ఈరోజు నుంచి (24-07-2026) టోవినో థామస్ నటించిన మలయాళం యాక్షన్ మూవీ పళ్ళిచట్టంబి (Pallichattambi movie) సోని లివ్ ఓటిటిలో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది . గత ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ అయిన పళ్ళిచట్టంబి మూవీ కేరళలో మంచి వసూళ్లను సాధించింది . ఈ వసూళ్లకు ఒక కారణం ఉంది . దర్శకుడు 1957 లలో కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నారు . ఇది అక్కడి నేల కథ . అందుకే మలయాళీలు ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు .
అయితే ఇటువంటి మట్టి కధలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉంటాయి . పేర్లు , ప్రాంతాలు , భాష మారొచ్చేమో కానీ నేలను నమ్ముకున్న మట్టిమనుషుల కధలు మారవు . ఆ భూముల కోసం అరాచకాలు చేసే పెత్తందారీ , భూస్వాముల కధలు మారవు . ఎక్కడి కధలు అక్కడి మట్టివాసనను తెలియచేస్తాయి . ఈ సినిమా కధంతా కేరళ నేల చుట్టూ తిరుగుతుంది . 1957 లో కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల గురించి అవగాహన ఉన్న తెలుగువారు కనెక్ట్ అవుతారు . ఆనాటి చరిత్ర అవగాహన లేనివారికి కొంచం కన్ఫ్యూజన్ గా ఉంటుంది .
ఇప్పుడు పళ్ళిచట్టంబి మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
కథ 1930 ల కాలం నాటినుంచి మొదలౌతుంది . కుంజప్ప నాయర్ దొర ( పృథ్విరాజ్ సుకుమారన్ ) కేరళ , తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంత భూములను ఆక్రమించుకుని అక్కడివారిచేత వెట్టి చాకిరీ చేయించుకుంటుంటాడు . తోమాపురం అటవీ ప్రాంతంలో కనిపించే భూమి అంతా అతడి ఆధీనంలోనే ఉంటుంది . భూముల మీద హక్కుల గురించి పొరపాటున అక్కడి ఆదివాసీలు ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యాలు చేస్తుంటాడు. కుంజప్ప నాయర్ ని బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతారు .
1957 – 58 లలో కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం తీసుకొస్తుంది . ఈ సంస్కరణలను అప్పటి భూస్వాములు వ్యతిరేకిస్తారు . ముఖ్యంగా కుంజప్ప నాయర్ కూడా. మరోవైపు కేరళలో కమ్యూనిస్టులకు , చర్చిల నిర్వాహకులకు వివాదాలు మొదలౌతాయి . చర్చ్ భూములను ఆక్రమించుకుని కమ్యూనిస్టులు జెండాలు పాతుతుంటారు . కమ్యూనిస్టుల దాడులనుంచి రక్షణ కల్పించుకోవడం కోసం అప్పటి చర్చ్ ఫాదర్లు చట్టంబిలను నియమించుకునేవారు . చట్టంబి అంటే తెలుగులో రక్షకుడు అని అర్ధం .
అలా కేరళలోని కణియార్ పూర్ లోని చర్చ్ ఫాదర్ కూడా కమ్యూనిస్టుల నుంచి తమ చర్చ్ లను రక్షించుకునేందుకు రక్షకుడిని నియమించుకోవాలని అనుకుంటారు . ఈ విషయాలు తెలుసుకున్న ఇంకో ఫాదర్ తోమాపురానికి చెందిన కృష్ణ పిళ్ళైని ( టోవినో థామస్ ) క్రిష్టఫర్ పేరుతో కణియార్ పూర్ పంపిస్తాడు .
క్రిష్టఫర్ పేరుతో కణియార్ పూర్ చేరుకున్న కృష్ణ పిళ్ళై ఏం చేస్తాడు ?
కమ్యూనిస్టుల ఆక్రమణల నుంచి చర్చ్ భూములను కాపాడుతాడా ?
అసలు కృష్ణ పిళ్ళై గతం ఏంటి ?
కృష్ణ పిళ్ళై ప్రేమించిన రెబెకా ఎవరు ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
మూవీ స్టార్టింగ్ 1930 నుంచి మొదలౌతుంది అని చెప్పాను కదా ..అందుకే కథ ఆంగ్లేయుల పాలన నుంచి మొదలౌతుంది . కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆంగ్లేయుల కన్నా భారతీయుడైన కుంజప్ప ఇక్కడివాళ్లను పెట్టే హింసతోనే కథ మొదలౌతుంది . సరే అతడొక భూస్వామి ..పేదవాళ్ల భూములు లాక్కుని వెట్టి చాకిరీ చేయించుకుంటాడు అనే పాయింట్ మొదట్లోనే దర్శకుడు ఎస్టాబ్లిష్ చేసేసాడు . అయితే అతడు అక్కడి కొండను ఆక్రమించుకుని అరాచకాలు చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని సెకండాఫ్ లో రివీల్ చేస్తాడు . అప్పటిదాకా కుంజప్ప గొడవేంటో మనకు అర్ధం కాదు . అసలు కథ కుంజప్ప ఆక్రమించుకున్న భూముల్లోనే ఉంది .
ఈలోపల దర్శకుడు ఫస్టాఫ్ అంతా చర్చులు , కమ్యూనిస్టుల గొడవల చుట్టూ తిప్పాడు . ఇక్కడ అందరూ కనెక్ట్ కారు . చర్చ్ ఫాదర్లకు , కమ్యూనిస్టులకు మధ్య జరిగే గొడవలకే కథ పరిమితం కావడంతో మూవీ మీద ఇంట్రెస్ట్ లిమిటెడ్ అయిపోతుంది . పైగా అక్కడి పేర్లు , అక్కడి నేటివిటీ మనల్ని సినిమాలోకి తీసుకెళ్లడానికి స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డుపడుతూ ఉంటాయి . ఇంకో పైగా ఏంటంటే కమ్యూనిస్టుల నుంచి కాపాడటానికి క్రిష్టఫర్ ఊరి జనానికి కర్రసాము , మల్ల యుద్ధాలను నేర్పిస్తాడు కానీ అదేమీ సీరియస్ మోడ్ లో సాగదు . జార్జ్ అనే కమ్యూనిస్టుతో క్రిష్టఫర్ చేసిన ఫైట్ సీన్ కామెడీ పీసుగా అనిపిస్తుందే తప్ప సీరియస్ గా అనిపించదు . దానికి తోడు ఈ క్రిష్టఫర్ ఒకటికి పదిసార్లు తన మీసాలు సవరించుకోవడం అతిగా అనిపిస్తుందే కానీ హీరోయిజంగా అనిపించదు .
సరే , ఫస్టాఫ్ ఎలాగోలా కాలక్షేపం చేసి మమ అనిపించిన దర్శకుడు సెకండాఫ్ లో అసలు కథలోకి వెళ్తాడు . కమ్యూనిస్ట్ భావాలు ఉన్న స్టేజ్ ఆర్టిస్ట్ రెబెకా వారి కోసం ఊళ్లలో నాటకాలు వేస్తూ కణియార్ పూర్ రావడం , ఆమెను చూసి క్రిష్టఫర్ ప్రేమలో పడటంతో మెల్లిగా స్టోరీ లవ్ ట్రాక్ లోకి టర్న్ అవుతుందని అనుకుంటాం . అది కూడా కొద్దిసేపే . కానీ రెబెకా పాత్ర ఎంటర్ అవడంలో కధలో కూడా సంఘర్షణ ఎంటర్ అవుతుంది . అది కూడా కొద్దిసేపే . పోలీస్ ఆఫీసర్ రామన్ పాత్ర ఎంటర్ అవడంతో సంఘర్షణ డబల్ అవుతుంది . అలా సెకండాఫ్ లో క్యారెక్టర్లు పెరుగుతున్న కొద్దీ కధలో డెప్త్ కూడా పెరుగుతుందన్నమాట . కధలో డెప్త్ పెరుగుతున్న కొద్దీ కధనంలో వేగం పెరుగుతుంది . దాంతో ఆ కధనంతో మనం ఎంగేజ్ అవుతాము . దానికి తోడు ఫస్టాఫ్ లో అసంపూర్తిగా మిగిలిపోయిన కొన్ని సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి .
ప్రీ క్లైమాక్సులో కుంజప్ప ఆ భూములకు ఎందుకు అంతగా పట్టుబడుతున్నాడో తెలిసినతర్వాత అసలు విషయం అర్థమైపోతుంది . వెంటనే కెజిఎఫ్ గుర్తుకొస్తుంది . నెక్స్ట్ కథ అక్కడికే వెళ్తుందేమో అని చూస్తే కుంజప్ప వదిలిన బుల్లెట్టు , కృష్ణపిళ్ళై విసిరిన బల్లెం గాల్లోనే చూపించి శుభం అన్నాడు దర్శకుడు . దీన్నిబట్టి మనకు ఏమర్థమౌతుంది ? ఆ బుల్లెట్ కృష్ణపిళ్ళై గుండెల్లో దిగిందా ? ఆ బల్లెం కుంజప్ప గొంతులో దిగిందా ? తెలియాలంటే మనం రెండో పార్ట్ వరకు వేచి చూడాలన్నమాట .
ఇప్పుడు ఈ మూవీలో చెప్పుకోవాల్సింది ఇంకోటుంది . పతాక స్థాయిలో తీసిన యుద్ధ సన్నివేశాలు ఈ మూవీకి ప్లస్ అవుతాయి . భారీ ఎత్తున దూసుకొస్తున్న పోలీసులను ధీటుగా ఎదుర్కోవడానికి యుద్ధ తంత్రంలో కృష్ణపిళ్ళై దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్న కార్యకర్తలు వారితో పోరాడే సన్నివేశాలు బావుంటాయి . నిజానికి ఈ కధలో ప్రధాన పాత్ర కుంజప్ప నాయర్ . కానీ మొదట్లో కనిపించిన కుంజప్ప తిరిగి చివరి ఐదు నిమిషాల్లోనే కనిపిస్తాడు . మధ్యలో కధంతా చర్చ్ ఫాదర్ల చుట్టూ తిరగడంతో ఎంగేజింగ్ గా అనిపించదు . కుంజప్ప పాత్రను కూడా సమాంతరంగా కొనసాగించి ఉంటే బాగుండేది . ఇక హీరోయిన్ పాత్రకు ఇచ్చిన ముగింపు డిజప్పాయింటింగ్ గా ఉంటుంది .
చివరగా మనిషికి మనిషే తోడు ..కులాలు , మతాలు అడ్డుగోడలు కాకూడదు అంటూ ఇచ్చిన సందేశం బాగుంది .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమా అంతా ఒకే పాత్ర చుట్టూ తిరుగుతుంది . ఆ పాత్ర పేరే కృష్ణ పిళ్ళై అలియాస్ క్రిష్టఫర్ . ఎక్కడా వివాదాలు రాకుండా దర్శకుడు ఈ క్యారక్టర్ ను జాగ్రత్తగా డిజైన్ చేసాడు . చట్టంబి గా .. రౌడీగా .. రక్షకుడిగా టోవినో థామస్ బాడీ లాంగ్వేజ్ సరిపోయింది . క్లైమాక్స్ సన్నివేశాల్లో మరింత బాగా నటించాడు .
ఇక రెబెకా పాత్రలో నటించిన కయదు లోహర్ నటన బాగుంది కానీ దర్శకుడు ఆమె పాత్రకు స్కోప్ లేకుండా చేయడం బాలేదు .
సాంకేతికత
జెక్స్ బిజోయ్ అందించిన సంగీతం బాగుంది . ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అందించిన బీజీఎమ్ బాగా వర్కౌట్ అయింది .
టిజో టోమి అందించిన ఫోటోగ్రఫీ కూడా బాగుంది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
ఈ మూవీ కథ ఎప్పుడో కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్నారు కాబట్టి తెలుగువారికి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు . ఫస్టాఫ్ చూస్తుంటే ఇదేదో స్థానిక సమస్యలా అనిపిస్తుందే కానీ మనల్ని ఎంగేజ్ చేసే కధనం ఉండదు . ఇక సెకండాఫ్ కొంతవరకు మనల్ని మూవీలోకి తీసుకెళ్తుంది . క్లైమాక్స్ అసంపూర్తిగా ముగిసినట్టు అనిపించింది . బహుశా రెండో పార్టులో చూపిస్తారు అనుకుంటా . రెండో పార్ట్ సంగతి ఎలా ఉన్నా మొదటి పార్టులో ప్రేక్షకులకు అర్దమయ్యేమేరకు కథని ముగించి ఉంటే బాగుండేది .
సోని లివ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉందికాబట్టి వన్ టైమ్ వాచ్ మూవీ కింద ఓ లుక్కేయండి .
నటీనటులు : టోవినో థామస్ , పృథ్విరాజ్ సుకుమారన్ , కయదు లోహర్ తదితరులు
సంగీతం : జెక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ : టిజో టోమి
నిర్మాత : నౌఫర్ , చాణుక్య
దర్శకత్వం : డిజో జోస్ ఆంటోని
విడుదల : సోని లివ్ ( 24-07-2026 )
రేటింగ్ : 2.5 / 5
