ఈ మూవీలో నటించిన శశికుమార్ నటన గురించి తెలుసుకోవాలంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడాలి
ఆ మూవీ చూసినవాళ్లు శశికుమార్ సినిమాలు ఏవైనా సరే చూడాలి అనుకుంటారు.
అతడిలో గొప్పతనం ఏంటంటే ఇతడు నటించిన సినిమాల్లో ఎక్కడా శశికుమార్ కనిపించడు
కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది
కొన్ని పాత్రలకు కొందరే నప్పుతారు
అన్ని పాత్రలు అందరూ చేయలేరు
మంచితనానికి మారుపేరు అయిన పాత్రలు చేయాలంటే శశికుమార్ సెలెక్షన్ సరైన ఛాయిస్.
అతి మంచితనానికి ఇతడి ఫేస్ కరెక్ట్ గా సూట్ అవుతుంది
టూరిస్ట్ ఫ్యామిలీ లో అంతే.. ఇప్పుడు మై లార్డ్ మూవీలో కూడా అంతే.. సేమ్ అదే మంచితనం.
ఇతడ్ని చంపాలనుకునే శత్రువులు కూడా ఇతడి ఫేస్ చూస్తే ఆయుధాలు కిందపడేసి దండం పెట్టి పోతారు
ఇక మై లార్డ్ మూవీ విషయానికి వస్తే పేరుకు స్ట్రెయిట్ తమిళ్ సినిమా అయినా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది
ఓటీటీ లు వచ్చాక భాష ఏదైనా మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు
వాటిలో మై లార్డ్ మూవీ కూడా ఒకటి
ఈ మూవీలో మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయనే అహంకారాన్ని ఒకవైపు.. ప్రేమతోనే మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలమనే నమ్మకం మరోవైపు అనే రెండు కోణాలలో కథను రాసుకుని ప్రెజెంట్ చేశారు
పనిలోపనిగా నేటి సమాజంలో ఒక పేదవాడు రేషన్ కార్డ్ పొందటానికి పడే సమయం కన్నా , పడే కష్టం కన్నా, ఒక ధనవంతుడు అదే పేదల కిడ్నీలను తేలిగ్గా కొనుక్కోగలుగుతున్నాడు అనే పాయింట్ మీద ఫోకస్ పెట్టి కథనంలో నడిపించారు
ఇప్పుడు మై లార్డ్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే?
ముత్తు (శశికుమార్) తమిళనాడులోని ఓ విలేజ్ లో అగ్గిపెట్టల ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ ఉంటాడు
అదే ఫ్యాక్టరీలో పనిచేసే సుశీల (చైత్ర ఆచార్) ముత్తు ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది
అయితే సుశీల తరచూ కడుపు నొప్పితో బాధ పడుతూ ఉండటంతో ముత్తు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి పరీక్షలు చేస్తే కడుపులో ట్యూమర్ ఉంది కాబట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు . దాంతో ముత్తు ఆమె వైద్యం కోసం అయ్యే ఖర్చుల కోసం నరసిమ్మన్ అనే ఫైనాన్షియర్ దగ్గర తన రేషన్ కార్డ్ ఆధారంగా పెట్టి అప్పు తీసుకుంటాడు . వైద్యం పేరుతో హాస్పిటల్స్ ముత్తు ను దోచుకోవడంతో అతడి అప్పు మూడు లక్షలకు చేరుకుంటుంది . దాంతో నరసిమ్మన్ కిడ్నీలు అమ్మైనా సరే తన అప్పును తీర్చాలని ముత్తును బెదిరిస్తాడు . నరసిమ్మన్ బెదిరింపులు తట్టుకోలేక ముత్తు విలేజ్ నుంచి పారిపోతాడు . దాంతో అగ్గిపెట్టల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముత్తు సుశీలలు కూడా మరణించారని క్లెయిమ్ చేసి ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని కాజేస్తాడు
ఇదిలా ఉండగా కేంద్రమంత్రి సుజాతా మోహన్ (ఆశా శరత్ ) కిడ్నీ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. డబ్బుతో ఏదైనా కొనగలననే అహంకారం ఈమెది . అదే అహంకారం అలవడిన ఆమె కొడుకు, కూతురు కూడా తల్లికి కిడ్నీ డొనేట్ చేయటానికి ముందుకురారు . దాంతో ఆమె టీమ్ తనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ డోనర్ కోసం వెతికితే అందులో ముత్తు పేరు కనిపిస్తుంది . వెంటనే ఎంత డబ్బైనా సరే ముత్తును తీసుకురమ్మని ఆమె తన టీమ్ ను ఆదేశిస్తుంది
ముత్తు ను తీసుకురావడానికి కేంద్రమంత్రి టీమ్ తమిళనాడు విలేజ్ కు వెళ్తుంది
అక్కడ వాళ్లకు ఎటువంటి అనుభవం ఎదురౌతుంది?
కేంద్రమంత్రికి కిడ్నీ డొనేట్ చేయటానికి ముత్తు ఒప్పుకుంటాడా ?
అతడు ప్రాణప్రదంగా ప్రేమించే సుశీల ఇందుకు ఒప్పుకుంటుందా ? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది.
ఎలా ఉంది?
డబ్బుతో దేన్నైనా సాధించగలమనే కేంద్రమంత్రి సుజాతా మోహన్ అహంకారం ఒకవైపు, ప్రేమతోనే దేన్నైనా సాధించగలమనే ముత్తు నమ్మకం మరోవైపు..అనే రెండు కోణాలలో దర్శకుడు కథను రాసుకుని తెరకెక్కించాడు
ఒక పేదవాడు రేషన్ కార్డ్ పొందాలంటే ఎన్ని కష్టాలు పడాలో, ఒక ధనవంతుడు తల్చుకుంటే కిడ్నీలను సైతం ఎంత తేలిగ్గా కొనేస్తాడో అనే పాయింట్లను చక్కగా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది
అయితే సినిమా ప్రారంభంలోనే ఒక పాటలో ముత్తు సూసైడ్ చేసుకోబోయే సన్నివేశాలు పెట్టడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది . ఆ సన్నివేశాల్లో అతడి ఓవర్ యాక్షన్ చూసి శశికుమార్ నటన ఇది కాదు కదా అని కూడా అనిపించింది . అనవసరమైన ఈ సన్నివేశంతో ఆరంభంలోనే సినిమా మీద మంచి అభిప్రాయం పోతుంది . అతడు పాట పాడుతూ సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవడం.. పోలీసులు చోద్యం చూస్తూ ఉండటం.. జర్నలిస్ట్ అతడి సూసైడ్ నోట్ చదవడం కొంచం అతి అనిపిస్తుంది
ఎప్పుడైతే సుశీల ఆరోగ్యం కోసం ముత్తు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మొదలు పెడతాడో అప్పుడు కథలో సంఘర్షణ మొదలౌతుంది .పేదవాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్లక్ష్యం ఏ విధంగా ఉంటుంది , అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ఏ విధంగా ఉంటుంది అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు
మరోవైపు కిడ్నీ వ్యాధి బారిన పడిన కేంద్రమంత్రి సుజాతా మోహన్ ను రక్షించుకునేందుకు ఆమె కుమారుడు నియమించిన టీమ్ ముత్తు కోసం తమిళనాడు విలేజ్ కి రావడంతో కథనంలో వేగం పుంజుకుంటుంది. కేంద్రమంత్రికి కిడ్నీ డొనేట్ చేస్తే తన కష్టాలు తీరతాయని చెప్పడంతో నమ్మిన ముత్తు వారితో కలిసి వెళ్తాడు
దారిలో తన భార్య ముందు తనని కొట్టిన నరసిమ్మన్ ను చెంప మీద ఒకటి కొట్టి వెళ్దామని కేంద్రమంత్రి టీమ్ కృష్ణకుమార్ ను ముత్తు కోరడం, అతడు తలపట్టుకుని తన ఇన్ఫ్లుయెన్స్ తో జైల్లో ఉన్న నరసిమ్మన్ చెంప మీద ముత్తు కొట్టేలా ఏర్పాటు చేయడం , ముత్తు నరసిమ్మన్ చెంప మీద కొట్టినా సుశీల నవ్వకపోవడంతో ఆమె నవ్వేదాకా కొడతానని అనటం, ఫైనల్గా సుశీల నవ్వడం వంటి సన్నివేశం బాగా కుదిరింది. భార్య నవ్వు చూడటం కోసం ముత్తు అమాయకంగా కేంద్ర మంత్రి టీమ్ ను ఇబ్బందులు పెట్టడం వంటి సన్నివేశాలు కథలో భాగంగా కుదిరాయి
భార్య మీద ముత్తు కు ఎంత ప్రేమంటే నరసిమ్మన్ తన అప్పు తీరడం కోసం ఇద్దరి కిడ్నీలు అమ్మేయని చెప్తే కావాలంటే తన కిడ్నీ ఇస్తాను కానీ తన భార్య కిడ్ని అడగొద్దని ప్రాధేయపడే సన్నివేశంలో కంట తడిపెట్టిస్తాడు . మూవీలో ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలు చాలానే ఉన్నాయి
కాకపోతే ఫస్టాఫ్ లో సాగతీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి . సెకండాఫ్ వచ్చేసరికి కానీ కథ పూర్తిగా గాడిలో పడదు
సెకండాఫ్ లో ముత్తు, సుశీలల అమాయకత్వం , ముత్తు కిడ్నీ కోసం కేంద్ర మంత్రి సుజాతా మోహన్ టీమ్ వెంటపడటం , కోర్ట్ సన్నివేశం ఆకట్టుకుంటాయి . ముత్తుకు సాయం చేయడానికి జడ్జి ముందుకు రావడంతో కథనం పట్ల క్యూరియాసిటి పెరిగింది కానీ జడ్జి పాత్రను అర్థంతరంగా ముగించడంతో తేలిపోయింది
ఓవరాల్ గా ఈ మూవీకి క్లైమాక్స్ ప్రాణం పోసిందని చెప్పాలి. డబ్బుతో దేన్నైనా కొనగలననే కేంద్ర మంత్రి అహంకారాన్ని ముత్తు ఏ విధంగా అణిచేశాడు అనే విధానాన్ని కన్విన్సింగ్ గా చూపించాడు . అన్నిటికన్నా ఆమె డబ్బులు ఆఫర్ చేసినప్పుడు తీసుకోకుండా భార్యాభర్తలు భగవంతుడికి నమస్కరిస్తూ స్తోత్రాలు చదవడం కంట తడిపెట్టిస్తుంది.
తనకు కిడ్నీ డోనేట్ చేస్తున్న ముత్తు వివరాలు చెప్తున్నప్పుడు కేంద్రమంత్రి అతడి క్యాస్ట్ ఏమిటని తన టీమ్ ను అడుగుతుంది. అతడి క్యాస్ట్ తెలియకపోవడంతో అందర్నీ విసుక్కుంటుంది . చివర్లో ఆమె చావుబతుకుల మీద ఉన్నప్పుడు మనుషుల కులాలు, రక్త సంబంధాలు, డబ్బులు ఇవేమీ తనని కాపాడలేకపోయాయని.. మనుషులకు, మనుషులకు మధ్య కేవలం ప్రేమ మాత్రమే గెలిచిందని తెలుసుకుంటుంది.
ఎవరెలా చేశారు?
ఈ మూవీలో ఎవరెలా చేశారని చెప్పుకోవాలంటే మొదట ఇద్దరి గురించి ఎక్కువగా చెప్పుకోవాలి.
మంచితనం మూర్తీభవించిన ముత్తు పాత్రలో శశికుమార్ జీవించేశాడు . అసలు ఈరోజుల్లో ఇలాంటి మంచి మనుషులు ఉంటారా? అని మనం ఆశ్చర్యపోయేలా నటించాడు
ఇక అతడి భార్య సుశీల పాత్రలో చైత్ర ఆచార్ పెర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు . భర్తను ప్రేమించే అమాయకపు పల్లెటూరి పిల్లగా ఆమె ప్రదర్శించిన హావభావాలు బాగున్నాయి
ఇక జర్నలిస్ట్ పాత్ర కొంచం ఓవర్ అనిపించింది.
కేంద్రమంత్రి సుజాతా మోహన్ పాత్రలో ఆశా శరత్ నటన బాగుంది
మిగిలినవారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు
సాంకేతికత
సినిమాలో పాటలవీ పెద్దగా ఏమీ లేవు . ఇద్దరి మధ్య బ్యాక్డ్రాప్ మ్యూజిక్ తో వచ్చిన సాంగ్ బాగుంది .
హీరోహీరోయిన్ల మధ్య అనవసరమైన డ్యూయెట్లు పెట్టి కథ పాడుచేయకుండా దర్శకుడు తెలివైన పని చేశాడు. అప్పటికీ మొదటి పాట అనవసరంగా పెట్టాడు
ఓవరాల్ గా నేపథ్య సంగీతం బాగానే ఉంది.
పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
మొదట్లో మూవీ కొంచం స్లోగా నడుస్తుంది అన్న ఫీలింగ్ వచ్చినా కథలోకి వెళ్తున్న కొద్దీ లీనమైపోతాం. ముఖ్యంగా ముత్తు, సుశీలల అమాయకత్వం మనకి నప్పుతుంది . భార్యభర్తల బాండింగ్ ప్రజెంట్ చేసిన తీరు బాగుంది . నేటి సమాజంలోని మానవ సంబంధాల గురించి కఠోరంగా చెప్పినా వాస్తవం బాగుంది . హాస్పిటల్స్ దోపిడీల గురించి, డబ్బు అహంకారం గురించి చెప్తూనే అంతిమంగా ఏది గెలుస్తుంది అని చెప్పిన విధానం కన్విన్సింగ్ గా ఉంది . సినిమా కష్టాలు చూడటానికి ఇష్టపడని వారికి ఈ సినిమా పెద్దగా నచ్చదు . ఫ్యామిలీ బాండింగ్, భావోద్వేగాల సంఘర్షణ, సెంటిమెంట్ వంటి అంశాలను ఇష్టపడేవారు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఓటీటీ లో తెలుగులో నిరభ్యంతరంగా చూడొచ్చు.
నటీనటులు: శశికుమార్, చైత్ర ఆచార్, ఆశా శరత్ తదితరులు
సంగీతం: సీన్ రోల్డన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
దర్శకత్వం: రాజు మురుగన్
విడుదల: అమెజాన్ ప్రైమ్ ఓటిటి
రేటింగ్: 2.75 / 5
