రామ్ చరణ్ కధానాయకుడిగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది మూవీ నిన్న ( 04 -06 -2026 ) థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంది . ఈ మూవీ మీద అటు చిరంజీవి అభిమానులు , ఇటు రామ్ చరణ్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు . అలా అంచనాలు పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంది . కొంత గ్యాప్ తర్వాత రామ్ చరణ్ పూర్తిస్థాయిలో మనసుపెట్టి కష్టపడిన సినిమా పెద్ది . ట్రైలర్లలోనూ , పోస్టర్లలోనూ రామ్ చరణ్ లుక్ చూసిన అభిమానులు ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని ఉత్సాహంతో ఎదురుచూసారు .
ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన సానా బుచ్చిబాబు రెండో సినిమా రామ్ చరణ్ తో చేయడంతో ఇండస్ట్రీలో కూడా పెద్ది మీద అంచనాలు ఏర్పడ్డాయి . మరి అభిమానులు , ఇండస్ట్రీ అంచనాలకు తగినట్టుగా పెద్ది మూవీ ఉందో ? లేదో ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
స్టోరీ గురించి తక్కువగా చెప్పుకుంటేనే మంచిది . ఇంకా ఎక్కువగా చెప్పుకుంటే వేరే సినిమాలు కొన్ని గుర్తుకొస్తాయి.
విజయనగరం జిల్లా చివరలో ఉండే కొండకింద షుమారు 1800 ల కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి . కొండకింద కుటుంబాలు అన్నప్పుడే ఆ ఊరికి పేరుకూడా లేదని అర్థమై ఉంటుంది . ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ ఊరికి పేరు లేదు . అసలు గుర్తింపే లేదు . ఆ కొండకింద నివసించే కుటుంబాలలో తల్లితో కలిసి ఉంటున్న పెద్ది ( రామ్ చరణ్ ) కూడా ఒకడు . వీళ్ళు మైళ్ళ దూరం నడుచుకుంటూ కొండలు , గుట్టలు దాటుకుని విజయనగరం చేరుకొని అక్కడి బెల్లపు బట్టిలలో వలస కూలీలుగా పనిచేస్తూ ఉంటారు . వీళ్ళు నివాసం ఉండే కొండమీదినుంచి రైలు వెళ్తుంది కానీ గుర్తింపు లేకపోవడంతో అక్కడ రైలు ఆగదు. తమకు రైల్వే స్టేషన్ వస్తే మైళ్ళ దూరం నడిచే బాధ తప్పుతుందని ఊరి జనాల ఆశ . అందుకే ఆ ట్రాక్ మీదుగా ఎప్పుడు రైలు వెళ్లినా ఎర్రజెండా ఊపుతూ ఆపాలని ప్రయత్నిస్తుంటాడు అప్పలసూరి ( జగపతిబాబు ) .
ఇదిలా ఉండగా విజయనగరం , బొబ్బిలి జట్ల మధ్య తరచూ పెద్దఎత్తున క్రికెట్ పోటీలు జరుగుతూ ఉంటాయి . క్రికెట్ ఆటగాడైన పెద్ది ఏ జట్టులో ఉంటే ఆ జట్టు గెలుస్తుందని పేరు ఉండటంతో ఆట కూలీ కింద అతడ్ని వేలంలో పాడుకుని క్రికెట్ పందాలు కాస్తుంటారు . అయితే అనుకోని పరిస్థితుల్లో పెద్ది క్రికెట్ ఆటకూలీ పని నుంచి తప్పుకుని కుస్తీ పోటీలకు దిగుతాడు .
క్రికెట్ ఆటని ప్రాణప్రదంగా ప్రేమించే పెద్ది ఆ ఆటను వదిలిపెట్టి కుస్తీ పోటీలవైపు ఎందుకు మారతాడు ?
పెద్ది ఆశయానికి గౌర్ నాయుడు ( శివరాజ్ కుమార్ ) ఎటువంటి సహకారం అందిస్తాడు ?
ఊరికి రైల్వే స్టేషన్ కావాలని పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అప్పలసూరి ఆశయాలను పెద్ది ఎలా సాధిస్తాడు?
చివరకు తన ఆశయ సాధన కోసం పెద్ది ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
ఒలింపిక్స్ లో భారత్ కేవలం రెండు స్వర్ణాలు మాత్రమే గెలుచుకోవడంతో కోపం వచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి క్లాస్ తీసుకుంటాడు . క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి గొప్ప ఆటగాళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం బోలెడు ఫండ్స్ ఖర్చు చేసి అకాడమీలు పెట్టినా నయాపైసా ఉపయోగం లేదని , పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో ఉన్న అన్ని స్పోర్ట్స్ అకాడమీలు రద్దు చేసి ఈ బడ్జెట్ అగ్రికల్చర్ రంగానికి కానీ ,డిఫెన్స్ రంగానికి కానీ కేటాయిస్తానని చెప్పడంతో కథ మొదలౌతుంది .
ఈ సన్నివేశం చూడగానే ఇదేదో క్రీడాస్ఫూర్తికి సంబంధించిన కథ అనుకుంటాం . కానీ ఎప్పుడైతే కారులో వెళ్తున్న అధికారికి ఒక ఊరిలో జనాలు అందరూ పెద్దిలోని గొప్ప ఆటగాడి గురించి చెప్పడం , అక్కడ్నుంచి ఆ అధికారి ఊరివాడితో కలిసి పెద్దిని కలవడానికి కొండలు గుట్టల వెంబడి నడవడం , ఈ ట్రావెలింగ్ లో అతడు పెద్ది గురించి తెలుసుకోవడం.. ప్రభుత్వ గుర్తింపు లేని కొండకింది కుటుంబాల గురించి తెలుసుకోవడంతో అసలు స్టోరీ అర్ధమౌతుంది . అసలు స్టోరీ అర్ధం కాగానే అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సినిమాలు కొన్ని గుర్తుకొస్తాయి .
ఆ పాత సినిమాలు గుర్తుకురాగానే సానా బుచ్చిబాబు తెరకెక్కించిన కధలో కొత్తదనం లేదని అర్ధమౌతుంది . అందుకే కథ గురించి ఎక్కువ లోతుల్లోకి వెళ్లోద్దని చెప్పింది . మరి ఈ మూవీ స్పెషాలిటీ ఏంటి ? అంటే RRR మ్యాజిక్ గురించి చెప్పుకోవాలి . ఇంతకీ RRR అంటే ఎవరై ఉంటారా ? అని అనుకుంటున్నారా ? వారే రామ్ చరణ్ , రెహమాన్ , రత్నవేలు .
వీరిలో మొదటి R రామ్ చరణ్ . ఈ మూవీతో నటుడిగా అతడు ఖచ్చితంగా ఇంకో మెట్టుపైకి ఎదుగుతాడు . ఈ సినిమా కోసం రామ్ చరణ్ నటుడిగా ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడి పనిచేసాడు . ఆ విషయం మూవీ చూసినవాళ్లకు అర్ధమౌతుంది . ఇక రెండో R ఎఆర్ రెహమాన్ .. రెహమాన్ అందించిన బీజీఎమ్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది . మూడో R రత్నవేలు .. కెమెరాతో అద్భుతాలు ఎలా చేయవచ్చో రత్నవేలు చూపించాడు . ఇతడి కెమెరా పనితనం చూడాలంటే రామ్ చరణ్ కుస్తీ పోటీలు జాగ్రత్తగా గమనించండి . అదొక్కటే కాదు ..ఆధ్లెట్ ట్రాక్ మీద రామ్ చరణ్ పరుగు , రన్నింగ్ ట్రైన్ ఎపిసోడ్స్ చూస్తే అర్థమైపోతుంది .
కధనంలో దర్శకుడు బుచ్చిబాబు తడబడినా ఈ ముగ్గురూ ఆ లోటును తీర్చారు . అయినా బుచ్చిబాబు గారూ ..అదేం పనండీ ? స్టార్ డమ్ ఉన్న రామ్ చరణ్ , స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ , స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ , స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు లాంటి మహామహులైన అంతమంది స్టార్ లను పెట్టుకుని కూడా మంచి స్టోరీ లైన్ నమ్ముకుని కధనం నడిపించకుండా ఆ బూతులవీ అవసరమా ? ఫ్యామిలీ ఆడియన్స్ పరిస్థితి ఆలోచించావా ? ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో క్యాబరేకు ఎక్కువ .. క్లబ్ డాన్సర్ కు తక్కువ టైపులో ఆ గెంతులు వేయించడం ఏంది ? ఆ బూతులు చెప్పించడం ఏంటి ? తెలుగమ్మాయి కాదు కాబట్టి ఆ అమ్మాయికి తెలీదేమో ? కానీ మీకు తెలుసు కదా ? అసలు ఒకటికి పదిసార్లు జాన్వీ కపూర్ నడుము వైపు , పైట లేని ఆమె ఎద వైపు కెమెరా నిలిపి జనాలకు ఏమి చూపిద్దామని ఆలోచన చేసారు . ఇకనైనా ఆ డీ గ్రేడ్ ఫార్ములా నుంచి బయటకు రండి . ముంబై హీరోయిన్ల స్కిన్ చూపించి పైసలు ఏరుకుందామనే ఆలోచనకు స్వస్తి చెప్పండి . మంచి కథలతో రండి.
అన్నట్టు జాన్వీ కపూర్ స్కిన్ షోలో పడిపోయి అసలు కథను మర్చినట్టున్నారు బుచ్చిబాబు గారు .. ఫస్టాఫ్ అంతా పైట లేకుండా జాన్వీ కపూర్ ను చూపించిన మీరు సెకండాఫ్ లో ఆమెను అపర సాధ్వీమణిగా చూపించడం అస్సలు సింక్ కాలేదు . అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో కూడా ఎవరికీ అర్ధం కాదు . ఈ కాన్సెప్ట్ తో ఫస్టాఫ్ లో చాలాభాగం కొండెక్కింది .
ఇక ఇంటర్నేషనల్ ఆధ్లెట్ పోటీల్లో పెద్ది గోల్డ్ మెడల్ గెల్చుకుని మీడియాతో కూడా మాట్లాడుతాడు . దేశమంతా తెలిసిన ఈ విషయం ఒలింపిక్స్ కమిటీకి కానీ , ఆయాసపడుతూ కొండఎక్కిన స్పోర్ట్స్ అధికారికి కానీ తెలియకపోవడం కడు శోచనీయం మరియు లాజికల్ మిస్టేక్ కిందికి వస్తుంది . ఇంత సింపుల్ లాజిక్ మరచి షుమారు రెండున్నర గంటలకు పైగా సినిమా నడపడం విచారకరం . సినిమా చూసి రివ్యూ రాసేటప్పుడు ఉన్నదున్నట్టుగా లోటుపాట్ల గురించి రాస్తేనే , భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకుని మీనుంచి మంచి సినిమాలు వస్తాయనే సదుద్దేశ్యంతోనే కొంత కఠినంగా రాయాల్సివచ్చింది .
ఇక సెకండాఫ్ లో కుస్తీ పోటీలను అద్భుతంగా పిక్చరైజ్ చేసారు . పెద్దిలో దర్శకుడి ప్రతిభ ఎక్కడ కనిపిస్తుందంటే జగపతిబాబు , శివరాజ్ కుమార్ , రావు రమేష్ వంటి పాత్రలను డిజైన్ చేసిన తీరులో కనిపిస్తుంది . నిజానికి అప్పలసూరి గెటప్ లో జగపతిబాబును వెంటనే పోల్చుకోలేకపోయాం . ఇంతకాలం అలవాటుపడిపోయిన మూస గెటప్ నుంచి జగపతిబాబును సరికొత్తగా చూపించడమే కాదు ఆయనలోని నటుడుని పూర్తిస్థాయిలో వాడుకున్న ఘనత దర్శకుడు బుచ్చిబాబుకే దక్కుతుంది . అలాగే శివరాజ్ కుమార్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి నటనను ఆశిస్తారో అది అందించారు . ఇక రామ్ చరణ్ ని అయితే మరే దర్శకుడు ఇంతలా వాడుకోలేదేమో ? ఇప్పటివరకు కనిపించని ఓ కొత్తకోణంలో రామ్ చరణ్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో బయటకు తీసుకొచ్చిన క్రెడిట్స్ దర్శకుడికే దక్కుతుంది .
ఇక క్లైమాక్స్ సన్నివేశాలు గుండెను మెలిపెడతాయి . ఫస్టాఫ్ లో చూసిన కొన్ని వెకిలి సన్నివేశాల ప్రభావం క్లైమాక్స్ ధాటిలో కొట్టుకుపోతాయి . ఆ కొండకింది ప్రాంతం మనుషులు .. రైల్వే స్టేషన్ ..ముఖ్యంగా పెద్ది మన మనసులనిండా నిండిపోతారు .
ఎవరెలా చేసారు ?
ఇందులో రామ్ చరణ్ ఒక డైలాగ్ ఉంటుంది .నేను కూలి కోసం ఆడటానికి రాలేదు .. ఆట మీద ప్రేమతో వచ్చాను అంటాడు .ఈ డైలాగ్ పెద్దిలో అతడి నటనకు కూడా వర్తిస్తుందేమో అనిపిస్తుంది . ఎందుకంటే కేవలం రెమ్యునరేషన్ కోసం రామ్ చరణ్ ఈ సినిమాలో నటించినట్టు లేదు . సినిమా మీద ప్రేమతో నటించినట్టున్నాడు . అతడి ప్యాషన్ , అతడి కష్టం సినిమా చూసిన ఎవరికైనా అర్ధమౌతుంది . టైటిల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని వేశారు . కరెక్టుగా వేశారు అనిపించింది . త్వరలో రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడు అవుతాడనడంలో సందేహం లేదు .
జగపతిబాబు గొప్ప నటుడని తెలుసు కానీ ఏ సినిమాలో చూసినా ఆ బవిరిగడ్డం తో ఒకేలా కనిపించేవాడు . దాంతో జగపతిబాబు అంటే మొనాటని వచ్చింది . పెద్దితో ఆ లోటు తీరింది. అప్పలసూరి గెటప్ లో జగపతిబాబు విశ్వరూపం చూసాం .
ఇక గౌర్ నాయుడు పాత్రలో శివరాజ్ కుమార్ జీవించేసాడు .
జాన్వీ కపూర్ గురించి చెప్పుకోవాలంటే జాలేస్తుంది . పెద్దిలో తన క్యారక్టర్ గురించి తెలుసుకునే సైన్ చేసిందో ? లేకపోతె వ్యాంప్ క్యారెక్టర్లలో సెటిల్ అయిపోదామని నిర్ణయించుకుందో తెలీదు కానీ ఇందులో అచ్చియమ్మ పాత్ర చూస్తే ఫ్యామిలీతో వెళ్లినవాడు కళ్ళుమూసుకోవాల్సిందే . ఇకనైనా మీ తల్లిగారి ఇమేజుకు తగ్గట్టుగా నటించమని కోరుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు .
సాంకేతికత
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పవర్ గురించి తెలుసు కానీ పెద్దిలో అతడు అందించిన బీజీఎమ్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాల్లో గూస్ బంప్స్ వచ్చాయి . కేవలం రెహమాన్ బీజీఎమ్ తోనే మూవీ ఇంకో మెట్టు పైకి ఎదిగింది అంటే అతిశయోక్తి కాదు .
అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా . కెమెరా పనితనం ఉండాలే కానీ వెండితెర మీద ఎన్నో మ్యాజిక్కులు చేయొచ్చు . రత్నవేలు కెమెరా మ్యాజిక్ పెద్దిలో అణువణువునా కనిపిస్తుంది .
నిర్మాణ విలువలు బాగున్నాయి
విశ్లేషణ
మూవీ స్టార్టింగ్ స్పోర్ట్స్ వైపు నడిపించి అటునుంచి ఊళ్ళో పెద్ది , పెద్ది అనే అరుపులతో రామ్ చరణ్ కు భారీ ఎలివేషన్లు ఇస్తూ హోరెత్తించిన దర్శకుడు జీపులో జాన్వీ కపూర్ ను దింపి స్తంభానికి డీ కొట్టడమే కాకుండా ప్రేక్షకుల ఉత్సాహం మీద కూడా డాష్ ఇచ్చాడు . అసలామె క్యారక్టర్ లేకపోయినా పెద్ది మూవీకి వచ్చిన నష్టం ఏమీ ఉండేది కాదనిపిస్తుంది . అంతగా కావాలంటే శృతిహాసన్ తో పాటు జాన్వీ కపూర్ ను కూడా వేయి దాయి ఐటెం సాంగ్ చేయించుకుని ముంబై ఫ్లయిట్ ఎక్కిస్తే సరిపోయేది . టోటల్ గా ఫస్టాఫ్ లో ఎదురయ్యే సాగతీత సన్నివేశాలు నిరుత్సాహపరుస్తాయి .
ఇక డబ్బింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది . విజయనగరం యాస కోసం మధ్యలో మాటల్ని మింగేయడంతో కొన్నిచోట్ల డైలాగులు సరిగా అర్ధం కావు . ఇక ఆ స్పోర్ట్స్ అధికారి మాటలైతే మరీ ఘోరం అప్పుడే అమెరికాలో పుట్టి తెలుగులో మాట్లాడుతున్న పిల్లాడిలా ఉంది .
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే కధనం చకచకా పరుగులు పెడుతుంది . అప్పలసూరి మరణం , పెద్ది కుస్తీపోటీల్లో చేరడం , నేషనల్ గేమ్స్ లో పోటీ చేయడం వంటి సన్నివేశాలతో మనల్ని చూపు పక్కకు తిప్పనీయవు . క్లైమాక్స్ మాత్రం గుండెలను బరువెక్కిస్తుంది . ఓవరాల్ గా పెద్ది మూవీ లో RRR మ్యాజిక్ కనిపిస్తుంది . అదే మనకు కిక్కిస్తుంది .
నటీనటులు : రామ్ చరణ్ , జాన్వీ కపూర్ జగపతిబాబు ,శివరాజ్ కుమార్ , రావు రమేష్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
దర్శకత్వం ; బుచ్చిబాబు సానా
విడుదల : 04- 06 -2026
రేటింగ్ : 2.75 / 5
