జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన వరవు మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ (Varavu Movie) సెప్టెంబర్ 11, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. జూలై నెలలో ఈ మూవీ ఒరిజినల్ మలయాళం వెర్షన్ థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా సెప్టెంబర్ 11 నుంచి ZEE 5 లో తెలుగు ఆడియో వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రానికి రేజి నిర్మాతగా వ్యవహరించగా, సాజి కైలాష్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు వరవు మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే?
ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాల్సన్ (జోజు జార్జ్) తన సోదరి (నన్) వాటికన్ సిటీకి వెళ్ళిపోతున్న సందర్భంగా వీడ్కోలు పలకడానికి 10 రోజులు పెరోల్ మీద జైలు నుంచి బయటికి వస్తాడు. పాల్సన్ జైలునుంచి బయటికి రాగానే కొంతమంది అతడి మీద అటాక్ చేయడానికి వస్తారు. ఆ అటాక్ ను తిప్పికొట్టి పాల్సన్ తన సోదరి దగ్గరికి చేరుకుంటాడు.

తాను వాటికన్ వెళ్ళిపోయేలోగా నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన మరో సోదరుడు విలియమ్స్ ను (అర్జునన్ అశోకన్) వెతికి పట్టుకుని తీసుకురావాలని ఆమె కోరుతుంది. పాల్సన్ కి కూడా తన తమ్ముడు విలియమ్స్ అంటే ప్రాణం. విలియమ్స్ తో పాటు అనాథ అయిన సెబాన్ ను కూడా పాల్సన్ చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు. కానీ సెబాన్ బిగ్ డాన్ కొంచెట్టాన్ దగ్గర చేరి అతడి దయతో ఎమ్మెల్యే కూడా అవుతాడు. దీంతో అతడు పాల్సన్ తో విడిపోయి వేరుగా ఉంటుంటాడు.
ఇదిలా ఉండగా విలియమ్స్ కనిపించకుండా పోవడం వెనుక ఏదో కుట్ర ఉందని పాల్సన్ అనుమానిస్తాడు. పాల్సన్ జైలు నుంచి పెరోల్ మీద బయటికి వచ్చింది అతడి సోదరికి వీడ్కోలు పలకడానికి అని అందరూ అనుకుంటారు. కానీ అసలు కారణం వేరే ఉంది?
నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన విలియమ్స్ ఏమైపోతాడు?
పాల్సన్ జైలునుంచి బయటికి రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?
విలియమ్స్ మాయమైపోవడం వెనుక సెబాన్,కొంచెట్టాన్ ల పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
ఏ భాషలో అయినా సరే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో ఓపెనింగ్ ఎంత ఉత్సుకత రేకెత్తించే విధంగా ఉంటే ప్రేక్షకులను అంతే పూర్తిస్థాయిలో ఎంగేజ్ చేస్తుంది. ఈ ఫార్ములా మలయాళం దర్శకులకు బాగా తెలుసు. అందుకే వాళ్ల మూవీల్లో ఆకట్టుకునే ప్రారంభం ఉంటుంది.
సపోజ్ పొద్దున్నే అలారం మోగగానే హీరో గారు లేచి టైమ్ చూసుకుని బెడ్ దిగి రెడీ కారులో బయటికి బయలుదేరతాడు అనే సన్నివేశాన్ని ఓపెనింగ్ షాట్ తీస్తే ప్రేక్షకులను ఎంత మాత్రం ఎంగేజ్ చేస్తుంది?. రొటీన్ అనుకుంటారు కదా? పైగా హీరోగారి ఇలాంటి ఇంట్రడక్షన్ సీన్లు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసే ఉంటాం.
అదే సపోజ్ హీరోగారు జైలు నుంచి బయటికి వచ్చి బస్సులో వెళ్తున్న సమయంలో కొంతమంది రౌడీలు వెంటపడి అటాక్ చేస్తే మనకేమనిపిస్తుంది? అసలు హీరోగారు జైలుకు ఎందుకెళ్లారు? అతడు బయటికి రాగానే రౌడీలు ఎందుకు అటాక్ చేశారు? అనే ప్రశ్నలు ఏర్పడి క్యూరియాసిటి కలుగుతుంది కదా? వరవు మూవీ లో దర్శకుడు సాజి కైలాష్ చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ అదే. ఇంట్రెస్టింగ్ బిగినింగ్ ఇచ్చారు.
జోజు జార్జ్ జైలునుంచి పెరోల్ మీద ఎందుకు బయటికి వచ్చాడో ఒక్క ముక్కలో చెప్పేస్తే ఇక మిగిలిన కథనంలో పస ఏముంటుంది? అందుకే తన సోదరికి వీడ్కోలు పలకడానికే తాను బయటికి వచ్చినట్టు పోలీసులను, సినిమా చూస్తున్న ప్రేక్షకులను నమ్మించాడు.
కానీ పాల్సన్ ఎందుకు బయటికి వచ్చాడో తెలిసిన తర్వాతనే మన క్యూరియాసిటి మరింత పెరుగుతుంది. దర్శకుడు ఆ పనిని సెకండాఫ్ లో చేశాడు. అక్కడితో చిక్కుముడి విడిపోవడంతో మిగిలిన కథనం రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో రన్ అయి స్లోగా ప్రిడిక్టబుల్ స్టేజికి వస్తుంది. ఎప్పుడైతే కథనం మన ఊహలకు తగ్గట్టుగా ప్రయాణిస్తుందో అప్పుడు ఆటోమేటిగ్గా మనల్ని ఎంగేజ్ చేయడం కూడా తగ్గుతుంది.
కాబట్టి వరవు సినిమాకి ఫస్టాఫ్ ప్రధాన బలం అయితే సెకండాఫ్ దానికి కొనసాగింపుగా సాగే రొటీన్ ఫార్మాట్ అనిపిస్తుంది. ఇక స్టోరీ సంగతి అంటారా? పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. కుట్ర.. మోసం ..పగ..ప్రతీకారం ఎట్సెట్రా వంటి రివెంజ్ ఫార్ములాతో కూడిన రొటీన్ కమర్షియల్ డ్రామా అనబడు దినుసులను కలిపి వండితే వరవు మూవీ అవుతుంది. ఇలాంటి ఫార్ములాలతో కూడిన మసాలా సినిమాలు ఇంతకుముందే చూసేశారా?
అయితే కొన్ని సినిమాలకు కథ కన్నా నేరేషన్ ఎక్కువ బలాన్ని ఇస్తుంది. మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తే చాలు దర్శకుడు సగం విజయం సాధించినట్టే. ఈ సినిమాలో సాజి కైలాష్ చేసింది అదే. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ టెంపో చెడకుండా చివరివరకు సీరియస్ టోన్ లో కథనాన్ని నడిపారు.
అయితే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో ప్రేక్షకులు లాజిక్కులు కూడా ఎక్కువగా గమనిస్తారు. అపాచన్, సేతు మర్డర్లతో పాటు ఎస్సై హత్య జరిగినా పోలీసులు జోజు జార్జ్ మీద అనుమానపడతారే కానీ అతడ్ని ఏమీ చేయలేరు. జోజు జార్జ్ ను పోలీసులు ఏమీ చేయలేరు అని కన్ఫర్మ్ చేయడానికి దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు.
సరే ముందు నుంచీ ఎస్సై, సీఐ లు జోజు జార్జ్ ను ఏమీ చేయలేరని మనకి అర్థమైపోయింది కాబట్టి పోలీసుల గొడవ వదిలేసి సినిమా చూస్తుంటే ఎస్పీ పాత్రలో సడెన్గా వాన పాటల వాణీ విశ్వనాథ్ ను దర్శకుడు దింపడంతో ఆమె ఎంట్రీతో ఏదో విషయం ఉండే ఉంటుందని ఆశ పడతాం. కానీ చివరకు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆమె ఆంధ్రాకు చెందిన ఐపీఎస్ అనుపమ రెడ్డి అని. అంతకుమించి ఆ క్యారక్టర్ వల్ల కథకు ఉపయోగం ఏమీ లేదు.
వాణీ విశ్వనాథ్ ఎపిసోడ్ కథనాన్ని సాగతీయడానికి పనికొస్తుందే కానీ కథకు అవసరం లేదు. ఆమె బదులు ఆ సీఐ ఒక్కడు చాలు.
ఇక కొంచెట్టాన్ కూతురికి విలియమ్స్ కి సెపరేట్ లవ్ ట్రాక్ పెట్టకుండా దర్శకుడు మంచి పని చేశాడు. లేకపోతే అదొక సాగతీత అయ్యేది. ఓవరాల్ గా వరవు మూవీ ఫస్టాఫ్ ఎక్కువ ఎంగేజ్ చేస్తుంది.. సెకండాఫ్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో రన్ అవుతుంది.
ఎవరెలా చేశారు?
అదేంటో కానీ జోజు జార్జ్ సినిమాల్లో ఎంతమంది నటులున్నా చివరి వరకు అతడొక్కడే కనిపిస్తాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకుని నడిపిస్తాడు. కాబట్టి యథాప్రకారం ఈ మూవీలో కూడా స్క్రీన్ నిండుగా జోజు జార్జ్ మాత్రమే కనిపించాడు.
ఇదే మూవీలో అర్జునన్ అశోకన్ వంటి చక్కటి నటుడున్నా అతడికి స్కోప్ దక్కలేదు. అతడి పాత్ర ప్రారంభానికి, ముగింపుకు పనికొచ్చింది. వాణీ విశ్వనాథ్ నటన కూడా బాగానే ఉంది కానీ ఆమె పాత్ర ఊహించినంత బలంగా లేకపోవడంతో తేలిపోయింది.
సాంకేతికత
సామ్ సిఎస్ అందించిన సంగీతం బాగానే ఉంది. జోజు జార్జ్ పాత్రకు ఆయన ఇచ్చిన బిజీఎమ్ మరింత బలాన్ని ఇస్తుంది.
మాములుగానే శరవణన్ ఫోటోగ్రఫీ పని తీరు బాగుంటుంది. ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లని తన కెమెరా పనితనంతో బాగా కాప్చర్ చేశారు.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి వరవు మూవీ నచ్చుతుంది. అందులోనూ ఫస్టాఫ్ ఎక్కువగా నచ్చుతుంది. సెకండాఫ్ ప్రిడిక్టబుల్ గా ఉండటంతో కొంత యావరేజ్ అనిపిస్తుంది.
ఇక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే క్లైమాక్స్ ట్విస్టులు, మెరుపులు పెద్దగా ఏమీ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అవుతుంది.
ఓవరాల్ గా లాజిక్కుల జోలికి పోకుండా చూస్తే ఈ సినిమా నిరాశ పరచదు. ప్రస్తుతం ZEE 5 ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఆ జానర్ మూవీలు ఇష్టపడేవాళ్ళు చూడొచ్చు.
నటీనటులు: జోజు జార్జ్, అర్జునన్ అశోకన్, వాణీ విశ్వనాథ్ తదితరులు
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: శరవణన్
నిర్మాత: రేజి
దర్శకత్వం: సాజి కైలాష్
ఓటిటి: ZEE 5
స్ట్రీమింగ్: 11-09-2026
రేటింగ్: 2.75 / 5
