1980 లలో విజయవాడలో జరిగిన వర్గ రాజకీయాల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది . ముఖ్యంగా సీనియర్ వంగవీటి రాధాకృష్ణమూర్తి హత్య తర్వాత ఆయన తమ్ముడు వంగవీటి మోహన రంగా పేరు తెరమీదకు వచ్చింది . అన్నగారి క్యాడర్ కు నాయకత్వ బాధ్యత తీసుకునేందుకు ఆయన ముందుకొచ్చారు . అప్పటిదాకా కలిసి ఉన్న వంగవీటి , దేవినేని బ్రదర్స్ విడిపోయి ఎవరికి వారు సొంత విద్యార్థి సంఘాలను నెలకొల్పుకున్నారు .
ఇదిలా ఉండగా సరిగ్గా దేవినేని మురళి హత్యకు కొద్దిరోజుల ముందు ఒక డైలీ న్యూస్ పేపర్ విజయవాడ మెయిన్ ఎడిషన్ లో ‘ రంగా పక్కలో మురళి బళ్ళెం ‘ పేరుతో ఒక వార్తా కధనం పబ్లిష్ చేసింది . అప్పట్లో ఈ వార్త విజయవాడలోని ఇరు వర్గాల్లో సంచలనం సృష్టించింది .
ఈ కధనం పట్ల దేవినేని వర్గం సంబరాలు చేసుకోగా వంగవీటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సదరు విలేకరి గత కొద్ది రోజులుగా విజయవాడలో జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ కధనం రాసారు . ఆ కధనంలో ప్రధానంగా విజయవాడలో వంగవీటి మోహన రంగా వర్గంపై దేవినేని మురళి ఏ విధంగా దూకుడుగా దూసుకెళ్తున్నాడో రాసాడు . విజయవాడలో వంగవీటి నాయకత్వానికి ధీటుగా దేవినేని మురళి కార్యక్రమాలు చేస్తున్నారని రాసారు . ఇకపై తన నాయకత్వంలో తమ విద్యార్థి సంస్థను అన్ని కాలేజీలలో విస్తరిస్తామని , ఈ ప్రక్రియలో తమదారికి ఎవరన్నా అడ్డొస్తే గతంలోలా ఉపేక్షించే పరిస్థితి ఉండదని మురళి నేరుగా వంగవీటి రంగాకు సవాల్ విసిరినట్టు ఆ కధనంలో రాసుకొచ్చారు . టోటల్ గా ఆ కధనం రంగా నాయకత్వాన్ని ప్రశ్నించే ధోరణిలో సాగింది .
సరే , ఆ కధనం గురించి చర్చించుకునే ముందు ఆనాటికి వాస్తవంగా విజయవాడలో ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం.
1970 వ దశకంలో విజయవాడలో కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉండేది ( ఏలుబడి అంటే నాయకత్వ పరంగా కానీ , క్యాడర్ పరంగా కానీ నిర్ణయాత్మక శక్తిగా ఉండేది ) . లేబర్ యూనియన్లలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించేవాళ్ళు . బస్ స్టాండ్ దగ్గర ఉన్న విజయవాడ టాక్సీ వర్కర్స్ యూనియన్ కు కమ్యూనిస్ట్ నాయకుడు చలసాని వెంకట రత్నం లీడర్ గా వ్యవహరించేవారు . విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు టాక్సీలు వెళ్లాలంటే ఆయన స్టాంప్ వేయాల్సిందే . ఏ ప్రాంతానికి ఎంత కిరాయి తీసుకోవాలి , యూనియన్ కు ఎంత కమిషన్ ఇవ్వాలి లాంటి అంశాలన్నీ యూనియన్ ఆఫీసులోనే డిసైడ్ అయ్యేవి .
ఇదే యూనియన్లో వంగవీటి రాధా ( మోహన రంగా అన్న ) కూడా చురుగ్గా ఉండేవాడు . కానీ టాక్సీ వర్కర్స్ కిరాయి విషయంలోనూ , యూనియన్ కమిషన్ విషయంలోనూ రాధాకు , వెంకట రత్నానికి మధ్య విభేదాలు వచ్చాయి . మెల్లిగా చలసాని వెంకటరత్నం నాయకత్వానికి రాధా ఆధ్వర్యంలో కొంతమంది కార్యకర్తలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు .
తదుపరి కాలంలో నాయకత్వంలో తీవ్రమైన పోటీలు వచ్చి 1972 లో చలసాని వెంకట రత్నం హత్య చేయబడి యూనియన్లు వంగవీటి రాధా ఏలుబడిలోకి వచ్చాయి . చలసాని వెంకట రత్నం హత్య కేసులో వంగవీటి రాధాతో సహా మరికొంత మందికి కింది కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది . కానీ హైకోర్ట్ ఈ కేసు కొట్టివేయడంతో రాధా బయటికి వచ్చాడు .
1974 లో చలసాని వర్గం వంగవీటి రాధాను హత్య చేయడంతో ఆయన సోదరుడు వంగవీటి మోహన రంగా తెరమీదికి వచ్చాడు . రాధా స్థానాన్ని రంగా భర్తీ చేస్తున్నాడని తెల్సుకున్న ప్రత్యర్థులు రంగాను కూడా తుదముట్టించడానికి స్కెచ్ వేశారు . ఈ విషయం తెలుసుకున్న రాధా క్యాడర్ రంగాని బలవంతంగా అజ్ఞాతానికి పంపించారు .
కొంతకాలం అజ్ఞాతంగా ఊటీలో గడిపిన రంగా తన అన్న ఆశయాలను సాధించేందుకు చావుకైనా వెనుకాడనని అజ్ఞాతం వీడి ధైర్యంగా విజయవాడ వచ్చేసారు . ఇక అక్కడ్నుంచి మెల్లిగా వంగవీటి మోహన రంగా కూడా విజయవాడలో కార్మిక నాయకుడిగా ఎదగడం మొదలుపెట్టాడు .తన అన్న రాధా మొదలుపెట్టిన ఆశయాలను సాధించటానికి ముందుకు కదిలాడు . రాధా స్థాపించిన విద్యార్థి సంస్థ యునైటెడ్ ఇండిపెండెన్స్ ను నగరంలోని అన్ని కళాశాలలలోనూ విస్తరించే దిశగా అడుగులు వేశారు . ఈ దశలో దేవినేని వర్గం కూడా రంగాతో కలిసి పనిచేసింది .
మరోవైపు రంగా కార్మిక నాయకుడిగా అన్ని యూనియన్లలోనూ బలంగా పాతుకుపోతున్నాడు. ఒకపక్కన కార్మిక నాయకుడిగా ఎదుగుతూనే మరోవైపు విద్యార్థి నాయకుడిగా కూడా ఎదగటానికి అన్న UI పేరుతొ స్థాపించిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను మరింత బలోపేతం చేసే దిశగా రంగంలోకి దిగాడు . కానీ ఈ దశలో విద్యార్థి సంస్థ విషయంలో రంగాకు , దేవినేని బ్రదర్స్ కు మధ్య విభేదాలు వచ్చాయి .
దాంతో దేవినేని సోదరులు రంగాతో విడిపోయి సొంతంగా USO పేరుతో వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టుకోవడంతో విజయవాడలో వంగవీటి , దేవినేని వర్గాలుగా విడిపోయారు . అప్పట్నుంచి రెండు వర్గాల మధ్య విజయవాడలో స్టూడెంట్ యూనియన్ల విషయంలో తరచూ ఘర్షణలు జరుగుతూ ఉండేవి .
సరిగ్గా ఈ పరిస్థితుల్లో విజయవాడ లయోలా కాలేజీలో ప్రచారం చేస్తున్న దేవినేని గాంధీని ప్రత్యర్థులు హత్య చేసారు . ఈ హత్య కేసులో పోలీసులు వంగవీటి మోహన రంగాతో పాటు మరికొంతమంది పైన కేసులు పెట్టి అరెస్ట్ చేసారు .
దేవినేని గాంధీ హత్య తర్వాత ఇరువర్గాలకు చెందిన కొంతమంది పెద్దలు శాంతి సంఘాలు ఏర్పాటు చేసుకుని కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు . ఆ నిబంధనల ప్రకారం వర్గ పోరాటాలకు విరామం ప్రకటించడం , ఎవరి సరిహద్దుల్లో వాళ్ళు కార్యకలాపాలు చేసుకోవడం ( గుణదల , కంకిపాడు ఏరియాలు దేవినేని నెహ్రు ప్రాంతాలుగా , విజయవాడ వంగవీటి ప్రాంతంగా హద్దులు నిర్ణయించుకున్నారు ) , ఏమన్నా సమస్యలుంటే శాంతి సంఘం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు .ఈ శాంతి సంఘం నిర్దేశించిన నియమాలకు ఇరు వర్గాలు కట్టుబడి ఎవరి ఏరియాలలో వాళ్ళు రాజకీయంగా ఎదగటానికి ఏర్పాట్లు చేసుకున్నారు .
దరిమిలా వంగవీటి మోహన రంగా కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ గా , ఎమ్మెల్యేగా ఎదగగా , దేవినేని నెహ్రు టిడిపిలో ఎమ్మెల్యేగా ఎదిగాడు . క్రమంగా వర్గ పోరాటాలు కాస్తా రాజకీయ పోరాటాలుగా మారిపోయాయి . హత్యా రాజకీయాలు తగ్గు ముఖం పట్టి ఎవరి స్థాన బలం వారు పెంచుకుంటున్నారు . ఇలా 1988 వరకు చిన్నాచితకా గొడవలు మినహా దాదాపు ప్రశాంతంగానే నడిచింది అని చెప్పాలి .
ఈ పరిస్థితుల్లో అకస్మాత్తుగా దేవినేని నెహ్రు తమ్ముడు మురళి రంగా వర్గం మీద దూకుడుగా దూసుకువస్తుండటంతో ఒక్కసారిగా విజయవాడ వాతారణం మారిపోయింది . మళ్ళీ పాత పగలు పడగలు విప్పాయి .
దీనికి పరాకాష్ట గా చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మురళి విజయవాడ నగరంలో పెద్ద ఊరేగింపు తీసి సరిగ్గా వంగవీటి రంగా ఇంటిముందు ఆగి మరీ నినాదాలు చేసాడు . అతడి దూకుడు ఎంతలా మారిందంటే రంగాకు చెందిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థులు మురళి భయానికి ఊళ్ళు విడిచిపెట్టి పోయారు .
మురళి అంతటితో ఆగలేదు . రంగా భార్య రత్నకుమారికి ఫోన్ చేసి రంగాని రోజులు లెక్కపెట్టుకోమని బెదిరించిన విషయం కూడా బయటికి వచ్చింది .
సరిగ్గా ఈ పరిస్థితుల్లో అప్పుడు పేపర్లో వచ్చింది ‘ రంగా పక్కలో మురళి బళ్ళెం ‘ అనే వార్తా కధనం . ఈ కధనం పబ్లిష్ అయినా తర్వాత విజయవాడలో వాతావరణం మారిపోయింది . నివురుగప్పిన నిప్పులా ఉంది . ఈ వార్త పబ్లిష్ అయిన కొద్ది రోజులకే 1988 మార్చిలో దేవినేని మురళి లా పరీక్షలు రాయడానికి కారులో నెల్లూరు బయలుదేరాడు .
అప్పటికే రంగాతో సహా ప్రత్యర్థులు ఎవరూ నగరంలో లేకపోవడంతో కీడు శంకించిన నెహ్రు మురళిని నెల్లూరు వెళ్లోద్దని ఆపటానికి ప్రయత్నం చేసాడు . ఆ రోజుల్లో ప్రత్యర్థులు నగరంలో లేకపొతే ఎవరికో స్పాట్ పెడుతున్నారని అర్ధం .
అయినా మురళి పట్టించుకోకుండా కొంతమంది అనుచరులను తోడుగా తీసుకుని మెటాడోర్ వ్యాన్ లో నెల్లూరు వెళ్లి పరీక్షలు రాసాడు . తిరుగు ప్రయాణంలో విజయవాడ వస్తుండగా చిలకలూరి పేట దగ్గరలో మురళి హత్య చేయబడ్డాడు . (ఇదే సన్నివేశాన్ని రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో వాడుకున్నాడు)
దానితో హత్యా రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది . ఆ సమయంలో వంగవీటి మోహన రంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు . అయినా పోలీసులు రంగాతో సహా మరికొంతమంది అనుచరులపై కేసులు పెట్టారు .
అదే సంవత్సరం డిసెంబర్ 26 న విజయవాడలో నిరాహార దీక్షలో ఉండగా వంగవీటి మోహన రంగా హత్య చేయబడ్డారు !
(ఈ ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ , ఫేస్ బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ఐకాన్ల ద్వారా చేయొచ్చు )
