సినిమాలో ‘సినిమా’ చూపించిన కాంత-మూవీ రివ్యూ !

Spread the love

మనం ఏదైనా సినిమా చూడాలనుకున్నప్పుడు అది లవ్ స్టోరీనా ,ఫ్యామిలీ మూవీనా , లేకపోతే కామెడీ , హర్రర్ స్టోరీ మూవీనా అనేది ముందు తెలుసుకుంటాం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో జానర్ మీద ఇష్టాలు , ఆసక్తి ఉంటాయి . దానికి తగ్గట్టుగా సినిమాలను ఎంచుకుంటాం .

పై జానర్లు ఏమీ కాకుండా సినిమా నేపథ్యంతోనే వచ్చే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. గతంలో వచ్చిన మహానటి మూవీ స్టోరీ అంతా సినిమా నేపథ్యంలోనే సాగుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంత మూవీ కూడా సినిమా నేపథ్యంలో తీసిన సినిమానే. దీన్నే సినిమాలోనే సినిమా చూపించడం అంటారేమో ? ఇది కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కిందికే వస్తుంది . మూడు గంటలు వెండితెర మీద మనం చూసే సినిమాల వెనుక మూడునెలల కష్టం ఉండొచ్చు ..మూడేళ్ళ శ్రమ కూడా ఉండి ఉండొచ్చు . కానీ ఒక కథ షూటింగ్ పూర్తిచేసుకుని సినిమాగా బయటికి వచ్చే క్రమంలో మనకి కనిపించని తెర వెనుక భాగోతాలు ఎన్నో ఉంటాయి . ఇదే పాయింట్ బేస్ చేసుకుని కాంత సినిమా తీశారు . ఒక సినిమా పూర్తి అయ్యేలోపు హీరోకి ,దర్శకుడికి సరైన సంబంధాలు ఉండాలి . లేకపోతే నష్టపోయేది నిర్మాతే.

సినిమాలకు సంబంధించి తెర వెనుక నిజ జీవితంలో దర్శకుడు , హీరో ల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ముచ్చటిస్తూనే కాంత లో కొంచెం సస్పెన్సు క్రైమ్ సీన్స్ మిక్స్ చేసారు . అదే కాంత సినిమాకి అదనపు ఆకర్షణ . నిజానికి ఇది సినిమా కథ కాదు . కధలాంటి నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన . ఇప్పుడు కాంత సినిమా ఎలా ఉందో చూద్దాం .

కాంత కధేంటి ?

కాంత కథ 1950 కాలం నాటి సినిమాల నేపథ్యంలో మొదలౌతుంది . అయ్య (సముద్రఖని ) సినిమా ఇండస్ట్రీలో పేరున్న దర్శకుడు . అప్పటికే ఎన్నో సినిమాలు తీసి హిట్ దర్శకుడిగా సినీ రంగంలో గౌరవం పొందుతుంటాడు . ఓసారి ఈయన తన తల్లి జీవితం ఆధారంగా శాంత అనే సినిమా తీద్దామని నిర్ణయించుకుంటాడు .

ఈ సినిమా కోసం తన శిష్యుడైన నట చక్రవర్తి టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్ ) హీరోగా , కుమారి ( భాగ్యశ్రీ బొర్షే ) హీరోయిన్ గా శాంత మూవీని మొదలుపెడతాడు . అయితే అనుకోకుండా సినిమా మధ్యలోనే ఆగిపోతుంది . ఎలాగైనా తన తల్లిపేరుతో మొదలుపెట్టిన సినిమాని పూర్తిచేయాలని నిర్ణయించుకుని ఎనిమిదేళ్ల తర్వాత అయ్య అదే సినిమాని తిరిగి మొదలుపెడతాడు . ఇందులో హీరో పాత్ర పోషిస్తున్న టికే మహదేవన్ కు ఆ విషయం చెప్తాడు .

కాకపోతే సినిమా పేరు శాంత బదులు కాంత అని మార్చి తాను చెప్పిన షరతులకు ఒప్పుకుని తీస్తేనే నటిస్తానని కండిషన్ పెడతాడు హీరో మహదేవన్ . తల్లి కోసం అయ్య ఆ షరతులకు ఒప్పుకుని సినిమా మొదలుపెడతాడు .

సినిమా అయితే మొదలైంది కానీ దర్శకుడుకి , హీరోకి క్షణం పడేది కాదు . మహదేవన్ ముందే షరతులు పెట్టడంతో షూటింగ్ తన ఇష్టప్రకారమే జరగాలని మొండిపట్టుదలకు పోతుంటాడు . మహదేవన్ షరతులకు అడుగడుగునా విసుక్కుంటుంటాడు దర్శకుడు అయ్య . ఈ ఇద్దరి ఈగోల మధ్య హీరోయిన్ నలిగిపోతూ ఉంటుంది .

ఇలాంటి దశలో ఓ హత్య జరుగుతుంది . అక్కడే కాంత కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ హత్య కేసును పరిశోధించడానికి ఇన్స్పెక్టర్ దేవరాజ్ ( దగ్గుబాటి రానా ) రంగంలోకి దిగుతాడు .

ఇంతకీ హత్యకి గురైంది ఎవరు ?
హంతకుడ్ని ఇన్స్పెక్టర్ దేవరాజ్ కనిపెడతాడా ?
హీరోకి , దర్శకుడికి మధ్య జరుగుతున్న గొడవలు పరిష్కారం అవుతాయా ? అనేది మిగతా కధలో తెలుస్తుంది

సినిమా ఎలా ఉంది ?

నిజానికి ఈ సినిమా కథను 1950 కి ముందు తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్నారు . అప్పట్లో తమిళ సూపర్ స్టార్ గా వెలిగిన త్యాగరాజ మహావతార్ కి , ఒక దర్శకుడికి పొసగక కేసులు , జైలు దాకా వెళ్ళింది వ్యవహారం . అప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీలో పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్న త్యాగరాజ కి దర్శకుడి తీరు నచ్చలేదు . దాంతో ఇద్దరూ పంతాలకు , పట్టుదలలకు పోవడంతో ఆ ప్రభావం సినిమా మీద పడింది .

సినిమా నిర్మాణంలో యూనిట్ మధ్య సఖ్యత ఏ విధంగా ఉంటుంది ? దర్శకుడికి , హీరోకి మధ్య వచ్చే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల నిర్మాతలు ఏ విధంగా నష్టపోతారు అన్న కోణంలో కాంత కథ రాసుకున్నారు . ఇదంతా ఇండస్ట్రీలో సాధారణంగా జరిగేదే . కేవలం తమిళ రంగంలోనే కాదు , అన్ని రంగాల్లో ఇలాంటి ఈగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి . తెలుగులో కూడా ఒక పాపులర్ హీరోకి , పాపులర్ గాయకుడికి మధ్య మిస్ కమ్యూనికేషన్ ఏర్పడి సదరు హీరోగారు కొన్నాళ్లపాటు తన సినిమాలకు కొత్త గాయకుడ్ని ఏర్పాటుచేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి . తర్వాత రాజీ పడి కథ సుఖాంతం అయ్యింది అనుకోండి . అలాగే దర్శకుడికి , హీరోకి పడక నిర్మాతలు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఇవన్నీ సినిమా పరిజ్ఞానం ఉన్న చాలామందికి తెలిసినవే .

అందుకే పూర్తిగా సినిమాల గురించే చూపిస్తే ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చన్న ముందస్తు ఆలోచనతో తెలివిగా కొద్దిగా క్రైమ్ సస్పెన్సు స్టోరీని మిక్స్ చేసారు . నిజానికి కాంత సినిమాకి ఈ ఫార్ములా వర్కౌట్ అయ్యింది . స్టోరీలో క్రైమ్ మిక్స్ చేయకపోతే రొటీన్ ఫార్ములా అయి ఉండేది .

హత్య కేసును పరిశోధించడానికి దగ్గుబాటి రానా రావడంతో ప్రేక్షకులకు క్యూరియాసిటీ కలిగిస్తుంది . అయితే రానా నేరపరిశోధన వేగంగా సాగకుండా నిదానంగా నడిచినట్టు అనిపిస్తుంది .

ఇక సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా 1950 ల నాటి సినిమాల కాలాన్ని తెర మీద జాగ్రత్తగా ఆవిష్కరించారు . అప్పటి నేటివిటీని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . కాకపోతే హత్య కేసు పరిశోధన నిమిత్తం దగ్గుబాటి రానా వచ్చేవరకు ప్రథమార్థం రొటీన్ గా సాగిపోతుంది . ద్వితీయార్థం మాత్రం అపరాధ పరిశోధన నవల చదువుతున్నట్టు అనిపిస్తుంది .

అన్నట్టు ఈ సినిమాలో అయ్య మొదలుపెట్టిన సినిమా మధ్యలో ఆగిపోయి తిరిగి మొదలైనట్టు కాంత సినిమా కూడా మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోయి తిరిగి షూటింగ్ కి వెళ్ళింది. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఈ సినిమా కొన్నాళ్ళు ఆగిపోయి తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకోవడం యాదృచ్ఛికమో , కాకతాళీయమో తెలీదు .

ఎవరెలా చేసారు ?

మలయాళ నటుడు ముమ్మట్టిని మలయాళీలు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పుడో ఓన్ చేసుకున్నారు . ఈరోజుకి ముమ్మట్టి సినిమాలకు తెలుగు నాట ఆదరణ ఉంది . ఆయన కొడుకే ఈ సినిమాలో కధానాయకుడు . దుల్కర్ సల్మాన్ కూడా తండ్రి బాటలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు .

ముఖ్యంగా సీతారామం , లక్కీ భాస్కర్ వంటి సినిమాల్లో చక్కటి నటన ప్రదర్శించి నటుడిగా తెలుగునాట కూడా మరోమెట్టు ఎక్కాడు . కాంత సినిమాలో కూడా దుల్కర్ సల్మాన్ తన గత సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా చక్కటి పెర్ఫార్మన్స్ చూపించాడు .

ఇక సముద్రఖని నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది ? క్యారక్టర్ ఆర్టిస్టులలో చక్కటి నటన కనపరచడంలో సముద్ర ఖని ఎప్పుడూ ముందుంటాడు. కాంత లో కూడా సముద్ర ఖని నటన బావుంది .

కధానాయిక భాగ్యశ్రీ చక్కటి లుక్స్ తో దుల్కర్ పక్కన అందంగా కనిపిస్తుంది .

ద్వితీయార్థంలో ఎంటర్ అయిన దగ్గుబాటి రానా తనదైన స్టైల్ లో ఇన్స్పెక్టర్ పాత్రను రక్తి కట్టించాడు .

సాంకేతికత

సాంకేతికత గురించి చెప్పుకోవాలంటే సినిమా 1950 ల కాలం నాటిది కాబట్టి అప్పటి నేటివిటీకి కనెక్ట్ అయ్యే విధంగా చూపించాల్సి ఉంటుంది . నాటి కాలాన్ని కళ్ళముందు ఆవిష్కరించడంలో డానీ సాంచెజ్ లోపెజ్ విజయం సాధించాడు . విజువల్స్ పరంగా ప్రేక్షకులను అప్పటి కాలానికి తీసుకెళ్లాడు . ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది .
బిజోయ్ నేపధ్య సంగీతం కూడా బావుంది .

ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే కాంత లో కేవలం సినిమా విషయాలనే చూపించకుండా క్రైమ్ ను కూడా మిక్స్ చేసి ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా స్క్రీన్ ప్రెజెన్స్ చేసాడు
ఇక్కడే అతడి పనితనం కనిపిస్తుంది .

అన్నట్టు ఈ సినిమాని మలయాళ నటుడు దుల్కర్ , తెలుగు నటుడు దగ్గుబాటి రానా సంయుక్తంగా తమిళ్ లో నిర్మించి విడుదల చేసారు . తెలుగు అనువాదం పూర్తి చేసుకున్న కాంత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయ్యింది .

నటీనటులు : దుల్కర్ సల్మాన్ , సముద్ర ఖని , దగ్గుబాటి రానా , భాగ్యశ్రీ తదితరులు
నిర్మాత : దగ్గుబాటి రానా , దుల్కర్ సల్మాన్ , ప్రశాంత్ పొట్లూరి , జోమ్ వర్గీస్
రచన , దర్శకత్వం : సెల్వమణి సెల్వరాజ్
విడుదల : నవంబర్ 14 , 2025
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!