శేష 2016 (Shesha 2016 Movie) మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ (OTT) రివ్యూ !

Spread the love

సస్పెన్స్ , రివెంజ్ , థ్రిల్లర్ ప్రధాన అంశాలుగా కథ రాసుకుని దర్శకుడు ప్రదీప్ తెరకెక్కించిన శేష 2016 (Shesha 2016 Movie) మిస్టరీ మూవీ ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సన్ నెక్స్ట్ అండ్ అమెజాన్ ప్రైమ్ లలో కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది . ఈ జానర్ మూవీ ఇష్టపడేవారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు .

ఒరిజినల్ గా ఈ మూవీ కన్నడంలో రిలీజ్ అయినా తర్వాత మలయాళం వెర్షన్ కూడా రిలీజ్ చేసారు . 2026 మార్చిలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని తర్వాత ఓటిటిలోకి వచ్చి మంచి రేటింగ్ తెచ్చుకుంది .

ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

కథ 6 ఆగస్టు 2016 రాత్రి వర్షం కురుస్తున్న వేళ కర్ణాటక , కేరళ బోర్డర్ లో ఉన్న పుష్పగిరి పోలీస్ స్టేషన్ లో మొదలౌతుంది . పుష్పగిరి పోలీస్ స్టేషన్ కి ఎస్సైగా దాస్ ( జాన్ కైపల్లిల్ ) , ఏఎస్సైగా ఆంథోనీ ( ప్రమోద్ శెట్టి ) , కానిస్టేబుళ్లుగా లాల్ , గీత లతో పాటు మరికొందరు పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉంటారు.

మర్నాడు సీఎం ప్రోగ్రాం ఉండటంతో చాలామంది పోలీసులు బందోబస్త్ డ్యూటీలకు వెళ్లారు . ఏఎస్సై ఆంథోనీ నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిపోతాడు . ఆంథోనీ వెళ్లిపోయిన కాసేపటికి ఎస్సై దాస్ డ్యూటీ కి వస్తాడు . ఇక్కడే పోలీసులను టెన్షన్ పెట్టే అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది . ఎవరో అపరిచితుడు స్టేషన్ ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసి ఏఎస్సై ఆంథోనీ ప్రస్తుతం తన చేతుల్లో ఉన్నాడని , గంటలోపు తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అతడ్ని చంపేస్తానని బెదిరించి ఒక పజిల్ ఇస్తాడు .
ముందు పోలీసులు ఆ బెదిరింపు కాల్ ను సీరియస్ గా తీసుకోరు . ఎవడో తాగుబోతు కాల్ చేసి ఉంటాడని పట్టించుకోరు . కానీ ఎప్పుడైతే ఆంథోనీ ఇంటికి కూడా చేరలేదని తెలుస్తుందో అప్పుడు డౌట్ వస్తుంది .

సరిగ్గా గంటకి దగ్గర్లో ఉన్న ఫారెస్టులో ఏఎస్సై ఆంథోనీ తల మాత్రమే దొరుకుతుంది . దాంతో పోలీసుల్లో టెన్షన్ మొదలౌతుంది . కిల్లర్ ఎవరో కానీ పోలీసులనే టార్గెట్ చేస్తున్నాడని అర్ధమౌతుంది . తిరిగి స్టేషన్ కి రాగానే కిల్లర్ నుంచి రెండో కాల్ వస్తుంది . మళ్ళీ అతడు ఎస్సై దాస్ కి ఇంకో పజిల్ ఇచ్చి గంటలో సమాధానం చెప్పకపోతే ఇంకో మర్డర్ అవుతుందని హెచ్చరిస్తాడు . అతడు చెప్పినట్టుగానే గంటకు రోడ్డు మీద గీత అనే పోలీస్ తల దొరుకుతుంది

దీనితర్వాత కిల్లర్ దగ్గర్నుంచి మళ్ళీ కాల్ వస్తుంది . తన లిస్టులో ఇంకో ఇద్దరు ఉన్నారని చెప్తాడు . దీంతో కిల్లర్ నెక్స్ట్ తమలో ఎవరిని టార్గెట్ చేస్తాడో అనే భయం మిగిలిన పోలీసులకు పట్టుకుంటుంది .

అసలు కిల్లర్ ఎవరు ?
పోలీసులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ?
పుష్పగిరి పోలీస్ ఫైల్స్ లో ఏముంది ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

దర్శకుడు కథ మొత్తాన్ని ఒక్క రోజులోనే నడిపించిన తీరు బాగుంది . రాత్రి నుంచి ఉదయం వరకు కిల్లర్ పెట్టే కౌంట్ డౌన్ లతో కధనం నడుస్తుంది . ఒక పక్కన భోరున వర్షం కురుస్తూ ఉంటుంది . ఫారెస్టుకు దగ్గరగా ఊరికి దూరంగా ఉండే పుష్పగిరి పోలీస్ స్టేషన్ . అందులో ఉండే పదిమంది పోలీసులు , నలుగురు ఖైదీలు .. కిల్లర్ నుంచి ఫోన్ కాల్స్ రావడం వంటి సన్నివేశాలతో దర్శకుడు ఉత్కంఠత కలిగించే బిగినింగ్ ఇచ్చాడు .

పోలీసులకు ఏఎస్సై ఆంథోనీ తల దొరకడంతో స్టోరీ మర్డర్ మిస్టరీ టర్న్ తీసుకుంటుంది . అక్కడ్నుంచి ఎస్సై దాస్ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడం , కాసేపటికే గీత అనే పోలీస్ తల దొరకడం , కిల్లర్ ట్రేస్ కాకపోవడం , పాత నేరస్తుల్లో ఎవరో ఈ పని చేసి ఉంటారని ఎస్సై దాస్ భావించి స్టేషన్లో ఉన్న పాత ఫైల్స్ అన్నీ చెక్ చేయడం వరకు ప్రొఫెషనల్ పోలీసింగ్ ప్రొసీజర్లోనే కధనం నడుస్తుంది .

పాత ఫైల్స్ చెక్ చేస్తే ఆంథోనీ కి , గీతకు కొంతమందితో ఉన్న వైరం బయటపడుతుంది . ఈ క్రమంలో దర్శకుడు సలీం పాత్రను , ట్రైబల్స్ హక్కుల కోసం పోరాటం చేసిన గ్రూపును , ఏఎస్సై ఆంథోనీ కి , అతడి స్నేహితుడికి ఉన్న వ్యాపార గొడవలను తెర మీదికి తీసుకువస్తాడు . ఇక్కడే మనకు కొంత సాగతీత సన్నివేశాలు ఎదురై ఇంట్రెస్ట్ తగ్గుతుంది . ఇలా స్టోరీని సాగతీసుకుంటూ ఇంటర్వెల్ వరకు దర్శకుడు కిల్లర్ ఎవరనేది కనీసం హింట్ కూడా ఇవ్వడు .

లాల్ , నాయర్ అనే పోలీసుల మర్డర్ తో కథ క్లైమాక్సుకు వస్తుంది . కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ తానే అని ఎస్సై దాస్ తెలుసుకోవడం , అతడు తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో తెలిపే ఫైల్ దొరకడం తో కధనం చకచకా పరుగులు పెడుతుంది . చివరికి క్లైమాక్సులో కిల్లర్ పోలీసులను టార్గెట్ చేసుకుని మర్దర్లు చేయడం వెనుక ఉన్న మోటివ్ ను దర్శకుడు రివీల్ చేసిన విధానం బాగుంది .

శేష 2016 మూవీ కోసం దర్శకుడు మంచి పాయింటుతోనే కథ రాసుకున్నారు కానీ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి తడబడ్డారు . కథ మొత్తం పుష్పగిరి పోలీస్ స్టేషన్ చుట్టూనే నడుస్తుంది . ఒకపక్కన గంటకో పోలీస్ మర్డర్ జరుగుతుంటుంటే పైనుంచి ఒక్క ఆఫీసర్ కానీ , ఫోర్స్ కానీ రాదు . పైగా ఇదేదో మాములు జేబు దొంగతనం కేసు అన్నట్టు ఎస్పీ , డిఎస్పీలు వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి చేతులు దులుపుకుంటారు . ఈ సన్నివేశాల్లో లాజిక్ పూర్తిగా మిస్ అయ్యింది . అన్ని మర్దర్లు పూర్తి అయిన తర్వాత ఎస్పీ తాపీగా అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం నాన్సెన్స్ అనిపిస్తుంది .

కిల్లర్ ఫోన్ చేసి ఫలానా చోట తల ఉంది తెచ్చుకోండి ..పోండి.. అని చెప్తే స్టేషన్లో ఉన్న పదిమంది పోలీసులు పొలోమంటూ రెయిన్ కోట్లు వేసుకుని , డబుల్ బారెల్ గన్నులను భుజాన వేసుకుని వర్షంలో నాలుగు రోడ్లు తిరిగి తల కలెక్ట్ చేసుకుని మళ్ళీ స్టేషన్ కి వచ్చి అందరూ రెయిన్ కోట్లు విప్పి , గన్నులు స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి ఈసారి కిల్లర్ ఏం చెప్తాడా ? అని ఆత్రంగా టేబుల్ మీదున్న ఫోను వంక చూడటం , ఆ ఫోను రాగానే మళ్ళీ అందరూ పొలోమంటూ రెయిన్ కోట్లు వేసుకుని , గన్నులు భుజాన వేసుకుని జీపుల్లో పోవడం పదేపదే చూసి విసుగు వస్తుంది .

స్టార్టింగులో ఎస్సై దాస్ ఎలివేషన్లు చూస్తే ఈ మర్డర్ మిస్టరీల గుట్టు విప్పే హీరో ఈయనే అనుకుంటాం . కానీ క్లైమాక్స్ చూసాక తెలుస్తుంది ఈ మూవీలో హీరో లేడని . దేవరాజ్ వంటి సీనియర్ నటుడ్ని వీడియో కాల్ కాన్ఫరెన్సులో మాట్లాడించి దర్శకుడు పొరపాటు చేసాడు . కనీసం దేవరాజ్ కు మూవీలో కొంత స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది . ఇక క్లైమాక్సులో లాకప్ లో ఉన్నవాడి చేతిలోకి హఠాత్తుగా పిస్తోలు ఎక్కడ్నుంచి వచ్చిందనేది ఆ ఎస్పీ దేవరాజ్ అయినా చెప్పాలి ..లేకపోతే ఆ సీన్ తీసిన దర్శకుడైనా చెప్పాలి .

సస్పెన్స్ , క్రైమ్ , థ్రిల్లర్ మూవీల్లో ఉండాల్సిన ట్విస్టులు ఇందులో లేకపోవడంతో అడుగడుగునా థ్రిల్ ఫీలయ్యే అవకాశం ప్రేక్షకులకు లేకుండా పోయింది . గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అంటారే .. అది లోపించింది . చివరిదాకా ఈ మూవీని చూసిన తర్వాత ఈ కథను ఇంకా బాగా తెరకెక్కించవచ్చు అనిపిస్తుంది .

ఎవరెలా చేసారు ?

ఈ మూవీలో మొదటినుంచి , చివరివరకు ఎక్కువ భాగం ఓ పదిమంది పోలీసులే కనిపిస్తారు . వారిలో ఇన్స్పెక్టర్ దాస్ నుంచి మొదలుపెడదాం . ఈ పాత్ర పోషించిన జాన్ కైపల్లిల్ సమయమంతా ఫ్రస్టేషన్ కే సరిపోయింది . ఇక అసలు నటన చూపించటానికి ఆయనకి అవకాశమేదీ?

సీనియర్ నటుడు దేవరాజ్ ఉన్నాడు కానీ ఆయన్ని వీడియో కాల్ కాన్ఫరెన్స్ వరకే వాడుకున్నారు . మరీ బాగోదేమో అని చివరికి పుష్పగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు . చివరికి ఆయనకి కూడా స్కోప్ ఉన్న రోల్ దొరకలేదు .
దర్శకుడు క్యారెక్టర్లను సరిగా డిజైన్ చేయలేకపోయాడు . ఇంతకన్నా నటుల పెర్ఫార్మన్స్ గురించి ఏమీ చెప్పలేం .

సాంకేతికత

పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం బాగానే ఉంది .
ఈ మూవీ అంతా దాదాపు వర్షం బ్యాక్ డ్రాప్ లో నైట్ డార్క్ మోడ్ లో సాగుతుంది కాబట్టి కెమెరాకి ఎక్కువగా పని ఉంటుంది . ఆనంద్ కుమార్ ఫోటోగ్రఫీ బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

ఈ స్టోరీ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యానికి చివర్లో దర్శకుడు చెప్పిన జస్టిఫికేషన్ బాగానే ఉంది . ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు సరిగా లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి . ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందకపోతే ప్రైవేట్ బడులు ఉన్నాయి . కానీ పోలీస్ వ్యవస్థలోనే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి అనే ఒక సందేశంతో దర్శకుడు పోలీస్ వ్యవస్థలోని లోపాలను బయటపెట్టే ప్రయత్నం చేసాడు .

పోలీసులు పెట్టే ఫేక్ కేసులు , ఫేక్ ఎన్కౌంటర్లతో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పడం మీదనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టున్నాడు . సరే , పోలీస్ వ్యవస్థలో ఉండే లోపాలను బయటికి తీసుకురావడం వరకు బాగానే ఉంది కానీ అదే సమయంలో పోలీస్ వ్యవస్థలో ఉన్న వీడేరా పోలీస్ అని అరిచి మరీ చెప్పే నిజాయితీపరుడైన సాయి కుమార్ లాంటి పోలీస్ పాత్రను ఒకటి దింపి ఉంటే బాగుండేది .

ఓవరాల్ గా రెగ్యులర్ మలయాళం మిస్టరీ మూవీలలో ఉన్నంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయినట్టు అనిపిస్తుంది . కన్నడ , మలయాళం వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని వన్ టైమ్ వాచ్ కింద చూడొచ్చు .

నటీనటులు : దేవరాజ్ , జాన్ కైపల్లిల్ , ప్రమోద్ శెట్టి తదితరులు
సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫీ : ఆనంద్ కుమార్
నిర్మాత : మంజు వాణి
దర్శకత్వం : ప్రదీప్
విడుదల : అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!