మలయాళ నటుడు అసిఫ్ ఆలీ నటించిన రేఖాచిత్రం (Rekhachitram Movie) మర్డర్ మిస్టరీ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సోని లివ్ లో మంచి రేటింగుతో దూసుకుపోతుంది . జనవరి 2025 లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ 50 కోట్ల వసూళ్లను రాబట్టింది . మార్చి నుంచి సోని లివ్ ఓటిటిలో తెలుగు ఆడియో వెర్షన్లో కూడా అందుబాటులోకి రావడంతో క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవాళ్లు వెతికి మరీ చూస్తున్నారు .
సాధారణంగా ఏ క్రైమ్ సినిమాలో అయినా మర్డర్ మిస్టరీ కేసు ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కిల్లర్ కోసం వెతకడంతో మొదలౌతుంది . కానీ ఇందులో మాత్రం హత్యకు గురైన మహిళ ఎవరో తెలుసుకోవడం కోసం పోలీసులు సాగించే ఇన్వెస్టిగేషన్ తో స్టోరీ మొదలౌతుంది . అందుకే టైటిల్ కూడా రేఖాచిత్రం అని యాప్ట్ గా పెట్టారు .
ఇప్పుడు రేఖాచిత్రం మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వివేక్ ( ఆసిఫ్ ఆలీ ) ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతుండటంతో సస్పెండ్ అవుతాడు . తర్వాత అతడ్ని కేరళలోని మలకపార విలేజ్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా ట్రాన్స్ఫర్ చేస్తారు . అతడు డ్యూటీలో జాయిన్ అయిన రోజునే మలకపార ఫారెస్ట్ ఏరియాలో రాజేంద్రన్ ( సిద్దిఖీ ) అనే వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ లో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకుంటాడు . చనిపోయేముందు రాజేంద్రన్ లైవ్ లో మాట్లాడుతూ ‘ షుమారు నలభై ఏళ్ళక్రితం తన స్నేహితుడు విన్సెంట్ , మరో ఇద్దరు కలిసి ఇప్పుడు తాను కూర్చున్న చోటనే అన్యాయంగా 16 ఏళ్ళ అమ్మాయిని పాతిపెట్టామని , అందుకే కర్మఫలం వెంటాడి తన ఆరోగ్యం దెబ్బతిందని ‘ ఏడుస్తాడు .
కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన ఎస్సై వివేక్ ఈ కేసును టేకప్ చేస్తాడు . రాజేంద్రన్ చనిపోయిన చోటనే తవ్వి చూస్తే ఒక మహిళ అస్థిపంజరం దొరుకుతుంది . అక్కడ దొరికిన కాలిపట్టీల ఆధారంగా వివేక్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు .
నలభై ఏళ్ళ క్రితం హత్యకు గురైన ఆ అమ్మాయి ఎవరు ?
రాజేంద్రన్ మరో ముగ్గురితో కలిసి ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేస్తాడు ?
వీడియోలో రాజేంద్రన్ చెప్పిన విన్సెంట్ ఎవరు ? ఈ హత్యకూ , అతడికీ ఉన్న లింక్ ఏంటి?
చివరికి ఎస్సై వివేక్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
అదేంటోగానీ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీలన్నీ మర్డర్ తోనే మొదలౌతాయి . బహుశా మలయాళం వాళ్ళకి ఈ సెంటిమెంట్ అచ్చి వచ్చిందేమో ? దానికి తోడు వాళ్ళ సినిమాల్లో ఫారెస్ట్ ఉండాల్సిందే.. వర్షం పడాల్సిందే . రేఖాచిత్రంలో కూడా దర్శకుడు ఆ సెంటిమెంటును ఫాలో అయ్యాడు . 1985 లో ఓ వర్షం కురుస్తున్న రాత్రివేళ నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని మర్డర్ చేసి చాపలో చుట్టి అడవిలో పాతిపెట్టడంతో సినిమా మొదలౌతుంది .
కట్ చేస్తే దర్శకుడు 2024 లోకి వచ్చేస్తాడు . వివేక్ ఎస్సైగా డ్యూటీలో జాయిన్ అయినరోజునే ఫారెస్టులో రాజేంద్రన్ సూసైడ్ చేసుకోవడం , అతడి సెల్ఫీ వీడియో ఆధారంగా అక్కడ తవ్వి చూస్తే ఒక అమ్మాయి అస్థిపంజరం దొరకడం , అక్కడే దొరికిన కాలి పట్టీల ఆధారంగా వివేక్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం వంటి సీన్లతో దర్శకుడు నేరుగా కథలోకి వెళ్ళిపోయాడు . ఒకరకంగా దర్శకుడు సినిమాకి మంచి బిగినింగ్ ఇచ్చాడు .
ఇప్పుడు ఒక ప్రశ్న ఎదురౌతుంది . ఎవరో ఒక అమ్మాయిని నాలుగు దశాబ్దాల క్రితం తామే చంపామని రాజేంద్రన్ వీడియోలో చెప్పేసాడు కాబట్టి కిల్లర్ ఎవరో దాదాపుగా తెలిసిపోయింది . అయితే చనిపోయిన అమ్మాయి ఎవరు ? కోర్టులో సాక్ష్యాలు చూపించాలంటే కిల్లర్ ను అరెస్ట్ చేస్తే సరిపోదు . కిల్లర్ ఈ అమ్మాయినే మర్డర్ చేసాడనే ఎవిడెన్సులు కూడా కావాలి . అన్నిటికన్నా ముందు చనిపోయిన ఆ అమ్మాయి ఎవరో తెలియాలి . ఈ సినిమాకి స్టోరీ రాసిన రైటర్ ఇక్కడే డిఫరెంట్ ప్లాట్ అల్లుకున్నాడు .
మాములుగా మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీలన్నీ మర్డర్ తో మొదలై క్లైమాక్సులో కిల్లర్ ను రివీల్ చేయడంతో ముగుస్తుంది . కానీ ఇందులో మాత్రం స్టోరీ చనిపోయిన అమ్మాయి చుట్టూనే నడుస్తుంది . ఆ అమ్మాయి క్యారక్టర్ ని కూడా దర్శకుడు వెంటనే దింపలేదు . 1985 లో మిస్సింగ్ అయిన అమ్మాయిల ఫైల్స్ ఆధారంగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ను కలవడం , కాలి పట్టీల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం , ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం వంటి రొటీన్ పోలీస్ ప్రొసీజర్ నడుస్తుంది . ఈ సన్నివేశాలు ఏ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో అయినా మనకు కనిపించేవే . కాబట్టి ఆ సీన్లు మనం చూడాల్సిందే .
సరే ఇంతచేసినా ఎస్సై వివేక్ కి చనిపోయిన అమ్మాయి ఎవరో తెలియక ఫ్రస్టేట్ అవుతాడు . సినిమా మొదలై ముప్పావు గంట అయినా ఆ అమ్మాయి ఎవరో తెలియక మనం కూడా ఫ్రస్టేట్ అవుతాము . దానికి తోడు పై అధికారులు వివేక్ ను ఈ కేసునుంచి తప్పించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వేయడం , కేసును క్రైమ్ బ్రాంచుకు అప్పచెప్పడం , అయినా సరే సదరు ట్రాఫిక్ ఎస్సై ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని సొంతంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం వంటి రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లోకి స్టోరీ టర్న్ అవడంతో కొంత విసుగు వస్తుంది .
మన విసుగును దర్శకుడు గమనించాడో ఏమో కానీ సెకండాఫ్ లో చంద్రప్ప అనే సినిమా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్యారక్టర్ ద్వారా ఆ అమ్మాయి పేరు రేఖ అని రివీల్ చేస్తాడు . రేఖ పాత్ర ఎంటర్ అవడంతో కధలో సంఘర్షణ పెరుగుతుంది . కధనంలో ఎమోషన్స్ కి స్కోప్ దక్కుతుంది . అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఎదురౌతాయి . అసలు ఈ రేఖ ఎవరు ? ఆమె గతం ఏంటి ? రాజేంద్రన్ ఆమెను ఎందుకు చంపాడు ? ఈ ప్రశ్నలకు సమాధానంగా దర్శకుడు సెకండాఫ్ కధనం నడిపాడు . చనిపోయిన అమ్మాయి పేరు తెలిసింది ? ఆమె గతం తెలిసింది .. ఇప్పుడు తెలియాల్సింది అసలు కిల్లర్ ఎవరు ? అని . ప్రీ క్లైమాక్సులో దర్శకుడు కిల్లర్ వైపు కధనాన్ని ఫోకస్ పెట్టాడు .
ఇంతవరకు బాగానే ఉంది . అయితే క్లైమాక్స్ వరకు వచ్చేసరికి దర్శకుడు కొంచం తడబడినట్టు అనిపించింది . ఆ తడబాటులో వేగం పెరిగింది . ఆ వేగంలో క్లైమాక్స్ కొంచం కన్ఫ్యూజ్ అయ్యింది . క్లైమాక్స్ ఇంకొంచం క్లారిటీగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది .
ఎవరెలా చేసారు ?
ఎస్సై వివేక్ పాత్రలో అసిఫ్ ఆలీ నటన బాగుంది . మొదటినుంచి క్లైమాక్స్ వరకు చాలా బాలన్సుడ్ గా నటించాడు .
ఇక ఓటీటీలు చూసేవాళ్ళకి మలయాళ నటుడు ఇంద్రాన్స్ నటన గురించి తెలిసే ఉంటుంది . బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తాడు . ఇందులో కూడా బాగానే చేసాడు కానీ అతడి పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు .
రేఖ పాత్రలో అనశ్వర రాజన్ నటన బాగుంది . మమ్ముట్టి హార్డ్ కోర్ ఫాన్స్ గానూ , సినిమాలలో నటించాలనే పాత తరం అమ్మాయిగా చక్కటి నటన ప్రదర్శించింది .
సాంకేతికత
ముజీబ్ మజీద్ అందించిన సంగీతం బాగానే ఉంది .
అప్పు ప్రభాకర్ కెమెరా పనితనం బాగుంది . వర్షంలో ఫారెస్టు విజువల్స్ బాగుంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
మర్డర్ మిస్టరీతో మంచి బిగినింగ్ ఇచ్చిన దర్శకుడు తర్వాత రొటీన్ కమెర్షియల్ ఫార్మాట్లో కధనాన్ని నడిపించడంతో పెద్దగా థ్రిల్ అనిపించదు కానీ రేఖ పాత్ర ఎంటర్ అయినదగ్గర్నుంచీ కధనం పట్ల ఉత్సుకత పెరుగుతుంది .
ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ కధనంలో డెప్త్ పెరుగుతుంది . దాంతో తర్వాతి సన్నివేశం మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది . క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా సెకండాఫ్ లోనే పరుగులు పెడుతుంది . దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ జానర్ నుంచి ఇంచు కూడా పక్కకు జరక్కుండా చివరివరకు అదే టెంపోతో కధనాన్ని నడిపించాడు . కాకపోతే క్లైమాక్స్ కాస్త హడావుడిగా ముగించినట్టు అనిపించింది . కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కధనాన్ని నడిపించేసాడు . ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సిన ఎస్సై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయడం లాజికల్ గా అతకదు .
సోని లివ్ ఓటిటిలో తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద చూడొచ్చు .
నటీనటులు : ఆసిఫ్ ఆలీ , అనశ్వర రాజన్ , సిద్దిఖీ , ఇంద్రాన్ , మనోజ్ తదితరులు
సంగీతం : ముజీబ్ మజీద్
సినిమాటోగ్రఫీ : అప్పు ప్రభాకర్
దర్శకత్వం : టి . చాకో
విడుదల : సోని లివ్ ఓటిటి
రేటింగ్ : 2.75 / 5
