న్యూటన్స్ థర్డ్ లా (Newtons 3rd Law Movie) సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూ !

Spread the love

సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన న్యూటన్స్ థర్డ్ లా ( Newtons 3rd Law Movie ) సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జులై 31 నుంచి థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంది . ఈ చిత్రాన్ని హరీష్ కోహిర్కర్ నిర్మించగా , రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు .

ఇక సుమంత్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోగా నటించి మెప్పించాడు . అప్పట్లో ఆయన నటించిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి ..మరికొన్ని ఫట్ అయ్యాయి . తర్వాత సుమంత్ కొంత గ్యాప్ తీసుకున్నారు . ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో సుమంత్ దూసుకుపోతున్నాడు . చాన్నాళ్ల తర్వాత సీతారామం మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి మెప్పించాడు . ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ కోసం అనగనగా మూవీలో నటించి మంచి రేటింగ్ సాధించాడు . తిరిగి ఈటీవీ విన్ కోసమే న్యూటన్ థర్డ్ లా అనే మూవీలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .

ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా మూవీ ఎలా ఉందో చూద్దాం .

కధేంటంటే ?

కథ 2026 నుంచే మొదలౌతుంది . సిక్కిం లోని గ్యాంగ్టక్ రిసార్ట్ లో చిల్ అవుతున్న డేవిడ్ కిశోర్ ( అవసరాల శ్రీనివాస్ ) కి ఒక కొరియర్ వస్తుంది . ఆ పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో న్యూటన్స్ థర్డ్ లా – పార్ట్ 1 అనే బుక్ కనిపిస్తుంది . ఆ బుక్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టిన కిశోర్ టెన్షన్ పడిపోతాడు .

ఇక ఆ బుక్ లో మొదటి పార్ట్ ఇలా మొదలౌతుంది . 1999 లో ఫ్యాక్టరీలో జరిగిన ఫైర్ ఆక్సిడెంటులో భర్త చనిపోయాడని టెలిగ్రామ్ రావడంతో జ్యోతి తన కూతుర్ని తీసుకుని బయలుదేరుతుంది . అయితే ఒక కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో జ్యోతి కూడా మరణిస్తుంది .

ఈ కేసు ఇలా ఉండగానే వినయ్ ( త్రినాథ వర్మ ) అనే ఇంజనీరింగ్ విద్యార్థి అపార్ట్మెంట్ టెర్రస్ నుంచి కిందపడి అనుమానాస్పదంగా మరణిస్తాడు . అతడు సూసైడ్ చేసుకున్నాడని అందరూ అనుకుంటారు . కానీ అతడిది సూసైడ్ కాదు మర్డర్ అని పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్ ) అనుమానపడతాడు . అందుకే జ్యోతి ఆక్సిడెంటుకు , వినయ్ మరణానికి లింక్ ఏమన్నా ఉందేమో అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు . అతడి ఇన్వెస్టిగేషన్లో అనుమానిత జాబితాలో వినయ్ తండ్రి పేరు కూడా బయటికి వస్తుంది . వినయ్ స్నేహితుడు కార్తీక్ ను ప్రశ్నిస్తే స్మగ్లింగ్ కింగ్ స్టీఫెన్ మెర్క్యురీ ( జగపతి బాబు ) పేరు కూడా బయటికి వస్తుంది .

జ్యోతి ఆక్సిడెంటుకు , వినయ్ మరణానికి ఉన్న లింక్ ఏంటి ?
వినయ్ సూసైడ్ చేసుకున్నాడా ? లేకపోతే ఎవరైనా మర్డర్ చేసారా ?
వినయ్ ..అతడి స్నేహితుడు కార్తీక్ లు కలిసి ఏం చేసారు ?
మెర్క్యురీకి .. వినయ్ కి ఉన్న కనెక్షన్ ఏంటి ?
న్యూటన్ థర్డ్ లా బుక్ చదివి భయపడిన డేవిడ్ కిశోర్ ఎవరు ? ఆ బుక్ చదివి అతడెందుకు భయపడతాడు ?
వినయ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ చివరికి ఏం తెలుస్తాడు ? అనేది మిగిలిన కథ .

ఎలా ఉంది ?

చర్యకు , ప్రతి చర్య ఉంటుందనే న్యూటన్ థర్డ్ లా ఫార్ములాకు , కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టి దర్శకుడు అల్లుకున్న కథ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది . సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో మలయాళం సినిమాలకు ధీటుగా స్క్రీన్ ప్లే నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . మూవీ స్టార్టింగులోనే న్యూటన్ థర్డ్ లా అనే బుక్ తో దర్శకుడు స్టోరీని మొదలెట్టిన విధానం క్యూరియాసిటీని కలిగిస్తుంది .

కార్ ఆక్సిడెంటులో జ్యోతి మరణించడం , అపార్ట్మెంట్ టెర్రస్ మీద నుంచి వినయ్ కిందపడి వినయ్ అనుమానాస్పదంగా మరణించడం , ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ రంగంలోకి దిగడంతో కధనం పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లోకి టర్న్ అవుతుంది . ఇక వినయ్ ది సూసైడ్ కాదని , అతడ్ని ఎవరో మర్డర్ చేసారని చెప్తూ వాసుదేవ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో ఆ మర్డర్ మిస్టరీ కేసులో క్యూరియాసిటీ పెరుగుతుంది .

వినయ్ తల్లితండ్రులను వాసుదేవ్ ఇంటరాగేట్ చేయడం , అతడి తండ్రి మీద అనుమానపడటం , అందుకు ఎవిడెన్సులు సంపాదించడం వరకు బాగానే ఉంది కానీ ఇంటర్వెల్ వరకు దర్శకుడు అసలు కథలోకి వెళ్లకుండా ఈ కేసు చుట్టూనే కధనం నడిపించారు . ఎంతసేపు వాసుదేవ్ వినయ్ ఇంటి చుట్టూనే తిరుగుతుండటంతో కథ కూడా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది . దాంతో ఇంకేమన్నా కొత్త పాయింట్ తెలుస్తుందేమోనని ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి వస్తుంది .

చివరికి ఎలాగైతేనేమి వినయ్ మర్డర్ కేసును వాసుదేవ్ సాల్వ్ చేయడంతో కథ అయిపోతుందనుకుంటాం . కానీ అసలు కథ ఇప్పుడే మొదలౌతుంది అని ఇంటర్వెల్ బ్యాంగ్ లో వాసుదేవ్ చెప్పడంతో సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది . వాసుదేవ్ చెప్పినట్టు అసలు కథ అప్పుడే మొదలౌతుంది . ఫస్టాఫ్ లో వినయ్ మర్డర్ మిస్టరీ మీద ఫోకస్ పెట్టిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం స్టీఫెన్ మెర్క్యురీని రంగంలో దించి నేరుగా అసలు కథలోకి వెళ్తాడు . అక్కడ్నుంచి ఫస్టాఫ్ లో ఎదురైన చిక్కుముడులను ఒకటొకటి విప్పుకుంటూ వెళ్ళాడు .

ఫస్టాఫ్ లో సాధారణంగా కనిపించిన వినయ్ క్యారక్టర్ సెకండాఫ్ లో పవర్ ఫుల్ గా మారుతుంది . ఏం పనిచేశామన్నది కాదు .. ఎలా చేశామన్నది ముఖ్యం అంటూ వినయ్ ఆడే క్రిమినల్ గేములు కధనాన్ని క్రైమ్ మోడ్ లోకి తీసుకెళ్తుంది . డబ్బు సంపాదించటానికి తన స్నేహితుడు కార్తీక్ కి ప్లాన్ ఎ , ప్లాన్ బి అని ప్లాన్లు చెప్తుంటే జులాయి సినిమాలో అల్లు అర్జున్ గుర్తుకొస్తాడు . ముఖ్యంగా డైమండ్స్ విషయంలో వినయ్ ఆడిన గేమ్ ప్లాన్ రక్తి కట్టిస్తుంది .

ఇద్దరి స్నేహితుల మధ్య మొదలైన డైమండ్స్ గొడవ మెర్క్యురీ కూడా యాడ్ అవడంతో ట్రయాంగిల్ ఫైట్ గా మారుతుంది . కానీ ఈ డైమండ్స్ కోసం జరిగే గొడవలో ముగ్గురే కాదు నాలుగోవాడు కూడా ఉన్నాడని క్లైమాక్సులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు . అదేంటో ఇక్కడ చెబితే స్పాయిలర్ అవుతుంది . సినిమా చూసి తెలుసుకోవాల్సిందే .

అసలు ఈ సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్ సన్నివేశాలే . న్యూటన్స్ థర్డ్ లా బుక్ – పార్ట్ 2 చదివిన తర్వాత కూడా డేవిడ్ కిశోర్ కు కొన్ని డౌట్లు ఉంటాయి . అతడి డౌట్లకు జగపతిబాబుతో చెప్పించిన సమాధానాలు అల్టిమేట్ గా నిలుస్తాయి .

దర్శకుడు రాజేష్ కర్ణ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మూవీకి ప్లస్ అవుతుంది . అనవసరమైన లవ్ ట్రాక్, వెకిలి కామెడీ స్కిట్ , అడుగడుగునా స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డు తగిలే పాటలు , ఫైట్లు లేకుండా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒకే టెంపో మెయింటైన్ చేసారు . మొదట్లో లేడీ కానిస్టేబుల్ తో కొంత కామెడీ చేయిద్దామని ప్రయత్నించారు కానీ ఎందుకో ఆపేసారు . అలా ఆపేయడమే మంచిదైంది . లేకపోతే కధనంలో ఉండే సీరియస్నెస్ దెబ్బ తినేది .

క్రైమ్ స్టోరీ అయినా ఫీల్ చెడకుండా మధ్య మధ్యలో ఫ్యామిలీ బాండింగ్ గురించి చూపించిన తీరు బాగుంది . మధ్యతరగతి జీవితాల్లో జరిగే నిత్యకృత్యాలను సందర్భానుసారంగా వినయ్ తల్లితండ్రుల ద్వారా చూపించిన విధానం బాగుంది . తండ్రి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటుంటాడు . తల్లి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది . అది చూసి కొడుకు ‘ ఇల్లు గడవాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పమ్మా .. ఎలాగైనా ఆ డబ్బు సంపాదించి తీసుకొస్తా ‘ అంటే .. తల్లి అన్నీ డబ్బుతోనే పరిష్కారం అవవురా .. మనం ముగ్గురం కూర్చుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తే చాలురా ‘ అంటుంది . ఇలాంటి భావోద్వేగవంతమైన సన్నివేశాలు కూడా కధలో భాగంగా దర్శకుడు నడిపించిన తీరు బాగుంది .

ఎవరెలా చేసారు ?

ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరో సుమంత్ ని చూసినవారికీ , సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా సుమంత్ ను చూసినవారికి స్పృష్టమైన మార్పు ఒకటి తెలుస్తుంది . ఇపుడు సుమంత్ పర్ఫెక్ట్ కధల్ని సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడు . బాగా స్కోప్ ఉన్న పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నాడు . నటనలో , బాడీ లాంగ్వేజ్ లో , డైలాగ్ డెలివరీలో మెచ్యూర్డ్ గా ఉన్నాడు . ఇక ఈ మూవీ విషయానికి వస్తే సుమంత్ చాలా బాలన్సుడ్ గా సెటిల్డ్ గా నటించాడు . అనవసరమైన కామెడీ స్కిట్ ల జోలికి పోకుండా పోలీస్ ఆఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు .

ఈ సినిమాలో జగపతి బాబును మళ్ళీ స్టైలిష్ గా చూస్తాము . ఇలాంటి పాత్రలు జగపతి బాబుకు కొట్టిన పిండే .

అవసరాల శ్రీనివాస్ కూడా చక్కటి నటుడే . కానీ ఎందుకో ఈ మూవీలో దర్శకుడు ఆయన్నించి పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేదు అనిపిస్తుంది .

ఇక వినయ్ పాత్రలో నటించిన త్రినాథ వర్మ చక్కటి పెర్ఫార్మన్స్ ప్రదర్శించాడు . తల్లి కళ్ళల్లో సంతోషం చూడాలనుకునే కొడుకు పాత్రలో ఇతడి నటన బాగుంది . డైమండ్స్ కోసం ఆడిన గేములో కూడా త్రినాథ వర్మ నటన బాగుంది .
మిగిలినవాళ్లు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతికత

సింజిత్ ఎర్రమిల్లి అందించిన సంగీతం బాగుంది . ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఈయన అందించిన బీజీఎమ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది . థియేటరిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది .
వేదవ్యాస్ గొట్టిపాటి ఫోటోగ్రఫీ పనితీరు కూడా బాగుంది . కొన్ని సీన్స్ లో విజువల్స్ బాగా క్యాప్చర్ చేసారు .
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి .

విశ్లేషణ

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలు ఇష్టపడేవారికి న్యూటన్ థర్డ్ లా మూవీ నచ్చుతుంది . దర్శకుడు రాసుకున్న క్రైమ్ స్టోరీని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు . కాకపోతే ఫస్టాఫ్ మొత్తం వినయ్ మర్డర్ మిస్టరీ చుట్టూనే కధనం నడవడంతో స్టోరీ అక్కడక్కడే తిరుగుతున్నఫీలింగ్ వస్తుంది .

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీల్లో ఫస్టాఫ్ పజిల్స్ కు కేటాయించి సెకండాఫ్ లో వాటి గుట్టు విప్పుకుంటూ వెళ్తారు . ఈక్రమంలో ఏ సినిమాకైనా కొన్ని రిపీటెడ్ సీన్లు వస్తాయి . పజిల్స్ గుట్టును ప్రేక్షకులకు అర్థమయ్యేలా విప్పితే చాలు ..సినిమా విజయవంతమైనట్టే . ఈ మూవీలో కూడా దర్శకుడు అన్ని పజిల్స్ గుట్టు క్లైమాక్సులో విప్పారు కానీ కొంచం కన్ఫ్యూజన్ ఉంది . అది కూడా అతి కొంచమే కాబట్టి నాట్ బాడ్ .. బాగానే ఉంది .

నటీనటులు : సుమంత్ , జగపతి బాబు , అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం : సింజిత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ : వేదవ్యాస్ గొట్టిపాటి
నిర్మాత : హరీష్ కోహిర్కర్
దర్శకత్వం : రాజేష్ కర్ణ
విడుదల : ( 31-07-2026 )
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!