వలవు అంటే తెలుగులో మలుపు అని అర్థం.
ఇక ఈ మూవీ టైటిల్ పూర్తి అర్థం తెలుగులో సుమతి మలుపు.
అన్నట్టు ఈ మలుపు అనే పదం ప్రయాణాల్లో చాలామంది వినే ఉంటారు . ముఖ్యంగా రోడ్ ప్రయాణంలో చాలాచోట్ల మనకు మలుపులు ఎదురౌతాయి . కొన్ని చోట్ల ఈ మలుపు ప్రమాదం.. స్లోగా వెళ్ళండి అనే హెచ్చరిక బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి . ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న మలుపుల్లో నేషనల్ హైవే అథారిటీ వారు ప్రయాణీకులకు ముందస్తు జాగ్రత్తగా ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేస్తారు .
ఇప్పుడీ మలుపుల ఉపోద్ఘాతం దేనికి అంటారా?
సుమతి వలవు మూవీ కథ ప్రారంభం అయ్యింది ఈ మలుపు దగ్గరే .నిజానికి ఇది కథ కాదు.. నిజంగా జరిగిన సంఘటనే. కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఓ గ్రామానికి ఆనుకుని ఉన్న ఫారెస్ట్ లో ఇప్పటికీ సుమతి మలుపు ఉంది .
అయితే ఈ మలుపు అట్లాంటి ఇట్లాంటి మలుపు కాదు.. సుమతి అనే దయ్యం సంచరించే మలుపు అని ఆ గ్రామస్తుల నమ్మకం . వాస్తవ సంఘటనకు కొన్ని రంగులు అద్ది దర్శకుడు అదే పేరుతో సినిమాని తెరకెక్కించాడు .
ఇప్పుడు సుమతి వలవు మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే?
కేరళలోని కల్లెలి అనే గ్రామానికి మూడువైపులా ఫారెస్ట్ ఉంటుంది..గ్రామస్తులు పనుల మీద బయటికి వెళ్లాలంటే ఈ ఫారెస్ట్ దారి మీదుగా వెళ్లాల్సిందే . అయితే గ్రామస్తులు తమ పనులు ఏమున్నా పగలు చూసుకుని చీకటి పడేలోపు గ్రామానికి చేరుకుంటుంటారు .
ఇందుకు ఒక కారణం ఉంది . సుమతి అనే పేరు గల దయ్యం రాత్రి ఎనిమిది గంటల వేళ నుంచి ఈ మలుపులో సంచరిస్తూ ఉంటుందని వారి నమ్మకం .
బ్రిటిష్ వారు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని కూడా సుమతి భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయారని కథలు ప్రచారంలో ఉంటాయి . అందుకే చీకటి పడిన తర్వాత గ్రామస్తులు ఈ మలుపు వైపు వెళ్ళరు . దాంతో ఫారెస్ట్ అధికారులు ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి గ్రామస్తులను రాత్రి పూట ఆ దారిలో వెళ్లకుండా ఆపుతారు .
ఇదే గ్రామంలో అప్పు (అర్జున్ అశోకన్) అనే యువకుడు వీడియో క్యాసెట్ లైబ్రరీ నడుపుతుంటాడు . స్వతహాగా ఇతడు చాలా పిరికివాడు .
అయితే అదే గ్రామానికి చెందిన శేఖరన్ కూతురు మాలు ని ఈ అప్పు యే అడవి దాటించి మాయం చేసాడని శేఖరన్ కుటుంబం భావిస్తూ ఉంటుంది . మరోవైపు అప్పు ..శేఖరన్ చిన్న కూతురు భామ ( మాళవిక మనోజ్) తో ప్రేమలో పడతాడు . కానీ తమ పెద్ద కూతురు మాయం అవడం వెనుక ఇతడి ప్రమేయం ఉందని భావించి శేఖరన్ కుటుంబం భామకి వేరే వ్యక్తితో వివాహం జరిపించాలని ప్లాన్ చేస్తారు .
సుమతి అనే దయ్యం వల్లనే తన ప్రేమ కు ఆటంకాలు వచ్చాయని , ఈ విషయం సుమతి తోనే తేల్చుకుంటా అని అప్పు కోపంతో అడవిలో సుమతి మలుపు దగ్గరికి వెళ్తాడు .
అప్పుడు అప్పుకు సుమతి మలుపు దగ్గర ఎటువంటి అనుభవం ఎదురౌతుంది?
సుమతి మలుపుకి, అప్పుకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి?
అడవిలోకి వెళ్ళిన శేఖరన్ పెద్దకూతురు మాలు ఏమౌతుంది? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది.
ఎలా ఉంది?
కథ చదవగానే సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమైపోతుంది . అయితే అదే జానర్ కి కొంచం కామెడీ టచ్ కూడా ఇచ్చి దర్శకుడు దీనిని హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ మూవీగా మార్చాడు . అంటే కొన్ని హార్రర్ మూవీల మాదిరి పూర్తి సీరియస్నెస్ తో స్క్రీన్ ప్లే నడపకుండా మధ్య మధ్యలో హీరో చేతనే కామెడి ట్రాక్ పెట్టించాడు .
నిజానికి ఈ కథ కూడా కొత్తదేమీ కాదు . గతంలో చాలా సినిమాల్లో మనం చూసినవే .
హీరో.. హీరోయిన్ను ప్రేమించడం.. హీరోయిన్ ఫ్యామిలీ దృష్టిలో హీరో విలన్ అని ముద్ర పడటం.. చివరికి హీరో గురించి నిజం తెలుసుకుని హీరోయిన్ను ఇచ్చి పెళ్లిచేయడం చాలా రొటీన్ రోడ్డ కొట్టుడు ఫార్ములానే .
అయితే ఈ కథలో మనకు కాస్త కొత్తగా కనిపించేది ఏంటంటే ఫారెస్ట్ నేపథ్యం.. మలుపు.. సుమతి అనే దయ్యం చుట్టూ అల్లిన కథ . అది లేకపోతే మాములు స్టోరీ అయ్యుండేది .
హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ మధ్యలో సుమతి మలుపు పెట్టడమే ఈ మూవీకి ప్లస్ అవుతుంది .
సినిమా ప్రారంభమే అడవిలో కొండదేవతకు గ్రామస్తులు చేసే పూజతో ప్రారంభం అవుతుంది..కాసేపట్లోనే సుమతి ఇంట్రడక్షన్ కూడా అవుతుంది .
కట్ చేస్తే కథ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్న కల్లెలి అనే గ్రామంలోకి ఎంటర్ అవుతుంది . అక్కడ్నుంచి కాసేపు హార్రర్ ను పక్కనబెట్టి అప్పు.. భామల మధ్య దర్శకుడు లవ్ ట్రాక్ నడిపాడు. పనిలో పనిగా కొద్దిగా కామెడీ ట్రాక్ కూడా మిక్స్ చేశాడు .
ఈ మధ్య తెలుగు సినిమాల్లో చిచ్చరపిడుగులా దూసుకుపోతున్న బుల్లిరాజు మాదిరి ఇందులో కూడా భామ తమ్ముడి రూపంలో ఓ బుడతడి చేత పెద్ద మాటలతో యాక్షన్లు చేయించారు . బుడ్డోళ్ళ చేత పెద్ద పెద్ద మాటలు పలికించే సంప్రదాయం మలయాళంలో కూడా మొదలైనట్టు ఉంది.
ఇదిలా ఉండగా ఆ విలేజ్ వాతావరణం, అక్కడి మనుషులు, పరిసరాల్లో దర్శకుడు అచ్చు కేరళ గ్రామీణాన్ని దించేసాడు. కేరళ గ్రామీణ వాతావరణం చూడటానికి చక్కగా ఉంది.
ఇక యథాప్రకారం సినిమా కొద్దిగా స్లోగానే నడుస్తుంది . అక్కడక్కడా కొన్ని సాగతీత సన్నివేశాలు కూడా ఉన్నాయి.
సుమతి అనే దయ్యంతో హార్రర్ చేద్దామనుకుని దర్శకుడు అనుకున్నాడు కానీ ప్రేక్షకులని ఎక్కడా భయపెట్టలేకపోయాడు . దయ్యాలు అంటే పొడుగాటి గోళ్ళు, తెల్లటి కనుగుడ్లు ఉంటాయనే పాత ఫార్ములా నుంచి దర్శకుడు బయటపడినట్టు లేదు. ఇందులో కూడా అదే ఫార్ములా వాడాడు. ఆ గెటప్ లో ఆల్రెడీ బోలెడు దయ్యాలను చూసీ చూసి ప్రేక్షకుడు కూడా విసిగిపోయాడు. పైగా భయపడటం కూడా మానేశాడు. ఈ సంగతి తెలుసుకున్నాడేమో అదేదో మలయాళం సినిమాలో దర్శకుడు దయ్యాన్ని క్యూట్ గా చూపించాడు. ప్రేక్షకులు కూడా హాయిగా ఆ క్యూట్ దయ్యాన్ని ప్రేమించేశారు.
ఇక సుమతి మలుపు దగ్గర ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఎక్స్పీరియన్స్ ఎదురౌతుంది. అంతవరకు ఓకే.
అయితే ఆ సుమతి బ్యాక్ గ్రౌండ్ మరింత క్లారిటీగా చెప్పి ఉంటే ప్రేక్షకులకు కొంత కన్ఫ్యూజన్ తగ్గేది . క్లైమాక్స్ చూస్తే అసలు నిజంగా సుమతి అనే దయ్యం ఉందా? లేకపోతే కొందరు అల్లిన కట్టు కథా అన్న అనుమానం వస్తుంది. ముగింపులో ఇంకాస్త క్లారిటీ ఉంటే బాగుండేది. బహుశా రెండో పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు దర్శకుడు హింట్ ఇచ్చాడు. అందులో ఏమన్నా చెప్తాడేమో చూడాలి.
ఎవరెలా చేశారు?
అప్పు పాత్రలో అర్జున్ అశోకన్ నటన బాగుంది. ఈయన కామెడీ ట్రాక్ లో ఒదిగినంతగా హార్రర్ ట్రాక్ లో ఒదగడు అనుకుంటా. విలేజ్ లవర్ బాయ్ వరకు బాగానే నటించి మెప్పించాడు కానీ హార్రర్ సన్నివేశాల్లో హావభావాల విషయంలో కొద్దిగా వెనకబడినట్టు అనిపించాడు.
ఇక భామ పాత్రలో హీరోయిన్ మాళవిక నటన బాగానే ఉంది కానీ మూవీలో ఆమెకు తక్కువ స్పేస్ ఇచ్చారు. ఫుల్ టైమ్ లవ్ ట్రాక్ లేకపోవడంతో ఆమె పాత్ర నామమాత్రం అయ్యింది. అయితే కాసేపు కనిపించినా తన అందంతో బాగానే మెరిసింది.
ఇక మిగిలిన వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికత
రంజిన్ రాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది . అప్పు, భామల మధ్య నడిచిన ప్రణయ గీతం కుదిరింది . అప్పు తాగి పాడిన పాటలో కూడా మ్యూజిక్ జోష్ నింపింది.
కేరళ అంటేనే పచ్చదనం. అక్కడి ప్రకృతి అందాలను మరింత అందంగా కాప్చర్ చేయడంలో శంకర్ కెమెరా పనితనం కనిపించింది.
ఇక ఈ సినిమా తక్కువ బడ్జెట్లో తీసినా ఆ లోటు ఎక్కడా కనిపించకుండా నిర్మాణ విలువలు పాటించారు.
విశ్లేషణ
హార్రర్,సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది . హార్రర్ అంటే మరీ ఏసీలో కూడా సీట్లకు అతుక్కుపోయి గజాగజా వణికిపోయే సినిమా అయితే మాత్రం కాదు .
సినిమా కథ సుమతి మలుపు చుట్టూ రాసుకున్నా ఎక్కువ భాగం విలేజ్ లోనే నడుస్తుంది. మధ్య మధ్యలో ఆ సుమతి మలుపు దగ్గరికి తీసుకెళ్తాడు. నిజానికి ఆ మలుపు చూస్తే గ్రామస్తులు భయపడతారు కాని ప్రేక్షకులు అస్సలు భయపడరు. పైగా ఆ మలుపులో ఇంకేవన్నా కనిపిస్తుందేమో అని సీట్లలోనుంచి లేచి కూడా చూస్తారు. కానీ అంతకన్నా ఏమీ కనిపించదని అర్థమై బుద్ధిగా తిరిగి సీట్లలో కూర్చుంటారు.
కాకపోతే ప్రేక్షకుల అదృష్టం ఏంటంటే హర్రర్ సినిమా కాబట్టి డ్రమ్ముల కొద్దీ రక్తాన్ని పారించడం.. మితిమీరిన అసభ్య సన్నివేశాలు లాంటి మాస్ మసాలా ఫార్ములాలు ఇందులో లేవు. మధ్యలో ఆ మలుపు లేకపోతే ఫ్యామిలీ స్టోరీ లానే ఉంటుంది .
అయినా ఇప్పుడు జీ 5 ఓటీటీ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.
నటీనటులు: అర్జున్ అశోకన్, మాళవిక మనోజ్ తదితరులు
సంగీతం: రంజిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : శంకర్
దర్శకత్వం : విష్ణు శశి
విడుదల: జీ 5 ఓటీటీ
రేటింగ్: 2.75/5
