వంగవీటి మోహనరంగా అభిమానులకు కూతురు ‘ఆశాకిరణం’ అవుతుందా ?

Spread the love

వంగవీటి ఆషాకిరణ్ గురించి చెప్పుకునేముందు ఆమె తండ్రి వంగవీటి మోహన రంగా గురించి చెప్పుకోవాలి . 1980 లలో ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన సామాజిక వర్గ నాయకుడిగా ఉవ్వెత్తున ఎగసిన కెరటం వంగవీటి మోహన రంగా . రాజకీయాల్లో కార్పొరేటర్ గా మొదలైన ఆయన ప్రస్థానం 1985 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడిగా ఎదిగే స్థాయికి చేరింది . అతిపిన్న వయసులో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు . క్రమంగా బెజవాడ రాజకీయాల నుంచి రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదిగారు .

అప్పటికి ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పి ప్రజాపోరాటాలు చేయడం మొదలుపెట్టారు . దీంతో ఆయన మీద పోలీస్ నిర్బంధాలు ఎక్కువ అయ్యాయి . ఆయన మీద , అనుచరుల మీద పోలీస్ కేసులు ,అరెస్టులు నడిచాయి. అయినా వంగవీటి మోహన రంగా వెనుకంజ వేయలేదు . తనదైన పంధాలో పోరాటాలు చేస్తూనే ఉన్నారు .

ఇటువంటి అలుపులేని పోరాటాలతో విజయవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రంగా రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో 1988 డిసెంబర్ 26 న నిరాహార దీక్షలో ఉండగా హత్యకు గురయ్యారు . ఆయన హత్య దరిమిలా ఏపీలో నిరసనలు తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంతో షుమారు 53 రోజులు కర్ఫ్యూ కూడా విధించారు .

అప్పట్లో ఈ హత్య తెలుగుదేశం ప్రభుత్వమే చేయించిందని ఆయన భార్య రత్నకుమారి కూడా ఆరోపించారు . రంగా మరణం తర్వాత టిడిపి నాయకత్వానికి వ్యతిరేకంగా ఆమె పోరాటాలు కూడా చేసారు .

రంగా మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన భార్య రత్నకుమారి కి విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆమె శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు .

ఇదే సమయంలో వంగవీటి చలపతిరావు రంగా అన్నగా తనను ఆయన వారసుడుగా ప్రకటించుకుని రాజకీయ అరంగేట్రం చేయడంతో ఉయ్యురు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు .

రంగా వారసులుగా బరిలోకి దిగిన ఇరువురు నాయకులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని , తమ ప్రధాన ప్రత్యర్థి తెలుగు దేశం మాత్రమేనని ప్రజల్లోకి వెళ్లారు . ఈ సందర్భంగా రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని కూడా అప్పట్లో ఆరోపణలు కూడా చేసారు.

అయితే అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలతో రత్నకుమారి టిడిపిలో జాయిన్ అవగా , వంగవీటి చలపతి రావు అనారోగ్యంతో కన్నుమూసారు . దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాతుకుపోయిన రంగా అభిమానులకు , బలమైన క్యాడర్ కు , ప్రధానంగా ఒక సామజిక వర్గానికి దిశా నిర్దేశం చేసే నాయకత్వం కరువైంది . వంగవీటి మోహన రంగా ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసారో అదే పార్టీలో ఆయన భార్య చేరడం ఆయన అభిమానులకు మింగుడుపడలేదు .

ఈ పరిస్థితుల్లో విజయవాడలో కొంతకాలం రాజకీయ సూన్యం ఆవరించింది . రంగా జయంతికి , వర్థంతికి కార్యక్రమాలు చేయడం మినహా నాయకత్వం చురుకైన పాత్ర పోషించలేకపోయింది . వంగవీటి మోహన రంగా స్థాయిలో ప్రజాపోరాటాలు కరువైపోయాయి .

ఈ తరుణంలో రంగా వారసుడిగా ఆయన తనయుడు వంగవీటి రాధా తెరమీదకు వచ్చారు. ఆయన రాజకీయ ప్రవేశం కూడా గమ్మత్తుగా జరిగింది. గాయంతో హాస్పిటల్లో చేరిన రంగా కుమారుడు అని పేపర్లో లోపలి పేజీల్లో వచ్చిన చిన్న వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది . ఈ వార్త క్షణాల్లో రాష్ట్రమంతా పాకిపోయింది . తమ అభిమాన నాయకుడి కొడుకుకు గాయం అవడం వారు తట్టుకోలేకపోయారు .

అసలే నాయకత్వ లేమితో దిక్కుతోచని స్థితిలో ఉన్న రంగా అభిమానులు , రాధా , రంగా మిత్రమండలి సభ్యులు , ఇతర బలమైన క్యాడర్ తండోపతండాలుగా విజయవాడలోని ఆసుపత్రికి తరలిరావడంతో రాధా పేరు హఠాత్తుగా వెలుగులోకి వచ్చింది . అప్పటివరకు రాధా ప్రత్యక్షంగా జనంలోకి రాలేదు .

రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నిజమైన వారసుడిగా రాధాను అభిమానులు గుర్తించడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా రాధాకి విజయవాడ తూర్పు నియోజక వర్గం టికెట్ ఇవ్వడంతో అతిపిన్న వయసులోనే 26 ఏళ్ళ వయసుకే రాధా ఎమ్మెల్యే అయ్యారు .

రాధా రాకతో వంగవీటి మోహన రంగా అభిమానుల్లో తిరిగి పూర్వపు స్థాయిలో ఉత్సాహం వచ్చింది . వంగవీటి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా అభిమానులు రాధాకు బ్రహ్మ రధం పట్టారు . దీనితో ఏపీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో తిరిగి పూర్వపు రాజకీయ చైతన్యం వచ్చింది .

సరిగ్గా ఈ దశలో వంగవీటి రాధా అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో రాజకీయకంగా చిన్న కుదుపు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన వంగవీటి రాధా ఓడిపోవడంతో రాజకీయంగా అయన కెరీర్ కు బ్రేక్ పడింది . వంగవీటి కుటుంబంలో మొదటి ఓటమి కింద రికార్డ్ నమోదు అయ్యింది .

దానితో రంగా అభిమానుల్లో తిరిగి రాజకీయ సూన్యత ఆవరించింది . చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని రద్దు చేయడంతో వంగవీటి రాధా జగన్ నాయకత్వంలోని వైసిపిలో చేరారు . కానీ వైసిపిలో కూడా రాధా ఇమడలేకపోయారు .

ఈ దశలో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఈ నిర్ణయం రంగా అభిమానులు ఊహించలేదు . రాధా నిర్ణయం ఏపీలో బలమైన సామాజిక వర్గంగా ముద్ర పడిన కాపులకు అస్సలు మింగుడుపడలేదు .

రంగాను హత్య చేసిన టిడిపి లోకి రాధా చేరడం ఏమిటని ఆవేదన చెందారు . కానీ వంగవీటి రాధా మాత్రం ‘ తన తండ్రిని టిడిపి కి చెందిన కొంతమంది వ్యక్తులు హత్య చేసినంత మాత్రాన అది మొత్తం టిడిపికి ఎలా ఆపాదిస్తామని ‘ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు .

తమ పార్టీలో చేరిన రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పిన టిడిపి నేత అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకపోవడంతో పార్టీలో ఆయన సామాన్య నాయకుడిగానే మిగిలిపోవాల్సి వచ్చింది. రంగాకు కంచుకోటలా నిలిచిన విజయవాడ తూర్పు నియోజకవర్గం వారసుడి చేజారి పరులపాలయ్యింది .

అప్పటినుంచి ఈ నాటివరకు టిడిపిలోనే కొనసాగుతున్న రాధా ఆక్టివ్ పాలిటిక్స్ లో మాత్రం ఉండకపోవడంతో అభిమానుల్లో కూడా నిస్తేజం ఆవరించింది . వంగవీటి జయంతి , వర్థంతి లకు భారీ ఎత్తున విగ్రహావిష్కరణలు చేయడం మినహా నేరుగా ప్రజల్లోకి వచ్చింది తక్కువ .

ఈ పరిస్థితుల్లో వంగవీటి మోహన రంగా ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్తానని ఆయన కూతురు ఆషాకిరణ్ ఆదివారం విజయవాడలో ప్రకటించింది . అయితే ఈమె నేరుగా రాజకీయ పార్టీలలో చేరే ఆలోచన చేయకుండా వంగవీటి క్యాడర్ ను బలోపేతం చేయడమే తన ప్రధమ లక్ష్యం అని ప్రకటన చేయడంతో వంగవీటి అభిమానుల్లో ఆశాకిరణం అయ్యింది .

రంగా అభిమానులు , రాధామిత్ర మండలి సభ్యులలో గ్యాప్ వచ్చిందని , తిరిగి వారందరినీ సమైక్య పరిచి రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని ఆమె చెప్పింది . ఇందుకోసం తాను ఏ పార్టీలో చేరేది అభిమానులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారు . ప్రస్తుతానికైతే ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పేసారు .

ఈమె ప్రకటన కార్యకర్తల్లో కొత్త ఊపిరిలూదింది . రంగా ఆశయాలను ఆయన కూతురు సాధిస్తుంది అని నమ్మకం పెట్టుకున్నారు .

ఇలాంటి పరిస్థితుల్లో నిస్తేజంగా ఉన్న బెజవాడ రాజకీయాల్లో రంగా వారసురాలిగా ఆషాకిరణ్ ఎంట్రీ ఆయన అభిమానులకు కొత్త ఉత్సాహం ఇస్తుందా ?

ఇప్పటికే వారసుల రాజకీయాలతో నిర్లిప్తత గా ఉన్న రంగా అభిమానులు సరికొత్తగా మరో వారసురాలు ఆశాకిరణ్ రాకను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ?

ఆశాకిరణ్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారు ?

ఇప్పటికే తండ్రి వారసుడిగా రాధా రాజకీయాల్లో కొనసాగుతున్ననేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి రంగా వారసులుగా ఇద్దరు ప్రజల్లోకి వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయి ?

రంగాకి కంచుకోటలా ఉన్న విజయవాడ తూర్పు నియోజక వర్గం తిరిగి రంగా వారసుల చేతికి చిక్కుతుందా ? అనే ప్రశ్నలకు ఆషాకిరణ్ భవిష్యత్ వ్యూహం సమాధానం అవుతుంది. ఇప్పటికీ వంగవీటి పేరు చెప్తే చాలు ఊళ్ళనుంచి పరిగెత్తుకుంటూ వచ్చే లక్షలాది మంది అభిమానులు ఉన్నారు . రంగా హత్య జరిగి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ గ్రామగ్రామాన ఆయన విగ్రహాలు వెలుస్తున్నాయి . క్యాడర్ కోసం నిలబడగలిగే నాయకత్వం ఉండాలే కానీ ఏపీ రాజకీయాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురావడం పెద్ద కష్టమైన పని కాదు . కాకపోతే రంగా అభిమానులు అందర్నీ ఒకే తాటిమీదకు తీసుకువచ్చి నాయకత్వం వహించగలిగితే చాలు ఆశాకిరణ్ కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో సందేహం లేదు .

ఇదిలా ఉండగా తన సోదరుడు వంగవీటి రాధా దుబాయి పర్యటనలో ఉన్న సమయంలోనే ఆషాకిరణ్ సంచలన వార్తను రిలీజ్ చేయడం వెనుక అసలు కథ ఏమై ఉంటుంది ?

చూద్దాం
వంగవీటి మోహన రంగా సామ్రాజ్యానికి ఎవరు పూర్వ వైభవం తీసుకొస్తారో .. చూద్దాం ?


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!