Chinna Chinna Aasai Movie Review – మలయాళం దర్శకులు కేవలం హర్రర్ , క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే బాగా తీయగలరని అనుకుంటాం . కానీ చిన్న చిన్న ఆశై మూవీ చూసిన తర్వాత ఆ అభిప్రాయం మారిపోతుంది . అందమైన దృశ్య కావ్యం లాంటి ఫీల్ గుడ్ మూవీలను కూడా తీయగలరని అర్ధమౌతుంది .
మలయాళ నటుడు ఇంద్రన్ , రోజా ఫేమ్ మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన చిన్న చిన్న ఆశై మూవీ జులై 28 నుంచి జియో హాట్ స్టార్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది . గతంలో మధుబాల నటించిన ఒక సినిమాలోని చిన్న చిన్న ఆశ అనే పాట లైనును ఈ మూవీ టైటిల్ కోసం వాడుకున్నారు . అభిజిత్ బాబూజీ నిర్మించిన ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు .
ఇపుడు చిన్న చిన్న ఆశై మూవీ ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
ఈ మూవీలో కథ గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు . ఇదొక దృశ్య కావ్యం . గంగా ప్రవాహంలా సాగిపోతుంది . జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్న రెండు మనసులు గంగమ్మ ఒడిలో సేదతీరిన హృదయ కావ్యం ఈ మూవీ .
తమిళనాడులోని తంజావూరుకు చెందిన లీల ( మధుబాల ) తోటి తమిళ గ్రూపుతో కలిసి వారణాసి ట్రిప్ వస్తుంది . అయితే వారణాసిలో ఆమె గ్రూపు నుంచి తప్పిపోతోంది . దానికి తోడు ఒక దొంగ ఆమె పర్స్ , మొబైల్ ఫోన్ దొంగిలించడంతో ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా ఏడుస్తుంటుంది . ఇది గమనించిన స్థానికుడు అక్కడే ఉన్న మాధవన్ మాస్టారికి ( ఇంద్రన్ ) చెప్పడంతో లీలకు సహాయంగా తిరిగి ఆమె గ్రూపులో చేర్చటానికి ముందుకువస్తాడు .
ఏడాదిన్నర క్రితం భర్త చనిపోవడంతో ఒంటరి తనం అనుభవిస్తున్న లీల , పాపకు జన్మనిచ్చి కన్నుమూసిన భార్య జ్ఞాపకాలతో మాధవన్ మాస్టారు అనుకోకుండా వారణాసిలో కలుసుకుంటారు . ఈ ఇద్దరూ కలిసి వారణాసిలో ఒకరోజు సాగించిన ప్రయాణమే చిన్న చిన్న ఆశ .
వారణాసిలో కలిసిన మాధవన్ మాస్టారుతో లీలకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది ?
లీల తిరిగి తమిళ్ గ్రూపుతో కలిసి తంజావూరు వెళ్లిపోతుందా ?
మాస్టారుతో బోలెడు అనుభవాలు మూటగట్టుకున్న లీల జీవితం చివరకు ఎలాంటి ముగింపు తీసుకుంటుంది ? అనేది మిగిలిన కథ .
ఎలా ఉంది ?
చూసారుగా .. ఈ మూవీని కధలా చెప్పుకోవాలంటే కష్టం . ప్రతి సన్నివేశం ఓ దృశ్య కావ్యంలా సాగిపోతుంది . ఈ దృశ్య కావ్యానికి వారణాసిని వేదికగా చేసుకుని దర్శకురాలు తెలివైన పనిచేసింది . గంగ ఎంత పవిత్రంగా ఉంటుందో కల్మషం లేని ఈ ఇరు హృదయాలు కూడా అంతేనని సింబాలిక్ గా చెప్పడానికి దర్శకురాలు వారణాసిని ఎన్నుకున్నట్టుంది .
ఓ వెకిలి మాటలు ఉండవు . ద్వందార్ధలు ధ్వనించే డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు . మాటిమాటికీ తగులుకునే బూతు పాటలు ఉండవు . అసభ్య దృశ్యాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు . ఒకరికి ఒకరు ఏమౌతారో తెలీని ఇద్దరు ఒంటరి మనుషులు వారణాసిలో కలుసుకుని ఒకరోజు ప్రయాణం చేస్తారు .
జీవితంలో ప్రతి ఒక్కరికీ చిన్ని చిన్ని ఆశలు ఉంటాయి . ఇరవై ఏళ్ళు పుట్టింట్లో అమ్మానాన్నల దగ్గర పెరిగిన ఆడపిల్ల తన ఆశలను , ఆలోచనలను మార్చుకుని అత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాలి . తనకంటూ కొన్ని ఆశయాలు ఉంటాయని అత్తింట్లో గుర్తించి స్వేచ్ఛ ఇస్తే పర్లేదు . కానీ ఇంట్లో ఇంకో కొత్త పనమ్మాయి వచ్చిందని వాళ్ళు భావిస్తే ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి ?
లీల పరిస్థితి అదే . తండ్రి దగ్గర గారాబంగా పెరిగిన ఆ పిల్ల అత్తింట్లో .. ముఖ్యంగా భర్త దగ్గర కూడా అదే ప్రేమను ఆశించి విఫలమైతే ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ? ఆమె ఆశయాలేంటో తెలుసుకోకుండా కేవలం చాకిరీ చేసే పనమ్మాయిలా భావిస్తే ఆమె పడే సంఘర్షణ ఎలా ఉంటుంది ? ఓ సన్నివేశంలో లీల మాట్లాడుతూ ” తన భర్తను బాగా ప్రేమించానని , కానీ అతడినుంచి తాను అటువంటి ప్రేమను పొందలేకపోయానని” చెప్తుంది. మరి మీ సంగతి ఏంటని మాస్టారుని అడిగితే ” తాను నాలుగేళ్లుగా తన భార్యని ప్రేమించానని , కానీ పాపని తన చేతిలో పెట్టి ఆవిడ వెళ్లిపోయిందని చెప్తూ కంట తడిపెట్టుకుంటాడు . ఇటువంటి సన్నివేశాలు హృదయాలను టచ్ చేస్తుంది .
భర్త లేకపోవడంతో లీల , భార్య లేకపోవడంతో ఒంటరి తనాన్ని అనుభవిస్తూ మాధవన్ మాస్టారు కొన్ని అనుభవాలను ఫేస్ చేస్తారు . ఆ అనుభవాలను ఒకరికొకరు మనసు విప్పి షేర్ చేసుకుంటారు . ఈ ఇద్దరిమధ్య ఒక తెలియని అనుబంధం ఏర్పడుతుంది . దాని పేరేమిటో కూడా ఇద్దరికీ తెలీదు .
అయినా ఆ కాస్త పరిచయంలోనే ఆమె ఇష్టాలు ఏంటో కనుక్కుంటాడు మాధవన్ మాస్టారు . ఆమెకు లస్సి తాగడం ఇష్టమని చెప్తే లస్సి ఇప్పిస్తాడు . కూతురి పుట్టినరోజుకి చీర తీసుకుంటూ ఆమెకు కూడా చీర కొంటాడు . ఎక్కడా ఆమె ఒంటరి తనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందామని ఆలోచన చేయడు . కనీసం ఆమెను తాకను కూడా తాకడు . ఒకేఒక సన్నివేశంలో ఆమె చేయిపట్టుకుని కొంతదూరం నడిపించుకుని వెళ్ళాక ‘ ఇలా చేయి పట్టి తీసుకొచ్చినందుకు ఏమీ అనుకోవద్దు . వాళ్ళు మీ గురించి చెడుగా అనుకోవడం వినలేక ఇలా తీసుకొచ్చా ‘ అంటాడు
దర్శకురాలు ఇద్దరి మధ్య పవిత్రమైన రిలేషన్ ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు చాలా బాగుంది . శంకరాభరణంలో శంకర శాస్త్రులు గారు తులసి తల్లి మీద ఎటువంటి భావంతో ఉంటారో మాధవన్ మాస్టారు లీల మీద అటువంటి భావనతోనే ఉండటం మెప్పిస్తుంది . దర్శకురాలు ఈ ఇద్దరి మధ్య అనుబంధాన్ని ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా ప్రొజెక్ట్ చేసిన విధానం మూవీకి హైలెట్ అవుతుంది .
చిన్నప్పట్నుంచి తనకు కూచిపూడి , భారత నాట్యాలు ఇష్టమని లీల చెప్పడంతో మాధవన్ మాస్టారు అక్కడ ఘాట్ లో పాటలు పాడుతున్న సింగర్స్ దగ్గరికి వెళ్లి ఆమెచేత నాట్యం చేయించమని కోరడం , నాట్యం చేసి లీల తన చిన్ననాటి కోరికను తీర్చుకోవడం , వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని తన మొదటి సంపాదన అని మురిసిపోవడం , భలే ఉంటుంది . మూవీ చూసే మనకు కూడా మనసు హాయి అనిపిస్తుంది .
ఇలాంటి సన్నివేశాలే మనల్ని సినిమాతో పాటు ముందుకు నడిపిస్తాయి . ఓ పక్కన ప్రశాంతమైన వారణాసి ఘట్టాలను చూపిస్తూనే దర్శకురాలు ఈ ఇద్దరి మనసులను ఆవిష్కరించిన తీరు దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది .
మాధవన్ మాస్టారు కూతురి పాత్రను కూడా దర్శకురాలు చక్కగా మలిచారు . తండ్రి పరాయి ఆడదానితో చనువుగా ఉండటం సహించలేకపోవడం , అలగటాలు , అరుచుకోవడాలు వంటి రొటీన్ కమర్షియల్ ఫార్ములా జోలికి పోకుండా ఆమె పాత్రను కూడా చక్కగా డిజైన్ చేసారు .
మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకూ ఒక చక్కటి పవిత్ర బంధాన్ని స్వచ్ఛంగా నడిపించిన దర్శకురాలు చివరికి మన హృదయాలను మెలిపెట్టే సన్నివేశంతో ముగిస్తుంది . నిజంగా క్లైమాక్స్ సీన్ చూస్తే ఎంతటివారికైనా హృదయాలు బరువెక్కక మానవు. కానీ కధకు ఆ ముగింపు లేకపోతె రొటీన్ రొడ్డకొట్టుడు మూవీ అయిపోయేది . స్లో నేరేషన్ అన్న ఒక్కమాటే కానీ ఇందులో ప్రతి సన్నివేశం మన హృదయాలను తాకుతుంది.
ఎవరెలా చేసారు ?
ఎవరెలా చేసారంటే చప్పున సమాధానం చెప్పడం కష్టం . మాధవన్ మాస్టారు పాత్రలో ఇంద్రన్ , లీల పాత్రలో మధుబాల పోటీ పడి నటించారు . స్వచ్ఛమైన హావభావాలు ప్రదర్శించారు . కల్మషం లేని క్లీన్ ఇమేజ్ ఉన్న పాత్రలు చేయడం ఈ ఇద్దరివల్లే సాధ్యం అయ్యింది . దాదాపు సినిమా మొత్తం గ్రీన్ శారీలో మధుబాల , సింపుల్గా పంచెలో ఇంద్రన్ చాలా సహజంగా కనిపించడమే కాదు .. సహజంగా నటించారు కూడా .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధిమేరకు నటించారు .
సాంకేతికత
వెన్నెల రాత్రులలో వారణాసి అందాలను ఫైజ్ సిద్ధిక్ అద్భుతంగా చూపించారు . ఇద్దరిపాత్రల చుట్టూ దర్శకురాలు కథను నడిపిస్తే వారణాసి అందాల చుట్టూ ఛాయాగ్రాహకుడు ఫైజ్ సిద్ధిక్ కెమెరాని నడిపించారు .
గోవింద్ వసంత్ అందించిన సంగీతం హాయిగా ఉంది .
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి .
విశ్లేషణ
రొటీన్ కమ్మర్షియల్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు . ఇదొక క్లాసికల్ మూవీ . ఇందులో మనుషులు మాట్లాడుకోవడం కన్నా మనసులు మాట్లాడుకోవడం ఎక్కువగా ఉంటుంది . కల్మషం లేని మనసులు కనిపిస్తాయి . స్వచ్ఛమైన ప్రేమలు కనిపిస్తాయి . వెరసి ఇదొక ఫీల్ గుడ్ మూవీ కింద నిలిచిపోతుంది .
జియో హాట్ స్టార్ ఓటిటిలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి చూసేయండి .
నటీనటులు : ఇంద్రన్ , మధుబాల , అపర్ణ బాలమురళి తదితరులు
సంగీతం : గోవింద్ వసంత్
సినిమాటోగ్రఫీ : ఫైజ్ సిద్ధిక్
నిర్మాత : అభిజిత్ బాబూజీ
దర్శకత్వం : వర్ష వాసుదేవ్
విడుదల : జియో హాట్ స్టార్ (28-07-2026)
రేటింగ్ : 3.5 / 5
