జులై 24 నుంచి మరో మలయాళం సైకాలజూకల్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది . రెహ్మాన్ , భావన ప్రధాన పాత్రల్లో నటించిన అనోమీ ( Anomie movie ) మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది . ఇందులో ఏసిపి జిబ్రాన్ పాత్ర పోషించిన రెహ్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడే . రెహ్మాన్ గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . మళ్ళీ చాన్నాళ్లకు ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .
సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కి సైంటిఫిక్ కోణంలో కథను రాసుకుని దర్శకుడు తెరకెక్కించారు . ఫిబ్రవరి 6 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది . అందుకు కారణం స్లో నేరేషన్ . దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అటువంటిది . తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
అన్ని మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీల మాదిరే ఈ సినిమా మర్డర్ మిస్టరీతో మొదలౌతుంది . జారా (భావన ) , జియాన్ అక్కాతమ్ముళ్ళు . జారా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తూ ఉంటుంది . ఆమె తమ్ముడు జియాన్ మాత్రం ఒక ఆక్సిడెంట్లో తల్లిని కోల్పోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు . తరచూ అతడికి తల్లి గుర్తుకురావడం , ఆమె వాయిస్ వినిపిస్తుండం వంటి సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతూ ఉండటంతో జారా అతడ్ని సైక్రియాట్రిస్టుకు చూపిస్తుంది . సైక్రియాట్రిస్టు ట్రీట్మెంట్ తో జియాన్ కోలుకుంటున్నాడు అనుకునే టైములో అతడు అనుమానాస్పదంగా మరణిస్తాడు . పోలీసులు అతడి మరణం సూసైడ్ వల్ల జరిగి ఉంటుందని ఫైల్ క్లోజ్ చెయ్యాలని చూస్తారు.
కానీ జారా మాత్రం తన తమ్ముడిది సూసైడ్ కాదని , మర్డర్ అని అనుమానపడుతుంది .
ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఇదే తరహాలో మరో ఇద్దరు మానసిక రోగుల అనుమానాస్పద మరణాలు జరుగుతాయి . దాంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసిపి జిబ్రాన్ (రెహ్మాన్) రంగంలోకి దిగుతాడు . చనిపోయిన ముగ్గురూ డిప్రెషన్తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి సూసైడ్ చేసుకుని ఉంటారని ఏసిపి అనుకుంటాడు . కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేసే జారా మాత్రం తన తమ్ముడితో పాటు జరిగిన మరో ఇద్దరి మరణాలు ఖచ్చితంగా మర్దర్లే అని వాదించడంతో ఏసిపి జిబ్రాన్ కూడా ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు . మరోపక్క జారా కూడా ఈ మరణాల మిస్టరీని తేల్చడానికి స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది .
ఏసిపి జిబ్రాన్ , జారా ల ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది ?
చనిపోయిన ఆ ముగ్గురిదీ ఆత్మహత్యలా ? లేకపోతే హత్యలా ?
ఈ మిస్టరీ మరణాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? అనేది మిగిలిన కధలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
ఈ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే మనకు రెండు విషయాలు క్లారిటీ ఉండాలి . మొదటిది సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కాబట్టి చాలామంది ఇలాంటి మూవీలు చూడటానికి ఇష్టపడతారు . ఇక స్లో నేరేషన్ అనేది రెండోది . ఈ స్లో నేరేషన్ అనేది చాలామంది ఇష్టపడరు . ఒక మర్డర్ మిస్టరీ తేలాలంటే షుమారు రెండుగంటల తర్వాత వచ్చే క్లైమాక్స్ వరకు ఆగాలంటే చాలామందికి సహనం నశించిపోతుంది . అలాంటివాళ్ళకి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు . అయినా ఈ మూవీలో పాజిటివ్ , నెగిటివ్ అంశాలు ఏంటో ఒకసారి రివ్యూ చేసుకుందాం .
యధాప్రకారం అన్ని మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీలలాగానే ఇందులో కూడా దర్శకుడు ఒక మర్డర్ మిస్టరీతో మంచి ఇంట్రెస్ట్ కలిగించే బిగినింగ్ ఇచ్చాడు . అయితే చనిపోయిన జియాన్ సైకలాజికల్ పేషేంట్ కాబట్టి అతడిది సూసైడ్ అయివుంటుందని పోలీసులు అనుకోవడం , తన తమ్ముడిది సూసైడ్ కాదని , మర్డర్ అని అనుమానపడుతూ జారా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడంతో కధనం క్రైమ్ మోడ్ లోకి టర్న్ అయి మనకు ఉత్సుకత కలిగిస్తుంది . జియాన్ కాల్ రికార్డ్ ట్రాక్ చేయడం , బాడీలో డ్రగ్స్ కలిసాయని వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులు చూడటం , వంటి సన్నివేశాలతో జారా చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కధనాన్ని పరుగులు పెట్టిస్తుంది అనుకుంటున్న తరుణాన ఇదే తరహాలో ఇంకో ఇద్దరు అనుమానాస్పదంగా మరణించారని పోలీసుల దృష్టికి రావడంతో కథ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోకి మారిపోతుంది .
ఏసిపి జిబ్రాన్ మీద ప్రెజర్ పెరగడం , అతడు మొదటినుంచి తన కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడంతో అదే కేసును ఈయన యాంగిల్లోమరోసారి చూడాల్సివస్తోంది . దాంతో కథ ఈ మరణాల చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ ముందుకుపోదు . సైకలాజికల్ డిజార్డర్ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే తరహాలో అనుమానాస్పదంగా చనిపోయారు . వాట్ నెక్స్ట్ ? అనుకునే ప్రేక్షకుడి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు . ఆన్సర్ చెప్పడానికి దర్శకుడు ఎక్కడా హడావుడి పడలేదు . తన త్రోవన తాను గూడ్స్ ట్రైన్ మాదిరి నిదానంగా ముందుకు పోవడం మొదలెట్టాడు . ఇక్కడే ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఎదురౌతుంది .
ప్రేక్షకుల సహనం పీక్ కి వచ్చే టైముకి ప్రసాద్ అనే క్యారక్టర్ని రంగంలోకి దింపడంతో మన ఫోకస్ అతడిమీదకు మళ్లుతుంది . కిల్లర్ అతడే అయ్యుంటాడని అనుమానపడతాం . మన అనుమానం నిజమో కాదో కొద్దిసేపట్లోనే దర్శకుడు తేల్చేసాడు . ఇదంతా ఏసిపి వైపు జరిగే ఇన్వెస్టిగేషన్ . మరోవైపు జారా కూడా ఇన్వేసిగేషన్ చేస్తూ ఉంటుంది కదా .. నిజానికి ఏసిపి ఇన్వెస్టిగేషన్ కన్నా జారా చేస్తున్న ఇన్వెస్టిగేషనే కొంచం డామినేటింగ్ గా ఉంటుంది . మర్డర్ మిస్టరీ తేల్చలేక ఏసిపి గటగటా మందు తాగి టెన్షన్ పడతాడు కానీ జారా మాత్రం మొదటినుంచి చివరివరకు ప్రొఫెషనల్ వే లో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతుంది .
వరుసగా జరిగిన మరణాల మిస్టరీ తేల్చేందుకు దర్శకుడు ఈ రెండు పాత్రల ద్వారా సమాంతరంగా ఇన్వెస్టిగేషన్ నడిపించిన తీరు బాగానే ఉంది కానీ కొన్ని క్రైమ్ సీన్స్ చెరొకరు సమానంగా పంచుకున్నట్టు అనిపిస్తుంది . ఫస్టాఫ్ లో ఎక్కువభాగం ఆ ముగ్గురి మరణాల చుట్టూనే కథ తిప్పిన దర్శకుడు సెకండాఫ్ లో మిస్టరీ చిక్కుముడులను విప్పడం మీద ఫోకస్ పెట్టాడు . అదికూడా నేరుగా కాకుండా ప్రసాద్ తో మొదలెట్టి మెల్లిగా ముందుకు వెళ్ళాడు . చివరికి ప్రీ క్లైమాక్సులో మిస్టరీ గుట్టు విప్పుతాడు . కానీ చివరివరకు మిగిలిపోయిన ఒక ప్రశ్నకు క్లైమాక్సులో ఒక ట్విస్ట్ ద్వారా దర్శకుడు సమాధానం చెప్పిన తీరు బాగుంది.
ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో మనం ఎక్కువగా ఆశించేది ట్విస్టులను . కానీ ఎందుకనో దర్శకుడు క్లైమాక్సులో మినహా మధ్యలో ఎక్కడా ట్విస్టుల జోలికి వెళ్ళలేదు . ఎప్పుడైతే క్రైమ్ థ్రిల్లర్ కధనంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వవో అప్పుడు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేది కూడా ఏమీ ఉండదు . ఈ మూవీలో లోపించింది అదే . దర్శకుడు మర్డర్ మిస్టరీకి సైంటిఫిక్ కోణంలో కథ రాసుకుంటూ పోయాడే కానీ ప్రేక్షకులకు కావాల్సిన ట్విస్టుల గురించి దర్శకుడు ఫోకస్ పెట్టలేకపోయాడు . ఈ స్టోరీకి ఆ మసాలా కూడా యాడ్ అయి ఉంటే బాగుండేది .
ఎవరెలా చేసారు ?
ఏసిపి జిబ్రాన్ పాత్రలో రెహ్మాన్ నటన బాగానే ఉంది . చాన్నాళ్లు అయినా అతడి ఫిట్నెస్ బాగానే ఉంది . పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడి బాడీ లాంగ్వేజ్ బాగుంది . గతంలో తెలుగులో కూడా కీ రోల్ తో పాటు కొన్ని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు.
ఇక మరో ప్రధాన పాత్ర జారా . ఈ పాత్రలో భావన నటన బాగుంది . మిగిలినవారు తమ పాత్రల పరిధిమేరకు నటించారు .
సాంకేతికత
హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం బావుంది .
సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫీ పనితీరు కూడా బాగుంది . ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ అయినా కూడా కొన్ని దృశ్యాలను చక్కగా కేప్చర్ చేసారు .
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మూవీ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది . స్లో నేరేషన్ భరించలేనివారికి మాత్రం బోర్ కొడుతుంది . మర్డర్ మిస్టరీ మూవీల సక్సెస్ అనేది దర్శకుడు ఆ మిస్టరీ చిక్కుముడులను విప్పే తీరు మీద ఆధారపడి ఉంటుంది . ఇదే మూవీకి దర్శకుడు ఫస్టాఫ్ లోనూ , సెకండాఫ్ లోనూ కొన్ని ట్విస్టులను జోడించి ఉంటే వేరే లెవెల్లో ఉండేది .
ఈ జానర్ మూవీలు ఇష్టపడేవారు వన్ టైమ్ వాచ్ మూవీకింద అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు . కాకపోతే ఈ మూవీని మలయాళం వెర్షన్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి .
నటీనటులు : రెహ్మాన్ , భావన తదితరులు
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్
దర్శకత్వం : రియాస్ మరాద్
విడుదల : అమెజాన్ ప్రైమ్ (24-07-2026)
రేటింగ్ : 2.5 / 5
