Home » వలతు వశతే కల్లన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

వలతు వశతే కల్లన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

Spread the love

మూవీలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఒక్కో దర్శకుడి మీద ఒక్కో అభిప్రాయం ఏర్పడిపోతుంది.

అలాగే మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బాగా తీస్తాడనే ముద్ర కేవలం మలయాళ ప్రేక్షకులలోనే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకులలో కూడా ఏర్పడిపోయింది.

ఆ దర్శకుడి మీద ప్రేక్షకుల అంచనాలకు కూడా ఒక కారణం ఉంది.. అదే అతడు దర్శకత్వం వహించిన దృశ్యం మూవీ సిరిస్.

దృశ్యం మొదటి భాగం తీసినప్పుడే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో ఇతడి టాలెంట్ ప్రేక్షకులకు తెలిసివచ్చింది. ఎంతలా అంటే మలయాళంలో మొదలెట్టిన దృశ్యం తెలుగు, హిందీ లతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టింది. దృశ్యం మూవీకి సీక్వెల్ గా తీసిన దృశ్యం 2 పరిస్థితీ అదే.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.
తాజాగా అతడి దర్శకత్వంలోనే త్వరలో దృశ్యం 3 కూడా రిలీజ్ కాబోతుంది.

ఈలోపల జీతూ జోసెఫ్ నుంచి వలతు వశతే కల్లన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మలయాళంలో థియేటరిక్ రిలీజ్ అయ్యింది. కానీ ఎందుకో ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో లేదు.

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓటీటీల్లో మలయాళం వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే ఓటీటీల్లో ఈ మూవీ చూసిన చాలామందికి థియేటర్లలో ఎందుకు ఆడలేకపోయింది అనే అనుమానం వస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. జీతూ జోసెఫ్ మార్క్ దర్శకత్వం ఇందులో కూడా కనిపిస్తుంది. బహుశా మలయాళీలు దృశ్యం మూవీ తో పోల్చుకుని అతడి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు.

సరే ఆ విషయాలు అలా ఉంచితే వలతు వశతే కల్లన్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథేంటంటే?

సినిమా ప్రారంభమే తండ్రీ కొడుకులకు ఓ డాక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చే సన్నివేశంతో మొదలౌతుంది. ఆ సన్నివేశం చూడగానే దర్శకుడు పేరెంటింగ్ అంశాన్ని కూడా కథలో చెప్పబోతున్నాడని అర్థమైంది.

ఆంటోనీ జేవియర్ (బిజూ మీనన్) ఓ తెలివైన , అవినీతిపరుడైన పోలీస్ అధికారి. అతడి కొడుకు ఫిలిప్ వ్యసనాలకు బానిస అయి చెడు మార్గం పడతాడు. కొడుకు పెంపకం విషయంలో జాగ్రత్తగా ఉండమని డాక్టర్ ఆ పోలీస్ అధికారికి చెప్తాడు.

ఇదిలా ఉండగా ఓ రాజకీయ నాయకుడి కుమారుడి చేతిలో మోసపోయిన ప్రియ అనే అమ్మాయి తన తల్లితో కలిసి న్యాయం కోసం ఇతడు సీఐ గా ఉన్న పోలీస్ స్టేషన్ కు వస్తుంది. కానీ ఆంటోనీ డబ్బుకు అమ్ముడుపోయి ఆ అమ్మాయి కేసు క్లోజ్ చేసేస్తాడు. దాంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది.

ఈ కేసులో లా స్టూడెంట్ అండ్ యాక్టివిస్ట్ అయిన ఐరెన్ అనే అమ్మాయి ఆంటోనీ అవినీతికి వ్యతిరేకంగా హ్యూమన్ రైట్స్ కమీషన్ ద్వారా పోరాడుతుంది. ఈ అమ్మాయి సామ్యూల్ , థెరిస్సా ల గారాల కూతురు.

సామ్యూల్ (జోజూ జార్జ్) గతంలో ఎథికల్ హ్యాకర్ గా పనిచేసిన అనేక ఆటుపోట్లు ఎదుర్కొని , చివరికి ఆ రంగం వదిలేసి భార్య, కూతురితో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో ఇంటినుంచి వెళ్లిన అతడి కూతురు మర్డర్ అవుతుంది. తన కూతురి మర్డర్ వెనుక రాజకీయ నాయకుడి కొడుకు గానీ, పోలీస్ అధికారి ఆంటోనీ కానీ ఉండి ఉంటారని సామ్యూల్ అనుమానపడతాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కూతుర్ని హత్య చేసిన కిల్లర్ కోసం తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు.

ఇంతకీ ఐరెన్ ను హత్య చేసిన కిల్లర్ ఎవరు?

సైబర్ నిపుణుడైన సామ్యూల్ ఆ కిల్లర్ ఆచూకీ ఎలా కనిపెడతాడు?

ఈ హత్యలో ఆంటోనీ మరియు అతడి కొడుకు ఫిలిప్ ల పాత్ర ఏంటి?
అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది.

ఎలా ఉంది?

కథ విన్నారుగా?
కూతురిని హత్య చేసిన హంతకుల మీద ప్రతీకారం తీర్చుకునే తండ్రి కథ.

ఇలాంటి కథలు ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. చూసిన కథనే మళ్ళీ చూడాలా? అసలు ఇందులో స్పెషాలిటీ ఏంటి? అనే అనుమానాలు రావొచ్చు.

ఆ ప్రశ్నలకు సమాధానం ఒకటే దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ మార్క్ స్క్రీన్ ప్లే.. జీతూ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కథ పాతదే అయినప్పటికీ కథనంలో సరుకు ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు.

కాకపోతే ఈ దర్శకుడికి శవాలను పాతి పెట్టడం అచ్చి వచ్చిందేమో ?
దృశ్యం మూవీలో పోలీస్ ఆఫీసర్ కొడుకుని పాతి పెట్టిన దర్శకుడు ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ కొడుకు శవాన్ని పాతి పెడతాడు.

అదలా ఉంచితే ఈ మూవీలో దర్శకుడు ఒక తెలివైన క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ అండ్ అంతకన్నా తెలివైన సైబర్ నిపుణుడైన ఓ తండ్రిల మథ్య నడిపిన మైండ్ గేమ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ సన్నివేశాలే ఈ సినిమాకి హైలెట్ అవుతుంది.

తన కూతుర్ని చంపిన కిల్లర్ ఆచూకీ కనుగొనటానికి తనకున్న సైబర్ పరిజ్ఞానంతో క్లూల కోసం సామ్యూల్ రంగంలోకి దిగడం ఒకపక్క, అలాగే ఈ కేసులో ఏ ఒక్క ఆధారం దొరక్కుండా సీఐ ఆంటోనీ అన్ని క్లూ లను నాశనం చేయడం వంటి సన్నివేశాలు మరోపక్క పోటాపోటీగా నడిచాయి.

చాలా సన్నివేశాల్లో సామ్యూల్ ను చూస్తుంటే దృశ్యం మోహన్ లాల్ గుర్తుకొస్తాడు. ఇతడి ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ కూడా ఇంచుమించుగా మోహన్ లాల్ ను తలపిస్తాయి.

అన్నిటికన్నా సామ్యూల్ లొంగిపోవటానికి పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్ అవుతాయి.

తన కూతుర్ని చంపిన ఆంటోనీ కొడుకు ఫిలిప్ ను తను ఒక అజ్ఞాత ప్రదేశంలో చెక్కపెట్టేలో బంధించినట్టు చెప్తూ అతడిని కాపాడుకోవాలంటే కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని, కావాలంటే ఐదు క్లూ లు కూడా ఇస్తాను.. వీలుంటే నీ కొడుకుని కాపాడుకో.. అని చెప్పే సన్నివేశం మూవీ పట్ల క్యూరియాసిటీని పెంచుతాయి.

ఇక అక్కడ్నుంచి పోలీస్ అధికారి ఆంటోనీ అండ్ ఐరెన్ తండ్రి సామ్యూల్ ల మధ్య నడిచే మైండ్ గేమ్ ఉత్కంఠతను పెంచుతాయి.

మొదటినుంచి ప్రీ క్లైమాక్స్ వరకు సన్నివేశాలను జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చిన దర్శకుడు క్లైమాక్స్ లో మాత్రం కొంచం తడబడినట్టు అనిపించింది.

సామ్యూల్ ఫ్యామిలీ మొత్తాన్ని ముగించిన తీరు అందరికీ నప్పకపోవచ్చు . దానికితోడు చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకును దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఆంటోనీ కూడా నేరాలకు పాల్పడుతుండటంతో అతడి పాత్ర స్వభావం కొంత గందరగోళంగా మారింది.

అదేకాకుండా ఆంటోనీ నేరాలకు సంబంధించిన ఆధారాలు ఒకటికటి బయటపడుతున్నా పోలీసులు అతడేది చెప్తే అది చేయడం, అన్నిటికీ తలాడించడం కొంచం ఓవర్ అయ్యాయి.

ఓవరాల్ గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని వన్ టైమ్ వాచ్ మూవీగా ఓటీటీ లో చూడొచ్చు.

ఎవరెలా చేశారు?

ఎవరెలా చేశారంటే ఈ మూవీలో ప్రధానంగా ఇద్దరు నటుల గురించి చెప్పుకోవచ్చు.

వారిలో మొదటివాడు ఆంటోనీ పాత్రలో నటించిన బిజూ మీనన్. ఇతడు చాలా సాలిడ్ గా పెర్ఫెక్ట్ గా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో సామ్యూల్ తో మైండ్ గేమ్ ఆడుతున్న సందర్భంలో ఇతడి నటన బాగుంటుంది .

ఇక రెండోవాడు సామ్యూల్ పాత్రలో నటించిన జోజు జార్జ్. ఎందుకో ఇతడ్ని చూస్తుంటే మోహన్ లాల్ గుర్తుకొస్తాడు. ఇతడి ఆహార్యం, బాడీ లాంగ్వేజ్, గెటప్ చూస్తే మోహన్ లాల్ డూప్ ఏమో అన్న అనుమానం కూడా వస్తుంది. కూతురి మీద అమిత ప్రేమ ఉన్న తండ్రిగా ఇతడు కనిపించినప్పుడు మాములుగానే అనిపించాడు కానీ కూతుర్ని హత్య చేసిన కిల్లర్ కోసం స్వయంగా రంగంలోకి దిగిన సైబర్ నిపుణుడిగా ఆంటోనీతో ఇతడు ఆడిన మైండ్ గేమ్ సన్నివేశాల్లో చక్కటి నటన ప్రదర్శించాడు.

ఇక మిగిలిన వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికత:

జీతూ జోసెఫ్ సినిమాల్లో సాంకేతికతకు పెద్ద పీట వేస్తాడు. ఎందుకంటే అతడు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ భాగం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలే కాబట్టి . అందుకు అనుగుణంగా బిజిఎం,సినిమాటోగ్రఫీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు.
సన్నివేశాలకు తగ్గట్టుగా అందించిన బిజిఎం బాగుంది.

ఇక కేరళ అంటేనే అందాలకు పెట్టింది పేరు. పేరుకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా వీలున్న చోట కేరళ అందాలను చక్కగా చిత్రీకరించారు. అక్కడి వాతావరణాన్ని , చిరు జల్లులను చక్కగా కాప్చర్ చేశారు. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది.

నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

విశ్లేషణ:

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. బోర్ అయితే కొట్టదు. ఫస్టాఫ్ కొంత స్లోగా నడిచినట్టు అనిపించినా సెకండాఫ్ వచ్చేసరికి కథనంలో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా సామ్యూల్ కీ ఆంటోనీకి మధ్య మైండ్ గేమ్ స్టార్ట్ అవడం మొదలైన తర్వాత వచ్చే సన్నివేశాలు ఉత్కంఠత కలిగిస్తాయి. సామ్యూల్ ఇచ్చిన క్లూలు , వాటిని ఆంటోనీ ఛేదించే విధానం ఆసక్తికరంగా అనిపిస్తాయి. మూవీలో అన్ని సన్నివేశాలను తనదైన శైలిలో పేర్చుకుంటూ వచ్చిన దర్శకుడు ఆంటోనీ కొడుకు ఫిలిప్ ను చెక్కపెట్టలో బంధించిన సన్నివేశాలు మాత్రం ఒక హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నట్టుగా ఉంది. పేరుకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో ఎక్కడా మోతాదును మించి అశ్లీల సన్నివేశాలు కానీ, వయోలెన్స్ కానీ లేవు కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓటీటీల్లో నిరభ్యంతరంగా చూడొచ్చు. కాకపోతే మలయాళం వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూడాలి.

నటీనటులు: బిజూ మీనన్, జోజూ జార్జ్ తదితరులు
సంగీతం: విష్ణు శ్యామ్
సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్
దర్శకత్వం: జీతూ జోసెఫ్
విడుదల: ఏప్రిల్ 15 , 2026 అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలు
రేటింగ్: 2.75/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!