఆ పసివాడ్ని చూసినప్పుడల్లా గుండెలను మెలిపెట్టేసేది .

మళ్ళీ ఇన్నాళ్లకు అలాంటి పాపం పసివాడ్ని ఇంకొకడిని చూసా . వాడే ఈ సినిమాలో మనం చెప్పుకున్న కొడుకు . అసలు ఎక్కడ దొరికాడండీ ఈ పిల్లోడు . ముఖం చూస్తే చాలు హృదయంలో ఎక్కడో ఆవేదన మొదలౌతుంది . నీ పేరేంటో చెప్పరా ? అంటే ఉలకడు. ఎందుకంటే అమ్మ ఆ రోజు ఏ పేరు చెప్తే అదే అతడి పేరు . అమ్మ ఏ కథ చెప్తే అక్షరం పొల్లుపోకుండా జనాలకి అదే కథ చెప్తాడు . వాడికి తెలిసిందల్లా ఒక్కటే అమ్మ . వాడికి తెలియందల్లా ఒక్కటే అమ్మ గతం . కానీ అమ్మకు ఏవో చేదు జ్ఞాపకాలు ఉన్నాయని పసిగడతాడు . అందుకే ఎక్కడా తల్లిని విసిగించడు . ఒకే ఒక సన్నివేశంలో స్కూలుకు వెళ్తానమ్మా అంటూ తల్లితో మారాం చేస్తాడు .

సినిమా మొదలైన మొదటి ముప్పై నిమిషాలకు పైగా దర్శకుడు తల్లీకొడుకుల బాండింగ్ మీద , తల్లి చేదు జ్ఞాపకాల మీద దృష్టి పెట్టి కధనాన్ని నడిపాడు . మామ్మతో తన గతం చెప్పేదాకా ఆమె జ్ఞాపకాలేంటో మనకు తెలీదు . జైలునుంచి బయటికి వచ్చిన ఆమె మారు పేర్లతో ఊర్లు ఎందుకు తిరుగుతుందో తెలీదు . తన గతాన్ని ఆమె మామ్మతో పంచుకున్నప్పుడే అసలు కథ మనకు అర్ధమౌతుంది . భర్త తోడులేని ఒంటరి ఆడది . సమాజం సూటిపోటి మాటలు పడటం ఇష్టం లేదు . ఎలాగైనా కొడుకుని ప్రయోజకుడ్ని చేయాలి .. ఇవే ఆమె లక్ష్యాలు . ఆమె కన్నీటి కథ విన్న మామ్మ కూడా ఆమెకు అండగా నిలబడతానని చెప్తుంది .

ఇక్కడితో ఆమె లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకుంటాం . కానీ దర్శకుడి ఆలోచన వేరు .. అసలు కథ ఇక్కడ్నుంచే మొదలుపెట్టాడు . దురదృష్ట రాక్షసితో తలుపు తట్టించాడు . ఆ తలుపు తెరిచిన ఆమె జీవితం మళ్ళీ తల్లకిందులు అవుతుంది . ఇక్కడ్నుంచి మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టం . స్కూల్ నుంచి బస్సులో వచ్చిన పిల్లవాడు తల్లి కోసం పికప్ పాయింట్ దగ్గర ఎదురు చూడటం , అనుకోని సంఘటనలతో తల్లి కనిపించకుండా పోవడం , చివరికి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని కొడుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం , తల్లి జాడ తెలియక పిల్లవాడు పోలీసుల చేతిలో బందీఖానా కావడం వంటి ఒకటొకటిగా వచ్చే సన్నివేశాలు మనల్ని భావోద్వేగంలోకి తీసుకెళ్తాయి . ఈ సన్నివేశాలు చూస్తే అయ్యో పాపం పసివాడు అనుకోకుండా ఉండలేం .

ఇంతవరకు ఎమోషనల్ కనెక్టవిటీ తో కధనాన్ని నడిపిన దర్శకుడు అబ్బాస్ ( టోవినో థామస్ ) ను దింపి రొటీన్ కమెర్షియల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయాడు . టోవినో థామస్ ను దింపిన దర్శకుడు స్టోరీ లైన్ వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు . ఆ దొంగతనాలు , పిల్లోడికి ట్రైనింగ్ ఇవ్వడాలు , చిన్నప్పట్నుంచి చాలా సినిమాల్లో చూసేసాం . పైగా పిల్లోడి తల్లిని వెతికి అప్పచెప్పడంలో ఆ అబ్బాస్ ఏవన్నాసాధించాడా ? అంటే అదీ లేదు . చక్కగా తల్లీకొడుకుల బాండింగ్ తో స్టోరీ నడుస్తుంటే సడెన్గా స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చినట్టు ఆ మాస్ మసాలా గోల ఎందుకో అర్ధం కాదు . దానికి తోడు అబ్బాస్ దగ్గరే పిల్లోడు పెరిగి పెద్దోడు అవడంతో అంతకుముందున్న ఫీల్ పోయింది . కావాలంటే మీరు గమనించండి .. ఈ సినిమాని నడిపించింది ఆ చిన్న పిల్లవాడే . రెండో పిల్లోడు కూడా బాగానే చేసాడు కానీ ఎందుకో మొదటి పిల్లవాడిలా కనెక్ట్ కాలేకపోయాం .

ఇక టోవినో థామస్ గోల పక్కనబెడితే తిరిగి పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ తో దర్శకుడు కథని ట్రాక్ లోకి తీసుకొచ్చాడు . తల్లిని వెతుక్కుంటూ అదే పిల్లవాడు ఐదేళ్ల తర్వాత తిరిగి అదే పోలీస్ స్టేషన్ కి రావడం , తల్లీ కొడుకుల మీద కోపంతో ఇన్స్పెక్టర్ పవిత్రన్ చేసిన దుర్మార్గపు పని గురించి తెలుసుకోవడంతో ప్రీ క్లైమాక్స్ ఉత్కంఠత రేకెత్తిస్తుంది . ఆ తల్లి ఏమైపోయిందా ? అని పిల్లవాడితో పాటు మనమూ టెన్షన్ పడతాం . తల్లీకొడుకులు తిరిగి కలుసుకుంటే బాగుణ్ణు అని మనసులోనే అనుకుంటాం . ఇలా అనుకుంటూనే క్లైమాక్స్ వరకు వెళ్తాం .

సరిగ్గా ఇక్కడే .. క్లైమాక్సులో దర్శకుడు తన మ్యాజిక్ చూపించాడు . చివర్లో ఇచ్చిన ట్విస్టుతో సూపర్బ్ అనిపించుకున్నాడు . ఆ ట్విస్ట్ ఏంటో ఇక్కడ చెప్తే స్పాయిలర్ అవుతుంది . మూవీలో చూడండి .. అమ్మయ్య అనుకుంటారు . అప్పటిదాకా పడిన టెన్షన్ మాయమై మనసు తేలిక పడుతుంది . ముందునుంచీ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో కధనాన్ని నడిపించిన దర్శకుడు ( టోవినో థామస్ ఎపిసోడ్ మినహా ) ముగింపు కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసాడు .

ఎవరెలా చేసారు ?

ఎవరెలా చేసారంటే అందరికన్నా ముందు ఆ పిల్లోడి గురించే చెప్పాలి . అంతోటి టోవినో థామస్ ను కూడా వెనక్కి నెట్టేసి అటెన్షన్ మొత్తం తనవైపే తిప్పుకునేలా నటించిన ఆ కుర్ర హీరో పేరు ఆదిశేషన్ . డైరెక్టర్ చిదంబరానికి నువ్వు దొరకడం ఆయన అదృష్టం రా బాబూ .. అసలా ఫేస్ ఏంట్రా బాబూ ? ఎప్పుడూ అంతే ఉంటుందా ? సినిమా కోసం ఆ జాలి ఫేస్ పెట్టావా ? సినిమా అయిపోయినా మాకు నీ ఫేస్ కనిపిస్తూనే ఉందేంట్రా బాబూ .. నువ్వు సూపర్ .. ఏదో ఒకరోజు మలయాళం ఇండస్ట్రీని ఏలేస్తావ్ చూస్తుండు .. తెలుగు చదవడం రాకపోతే ఎవరితోనైనా చదివించుకో .. ఈ రివ్యూ కూడా నీకే అంకితం రా బుడ్డోడా .

ఇక బుడ్డోడి తల్లి పాత్రలో ఫర్జానా చక్కగా నటించింది . ఈమె పెద్ద పెద్ద కళ్ళతోనే హావభావాలు పలికించేసింది . తల్లీకొడుకులు ఇద్దరూ కలిసి సినిమాని భుజాన వేసుకుని నడిపించేసారు .

ఇక టోవినో థామస్ కూడా చక్కటి నటుడే .. కానీ ఎందుకో ఈ సినిమాలో అతడి పాత్రకు సరైన స్కోప్ దక్కలేదు అనిపిస్తుంది .

సాంకేతికత

సుశీన్ శ్యామ్ అందించిన సంగీతం బాగుంది
షిజు ఖాలిద్ అందించిన ఫోటోగ్రఫీ కూడా బాగుంది . కేరళ అందాలను చక్కగా క్యాప్చర్ చేసారు .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

రొటీన్ కమ్మర్షియల్ సినిమాలు చూసేవారికి ఈ మూవీ నచ్చకపోవచ్చు . ఫ్యామిలీ సెంటిమెంట్స్ , ఎమోషన్స్ కు కనెక్ట్ అయ్యేవారికి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది . కాకపోతే మూవీ స్లో నేరేషన్ లో రన్ అవుతూ ఉంటుంది . టోవినో థామస్ ఎపిసోడ్ స్పీడ్ బ్రేకర్ మాదిరి అడ్డుపడటం మినహా మిగిలిన కధంతా తల్లీకొడుకుల చుట్టూనే తిరుగుతుంది.
ముఖ్యంగా ఆ పిల్లోడి అమాయకపు జాలి ముఖం మాత్రం సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు మిమ్మల్ని వెంటాడుతుంది .

ఈ మూవీకి క్లైమాక్స్ ట్విస్ట్ ప్రధాన బలం అవుతుంది . ZEE 5 ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి చూసేయండి .

నటీనటులు : ఆదిశేషన్ , ఫర్జానా , టోవినో థామస్ తదితరులు
సంగీతం : సుశీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ : షిజు ఖాలిద్
నిర్మాత : వెంకట్ నారాయణ
దర్శకత్వం : చిదంబరం
విడుదల : ZEE 5 (31-07- 2026)
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!