జులై 24 నుంచి నాగబంధం మూవీ (Nagabandham movie) అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది . జులై 3 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ మూవీ నెలతిరిగేలోపలే ఓటిటిలోకి రావడం విశేషం . ఈ మధ్య సనాతన ధర్మం ప్రధాన అంశంగా వచ్చిన సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి . ఈ ట్రెండుకు నాంది పలికింది బాలయ్య అఖండ . అఖండ సాధించిన విజయంతో బోయపాటి దానికి సీక్వెల్ కూడా తీశారు .
అలాగే తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ , మిరాయ్ మూవీలు కూడా హిట్ కొట్టాయి . దీనికి కారణం కధాబలంతో పాటు విజువల్ వండర్స్ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండటమే . చక్కటి కధాబలంతో అంతర్లీనంగా సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ విజువల్ వండర్స్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనటానికి ఆ సినిమాలే ఉదాహరణ .
తాజాగా అదే కోవలో నాగబంధం పేరుతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా కోసం ఖర్చుపెట్టిన బడ్జెట్ తక్కువ కాదు . విజువల్స్ మాయ కూడా కళ్లకుకట్టినట్టు ఉన్నాయి . సనాతన ధర్మం అనే మాటని వీలైనన్నిసార్లు వాడారు . అయినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేదు . మిక్సెడ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది . అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి . అవేంటో రివ్యూలో చూద్దాం .
కధేంటంటే ?
మూవీ స్టార్టింగ్ నాగబంధనాన్ని తెరిపించే గ్రంధం కోసం 1962 వ సంవత్సరంలో ఇద్దరు పురావస్తు పరిశోధకులు అబ్దాలీ , టెస్లా లు హిమాలయ పర్వతాలలో చేపట్టిన అస్సైన్మెంట్ తో మొదలౌతుంది . అక్కడ వందల ఏళ్ళ క్రితం ఇదే నాగబంధనం గ్రంధం కోసం ప్రయత్నిస్తూ కాలచక్రంలో ఇరుక్కుపోయిన బైరాగి కనిపిస్తాడు .
చివరికి ఎలాగైతేనేమి ఆ గ్రంధాన్ని టెస్లా సంపాదిస్తాడు . ఆ గ్రంధం ద్వారా నాగబంధనానికి విముక్తి కల్పిస్తే భారత దేశం అపారమైన బంగారు రాశులతో నిండిపోయి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని భావించి ఆ గ్రంధాన్ని నేరుగా ప్రధాని చేతుల్లో పెట్టాలని అనుకుంటాడు టెస్లా . ఇందుకోసం తన గురువు , ప్రముఖ పురావస్తు పరిశోధకుడు అయిన ప్రభాకర్ ( జగపతిబాబు ) ద్వారా ప్రధాని అప్పాయింట్మెంట్ తీసుకుంటాడు .
అయితే అతడి సహచరుడు అబ్దాలీకి మాత్రం అద్భుతమైన ఆ నాగబంధనం గ్రంధం తనదగ్గర ఉంటే ప్రపంచాన్ని శాసించవచ్చని దుర్బుద్ధితో ఆలోచన చేస్తాడు . ఆలోచన చేయడమే కాదు టెస్లా ని చంపి ఆ గ్రంధాన్ని సొంతం చేసుకుంటాడు . అయితే ఆ గ్రంధం ప్రకారం నాగబంధనం నుంచి విముక్తం చేయాలంటే శ్రీరంగం పద్మనాభ స్వామివారి దేవాలయంలో ఉండే బ్రహ్మకమలం కావాలి .
శ్రీరంగం దగ్గరలోనే ఒక గూడెంలో రుద్ర ( విరాట్ కర్ణ ) తన కుటుంబంతో ఉంటాడు . నాగబంధనంలో చెప్పిన బ్రహ్మకమలం కోసం అబ్దాలీ శ్రీరంగం వస్తాడు .
అప్పుడేం జరుగుతుంది ?
నాగబంధనం గ్రంధానికీ , శ్రీరంగం పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధం ఏంటి ?
రుద్ర గతం ఏంటి ?
కాలచక్రంలో ఇరుక్కుపోయిన బైరాగి ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ .
ఎలా ఉంది ?
ఇందాక అఖండ , మిరాయ్ సినిమాల గురించి చెప్పుకున్నాం కదా ? సనాతన ధర్మం , నాగసాధువులు , విజువల్ అద్భుతాలు ఈ మూడూ కలిసి ఆ సినిమాలను ఒక మెట్టుపైన నిలిపాయి . ఈ మూవీ కోసం దర్శకుడు ఇంచుమించు అలాంటి ఫార్ములానే నమ్ముకున్నాడు . ఇక్కడి సంస్కృతిని ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరూ కూలగొట్టలేరు . హిందుత్వం అనేది మతం కాదు ..హితం , సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఉపయోగం కాదు ..యోగం , ఇలాగ సనాతన ధర్మం గురించి వీలైనన్నిచోట్ల కావాల్సినంత పవర్ ఫుల్ డైలాగులు వాడారు . ఇక విజువల్స్ మాత్రం తక్కువ చేసారా ? రుద్రతో పాటు దర్శకుడు మనల్నీ హిమాలయాలకు తీసుకెళ్లాడు . భైరవకోన అనే కొత్త ద్వీపాన్ని పరిచయం చేసాడు . బడ్జెట్ కోసం చూడకుండా కావాల్సినంత క్వాలిటీ ఇచ్చారు . అయినా ఈ సినిమా ఆశించినంతగా ఎందుకు టాక్ తెచ్చుకోలేకపోయింది ? ఎక్కడో ఏదో మిస్ అయ్యింది ?
హీరో ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవడం అందులో మొదటిది . తేజ సజ్జా బాలనటుడిగా ఉన్నప్పట్నుంచీ ప్రేక్షకులకు కనెక్ట్ అయి ఉన్నాడు . దాంతో భారీ విజువల్స్ తో అతడితో ప్లాన్ చేసిన హనుమాన్ , మిరాయ్ మూవీలు హిట్ కొట్టాయి . కానీ ఈ మూవీలో చేసిన విరాట్ కర్ణ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయాడు . నిజానికి ఇది బాలయ్య బాబు సబ్జెక్ట్ . అనంతపద్మనాభ స్వామి ఆలయం , నాగబంధనం , నాగసాధువులు అనే గట్టి పాయింటునే పట్టుకుని దర్శకుడు కథ రాసుకున్నారు . దర్శకుడు రాసుకున్న పాయింటులో ఎటువంటి లోపం లేదు . కానీ ఆ పాయింటునే ప్రేక్షకులకు అర్ధమయేలా చెప్పడంలో ఆయన తడబడ్డాడు .
దర్శకుడి తడబాటు ఎక్కడ కనిపిస్తుందంటే ఒకే కథను 1756 లోనూ , తిరిగి 1962 లోనూ తిప్పితిప్పి చూపించాడు చూశారూ ? అక్కడే దెబ్బ కొట్టింది . ఫస్టాఫ్ లో అంటే 1962 లోనే ఆ అబ్దాలీ గురించి , రుద్ర గురించి చెప్పేసిన దర్శకుడు తిరిగి సెకండాఫ్ లో 1756 కి వెళ్ళిపోయి ఈ ఇద్దరికీ గడ్డాలు , మీసాలు తగిలించి అదే కథను ఇంకోసారి రుబ్బేసరికి ప్రేక్షకులకు విసుగు వచ్చేస్తుంది . వీళ్ళకి తోడు రెండు జన్మలలోనూ కాస్ట్యూమ్స్ మార్చి ఒకే పాప బరువైన డైలాగులతో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కిస్తుంది . పాప చెప్పిన డైలాగులు బాగుంటాయి . అందులో డౌట్ లేదు . అయితే అవి హీరో చెప్పాల్సిన డైలాగులు..పాప చేత చెప్పించారు ..రాంగ్ ప్లేస్మెంట్ . మనకి కథ తెలియడం కోసం దర్శకుడు కొంత గతం కూడా చూపించొచ్చు కానీ అదేదో ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్ లో చూపించేసి ప్రస్తుత కాలానికి వచ్చేస్తే సరిపోయేది . అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు అన్నట్టు సేమ్ స్టోరీ ..కాస్ట్యూమ్స్ చేంజ్ అన్నట్టు తయారైంది పరిస్థితి .
ఇక ఎడిటింగ్ లోపాలు కూడా కొన్ని ఉన్నాయి . రీలు ముక్కను అతికించాల్సిన చోట అతికిస్తేనే బొమ్మ క్లారిటీగా అర్ధమౌతుంది . ఇందులో ఆ అతుకుడు సరిగా జరగలేదనిపిస్తుంది . ముఖ్యంగా జగపతిబాబు ఎపిసోడ్లో కొన్నిచోట్ల ఏది ముందో ? ఏది వెనకో తెలియక కన్ఫ్యూజ్ అవుతాము . చార్టర్ ఫ్లైట్ క్రాష్ లో ఆ క్యారక్టర్ ముగిసింది అనుకుంటే కాసేపట్లో మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు . అన్నట్టు జగపతిబాబు చార్టర్ ఫ్లైట్ అంటే గుర్తొచ్చింది . సినిమా అంతా చక్కటి విజువల్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు చార్టర్ ఫ్లైట్ విషయంలో మాత్రం సరైన శ్రద్ద పెట్టినట్టు లేదు . ఆ సన్నివేశం సరిగా కుదరలేదు .
ఇక ఫస్టాఫ్ లో దర్శకుడు బోలెడు క్యారెక్టర్లను మనకు పరిచయం చేస్తాడు . ముఖ్యంగా ఎవరూలేని ఆ రుద్ర చుట్టూ ఫ్యామిలీనే ఉంటుంది . తల్లి , చెల్లి , బావ అంటూ కృష్ణవంశీ సినిమాల టైపు అతడి చుట్టూ పెద్ద ఫ్యామిలీని దింపిన దర్శకుడు ఒకే ఒక్క ఫైటింగుతో అటు రుద్ర ఫ్యామిలీ , ఇటు అనసూయ ఫ్యామిలీతో సహా ఆ క్యారక్టర్లందరినీ ఇంటికి పంపడం మనల్ని డిజప్పాయింట్ చేస్తుంది . దానికి తోడు గ్యాలన్ల కొద్దీ పారించిన ‘ ఎరుపు’ ప్రేక్షకులకు మంటెక్కిస్తోంది . ఫైటింగ్ అంటే గుర్తొచ్చింది . క్లైమాక్స్ ఫైటింగ్ కంపోజ్ చేసింది ఎవరో కానీ చూసుకోబడలా ? హీరోగారు ఒక చక్రాన్ని ఎత్తి రౌద్రంగా రాక్షసుల వంక చూస్తూ రౌద్రంగా అరుస్తుంటే వెనుక ఉన్న రాక్షసులు ఎక్కడ ఆయనకు బల్లెం తగులుతుందో అని డిసిప్లిన్ గా వెనకనే ఉండిపోతారు కానీ పొరపాటున కూడా ఆ బల్లెంతో హీరోగారిని గుచ్చరు . ఇక చెల్లి అన్నకు అన్నం తినిపించడం , తల్లికి అతడే ప్రాణం అవడం వంటి సన్నివేశాలతో రుద్ర ఫ్యామిలీ గురించి ఇంట్రడ్యూస్ చేసినా ఎందుకో ఫ్యామిలీ సెంటిమెంటు , భావోద్వేగాలను దర్శకుడు సరిగా పండించలేకపోయాడు అనిపిస్తుంది . దీనికీ ఒక కారణం ఉంది . ఆ ఫ్యామిలీని చూసి మనం భావోద్వేగంలోకి జారుకుంటున్నంతలోనే ఒక పాట తగిలించి దర్శకుడు ఆ ఫీల్ ను మననుంచి దూరం చేస్తాడు . మళ్ళీ తిరిగి ఇంకో సన్నివేశంతో కనెక్ట్ అవుతున్న సమయంలో ఇంకో పాట స్పీడ్ బ్రేకర్ రూపంలో తగులుకుంటుంది .
సరే ఇప్పుడు సినిమాలో ఏం బాగుందో కూడా చెప్పుకుందాం . నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా , ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీసాడనడానికి అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్టింగ్ ఒకటి చాలు మనకు అర్థమైపోతుంది . రాజమౌళి సినిమాల్లో మినిమమ్ వందమంది జూనియర్ ఆర్టిస్టులు లేనిదే పాటల్లోనూ , సెట్టింగుల్లోనూ బొమ్మ ముందుకు వెళ్లదు . అలాగే ఈ సినిమాలో కూడా దర్శకుడు వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో స్క్రీన్ ను కలర్ఫుల్ చేసారు . సినిమా ప్రారంభంలోనే హిమాలయ పర్వతాలకు వెళ్లిపోయి విజువల్స్ తో వండర్స్ చేసారు . ఆ తర్వాత మిడిల్ డ్రామా రొటీన్ ఫార్మాట్ లో సాగుతుంది . మళ్ళీ క్లైమాక్సులో కనిపించే విజువల్స్ మనల్నిఅలరిస్తాయి . అక్కడే సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగులు ఈలలు వేయిస్తాయి .
ఎవరెలా చేసారు ?
రుద్ర పాత్ర పోషించిన విరాట్ కర్ణ కష్టపడ్డాడు కానీ ఎందుకో కనెక్ట్ కాలేకపోయాడు . అయినా నటన పరంగా అతడి లోపం ఏమీ లేదు .
ఇక జగపతి బాబు ఒక్కడు చాలు సినిమాని లేపటానికి.. పెద్దిలో చూసారుగా .. ఆ సినిమాలో జగపతిబాబు నటనకు దాదాపు హీరోతో సమానంగా మార్కులు పడ్డాయి . కానీ ఎందుకో ఈ సినిమాలో దర్శకుడు జగపతిబాబును సరిగా వాడుకోలేకపోయాడు .
ఇక ఈ సినిమాలో అబ్దాలీ క్యారక్టర్ మెయిన్ . అతడి పాత్ర చూస్తే ప్రేక్షకుడు వామ్మో అని ఫీల్ కావాలి . అటువంటి స్కోప్ ఉన్న పాత్ర అది . అయినా ఆ క్యారక్టర్ ను చూస్తుంటే ఎవడికీ అటువంటి ఫీలింగ్ రాదు . మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ క్యారక్టర్ చూడండి..మ్యాజిక్కులు చేసింది .
యధాప్రకారం మురళీశర్మ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు .
సాంకేతికత
జునైద్ కుమార్ అందించిన సంగీతం బావుంది . పాటల్లో పెళ్ళిపాట బాగుంది .
సుందర రాజన్ కెమెరా పనితనమే సినిమాకి ప్రధాన బలం . ప్రతి ఫ్రేములో అతడి పనితనం కనిపిస్తుంది .
భారీ సెట్టింగులు , విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది .. నిర్మాత నిర్మాణ విలువల్లో రాజీ పడలేదని . నిర్మాణ విలువలు బాగున్నాయి .
విశ్లేషణ
అఖండ ,హనుమాన్ , మిరాయ్ వంటి సినిమాలతో పోల్చుకోకుండా చూస్తే నాగబంధం కూడా బాగానే ఉంటుంది . ఒకే కథను రెండు కాలాలలో చూపించడం అనే మైనస్ మినహా సినిమా యాక్షన్ మోడ్ లో దూసుకుపోతుంది . సనాతన ధర్మానికి కనెక్ట్ అయినవాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది .
అమెజాన్ ప్రైమ్ లో ఉంది .. ఓ లుక్కేయండి
నటీనటులు : విరాట్ కర్ణ , సభా నటేశన్ , జగపతిబాబు , మురళీశర్మ తదితరులు
సంగీతం : జునైద్ కుమార్
సినిమాటోగ్రఫీ : సుందర రాజన్
నిర్మాత : కిషోర్ అన్నపురెడ్డి
దర్శకత్వం : అభిషేక్ నామా
విడుదల : అమెజాన్ ప్రైమ్ (24-07-2026)
రేటింగ్ : 2.75 / 5
