కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన భారత్ భాగ్య విధాత మూవీ ( Bharat Bhhagya Viddaata movie ) ఈరోజు నుంచి ( ఆగస్టు 14 , 2026 ) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ZEE5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది . 26 / 11 ముంబై అటాక్స్ నేపథ్యంలో హిందీలో చిత్రీకరించిన ఈ మూవీ గత జూన్ నెలలో థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . తాజాగా ఈరోజు నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది . అయితే ఓటిటిలో ఈ మూవీని చూడదల్చుకున్న వారు ఒరిజినల్ హిందీ వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది .
ముంబై దాడుల నేపథ్యంలో పోలీస్ , సైన్యంతో పాటు వైద్య సిబ్బంది కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని , ఇప్పటివరకు వెలుగులోకి రాని అన్ సీన్ హీరోస్ ని ఈ మూవీ ద్వారా దేశానికి పరిచయం చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ తెలియచేసింది . మనోజ్ తపాడియా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కంగనా రనౌత్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు .
ఇప్పుడు భారత్ భాగ్య విధాత మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
కథ 2008 , డిసెంబర్ 24 వ తేదీన మొదలౌతుంది . ముంబై దాడుల నేపథ్యంలో టెర్రరిస్టును గుర్తుపట్టేందుకు సాక్ష్యం చెప్పాల్సిందిగా ఇన్స్పెక్టర్ కాంబ్లే ( సాయాజీ షిండే ) కామా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న గీత ( కంగనా రనౌత్ ) కోరడంతో మూవీ మొదలౌతుంది .
అయితే గీత పోలీసుల దగ్గర సాక్ష్యం చెప్పడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు . కామా ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు ఇతర నర్సులు , డాక్టర్లు , ఇతర సిబ్బంది ఉన్నా టెర్రరిస్టులకు భయపడి సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారు . అదే విషయం గీతకు చెప్పి ఆమెను కూడా సాక్ష్యం చెప్పొద్దని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంతో గీత ఒక్క క్షణం ఆలోచనలో పడుతుంది . జరిగిన సంఘటనలు ఆమె కళ్ళముందు గిర్రున తిరుగుతాయి .
కట్ చేస్తే స్టోరీ నవంబర్ 26 కి వెళ్తుంది . ముంబైలోని కామా ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న గీత మంచి పేరు తెచ్చుకుంటుంది . ఆమెకు తాను చేస్తున్న వృత్తే దైవం . రోగులకు సేవ చేయడంలో ఒక్కోసారి కుటుంబ సభ్యులను కూడా మర్చిపోతూ ఉంటుంది . గీతాలాగే ఇతర నర్సులు కూడా అంకిత భావంతో రోగులకు సేవ చేస్తూ ఉంటారు .
అలా ఎప్పటిలానే అందరూ ఆసుపత్రిలో సేవలు చేస్తున్న సమయంలో కొంతమంది టెర్రరిస్టులు ముంబైలో దాడులు చేస్తున్నారని తెలుస్తుంది . వారిలో ఇద్దరు టెర్రరిస్టులు ఆసుపత్రిలో ఉన్న వారిపై అటాక్ చేసి అందర్నీ చంపేయాలని ప్లాన్ వేసుకుని హాస్పిటల్ బిల్డింగులో అడుగుపెడతారు .
అప్పటికే ఆ హాస్పిటల్లో డాక్టర్లు , నర్సులు , పేషేంట్లు , ఇతర సిబ్బంది కలిపి మొత్తం 400 మందిదాకా ఉంటారు . వీరిలో ఇరవైమంది దాకా ప్రీ మెచ్యూర్ బేబీలు , కొంతమంది గర్భిణీ స్త్రీలు , కాన్సర్ రోగులు కూడా ఉంటారు . వీరిలో ఏ ఒక్కరికి వైద్య సేవలు అందకపోయినా ప్రాణాలు పోతాయి . అందుకే గీత నాయకత్వంలో నర్సులందరూ ఎలాగైనా ఆ టెర్రరిస్టులబారినుంచి పేషేంట్ల ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకుంటారు .
పేషేంట్ల ప్రాణాలను కాపాడటం కోసం గీత ఎటువంటి రిస్క్ తీసుకుంటుంది ?
బిల్డింగులోకి అడుగుపెట్టిన టెర్రరిస్టులు తాము అనుకున్న ప్లాన్ అమలుచేయగలిగారా ?
టెర్రరిస్టులను పట్టుకునేందుకు ముంబై పోలీసులు చేసిన ఆపరేషన్ ఫలించిందా ? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ .
ఎలా ఉంది ?
26 / 11 ముంబై అటాక్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో ఇది మొదటిది కాదు . బహుశా చివరిది కూడా కాదేమో ? వాస్తవంగా జరిగిన ఒకే సంఘటనను ఇప్పటికే కొంతమంది దర్శకులు విభిన్న కోణాలలో కథ రాసుకుని తెరకెక్కించారు . గతంలో ఇదే అంశం మీద హిందీలో ఒక సినిమా రిలీజ్ అయి మంచి వసూళ్లను కూడా రాబట్టుకుంది . తెలుగులో కూడా అడవి శేష్ నటించిన మేజర్ మూవీ కూడా ముంబై దాడుల నేపథ్యంలో తీసిందే . అయితే ఆ మూవీలు ముంబై దాడుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీస్ అధికారి , ఆర్మీ అధికారుల నేపథ్యంలో సాగుతుంది .
కానీ ఈ మూవీ కథ మాత్రం ముంబై దాడుల్లో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు చేసి 400 మంది ప్రాణాలను కాపాడిన నర్సుల నేపథ్యంలో ఉంటుంది . గతంలో మనం చూసిన సినిమాల్లో యాక్షన్ డ్రామా ఎక్కువగా ఉంటే , ఈ మూవీలో మాత్రం ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుంది . ఇందులో టెర్రరిస్టులు చేసిన హింస మీదకన్నా దర్శకుడు నర్సులు చేసిన సేవల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి కధనాన్ని నడిపించాడు .
నిజానికి ఇది చాలా మంచి ఆలోచన . హింసాత్మక సన్నివేశాలకోసం డ్రమ్ములకు డ్రమ్ములు రక్తాన్ని పారించకుండా , రోగుల ప్రాణాలు కాపాడేందుకు రక్తాన్ని ఎక్కించే నర్సింగ్ సేవల మీద దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో ఎమోషనల్ గా ఈ మూవీ చాలామందికి కనెక్ట్ అవుతుంది .
దర్శకుడు మనల్ని నేరుగా ఎమోషనల్ జోన్ లోకి తీసుకెళ్లకుండా మొదటి నలభై ఐదు నిముషాలు సాదాసీదాగా స్టోరీని నడిపించాడు . వైద్య వృత్తిలో ఉండేవారు రోగులకు సేవలు చేయడానికి ఒక్కోసారి ఫ్యామిలీకి కూడా ఎలా దూరంగా ఉండాల్సి వస్తుంది .. ఒకసారి హాస్పిటల్లో అడుగుపెట్టిన తర్వాత రోగుల ప్రాణాలు కాపాడేందుకే నిద్రలు మానుకుని ఎలా సేవలు చేస్తారు .. అత్యవసర సమయాల్లో కుటుంబానికి దూరంగా నైట్ షిఫ్టులు కూడా పనిచేయాల్సి రావడం వంటి మెడికల్ ఫీల్డులోని ఇబ్బందుల మీదనే దర్శకుడు దృష్టి పెట్టి కధనాన్ని నడిపాడు . నర్సులు తమకున్న టెన్షన్లు బయటపడకుండా రోగుల దగ్గర నవ్వుతూ పనిచేసే విధానాన్ని దర్శకుడు పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది .
ఇలా సాగుతున్న కధనం సడెన్గా ఇద్దరు టెర్రరిస్టులు ఆ బిల్డింగులోకి ఎంటర్ అయ్యారని తెలియడంతో యాక్షన్ డ్రామాగా టర్న్ అవుతుంది . నిజానికి టెర్రరిస్టులు ఆ బిల్డింగులోకి ఎంటర్ అయ్యారనగానే స్క్రీన్ ఎక్కడ ఎరుపెక్కిపోతుందో అని భయంగా చూసిన మనల్ని దర్శకుడు అలాంటి అతి హింస జోలికి పోకుండా సర్ప్రైజ్ చేస్తాడు . ఇక్కడనుంచి దర్శకుడు స్టోరీని నేరేట్ చేసిన విధానం బాగుంది . రొటీన్ కమ్మర్షియల్ ఫార్మాట్ జోలికి పోకుండా సాధ్యమైనంత వరకు సహజత్వానికే దర్శకుడు ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది.
సెకండాఫ్ షో రన్ టైమ్ లో వచ్చే సన్నివేశాలు మన హృదయాలను టచ్ చేస్తాయి . ఒకపక్కన టెర్రరిస్టులు బిల్డింగులోకి అడుగుపెట్టినా నర్సులు మాత్రం తమ వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా పేషేంట్ల ప్రాణాలను కాపాడే సన్నివేశాలు ఎమోషనల్ గా మనల్ని కదిలిస్తాయి . గర్భిణీకి డెలివరీ చేయడానికి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్లు లేకపోయినా అక్కడ దొరికిన ఒక బ్లేడ్ నే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ గా చేసుకుని నర్సులు తల్లీపిల్లల ప్రాణాలను కాపాడటం , నర్సులు చేస్తున్న సేవలు చూసి చలించిపోయిన హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ గీతకు సెల్యూట్ చేసి ‘ తన ప్రాణాలు పోయినా సరే టెర్రరిస్టులను ఎదుర్కుంటాను .. ఆర్డర్ ఇవ్వండి మేడం ‘ వంటి సన్నివేశాలు కదిలిస్తాయి .
సెకండాఫ్ మొత్తం కథ అంతా దాదాపు హాస్పిటల్ చుట్టూనే నడుస్తుంది . హాస్పిటల్లో టెర్రరిస్టులు జొరబడ్డారని తెలియగానే టీవీల్లో చూస్తున్న కుటుంబ సభ్యులు ఆందోళన పడి నర్సులకు ఫోన్లు చేస్తే , తమ భయాన్ని భయటపడనీయకుండా వాళ్లకు ధైర్యం చెప్పడం , మర్నాడు ముంబై పోలీసులు టెర్రరిస్టును అరెస్ట్ చేసిన తర్వాత నర్సులు ఇళ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు పడే ఆవేదన సీన్లు భావోద్వేగాలను టచ్ చేస్తాయి .
క్లైమాక్స్ లో గీత చెప్పే డైలాగులు కూడా బాగుంటాయి . ‘టెర్రరిస్టును గుర్తుపట్టడానికి పోలీసులు తనని రమ్మన్నప్పుడు ముందు భయపడ్డానని , కానీ తర్వాత ఈ నర్సింగ్ గౌన్ వేసుకుని , ఆ గౌనుకి మన మువ్వన్నెల జెండా బాడ్జీని తగిలించుకునేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది . ఆ ధైర్యం నేను వేసుకున్న ఈ నర్సింగ్ గౌను వల్ల వచ్చింది . బహుశా మన జెండా బ్యాడ్జి చూసిన తర్వాత ఆ టెర్రరిస్టు కూడా భయపడే ఉంటాడు’ అని చెప్పిన డైలాగ్ బాగా పేలింది .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో చేసినప్పటికీ ఆమెతో పాటు నటించిన మిగిలిన నర్సులు కూడా సినిమాని తమ భుజాల మీద వేసుకుని నడిపించారు . అందుకే ఈ సినిమాలో క్రెడిట్స్ ఇవ్వాలంటే కంగనాతో పాటు నటించిన మిగిలిన నర్సులకు కూడా ఇవ్వాలి .
సాంకేతికత
అమన్ పంత్ అందించిన సంగీతం బాగానే ఉంది .
ఫోటోగ్రఫీ మాత్రం కొన్ని సన్నివేశాల్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది అనిపిస్తుంది .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
26 / 11 ముంబై అటాక్స్ మీద ఇంతకుముందు వచ్చిన సినిమాలకన్నా ఈ మూవీ కథ విభిన్నమైన కోణంలో సాగుతుంది . ఈ సినిమా చూసిన తర్వాత మనం వైద్యో నారాయణ హరి అని మరోసారి గుర్తుచేసుకోకుండా ఉండలేం
మితిమీరిన హింస మీద కన్నా విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది మానవాళికి చేసే సేవల గురించి దర్శకుడు నేరేట్ చేసిన తీరు బాగుంది . ప్రస్తుతం ZEE5 ఓటిటిలో హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు .
నటీనటులు : కంగనా రనౌత్ , గిరిజా ఓక్ , స్మిత తాంబే , అత్యుత్ నామ్ దేవ్ తదితరులు
సంగీతం : అమన్ పంత్
నిర్మాత : డాక్టర్ జయంతిలాల్ గడా , కంగనా రనౌత్
దర్శకత్వం : మనోజ్ తపాడియా
విడుదల : ZEE5 ( 14-08-2026 )
రేటింగ్ : 3.5 / 5
