నూతన నటీ నటులు ఆదర్శ్ , చిత్ర శుక్ల జంటగా నటించిన గీత సాక్షిగా (Geetha Sakshiga Movie) మర్డర్ మిస్టరీ మూవీ ఆగస్టు 6, 2026 నుంచి ఈటీవీ విన్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది . 2023, మార్చిలోనే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుని తాజాగా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది .
ఈ సినిమాకి చేతన్ రాజ్ నిర్మాతగా వ్యవహరించగా , ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వం వహించారు . నిజ జీవితంలో వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించినట్టు నిర్మాణ సంస్థ తెలియచేసింది .
టైటిల్స్ లో వేసిన యానిమేషన్ పిక్స్ చూస్తే గతంలో ఢిల్లీ , హైద్రాబాదులో జరిగిన అత్యాచార సంఘటనలు గుర్తుకొస్తాయి . అయితే ఆ సంఘటనలకు , సినిమా కధకు లింక్ ఉందా ? లేదా ? అనేది రివ్యూలో చూద్దాం .
కధేంటంటే ?
అర్జున ( ఆదర్శ్ ) ఒక పబ్బులో డీజేగా పనిచేస్తూ ఉంటాడు . తల్లితండ్రులు , చెల్లితో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు . లైఫ్ లో సెటిల్ అయ్యాడు కాబట్టి పెళ్లిచేసుకోమని అతడి తల్లి కొడుకుని పోరుతూ ఉంటుంది . అయితే అర్జున తొలిచూపులోనే అమూల్యతో ప్రేమలో పడతాడు .
ఇలాంటి పరిస్థితుల్లో మనిషా అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన నేరం మీద అర్జునను సిఐ శంకర్ ( భవాని శంకర్ ) అరెస్ట్ చేస్తాడు . ఈ నేరం తాను చేయలేదని చెప్పినా సిఐ వినిపించుకోకుండా కేసును కోర్ట్ ముందు పెడతాడు . అక్కడ లీడింగ్ లాయర్ జోసెఫ్ ( శ్రీకాంత్ అయ్యంగార్ ) అర్జునకు వ్యతిరేకంగా వాదించి శిక్ష పడేలా చేస్తాడు .
ఐదేళ్ల తర్వాత ఏసిపి రూపేష్ ఈ కేసును రీ ఓపెన్ చేస్తాడు . ఇదే కేసులో అర్జున తరపున అమూల్య కోర్టులో వాదిస్తుంది .
ఏసిపి రూపేష్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ?
అసలు మనీషాని ఎవరు హత్య చేస్తారు ?
లాయర్ అమూల్య కోర్టులో ఈ కేసును ఎలా ఛేదించింది ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
నిజానికి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్టు నిర్మాణ సంస్థ ప్రచారం చేసినా ఇందులో ఢిల్లీలో , హైద్రాబాదులో జరిగిన సంఘటనలను పోలినట్టుగా సన్నివేశాలు ఉండవు . గీత సాక్షిగా కధలో ప్లాట్ వేరు . ఒక సామాన్య బాధితురాలికి అన్యాయం జరిగితే అధికారబలం ఆ తప్పును ఏ విధంగా కప్పిపుచ్చగలదో తెలియచేసే పాయింటుతో కథ రాసుకున్నారు .
మంత్రిగారి కొడుకు అయినా సరే తప్పుచేస్తే దండించాల్సింది పోయి అతడ్ని కాపాడటానికి కొంతమంది పోలీసులు చట్టాలను ఎలా దుర్వినియోగం చేస్తారో తెలిపే కథ ఇది . న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్ అన్యాయం తరపున ఎలా వకాల్తా పుచ్చుకున్నాడో తెలిపిన కథ ఇది .
ఇది మర్డర్ మిస్టరీ స్టోరీ అయినా మూవీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కన్నా కోర్ట్ డ్రామా ఎక్కువగా ఉంటుంది . మూవీ ఫస్టాఫ్ లోనూ , సెకండాఫ్ లోనూ కోర్ట్ సన్నివేశాలే ఎక్కువ రన్ అవుతాయి . సాధారణంగా మర్డర్ కేసుల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజరే ఎక్కువగా ఉంటుంది . కానీ ఈ మూవీలో దర్శకుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కన్నా కోర్ట్ డ్రామానే ఎక్కువగా నడిపారు .
సిఐ శంకర్ ఎలాగూ మంత్రి చెప్పినట్టే నడుచుకుంటాడు కాబట్టి అతడి ఇన్వెస్టిగేషన్ మీద మాట్లాడుకునేది ఏమీ ఉండదు . కానీ ఏసిపి రూపేష్ తోనైనా కొంత ఇన్వెస్టిగేషన్ డ్రామా నడిపి ఉంటే బాగుండేది . కేసు రీ ఓపెన్ చేయడం వరకే అతడి ఇన్వెస్టిగేషన్ పరిమితం చేసి మిగతా కధంతా దర్శకుడు లాయర్ అమూల్యతో నడిపించాడు . హీరోయిన్ పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేయాలనే దర్శకుడి ఆలోచన సరైనదే అయినా ఆ వేగంలో మిగిలిన పాత్రల స్కోప్ తగ్గించడంతో కధనంలో గాఢత తగ్గింది . చాలా సన్నివేశాల్లో హీరో కన్నా హీరోయిన్ డామినేషనే ఎక్కువగా కనిపిస్తుంది .
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో పోలీస్ , కోర్ట్ డ్రామాగా కధనాన్ని నడిపిన దర్శకుడు లాజిక్కులను వదిలేసాడు . సిఐ శంకర్ అర్జునని అరెస్ట్ చేసి కోర్టులో పెడితే అతడి తరపున వాదించటానికి లాయర్ ఉండడు . కానీ శిక్ష పడి కేసు రీ ఓపెన్ అయిన తర్వాత మాత్రం అతడి తరపున వాదించటానికి లాయర్ రెడీ అవుతుంది . సరే ఎలాగోలా ఈ కేసునుంచి అర్జున బయటపడటంతో అసలు హంతకుడు ఎవరన్న ప్రశ్న జడ్జితో పాటు మనకూ ఎదురౌతుంది . ఇక్కడే కధనం మీద మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది . ఎప్పుడైతే పిక్చర్లోకి మంత్రిగారి కొడుకుని తీసుకొస్తారో మిగతా కథ ప్రిడిక్టబుల్ అయిపోయి మనకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది .
మధ్యలో అర్జున తండ్రిని చంపడంతో స్టోరీ ఇంకో యాంగిల్లో టర్న్ అవుతుంది అనుకుంటాం . కానీ అటువంటిదేమీ జరక్కపోవడంతో డిజప్పాయింట్ అవుతాం . ఇక సెకండాఫ్ మొత్తం హీరోయిన్ తన చేతుల్లోకి తీసుకుని నడపడం కొంచం ఎక్కువైనట్టు అనిపిస్తుంది . ఫస్టాఫ్ లో హీరోయిజం చూపించిన అర్జున సెకండాఫ్ లో మనలాగే ఒక ప్రేక్షకుడు అవుతాడు .
ఇక క్లైమాక్స్ మనం ఊహించిన విధంగానే ఉండటంతో కొత్తగా ఫీల్ అవడానికేమీ లేదు . బహుశా దర్శకుడు క్లైమాక్సుని విభిన్నంగా ముగించాలనే ఆలోచన చేయలేదు అనిపిస్తుంది. అందుకే ఆ విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ ను నమ్ముకుని క్లోజ్ చేసేసాడు . సినిమా బిగినింగులో కూడా హీరో , హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ పేరుతో సాగతీయకుండా సింపుల్గా ముగించడం రిలీఫ్ ఇస్తుంది . ఫ్యామిలీ ఎమోషన్స్ డోస్ కూడా కొంచం తగ్గినట్టు అనిపిస్తుంది .
ఓవరాల్ గా ఈ మూవీలో దర్శకుడు కోర్ట్ డ్రామా మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది . మొత్తంగా చూస్తే ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది . మూవీలో బాధితురాలి కోణం కంటే బలవంతుడి కోణమే ఎక్కువగా కనిపిస్తుంది . హీరోకి శిక్ష పడటం , జైల్లో కసరత్తులు చేసుకోవడం , ఐదేళ్ల తర్వాత కేసు రీ ఓపెన్ అవడం , ఏసిపి మంత్రిగారిని ఎదిరించి అతడి కొడుకుని అరెస్ట్ చేయడం వంటి సన్నివేశాల్లో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమా కోసం హీరో అర్జున బాగా కష్టపడ్డాడు అనడానికి అతడి సిక్స్ ప్యాక్ బాడీ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది . ఎక్స్ప్రెషన్స్ , డైలాగ్ డెలివరీ కొంచం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది . మొదటి ప్రయత్నమే కాబట్టి బాగానే చేసాడు అని చెప్పాలి .
ఇక లాయర్ అమూల్య పాత్రలో చిత్రా శుక్ల నటన బాగానే ఉంది . ఈ మూవీలో ఆమెకు ఫుల్ స్కోప్ ఉన్న రోల్ దక్కింది .
రాజా రవీంద్ర నుంచి పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేదు అనిపిస్తుంది .
శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిలానే తనదైన శైలిలో నటించారు .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .
సాంకేతికత
గోపి సుందర్ అందించిన సంగీతం బాగానే ఉంది .
వెంకట హనుమ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
రొటీన్ కమ్మర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా కొంతవరకు నచ్చుతుంది . కాకపోతే దర్శకుడు మర్డర్ మిస్టరీ చుట్టూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ నడిపి ఉంటే బాగుండేది . దర్శకుడు ఎక్కువగా కోర్ట్ డ్రామా మీదనే ఫోకస్ పెట్టడంతో థ్రిల్లింగ్ పార్టులో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు . దానికి తోడు మలయాళం మర్డర్ మిస్టరీ జానర్ మూవీల మాదిరి ట్విస్టులు లేకపోవడంతో కధనం సాదాసీదాగా సాగుతున్నట్టు అనిపిస్తుంది .
ఇదే కోర్ట్ డ్రామా సన్నివేశాలని ఇంకాస్త సీనియర్ ఆర్టిస్టులతో నడిపిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది . థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను అన్నిరకాలుగా కాచివడపోసిన తర్వాతనే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి తీసుకుంటారనే పేరు ఆ సంస్థకు ఉంది . ఎందుకంటే ఈటీవీ విన్ సొంతంగా రన్ చేస్తున్న మూవీస్ కూడా మంచి రేటింగులు సాధించి దూసుకుపోతున్నాయి . ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ వారు తీసుకోవడం ఆశ్చర్యకరమే .
మర్డర్ మిస్టరీ జానర్లో మూవీలు చూడటానికి ఇష్టపడేవారు వన్ టైమ్ వాచ్ కింద ఈ మూవీని చూడొచ్చు .
నటీనటులు : ఆదర్శ్ , చిత్రా శుక్ల , రాజా రవీందర్ , శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం : గోపి సుందర్
సినిమాటోగ్రఫీ : వెంకట హనుమ
నిర్మాత : చేతన్ రాజ్
దర్శకత్వం : ఆంథోనీ మట్టిపల్లి
విడుదల : ఈటీవీ విన్ ( 06-08-2026 )
రేటింగ్ : 2.5 / 5
