Pravinkoodu Shappu ( ప్రవింకూడు షాపు ) మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ (OTT) మూవీ రివ్యూ!

Spread the love

సౌబిన్ సాహిర్ , బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రవింకూడు షాపు ( Pravinkoodu shappu movie ) మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు సోని లివ్ ఓటిటిలో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా స్ట్రీమింగ్ లోకి వచ్చి మంచి రేటింగుతో దూసుకుపోతుంది . 2025 జనవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా ఓటిటిలో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ సాధించింది .

మలయాళ నటులు సౌబిన్ సాహిర్ , బాసిల్ జోసెఫ్ లు ఇద్దరూ చక్కటి నటులుగా తమని తాము ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు . ఇద్దరికీ మళయాళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . పైగా సౌబిన్ సాహిర్ తో క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ అంటే చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు . డిజిటల్ ప్లాట్ ఫామ్ లు వచ్చిన తర్వాత సగటు ప్రేక్షకుడి పని తేలికైంది . థియేటర్లలో చూడలేకపోయిన నచ్చిన పరభాషా చిత్రాలను హాయిగా ఇంట్లోనే చూడగలుగుతున్నారు .

సినిమా మొత్తం ఒక కల్లుదుకాణం చుట్టూ తిరుగుతుంది కాబట్టి దర్శకుడు ఆ టైటిల్ పెట్టినట్టున్నారు . ఇప్పుడు ప్రవింకూడు షాపు మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

మూవీ స్టార్టింగ్ ఒక మర్డర్ తో మొదలౌతుంది . కేరళలోని మారుమూల విలేజ్ లో కల్లుదుకాణం నడిపే కొంబన్ బాబు (శివజిత్ ) అదే కల్లుదుకాణంలో ఉరికి వేలాడుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు . రాత్రి సరిగ్గా కల్లుదుకాణం మూసివేసే సమయానికి బయట వర్షం పడటం మొదలవడంతో దుకాణం యజమాని బాబు , అందులో పనిచేసే కన్నన్ ( సౌబిన్ సాహిర్ ) , విలేజీకే చెందిన సుని ( చెంబన్ వినోద్ ) లతో కలిపి మొత్తం 11 మంది ఆ రాత్రికి దుకాణంలోనే ఉండిపోతారు . తెల్లారి చూస్తే దుకాణం యజమాని బాబు ఉరికి వేలాడుతూ కనిపిస్తాడు . ముందు బాబు సూసైడ్ చేసుకున్నాడేమో అని అందరూ అనుమానపడతారు .

కానీ మాజీ ఆర్మీ పర్సన్ అయిన సుని మాత్రం అది సూసైడ్ కాదు మర్డర్ అని అనుమానపడతాడు . రాత్రి దుకాణం తాళాలు వేసి ఉండటం వల్ల బయటివాళ్ళు ఎవరూ దుకాణంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి తమ 11 మందిలో ఒకరు ఈ మర్డర్ చేసి ఉంటారని సుని భావిస్తాడు .

ఈ కేసును ఇన్స్పెక్టర్ సంతోష్ ( బాసిల్ జోసెఫ్ ) టేకప్ చేస్తాడు . ఎటువంటి క్లిష్టమైన కేసునైనా పదిరోజుల్లో ఛేదిస్తాడని డిపార్ట్మెంట్లో సంతోష్ కు మంచి పేరుంటుంది . పైగా తాను తెలివైనవాడినని సంతోష్ నమ్ముతుంటారు కూడా . అందుకే ఆ 11 మందినీ విడివిడిగా పిలిపించి ఎంక్వైరీ చేస్తాడు . కానీ అతడికి కావాల్సిన ఎవిడెన్స్ దొరకదు . ఎందుకంటే ఆ 11 మందికీ బాబుతో ఏదోరకంగా గొడవలు ఉన్నాయి .

ఆ 11 మందిలో బాబును ఎవరు చంపినట్టు ?
సంతోష్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ?
కన్నన్ , సుని ల మీద ఇన్స్పెక్టర్ సంతోష్ ఎందుకు అనుమానపడతాడు ?
ఇన్స్పెక్టర్ సంతోష్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
కన్నన్ భార్య మిరిండాకు ఈ సంఘటనలకు ఉన్న సంబంధం ఏంటి ? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది ?

సాధారణంగా మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీలన్నీ ఒక మర్డర్ తోనే మొదలౌతాయి . సరే మర్డర్ జరిగాక ఏమౌతుంది ? పోలీసులు వస్తారు .. ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు .. క్లైమాక్సులో కిల్లర్ ఎవరో కనిపెడతారు . ఏ స్టోరీ అయినా ఇంతే కదా ? అయితే వీటిలో కొన్ని సినిమాలే ఎందుకు హిట్ కొడతాయి ? మరికొన్ని ఎందుకు ఫట్ అవుతాయి ? అంటే వచ్చే సమాధానం స్టోరీ నేరేషన్ , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది సినిమా హిట్టా ? ఫట్టా అనేది డిసైడ్ చేస్తుంది . అందుకే ఇలాటి జానర్లో మూవీలు తీసి కొంతమంది దర్శకులు హిట్ కొడుతున్నారు . ఫార్ములా వాడటం రాని దర్శకులు డిజాస్టర్ అందిస్తున్నారు .

ఇక ఇప్పుడు ఈ మూవీ విషయానికి వద్దాం . అందరిలాగానే ఈమలయాళ దర్శకుడు మర్డర్ తోనే మిస్టరీని మొదలెట్టాడు . ప్రధాన పాత్రల క్యారక్టరైజేషన్ జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నాడు. కల్లుదుకాణంలో పనిచేసే కన్నన్ కు ఒకరకమైన మ్యానరిజం ఉంటే , ఇన్స్పెక్టర్ సంతోష్ కు ఇంకోరకంగా మ్యానరిజం ఉంటుంది . ఒక్కోసారి కన్నన్ పాత్రలో సౌబిన్ సాహిర్ ను చూస్తుంటే పదహారేళ్ళ వయసులో కుంటుకుంటూ నడిచే చంద్రమోహన్ గుర్తుకొస్తాడు . కాలికి లోపం వల్ల కుంటుకుంటూ నడిచే పాత్రలో కన్నన్ క్యారక్టర్ పరిచయం చేయడంతో దర్శకుడి ఛాయిస్ సరైనదే అనిపిస్తుంది . ఎందుకంటే కధకు కూడా ఆ క్యారక్టర్ డిఫరెంట్ గా కనపడటం అవసరం . అందుకే ఇన్స్పెక్టర్ కన్నన్ మీద అనుమానపడినప్పుడు మనమూ అతడిమీదే అనుమానం పడతాం . దానికి తగట్టుగా కన్ననే ఈ మర్డర్ చేసి ఉంటాడు అనడానికి వీలుగా బాబుతో , కన్నన్ భార్యకు రిలేషన్ ఉందేమో అన్న అనుమానాన్ని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు .

మనం అనుమానపడినట్టు అతడే కిల్లర్ అయితే థ్రిల్ ఏముంది ? అందుకే దర్శకుడు అనుమానాన్ని కన్నన్ మీదనుంచి సుని వైపు తిప్పాడు . ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించే మలుపే . దాంతో మన అనుమానాలన్నీ సుని మీద మళ్ళుతాయి . ఎందుకంటే సుని ఈ మర్డర్ చేయడానికి అవకాశం ఉన్న కొన్ని ఎవిడెన్సులు ఎస్టాబ్లిష్ అవుతాయి .

దాదాపు ఫస్టాఫ్ అంతా కథ ఈ ఇద్దరి చుట్టూనే తిరుగుతుంది . సెకండాఫ్ కి వచ్చేసరికి ఈ ఇద్దరిలో ఒకరు మర్డర్ చేసి ఉంటారని మనం డిసైడ్ అయిపోతాం .సరిగ్గా ఇక్కడే దర్శకుడు కథను ఇంకో మలుపు తిప్పాడు . అసలు ఈ మర్డర్ ఇన్స్పెక్టర్ సంతోష్ ఎందుకు చేసి ఉండకూడదు ? ఇదీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ . అప్పటిదాకా కిల్లర్ ఆ ఇద్దరిలో ఒకరై ఉంటారని మనం ఫిక్స్ అయిపోతున్న తరుణంలో దర్శకుడు మన ఫోకస్ ఇన్స్పెక్టర్ సంతోష్ వైపు మళ్ళించాడు . నిజమే ఇన్స్పెక్టర్ సంతోష్ ఈ మర్డర్ ఎందుకు చేసి ఉండకూడదు ? అతడు బాబును మర్డర్ చేయడానికి అవకాశం ఉందని మనం అనుమానపడటానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉపయోగపడుతుంది . మళ్ళీ క్వశన్ మార్క్ మొదలౌతుంది ? అసలు కిల్లర్ ఎవరో తెలియక ఈ ఊగిసలాట ప్రీ క్లైమాక్స్ వరకు కొనసాగి ఉత్కంఠత రేకెత్తిస్తుంది .

ఇక క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనం ఊహించని విధంగా ఉండి థ్రిల్ కలిగిస్తుంది . అసలు ఆ మర్డర్ ప్లాన్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది . మాములు మనుషులు కూడా ఒక మర్డర్ ని ఇంత ప్లాన్డ్ గా చేస్తారా ? అనిపిస్తుంది . స్టార్టింగులోనే ఒక మర్డర్ తో మొదలెట్టి మెలిమెల్లిగా ఒక్కో పాత్ర మీద అనుమానం వచ్చేలా చేసి క్లైమాక్సులో ఉత్కంఠత రేకెత్తించేలా అసలు విషయాన్ని రివీల్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథను మొదట్నుంచీ చివరివరకు ఒక టెంపో లో చెప్పుకుంటూ పోయిన దర్శకుడు ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా చేసాడు .

కల్లుదుకాణంలో గుంపు ఎక్కువ అవడం , ఆ 11 మందికీ బాబుతో గొడవలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోవడం , అందుకోసం అనవసరమైన ఫైటింగులను ఇరికించడం , సన్నివేశాలను రిపీటెడ్ చేయడం వంటివి మనకి బోర్ కొడతాయి . సీరియస్ టోన్ లో సాగే క్రైమ్ థ్రిల్లర్ కధనంలో మధ్య మధ్యలో డార్క్ కామెడీ పండించాలనే దర్శకుడి ఆలోచన అభినందనీయమే కానీ కొన్నిచోట్ల ఓవర్ డోస్ అయి వికటించింది . ఫస్టాఫ్ లో బాసిల్ జోసెఫ్ తో చక్కటి కామెడీ పండించిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం అతడ్ని జోకర్ని చేసేసాడు . కిల్లర్ ని వెతికి పట్టుకుని బయటికి తీసుకువచ్చే పాత్రలో పవర్ ఫుల్ గా కనిపిస్తాడు అనుకున్న ఇన్స్పెక్టర్ పాత్ర కాస్తా చివర్లో కామెడీ అయిపోవడంతో కొంత డిజప్పాయింట్ గా అనిపిస్తుంది . ఇక క్లైమాక్సులో కిల్లర్ ఎవరనేది క్లారిటీ వచ్చినా ఇన్స్పెక్టర్ సంతోష్ కన్నన్ భార్య మిరిండాతో మాట్లాడుతూ అసలు కిల్లర్ వేరే ఉన్నారని చెప్తూ ముగించడం చూస్తే దర్శకుడు రెండో పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది .

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాని మొత్తం ముగ్గురు తమ భుజాల మీద వేసుకుని నడిపించారు . వారిలో మొదటివారు సౌబిన్ సాహిర్ . అతడికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి . బాడీ లాంగ్వేజును మార్చుకుని డిఫరెంట్ స్టైల్లో నటించి మెప్పించాడు . ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సౌబిన్ సాహిర్ వావ్ అనిపించాడు .

బాసిల్ జోసెఫ్ కూడా డిఫరెంట్ మ్యానరిజం బాగా పండించాడు . తనని తాను తెలివైనవాడు అనుకోవాలి .. ఎలాంటి కేసునైనా పది రోజుల్లో తేల్చేస్తాననే కాన్ఫిడెన్సులో ఉండాలి . ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్సులు దొరక్క ట్విస్టులు ఎదురైతే ఫ్రస్టేట్ అయిపోవాలి . ఇలా డిఫరెంట్ షేడ్స్ లో బాగా నటించాడు .

ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మూడో వ్యక్తి మిరిండా . చాందినీ శ్రీధరన్ ఈ పాత్రలో ఒదిగిపోయింది .

సాంకేతికత

విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది .
అలాగే షైజు ఖాలిద్ ఫోటోగ్రఫీ కూడా బాగుంది .
నిర్మాణ విలువలు పర్లేదు .

విశ్లేషణ

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ప్రవింకూడు షాపు మూవీ నచ్చుతుంది. కాకపోతే ఫస్టాఫ్ లో వచ్చే కల్లుదుకాణం గుంపు చేసే అతితో కొంచం చికాకు వస్తుంది . సెకండాఫ్ నుంచి మాత్రం కధనం పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో పరుగులు పెడుతుంది . కన్నన్ భార్య మిరిండా రాకతో కధలో గ్రిప్పింగ్ పెరుగుతుంది . ప్రీ క్లైమాక్స్ వరకు కనిపించే ట్విస్టులు థ్రిల్ పంచితే క్లైమాక్సులో కనిపించే ట్విస్ట్ మాత్రం వావ్ అనిపిస్తుంది .

ఓవరాల్ గా మూవీ బోర్ అయితే కొట్టదు . సోని లివ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పటివరకూ చూడనివాళ్ళు ఓ లుక్కేయండి .

నటీనటులు : సౌబిన్ సాహిర్ , బాసిల్ జోసెఫ్ , చాందినీ శ్రీధరన్ తదితరులు
సంగీతం : విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ : షైజు ఖాలిద్
నిర్మాత : అన్వర్ రషీద్
దర్శకత్వం : శ్రీరాజ్ శ్రీనివాసన్
విడుదల : సోని లివ్ ఓటిటి
రేటింగ్ : 2.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!