శివ సినిమాలో ఓ దృశ్యం ఉంటుంది .
రఘువరన్ తో డీల్ సెటిల్ చేసుకోవడానికి గొల్లపూడి మారుతీరావు ఓ రహస్య ప్లేసులో కలుసుకుంటాడు . యాక్చ్యువల్ గా మాట్లాడుకుందామని పిలిపించి రఘువరన్ ని లేపేద్దామని గొల్లపూడి ప్లాన్ .
కానీ ఇవేమీ పట్టించుకోకుండా గొల్లపూడి చెప్పిన ప్లేసుకి రఘువరన్ తన మనుషులతో వస్తాడు . అప్పటికే గొల్లపూడి కూడా తన మనుషులతో వస్తాడు .
అప్పుడు గొల్లపూడి అంటాడు ” చూసావా రఘువరన్ .. నేను పిలవగానే గుడ్డిగా నమ్మేసి ఎగేసుకుంటూ వచ్చావ్ ? నీ టైం దగ్గర పడింది.. వీడ్ని ఏసేయండ్రా” అని తన వెనకున్న రౌడీలకు చెప్తాడు .
ఆశర్యంగా ఆ రౌడీలు గొల్లపూడి మీదే తుపాకులు గురిపెడతారు . దాంతో గొల్లపూడి షాక్ అవుతాడు . తన దగ్గర జీతం తీసుకునే రౌడీలు తన మీదే తుపాకులు గురి పెట్టారేంటా ? అని తెల్లముఖం వేస్తాడు .
అప్పుడు రఘువరన్ ముందుకొచ్చి ” రేయ్ గొల్లపూడీ.. రౌడీయిజంలో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదురా ” అంటూ కత్తి తీసి కసుక్కున గొల్లపూడి గుండెలో గుచ్చుతాడు .
గొల్లపూడి అబ్బా అనుకుంటూ కూలిపోతాడు .
ఆగండాగండి
ఇదేంటి జూబ్లీ హిల్స్ బై పోల్ లో కారు పల్టీ కొట్టి హస్తం చేతిలోకి స్టీరింగ్ ఎలా వచ్చిందనేది విశ్లేషణ చేసుకుందాం అనిచెప్పి శివ సినిమా సన్నివేశం చెబుతున్నాడేంటి అనుకుంటున్నారా ?
శివ సినిమాలో రఘువరన్ చెప్పిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనే డైలాగ్ అన్ని రంగాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగానికి కూడా . ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక్కోసారి శత్రువు బలాన్ని , వ్యూహాన్ని తక్కువ అంచనా వేసి బొక్కబోర్లా పడతాం . రాజకీయాల్లో ఒక్కోసారి మహామహులు కూడా ఓడిపోవడానికి కారణం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే .
జూబ్లీ హిల్స్ బై పోల్ లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మొదటి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే రెండో కారణం శత్రువు బలాన్ని తక్కువగా అంచనా వేయడం . ఇక మూడో కారణం సరైన వ్యూహాలు లేకుండా ప్రచారానికి వెళ్లడం .
ఈ మూడు విషయాల్లో రేవంత్ జాగ్రత్త పడ్డాడు . కేటీఆర్ నిర్లక్ష్యం చేసాడు . అందుకే ఫలితాలు అలా వచ్చాయి . సరే కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ఏదో ఒక ఈక్వేషన్ లేకుండా ఆయన జూబ్లీ హిల్స్ గెలుపుమీద అంత నమ్మకం పెట్టుకోడు కదా ? అందుకే జూబ్లీ హిల్స్ లో ఎలాగైనా గెలిచి తీరతామనే కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వెనుక కొని కారణాలు ఉన్నాయి .
జూబ్లీ హిల్స్ లో దివంగత మాగంటి గోపినాధ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు..ఆయన మరణంతో ఆయన భార్యకు టికెట్ ఇవ్వడంతో సహజంగా సానుభూతి ఓట్లు పడతాయని భావించారు . ఎందుకంటే గతకొన్నేళ్ళుగా ఉప ఎన్నికల సరళి పరిశీలించినవారికి ఈ ఫార్ములా అర్థమైపోతుంది . పదిలో తొమ్మిది శాతం సింపతీ ఫార్ములా పనిచేసింది . కాబట్టి ఆమె గెలుపు సగం ఖాయం అనుకుని ఎన్నికల ముందే కేటీఆర్ ఫిక్స్ అయిపోయారు .
ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని రౌడీ గా ప్రొజెక్ట్ చేయడం వల్ల అతడి మీద నెగిటివ్ తో ఓట్లన్నీ తమకే పడతాయనే సింగిల్ పాయింట్ ఎజండాతో కేటీఆర్ , హరీష్ రావు , సునీతలతో సహా పార్టీ నాయకులంతా ప్రచారంలో పదేపదే రౌడీ నామం జపించారు . గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తారో చెప్పడం మరిచి ప్రత్యర్థి క్యారక్టర్ మీద ప్రచారం చేయడం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు . దాంతో గెలిస్తే బిఆర్ఎస్ ఏం చేస్తుందో అనే క్లారిటీ ప్రజలు మిస్ అయ్యారు .
ఇక క్రిమినల్ నేరారోపణలు ఉన్నవాళ్లు , కేసుల్లో విచారణలు ఎదుర్కుంటున్నవారిని బోలెడుమందిని ఇప్పటికే చట్టసభలకు పంపిన చరిత్ర ఓటర్లకు ఉంది . సాక్ష్యాత్తు ముఖ్యమంత్రులై అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు . కాబట్టి రౌడీ ప్రచారం పెద్దగా వర్కౌట్ కాలేదు . నేటి రాజకీయాల్లో అవినీతి కూడా ఒక భాగం అని ప్రజలు కూడా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు . కాబట్టి అటువంటి నెగిటివ్ ప్రచారాలు పెద్దగా వర్కౌట్ కావు .
గెలిచే సీటే కదా అనుకున్నారో , లేకపోతే రాజకీయ వైరాగ్యమో తెలీదు కానీ సునీతకు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో బి ఫార్మ్ , నలభై లక్షల చెక్కు ఇవ్వడం మినహా కేసీఆర్ జూబ్లీ హిల్స్ ప్రచారానికి రాలేదు . ఆయన నేరుగా ప్రచారానికి వస్తే ఫలితాలు ఇంకోలా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి . ఎందుకంటే కేసీఆర్ కు ఇప్పటికీ ప్రజల్లో అలాంటి ఛరిష్మా ఉంది .
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో తాము అవినీతి చేయలేదని హరీష్ రావు చెప్పిన మాటలకన్నా పూర్తి అవినీతి చేసారని కవిత చెప్పిన మాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి . ఇది సహజం కూడా. . తాను అవినీతి చేయలేదని సాక్ష్యాత్తు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి చెప్పే మాటలకన్నా అదే పార్టీ అధినాయకుడి కూతురు చెప్పే మాటలకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది . ఏపీలో షర్మిల ప్రభావంతో జగన్ కు జరిగిన డ్యామేజే కవిత ప్రభావంతో కేటీఆర్ కు జరిగింది .
సాక్ష్యత్తు కేసీఆర్ కూతురు కవిత తమ పార్టీలో అవినీతి జరిగిందని పదే పదే మీడియా సమావేశాల్లో చెప్పడం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఫ్యామిలీ గొడవలను నాలుగ్గోడల మధ్య పరిష్కరించుకోలేకపోవడం వల్ల ఏపీలో జగన్ కు జరిగిన డ్యామేజీ చూసి కూడా కవిత విషయంలో నిర్లక్ష్యం చేశారనిపిస్తుంది.
బిఆర్ఎస్ అవినీతి గురించి కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తే అవి కొంతవరకు రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది . కానీ కేసీఆర్ కూతురు , కేటీఆర్ చెల్లెలు అయిన కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో తమ పార్టీ అవినీతికి పాల్పడిందని చేసిన ఆరోపణలకు విలువ లేకుండా ఎలా ఉంటుంది ? ఇంత చిన్న లాజిక్ అంత పెద్ద వ్యూహకర్త కేసీఆర్ ఎలా మిస్ అయ్యారు ?
అసలే పార్టీ పేరు మార్పుతో కుదేలయిన బిఆర్ఎస్ పార్టీకి కవిత ఎపిసోడ్ నెత్తిన తాటికాయ పడిన సామెత గుర్తుచేస్తుంది . మౌనం కొన్ని విషయాల్లో మంచి చేస్తుంది కానీ అన్ని విషయాల్లో కాదు . కవిత విషయంలో కేసీఆర్ పాటించిన మౌనం ఎన్నికల ఫలితాల మీద కూడా ప్రభావం చూపించింది .
ఇప్పుడు శత్రువు రేవంత్ వైపు వ్యూహం చూద్దాం .
జూబ్లీ హిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే సంఖ్యా పరంగా పార్టీకి పెద్దగా కలిసొచ్చేది ఏమీ లేదు కానీ ఈక్వేషన్స్ పరంగా , వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ఈ గెలుపు చాలా అవసరం. ఇక్కడే రేవంత్ రెడ్డి జాగ్రత్తగా పావులు కదిపాడు .
ఢిల్లీ అధిష్టానం దగ్గర తన పరపతిని నిలుపుకోవాలన్నా , రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాచుకూర్చున్న సీనియర్లను కట్టడి చేయాలన్నా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం రేవంత్ రెడ్డికి చాలా అవసరం . అందుకే ఈ ఎన్నికను రేవంత్ రెడ్డి ఆషామాషీగా తీసుకోలేదు .
ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మూడు నెలల ముందే నలుగురు క్యాబినెట్ మంత్రులను , ఎమ్మెల్యేలను , ఇతర నాయకులను జూబ్లీ హిల్స్ లో మోహరించాడు . సాధారణంగా ఇదే ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడో అయితే ఓ కమిటీని నియమించి ఎన్నికల బాధ్యత అప్పచెప్పేవాడు . కానీ రేవంత్ పరిస్థితి అది కాదు . అతడికి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ప్రతి చిన్న గెలుపు కూడా అవసరమే .
అందుకే తమ గెలుపుకి అవసరమైన ఏ ఒక్క ఈక్వేషన్ని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆఖరికి జూబ్లీ హిల్స్ నియోజక వర్గ పరిధిలో ఉన్న 11 శాతం ముస్లిం ఓటర్లను కూడా నిర్లక్ష్యం చేయలేదు .అన్ని లెక్కలు వేసుకుని చూసుకున్నాడు .
బై పోల్ ముందు అప్పటికప్పుడు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చాడు . ఈ ఒక్క నిర్ణయం చాలు జూబ్లీ హిల్స్ బై పోల్ మీద రేవంత్ ఎంత గట్టిగా దృష్టి పెట్టారో తెలుసుకోవడానికి . అప్పటికప్పుడు అజర్ కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక అంతర్గతంగా ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ జూబ్లీ హిల్స్ బై పోల్ మాత్రమే అసలు కారణం అనేది బహిరంగ రహస్యమే . చూడండి.. కేవలం ఒక ఉప ఎన్నికలో గెలవడం కోసం ఏకంగా ఒక మంత్రి పదవినే అస్త్రంగా సంధించాడు . ఇలా జూబ్లీ హిల్స్ లో గెలుపుకు అవసరమైన ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా రేవంత్ అశ్రద్ధ చేయలేదు . ఇదే కాన్ఫిడెన్సుకు , ఓవర్ కాన్ఫిడెన్సుకు ఉన్న తేడా . బిఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్సుకు పోయి చేజేతులారా గెలిచే సీటును కోల్పోగా , రేవంత్ మాత్రం కాన్ఫిడెన్సుతో ఓడిపోయే సీటును గెలిపించుకున్నారు .
రేవంత్ వ్యూహం ఫలించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల పై చిలుకు ఓట్ల తేడాతో గెలిచారు . అందుకే ఒక్కోసారి యుద్ధంలో గెలవడానికి బలం కన్నా వ్యూహం ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది !
