ఈరోజు నుంచి (జులై 31) నవీన్ చంద్ర , వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన పోలీస్ కంప్లైంట్ ( Police Complaint movie ) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది . జూన్ 12 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి కృష్ణ సాయి నిర్మాతగా వ్యవహరించగా , సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు .
డిఫరెంట్ రోల్స్ చేయడంలో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇప్పటికే పేరుంది . విలనిజంలో తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకున్న నవీన్ చంద్ర ఇందులో హీరోగా నటించడం , క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ కావడం వంటి అంశాలతో సినిమా మీద కొంతమంది అంచనాలు పెట్టుకున్నారు . మరి వారి అంచనాలకు తగినట్టుగా మూవీ ఉందో ? లేదో ? ఇప్పుడు చూద్దాం .
కధేంటంటే ?
సీతామహాలక్ష్మీ ( వరలక్ష్మి శరత్ కుమార్ ) పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్పీ గా పనిచేస్తూ ఉంటుంది . ఆమె భర్త రామ్ ప్రసాద్ ( నవీన్ చంద్ర ) డాక్టర్ వృత్తిలో ఉంటాడు . చాలాకాలం క్రితం జరిగిన ఓ గర్భిణీ హత్యకేసులో ఎవిడెన్సులు లేక పోలీస్ రికార్డులలో ఫైలు మూలన పడి ఉంటుంది . క్షుద్ర పూజలు అయ్యుంటాయని పోలీసులు పట్టించుకోరు . ఈ పరిస్థితుల్లో ఓ పాప పోలీస్ స్టేషన్ కు వచ్చి తనకు డాడీ కావాలని కంప్లైంట్ పెడుతుంది . ఏఎస్పీ సీతాలు ఆ పాప డాడీ గురించి వివరాలు అడిగినప్పుడు పోలీస్ స్టేషన్ బయట టీ అమ్ముతున్న వ్యక్తిని చూపిస్తుంది . దాంతో అతడ్ని పిలిపించి అడిగితే ఆ పాప ఎవరో తనకు తెలీదంటాడు . కానీ అదే వ్యక్తి రాత్రి పన్నెండు గంటలకు హత్యకు గురి అవుతాడు .
ఈ కేసు విషయం తేలక పోలీసులు ఆలోచిస్తుంటే ఆ పాప మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇంకో వ్యక్తిని చూపించి ఇతడే నా డాడీ అంటుంది . ఏఎస్పీ సీతాలు అతడ్ని ప్రశ్నిస్తే ఈ పాప ఎవరో తనకు తెలీదు అంటాడు . సరిగ్గా అతడు కూడా అర్ధరాత్రి హత్యకు గురవుతాడు . దాంతో ఈ పాప ఎవర్ని చూపించి తన డాడీ కావాలని పోలీసులకు కంప్లైంట్ చేస్తుందో ఆ వ్యక్తి హత్యకు గురవుతున్నాడని ఏఎస్పీ సీతాలుకు అర్ధం అవుతుంది .
మూడోసారి ఆ పాప హోమ్ మినిష్టర్ కొడుకుని చూపించి ఈయనే నా డాడీ అనడంతో ఎలాగైనా అతడ్ని కాపాడాలని ఏఎస్పీ సీతాలు హోమ్ మినిష్టర్ ఇంటికి వెళ్తుంది .
ఇంతకీ ఆ పాప ఎవరు ?
తన డాడీ అని ఆ పాప చూపించిన వ్యక్తులు మర్డర్ అవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ?
క్షుద్ర పూజలకు , ఈ మర్డర్ లకు లింక్ ఏమన్నా ఉందా ?
ఏఎస్పీ సీతామహాలక్ష్మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
హార్రర్ సినిమాలు తీసి ప్రేక్షకులను భయపెట్టాలంటే కధే ఉండక్కర్లేదు . ఎలాగైనా భయపెట్టొచ్చు అని ఈ సినిమా నిరూపించింది . ఒక పక్కన మధ్యమధ్యలో కనిపించే క్షుద్ర మాంత్రికుడు , ఐపీఎస్ సీతామహాలక్ష్మీ చేసే కామెడీ స్కిట్లు , మరోపక్క శ్రీనివాస రెడ్డి పక్కన చేరి విన్యాసాలు చేసే నిర్మాత కృష్ణ సాయి ..ఇలా ప్రతి ఒక్కరూ భయపెట్టేస్తారు . మొదటి గంట వరకు ఏ సన్నివేశం ఎటు పోతుందో అర్ధం కాదు .. ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో అర్ధం కాదు .
ఒక ఐపీఎస్ ఆఫీసరుతో అతకని గతకని కామెడీ చేయిస్తున్నప్పుడే సినిమాలో పవర్ పోయింది . ఆ కామెడీ చూసాడంటే వీడేరా పోలీస్ అని అరవడానికి కూడా సాయికుమార్ భయపడతాడు . మర్డర్ మిస్టరీ చుట్టూ నడవాల్సిన కధనం పూర్తిగా కామెడీ పీసుగా అయిపొయింది . అదేదో సినిమాలో బ్రహ్మానందం చావు కబుర్లు కూడా పగలబడి నవ్వుతూ చెప్తుంటాడు . అలాగ ఈ మూవీలో సీరియస్ టోన్ లో సాగాల్సిన మర్డర్ మిస్టరీలు కాస్తా దర్శకుడు కామెడీ చేసేసారు . ఎప్పుడు చూసినా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక నలుగురు కానిస్టేబుళ్లను వెంటేసుకుని తిరగడం , ఎప్పుడైనా దయతలచి తాను ఏఎస్పీ ని అని గుర్తొస్తే యూనిఫార్మ్ వేయడం , లేకపోతే క్యాజువల్ డ్రెస్సులలో తిరగడం , మీడియా ముందు లిప్ స్టిక్కులు రాసుకోవడం , రీల్స్ కోసం రెడీ అవడం ఇత్యాది వాటిలో ఏ ఒక్కదానికీ ప్రేక్షకుడు కన్విన్స్ కాలేడు .
వరుసగా ప్రతి సీన్లో దర్శకత్వ లోపాలు కనిపిస్తాయి . తన దగ్గరున్న నలుగురు కానిస్టేబుళ్లతోనే హోమ్ మినిష్టర్ ఇంటికి వెళ్లడం , అక్కడ మీడియా వాళ్ళ ముందు రీల్స్ చేయడానికి పై కోటు వేసుకోవడం , డైరెక్ట్ హోమ్ మినిష్టర్ కే వార్నింగ్ ఇవ్వడం ,ఆయన ఈవిడని సస్పెండ్ చేస్తున్నానని అరవడం , పన్నెండు గంటలకు హోమ్ మినిష్టర్ కొడుకు ఎలా మర్డర్ అవుతాడో చూద్దామని పాపని ఎదురుగా పెట్టుకుని గడియారాల వంక చూడటం , పన్నెండు కాగానే కమెడియన్ శ్రీనివాస రెడ్డి ఫినిష్ అనడం .. టోటల్ ఎపిసోడ్లో లాజిక్కుల గురించి ఆలోచించకూడదు .. అంతే .. కనీసం ఈ సన్నివేశంలో అయినా ఐపీఎస్ వరలక్ష్మి కామెడీ చేయకుండా ఉంటుందేమోనని గంపెడు ఆశతో ఎదురు చూస్తే నిరాశే మిగిలింది .
పన్నెండు గంటలకు హోమ్ మినిష్టర్ కొడుకు మర్డర్ అవుతాడని ఏఎస్పీ కి తెలిసినప్పుడు ఓ పోలీస్ ఆఫీసర్ గా పై అధికారులకు తెలియచేయాలి కదా ? అక్కడే గేటు బయట కారు బ్యానెట్ మీద కూర్చుని శ్రీనివాస రెడ్డితో కామెడీ చేయడమేంటి ? ఇంతా చేసి ఈ కామెడీతో ఆ సీన్లో సీరియస్నెస్ అంతా గాల్లో కలిసిపోయింది .
ఇక ఆ పాప , ఆ పాప తండ్రి ల ఎపిసోడ్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి . వాళ్ళు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి మాత్రమే కనిపిస్తారు . కనిపించకూడదు అంటే ఎవరికీ కనిపించరు. ఆ పాప తల్లి కొంతవరకు నయం . మొదటినుంచి చివరి వరకు దయ్యంలానే పద్ధతిగా తిరుగుతుంది . కానీ ఈ రెండు క్యారెక్టర్ల సంగతే ఒక్క కమెడియన్ శ్రీనివాస రెడ్డికి మినహా సినిమాలో మిగిలిన పాత్రలకూ , సినిమా చూస్తున్న మనకూ అర్ధం కాదు . ఇక క్రిష్ పాత్ర పోషించింది నిర్మాత కృష్ణ సాయి అని తెలిసింది . నిర్మాతగా డబ్బులు ఖర్చుపెట్టడమే బోలెడు సాహసం అనుకుంటున్న ఈ రోజుల్లో ఆయన స్వయంగా నటించడం ఇంకా సాహసమనే చెప్పాలి . నటన మీద ఆయనకున్న ప్యాషన్ వల్లనో ? లేకపోతే సొంత సినిమా అనే ప్రేమ వల్లనో తెలీదు కానీ ఈ మూవీలో హీరో అనుకున్న నవీన్ చంద్ర అతిధి పాత్ర మాదిరి అప్పుడప్పుడు కనిపించడం , సినిమా మొత్తం పాప తండ్రి క్యారక్టర్ రూపంలో భుజాన వేసుకుని నడిపించినట్టున్నారు . ఇందువలన ఈ సినిమాలో అసలు హీరో ఎవరో తెలియక ప్రేక్షకులు కొంచం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి .
ఇక తొమ్మిది నెలల నిండు గర్భవతి నొప్పులు వస్తే స్కూటీ మీద ఆసుపత్రికి బయలుదేరడం మెడికల్ సైన్సునే ఆశ్చర్యపరిచే సన్నివేశం . ఈ సన్నివేశానికి డాక్టర్లు కన్విన్స్ అవుతారో ? లేదో ? చూడాలి . ఆమె విషయంలో విలన్ల చేత దర్శకుడు నడిపించిన సన్నివేశం కూడా జస్టిఫికేషన్ గా లేదు . జన్మనిచ్చిన పాపను గడ్డికుప్పలోకి విసిరినప్పుడైనా కెమెరా పనితనం చూపించి ఉండాల్సింది . రబ్బరుబొమ్మ కదలికలు కుదరలేదు .
పాప తల్లి బూడిద అయినప్పుడు పోలీసులకు ఏమీ ఎవిడెన్సులు దొరకవు . కానీ పాప తండ్రి స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వస్తే అక్కడ ఆమెకు సంబంధించిన చైన్ దొరుకుతుంది . అంతేకాదు బూడిదలోనుంచి భార్య వెన్నుపూస కూడా బయటికి తీస్తాడు . మరి క్రైమ్ సీన్లో పోలీసులు ఈ మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయలేరా ? ఫోరెన్సిక్ డాక్టర్ అది జంతువు బూడిద అంటే ఫైల్ క్లోజ్ చేసేస్తారా ? ఇంత ఇల్లాజికల్ గా సన్నివేశాలు రాసుకుంటే ఎలా ?
ఇక ఇందులో నవీన్ చంద్ర అయ్యుంటాడని అనుకున్నాం కదా .. కానీ కనీసం ఒక్క ఫైటింగులో అయినా ఆయన హీరోయిజాన్ని దర్శకుడు వాడుకోలేకపోయారు . అయినా సరే ఈ మూవీలో నవీన్ ఏదో మెస్మరైజ్ చేస్తాడని చూసినవాళ్ళకి ఆ పాత్రను ముగించిన తీరు నచ్చకపోవచ్చు . ఈ మధ్యవిడుదలైన తమిళ హీరో సినిమాలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది . ఆ సినిమాలో హీరోకన్నా నిర్మాత డామినేటింగ్ రోల్ తీసుకున్నాడు . హీరో పాత్రను పరిమితం చేసి పాప తండ్రి క్యారక్టర్ ఫుల్ లెన్త్ తీసుకోవడం ఈ సినిమాలో ప్రధాన లోపం . నటన పరంగా నవీన్ పాత్రకు మరింత స్కోప్ ఇచ్చి ఉంటే నటన పరంగా బాగుండటంతో పాటు ఫలితాలు ఇంకోలా వచ్చేవి .
ఓవరాల్ గా ఈ మూవీలో దర్శకత్వ వైఫల్యం ఎక్కువగా కనిపిస్తుంది . వరలక్ష్మి శరత్ కుమార్ , నవీన్ చంద్ర వంటి చక్కటి నటులనుంచి పూర్తిస్థాయిలో సరైన నటన రాబట్టుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు . మర్డర్ మిస్టరీ స్టోరీని స్క్రీన్ మీద పెట్టడంలో తడబడ్డారు . దాదాపు ఫస్టాఫ్ అంతా సాగతీతకు పనికివచ్చిందే కానీ అసలు కథలోకి రాలేదు . సెకండాఫ్ నుంచి అసలు కథలోకి వచ్చినా సరైన స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవడంతో ఇంట్రెస్ట్ కలక్కపోగా విసుగు వస్తుంది . నవీన్ చంద్ర ట్విస్ట్ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉండటంతో కొత్తగా థ్రిల్ ఫీలయ్యేది ఏమీ ఉండదు . క్లైమాక్స్ రొటీన్ కమ్మర్షియల్ ఫార్మాట్లోనే ముగిసింది కాబట్టి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు .
ఎవరెలా చేసారు ?
ఈ మూవీలో నవీన్ చంద్రకు స్కోప్ దక్కలేదు . ఫుల్ లెన్త్ రోల్ అయితే ఆయన నటన గురించి ఏమైనా చెప్పుకోవచ్చు . కనిపించినంతలో బాగానే చేసాడు .
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే చక్కటి నటి . ఆమెనుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో నటన రాబట్టుకోలేకపోయారు .
ఇక పాప తండ్రి క్యారక్టర్ ఓ ప్రయోగం అనుకోవాలి . కొంతమందికి నచ్చి ఉండొచ్చు . మరికొంతమందికి వికటించి ఉండొచ్చు .
కమెడియన్లు శ్రీనివాస రెడ్డి , సప్తగిరిలను కూడా దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు . వరలక్ష్మి కామెడీ తగ్గించి ఈ ఇద్దరికీ ఆ పోర్షన్ అప్పచెప్పి ఉంటే బాగుండేది .
సాంకేతికత
హరీష్ అందించిన కెమెరా పని తనం యావరేజ్ గా ఉంది .
సుధీంద్ర అందించిన సంగీతం కూడా యావరేజుగానే ఉంది .
నిర్మాణ విలువలు పర్లేదు .
విశ్లేషణ
హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీలను చాలామంది ఇష్టపడతారు . అలా ఇష్టపడటానికి కూడా ఒక కారణం ఉంటుంది . కధనం సీరియస్ మోడ్ లో సాగుతుంది . మధ్య మధ్యలో ఊహించని మలుపులు ఉంటాయి . క్లైమాక్స్ ట్విస్టుతో థ్రిల్ అవుతారు . ఇదీ ఈ జానర్లో చాలామంది దర్శకులు వాడే ఫార్ములా . కానీ ఇందులో ఆ ఫార్ములా లోపించింది .
ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం నిరాశ కలిగిస్తుంది .
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది .
నటీనటులు : నవీన్ చంద్ర , వరలక్ష్మి శరత్ కుమార్ , శ్రీనివాస రెడ్డి , సప్తగిరి తదితరులు
సంగీతం : సుధీంద్ర
సినిమాటోగ్రఫీ : హరీష్
నిర్మాత : కృష్ణ సాయి
దర్శకత్వం : సంజీవ్ మేగోటి
విడుదల : అమెజాన్ ప్రైమ్ ( 31-07-2026 )
రేటింగ్ : 1.5 / 5
