షుమారు పదమూడేళ్ల తర్వాత మలయాళ సూపర్ స్టార్ లు మమ్ముట్టి , మోహన్ లాల్ లు కలిసి నటించడంతో పేట్రియాట్ మూవీ మీద సినీ ఇండస్ట్రీ భారీ అంచనాలు పెట్టుకుంది . వీళ్లిద్దరికీ తోడు ఫహద్ ఫాసిల్ , కుంచకో బోబన్ , నయన తార లు కూడా నటించడంతో ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఉత్సుకతతో ఎదురు చూసారు . మే 1 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా జూన్ 5 నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్లో జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది . ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాకి మహేష్ నారాయణ్ దర్శకత్వం వహించాడు . మమ్ముట్టి ప్రత్యేకంగా సినిమా ప్రమోషన్ కూడా చేసారు .
నిజానికి పేట్రియాట్ ఒక స్పై థ్రిల్లర్ మూవీ . సార్ట్ ఫోన్ లు , ల్యాప్ టాప్ లు వచ్చిన తర్వాత ప్రపంచం మన అరచేతిలోకి వచ్చిందని సంబరపడుతున్నాం . కానీ మన ప్రపంచం ఎక్కడో సుదూరంలో ఉన్న హ్యాకర్ చేతిలోకి వెళ్తుందని గ్రహించలేకపోతున్నాం అన్న పాయింటును బేస్ చేసుకుని పేట్రియాట్ కథ అల్లుకున్నారు .
ఇప్పుడు పేట్రియాట్ మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
పేద బడిపిల్లలకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందచేసే పధకం కోసం కేంద్ర ప్రభుత్వం , కేంద్రమంత్రి కొడుకు శక్తికి ( ఫాహద్ ఫాసిల్ ) చెందిన శక్తి సొల్యూషన్స్ తో అగ్రిమెంట్ చేసుకుంటుంది . ఈ ఒప్పందం ప్రకారం శక్తి సొల్యూషన్స్ కంపెనీ బడిపిల్లలకు ల్యాప్ టాప్ లు సరఫరా చేస్తుంది . కానీ ఈ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని శక్తి సొల్యూషన్స్ కంపెనీ ఇల్లీగల్ యాక్టీవిటీస్ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నళిని రామకృష్ణన్ ( రేవతి ) అనుమానపడుతుంది . అందుకే డిఫెన్స్ సిస్టం లో సైంటిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ డానియల్ జేమ్స్ ను ( మమ్ముట్టి ) పిలిపించి శక్తి సొల్యూషన్స్ చేస్తున్న మోసాలను బయటపెట్టాలని కోరుతుంది .
దాంతో డాక్టర్ డానియల్ తన పరిశోధనలో శక్తి కంపెనీ ల్యాప్ టాప్ లలో స్పై వేర్ ప్రవేశపెట్టి బడిపిల్లల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాడని తెలుసుకుంటాడు . ల్యాప్ టాప్ లలో రహస్య కెమెరాలు పెట్టి బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు తెలుసుకుంటాడు . అదే సమయంలో మంత్రి నళిని రామకృష్ణన్ అనుమానాస్పదంగా మరణిస్తుంది . మరోపక్క శక్తి కంపెనీ మోసాలను బయటపెడదామని డానియల్ అనుకుంటున్నంతలో అతడి మీద దేశద్రోహం నేరం మోపడంతో లండన్ పారిపోతాడు .
నళిని రామకృష్ణన్ మరణం వెనుక ఎవరున్నారు ?
లండన్ పారిపోయిన డానియల్ శక్తి సొల్యూషన్స్ మోసాలను ఎలా బయటపెడతాడు ?
ఈ ఆపరేషన్ లో డానియల్ జేమ్స్ కు సహకరించిన అబ్దుల్ రహీం ( మోహన్ లాల్ ) ఎవరు ?
శక్తి సొల్యూషన్స్ లో పనిచేసిన మైకేల్ ( కుంచకో బోబన్ ) డానియల్ వైపు రావడానికి కారణాలు ఏంటి ? అనేది మిగిలిన కధలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
ఈ మూవీ చూసిన తర్వాత విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్లు వాడాలన్నా , ల్యాప్ టాప్ లు వాడాలన్నాభయపడతాం .. ఆలోచనలో పడతాం . మన వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడో సముద్రాల అవతల ఉన్న హ్యాకర్ ఎలా పసిగడుతున్నాడో తెలిస్తే ఒళ్ళు జలదరించకమానదు . ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల మీద కన్నేసిన సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసాలు చేస్తున్నారో చూస్తున్నాం . దర్శకుడు పేట్రియాట్ మూవీ కోసం మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు .
గదిలో ఎవరూ లేరనుకుని దుస్తులు మార్చుకున్న అమ్మాయి ల్యాప్ టాప్ లో ఉన్న కెమెరా తననే చూస్తున్న సంగతి మర్చిపోయింది . నిమిషాల్లో ఆ వీడియో బయటికి వెళ్ళిపోయింది . ఈ సన్నివేశం చూసిన తర్వాత ముందు ముందు ఇళ్లలో ఉన్న ల్యాప్ టాప్ లను కూడా మనం అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది .
హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ల ద్వారా మీ పర్సనల్ డేటా ఏ రకంగా చోరీ చేస్తారో మరొక సన్నివేశంలో డానియల్ ( మమ్ముటి ) చెప్తాడు . మన స్మార్ట్ ఫోన్లో కేవలం ఒక చిన్న డివైజ్ పెట్టడం ద్వారా ఏ టైంలో ఎక్కడున్నది ? ఏం చేస్తున్నది ? బ్యాంక్ అకౌంట్లు , ఇతర వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ చేతిలోకి అత్యంత సులువుగా వెళ్లిపోతాయి . అందుకే ఆ సన్నివేశంలో ‘ కొంతకాలం స్మార్ట్ ఫోన్ వాడిన తర్వాత దాన్ని తిరిగి అమ్మవద్దని చెప్తాడు . ఎందుకంటే సెకండ్ హ్యాండ్ లో మీ స్మార్ట్ ఫోన్ అమ్మితే ఫోనుతో పాటు మీ డేటా కూడా పోతుందని ‘ చెప్తాడు .
ఈ సన్నివేశం చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ స్మార్ట్ ఫోన్ల వినియోగం మీద అవగాహన కంపల్సరీ అని తెలుస్తుంది . నిజానికి దర్శకుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న డిజిటల్ మోసాల గురించి పేట్రియాట్ సినిమా ద్వారా అవెర్నెస్ తీసుకొచ్చినట్టుగా ఉంది . ప్రభుత్వాలు షార్ట్ ఫిలిం కింద తీయదగ్గ సబ్జెక్ట్ ఇది . కాకపోతే ఇది మూవీ కాబట్టి దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చెప్పాలనుకున్న పాయింటును సూటిగా చెప్పేసాడు .
ఇక మూవీ విషయానికి వస్తే దర్శకుడు నేరుగా కథలోకి వెళ్లకుండా నళిని రామకృష్ణన్ పాత్ర ద్వారా కొంత కధనం నడపడంతో మొదటి ముప్పై నిమిషాలు స్టోరీ లైన్ ఏంటో అర్ధం కాదు . ఎప్పుడైతే మమ్ముటి ఎంటర్ అవుతాడో అప్పుడు కధనంలో వేగం పెరుగుతుంది . మమ్ముట్టి లండన్ పారిపోయి విమతన్ పేరుతో యూ ట్యూబ్ ద్వారా శక్తి సొల్యూషన్స్ మోసాలు బయటపెడుతుండంతో స్టోరీ లైన్ పూర్తిగా అర్థమైపోతుంది . అక్కడ్నుంచి మమ్ముట్టి కిడ్నాప్ అవడం , తప్పించుకోవడం , మోహన్ లాల్ ఎంటర్ అవడం , శక్తి టీమ్ వీళ్ళని వెంటాడటం వంటి సన్నివేశాలు యాక్షన్ థ్రిల్లర్ ను తలపిస్తాయి .
ముఖ్యంగా రేడియో సిగ్నల్ ద్వారా లైట్స్ బ్లింక్ చేస్తూ మోహన్ లాల్ , మమ్ముట్టిలు సందేశాలు పంపుకోవడం , మోహన్ లాల్ ఇంట్లో జరిగిన ఫైటింగ్ సన్నివేశాలు , సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచాయి .
కాకపోతే ఫస్టాఫ్ కొన్ని సన్నివేశాలు సాగతీత కోసం ఇరికించినట్టుగా కనిపిస్తాయి . మమ్ముట్టితో సహజీవనం చేస్తున్న ఆయేషా పాత్ర ఎందుకో అర్ధం కాదు . వీళ్లిద్దరి మధ్య నడిచే ట్రాక్ లో కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తుంది .
ఇక సెకండాఫ్ లో మాత్రం కధనం చకచకా పరుగులు పెడుతుంది . కుంచకో బోబన్ మమ్ముట్టి పక్కన చేరడంతో కధనంలో క్యూరియాసిటీ పెరుగుతుంది . దానికి తోడు మోహన్ లాల్ ఎంట్రీ సినిమాకి బూస్ట్ ఇస్తుంది . ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య క్లైమాక్సులో జరిగిన సన్నివేశాలు సినిమాకి కీలకం అవుతాయి . చివరలో నయన తార కూడా ఎంట్రీ ఇస్తుంది కానీ ఆమె పాత్ర పరమార్థం అర్ధం కాదు . ఆమె ఇంట్రడక్షన్ లో కొద్దిగా క్లారిటీ మిస్ అయ్యింది . నయన తార పాత్రకు ఇంకొంచం స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది .
ఎవరెలా చేసారు ?
మమ్ముట్టి , మోహన్ లాల్ ఇద్దరూ మలయాళ సూపర్ స్టార్లే .. నటనలో ఎవరి స్టైల్ వాళ్ళది . మళయాళీలే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఇద్దరు నటులనీ అభిమానిస్తారు . షుమారు పదమూడేళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటించారు కాబట్టి కొన్ని పోలికలను చెప్పుకోక తప్పదు . మేకప్ మహత్యమో , వయసు ప్రభావమో తెలీదు కానీ మోహన్ లాల్ తో పోలిస్తే ఇందులో మమ్ముట్టి డీ గ్లామర్ గా కనిపించారు . చాలా సన్నివేశాల్లో మమ్ముట్టి తేలిపోయినట్టు కనిపించాడు . కానీ మోహన్ లాల్ మాత్రం చివరివరకు గ్లామర్ గా , ఎనర్జిటిక్ గా కనిపించారు.
సినిమాలో ఇద్దరికీ పవర్ ఫుల్ రోల్స్ దక్కాయి కానీ మోహన్ లాల్ పాత్ర ఇంకాస్త పవర్ ఫుల్ గా కనిపిస్తుంది .
ఇక ఫాహద్ ఫాసిల్ నటన షరా మాములుగా వంక పెట్టడానికి లేకుండా ఉంది . క్లైమాక్స్ సన్నివేశంలో ఆఫీసులో స్టాఫ్ తో మాట్లాడుతున్నప్పుడు , చివరగా తండ్రితో ఫోనులో మాట్లాడుతున్నప్పుడు ఫహాద్ తనదైన మార్క్ నటన చూపించాడు .
మరో చక్కటి నటుడు కుంచకో బోబన్ ను దర్శకుడు సరిగా వాడుకోలేదనిపిస్తుంది . ఇద్దరు అగ్రనటుల మధ్య కుంచకో బోబన్ కు అంతకన్నా ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం అని దర్శకుడు అనుకున్నాడేమో తెలీదు కానీ కుంచకో పరిస్థితి ఎస్ బాస్ మాదిరి తయారయ్యింది .
నయన తార కూడా చక్కటి నటి అనడంలో సందేహం లేదు . కానీ మూవీలో తన నటన నిరూపించుకునే స్కోప్ ఆమెకు ఇవ్వలేదు .
సాంకేతికత
మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది . కాకపోతే విమానంలో తీసిన సన్నివేశాలు మరీ కృతకంగా ఉన్నాయి .
సుషీన్ శ్యామ్ అందించిన సంగీతం బాగానే ఉంది .
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .
విశ్లేషణ
ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్ మోసాలను దర్శకుడు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు . ఈ కథ కోసం దర్శకుడు ఆ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకోకపోతే డాక్యుమెంటరీ ఫిలిం అవుతుంది . అందుకే తను చెప్పాలనుకున్న పాయింటును సూటిగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పాడు . ఇందులో హీరో ,హీరోయిన్ల లవ్ ట్రాకులు పెట్టలేదు . ముందు మూడు , తర్వాత మూడు పాటలు పెట్టలేదు . మధ్య మధ్యలో బలవంతపు కితకితలు పెట్టలేదు . పూర్తిగా కథ మీదే ఫోకస్ పెట్టి చివరి వరకు కధనాన్ని నడిపించాడు . మధ్యలో ఎక్కడా స్టోరీ సైడ్ ట్రాక్ తీసుకోకుండా జాగ్రత్త పడ్డాడు .
పేట్రియాట్ ని మనం కేవలం ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుని మర్చిపోకూడదు . ఇప్పట్నుంచే డిజిటల్ మోసాల మీద ఆలోచన చేయాలి . స్మార్ట్ ఫోన్లు , ల్యాప్ టాప్ లు వాడేవాళ్లు ఈ సినిమా ఇచ్చిన సందేశాన్ని అర్ధం చేసుకోవాలి . ఓవరాల్ గా చెప్పాలంటే ప్రస్తుత కాలానికి సరిపోయే కథ పేట్రియాట్ .
అన్నట్టు పేట్రియాట్ అంటే దేశభక్తుడు అని అర్ధం . దేశద్రోహం నేరం కింద మమ్ముట్టి మీద ఆరోపణలు చేసిన ఆఫీసరే చివరకు అతడిని తిరిగి డిఫెన్స్ సిస్టం లో బాధ్యతలు చేపట్టమని అడిగినప్పుడు ‘ నేను దేశభక్తుడినే కానీ దేశద్రోహిని కానని మీ చీఫ్ కు చెప్పు ‘ అని చెప్పి వెళ్ళిపోతాడు మమ్ముట్టి . జీ 5 లో తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకుండా చూడొచ్చు .
నటీనటులు : మమ్ముట్టి , మోహన్ లాల్ , ఫహద్ ఫాసిల్ , కుంచకో బోబన్ , నయన తార తదితరులు
సంగీతం : సుషీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ : మనుష్ నందన్
నిర్మాత : ఆంటోని జోసెఫ్
దర్శకత్వం : మహేష్ నారాయణ్
విడుదల : జీ 5 ఓటిటి
రేటింగ్ : 2.75 / 5
