మొన్న సోమవారం నాడు (20-07-2026) కుటుంబ సమేతంగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది . ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న స్వర్ణగిరి విశేషాలను మీతో పంచుకుంటాను . ఇప్పటిదాకా స్వర్ణగిరిని సందర్శించని వారు ఖచ్చితంగా చూడాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం .
సోమవారం సాయంత్రం షుమారు 4.30 నిమిషాలకు కారులో హైద్రాబాదు నుంచి కుటుంబ సమేతంగా స్వర్ణగిరి బయలుదేరాం . ఉప్పల్ దగ్గర ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నందున నారపల్లి వరకు ప్రయాణం నిదానంగా సాగింది . హైద్రాబాదు నుంచి వరంగల్ వెళ్లే రహదారిలో షుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత భువనగిరి పట్టణానికి దగ్గరలో హైవే కు అనుకుని కుడివైపున మానేపల్లి హిల్స్ కనిపిస్తుంది . ఆ కొండపైన ఉన్న స్వామివారి రాజగోపురం హైవే నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది . అక్కడ మనం యూ టర్న్ తీసుకుని స్వర్ణగిరి దేవాలయానికి దారి అని బోర్డు కనిపించిన కచ్చా రోడ్డులోకి వెళ్ళాలి . హైదరాబాద్ ఉప్పల్ నుంచి అక్కడికి చేరుకోవడానికి మాకు షుమారు యాభై నిముషాలు పట్టింది .
కచ్చా రోడ్డు
మానేపల్లి వారు 22 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన దేవాలయ కట్టడాలు నిర్మించారు కానీ దేవాలయానికి వచ్చే దారిని మాత్రం వదిలేసారు . హైవే నుంచి దేవాలయ ప్రాంగణానికి చేసురుకునే ఆ రోడ్డు మాత్రం ఇప్పటికీ గుంతలమయమే . వానోస్తే వాహనదారుల ఇబ్బందులు అంతాఇంతా కావు . ఇంత చక్కటి దేవాలయంలో ఇదొక్కటే భక్తులకు అసౌకర్యం కలిగించే విషయం . షుమారు మూడొందల కోట్లు వెచ్చించి ఎక్కడా రాజీపడకుండా ఆగమ శాస్త్రం ప్రకారం ఎక్కడా సిమెంట్ వాడకుండా మొత్తం రాతితోనే ప్రాచీన శిల్పకళ ఉట్టిపడేలా స్వర్ణగిరి దేవాలయాన్ని నిర్మించిన మానేపల్లి వారు ఈ కచ్చా రోడ్డుపైన కూడా దృష్టి పెడితే బాగుణ్ణు . దానికి తోడు ప్రశాంతతకు భంగం కలిగించేలా అడుగడుగునా తగులుకునే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల హడావుడి కూడా భక్తులకు ఇబ్బందిగా పరిగమిస్తుంది . దేవాలయానికి వెళ్లే దారిలో ఇరువైపులా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడంతో అక్కడ కమ్మర్షియల్ వాతావరణం కనిపిస్తుంది . ఈ విషయంలో మానేపల్లి వారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో మాట్లాడాల్సిన అవసరం ఉంది . సరే , ఆ కచ్చా రోడ్డులోనే షుమారు కిలోమీటర్ ముందుకు వస్తే దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెడతాం .
పార్కింగ్ సౌకర్యం
షుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయం ప్లాన్ చేయడంతో పార్కింగ్ సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు . ఆదివారాలు , పర్వదినాల్లో ఎన్ని వాహనాలు వచ్చినా ఇబంది లేకుండా వాహనాలు పార్క్ చేసుకోవచ్చు . కాకపోతే రద్దీ తక్కువగా ఉండే సాధారణ రోజుల్లో వాహనాలు నేరుగా దేవాలయానికి అతి సమీపంలో కూడా పార్క్ చేసుకోవచ్చు . ఫోర్ వీలర్స్ కి 50 రూపాయలు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు .
బ్యాటరీ కార్ సదుపాయం
వృద్ధుల కోసం బ్యాటరీ కార్ సదుపాయం కూడా ఏర్పాటు చేసారు . బ్యాటరీ కారులో నేరుగా దేవాలయ ప్రధాన ద్వారం వరకు తీసుకెళ్తారు . ఈ ఏర్పాటు వల్ల వృద్దులు , చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ కి సౌకర్యంగా ఉంటుంది .
టికెట్లు
కింద కార్ పార్కింగ్ తర్వాత 108 మెట్ల మీదుగా వస్తే దేవాలయం ప్రధాన ద్వారం దగ్గరికి వస్తాం . ఈ మెట్ల మీదనుంచి నడిచి వస్తుంటే ఇరువైపులా గోవిందనామాలు కనిపిస్తూ అలరిస్తాయి . దేవాలయ ప్రధాన ద్వారం దగరికి రాగానే ఎదురుగా టికెట్ కౌంటర్ కనిపిస్తుంది . ఉచిత సర్వ దర్శనంతో పాటు 50 , 300 , 500 రూపాయల టికెట్లు కూడా పెట్టారు . మాములు రోజుల్లో సర్వ దర్శనానికి 30 నిమిషాల లోపలే పడుతుంది . 50 రూపాయల టికెట్ తీసుకుంటే 15 నిమిషాల్లో దర్శనం అవుతుంది . ఇక 300 , 500 రూపాయల టికెట్లకు గర్భాలయం వరకు అనుమతించి ప్రత్యేక పూజతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలు , కండువాలు అందిస్తారు . క్యూ లైనులో నడుచుకుంటూ స్వామివారి ఎదుటికి వచ్చేసరికి అక్కడ కుర్చీ బల్ల వేసుకుని 100 రూపాయలకు అర్చన టికెట్లు అమ్ముతూ దేవస్థాన ఉద్యోగి కనిపిస్తాడు . అర్చన చేయించుకునేవాళ్ళు ఆ టికెట్ తీసుకుంటే అక్కడే ఉన్న పూజారి మన గోత్ర నామాలతో అర్చన చేస్తాడు . అది కూడా బయటినుంచి మాత్రమే . మేము సోమవారం వెళ్లడంతో పెద్దగా రద్దీ లేకపోవడంతో జరగండి..జరగండి అనే అరుపులు , తోపులాటలు లేకుండా స్వామివారిని కనులార దర్శించుకోవడం జరిగింది . అయితే సాయంత్రం 6 గంటలనుంచి 6.౩౦ గంటల వరకు బ్రేక్ ఉంటుంది. ఈ టైములో దర్శనాలు ఆపేస్తారు . కాబట్టి గుడికి వెళ్ళేవాళ్ళు ఈ టైమును దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోండి . వెయిటింగ్ ఉండదు . మొబైల్ ఫోన్లు దేవాలయంలోకి అనుమతించారు . 5 రూపాయలు తీసుకుని స్టోర్ చేయడానికి క్లాక్ రూములు కూడా ఉన్నాయి .
ఉపాలయాలు
నిలువెత్తు రూపంలో ఉన్న స్వామివారి మూల విరాట్టును దర్శించుకోగానే ఒళ్ళు పులకిస్తుంది . ఆధ్యాత్మిక భావనలో మనసుకు ప్రశాంతత వస్తుంది . పక్కనే అలిమేలు మంగాదేవి , వకుళామాత , శ్రీకృష్ణ , గోదాదేవి , రామానుజాచార్యుల ఉపాలయాలు కనిపిస్తాయి . గర్భాలయ ప్రాంగణంలో ఓం నమో వెంకటేశాయ అని మైకులో వినిపించే మంత్రోచ్ఛారణ మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది . భక్తులు కానుకలు వేయడానికి తిరుమల మాదిరి హుండీలు ఏర్పాటు చేసారు . పూజారులు కానీ ఇతర సిబ్బంది కానీ డబ్బులు డిమాండ్ చేయడం లేదు .
ఉపాలయాలు దర్శించుకుని ముందుకు వస్తే తులాభారం కనిపిస్తుంది . మొక్కులు చెల్లించుకునేవారు ఇక్కడ తులాభారం సమర్పించుకోవచ్చు .
ప్రసాదాలు
తులాభారం దాటి ముందుకు వెళ్తే ఉచిత ప్రసాదాల క్యూ కనిపిస్తుంది . అక్కడ చక్రపొంగలి , కట్టు పొంగలి , దద్దోజనం వంటి ప్రసాదాలు ఉచితంగా పంచి పెడతారు . మాకు చక్ర పొంగలి ప్రసాదం అందింది . వేడి వేడిగా రుచికరంగా ఉంది . అక్కడ్నుంచి బయటికి వస్తే ప్రసాదాల కౌంటర్ కనిపిస్తుంది . లడ్డు 50 , పులిహోర 20 రూపాయలకు అమ్ముతారు . అవి కూడా నాణ్యతగా ఉన్నాయి .
ఆంజనేయస్వామి
తిరుమలలో బేడీ ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయానికి ఎదురుగా అభిముఖంగా ఉంటే ఇక్కడ మాత్రం ప్రధాన ఆలయానికి ఎడమవైపు నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టించారు . అక్కడ పూజలు చేయటానికి ఒక పూజారి కూడా ఉన్నారు . ఆ పక్కనే స్వామివారికి ముడుపులు చెల్లించేందుకు ఉన్న ఒక చెట్టు కూడా కనిపిస్తుంది . దానికి అనుకునే ఒక గోశాల కూడా ఉంది .
జలనారాయణుడు
ఆంజనేయస్వామివారిని దర్శించుకుని ముందుకు వెళ్తే దిగువకు మెట్లు కనిపిస్తాయి . ఆ మెట్లకుండా కిందికి దిగితే పుష్కరిణిలో ఆదిశేషుని ఒడిలో శయనిస్తున్న నారాయణుడు కనిపిస్తాడు . ఇక్కడ స్వామివారు జలనారాయణుడిగా పూజలు అందుకుంటున్నారు . సాయంత్రం 6.30 గంటలకు లైట్లు వేసిన తర్వాత చూస్తే అద్భుతంగా ఉంటుంది .
అన్నదానం
ప్రధాన ఆలయానికి కుడివైపుకు వస్తే సువిశాలమైన అన్నదానం హాలు కనిపిస్తుంది . షుమారు రెండువేల మంది భక్తులు ఒకేసారి అన్నదాన ప్రసాదాలు స్వీకరించేలా ఏర్పాట్లు చేసారు .
సాంప్రదాయ వస్త్రాల నిబంధన
ఈ ఆలయంలో సాంప్రదాయ వస్త్రాల నిబంధన ప్రస్తుతానికి అమలులో లేనట్టుంది . బహుశా ప్రత్యేక పూజల్లో పాల్గొనేవారికి ఆ నిబంధన ఉందేమో . కానీ చాలామంది సాధారణ దుస్తులతోనే స్వామివారిని దర్శించుకోవడం కనిపించింది .
టిఫిన్ , భోజన హోటళ్లు
గతంలో లేదు కానీ ఇప్పుడు తిరుగు ప్రయాణంలో కొండకు దిగువున ఒక టిఫిన్ , భోజన హోటల్ వెలిసింది . దూరం నుంచి వచ్చినవారికి ప్రస్తుతానికి ఇదే ఛాయిస్ . ముందుముందు ఇంకా బోలెడు హోటళ్లు వెలిసే అవకాశాలు ఉన్నాయి .
దర్శనం వేళలు
దేవాలయ ప్రాంగణంలో కనిపించిన బోర్డులో దర్శనం వేళలు ఈ విధంగా కనిపించాయి . సాధారణ రోజుల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు , తిరిగి మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటలవరకు . శనివారం , ఆదివారం మాత్రం ఉదయం 8.౩౦ నుంచి రాత్రి 9 గంటలవరకు . కానీ తెల్లవారు ఝామునుంచే స్వామివారి పూజా కార్యక్రమాలు మొదలౌతాయని అక్కడివారు చెప్పారు . ఆన్లైన్ ద్వారా కూడా పూజా కార్యక్రమాలు బుక్ చేసుకోవచ్చని కౌంటర్లో ఉన్న మహిళ తెలిపింది . ఇంతకుముందు వానోస్తే క్యూ లైన్లో ఉన్న భక్తులు తడిసిపోయి ఇబ్బందులు పడేవారు . కానీ ఇప్పుడు క్యూ లైన్ల పైన టార్పాలిన్ రూఫ్ వేయడంతో ఆ ఇబ్బందులు తొలిగాయి .
ముగింపు
2024 మార్చిలో మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు గారి సారధ్యంలో చినజీయర్ స్వామివారి చే ప్రాణ ప్రతిష్ట గావించబడ్డ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మునుముందు మరింత విస్తరించి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు . ఇంతటి సత్కార్యానికి పూనుకున్న మానేపల్లి వారు ధన్యులు . ఇప్పటివరకు స్వర్ణగిరిని సందర్శించని వారు తప్పకుండా వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోండి . అద్భుతమైన అనుభూతిని ఖచ్చితంగా పొందుతారు .
